9.
మీరు యాజకత్వ తాళపుచెవులు మరియు అధికారం ద్వారా దీవించబడ్డారు
మత్తయి 16:18–19
యేసు పేతురుకు యాజకత్వ అధికారం గురించి బోధించినప్పుడు, ఆయన తాళపుచెవుల గురించి మాట్లాడారు. తాళపుచెవులను తాళము తీయడానికి మరియు వస్తువులను తెరవడానికి ఉపయోగిస్తారు. యాజకత్వ తాళపుచెవులు మీ జీవితంలో దేవుని శక్తిని, వరాలను మరియు ఆశీర్వాదాలను తెరవగలవు.
నిత్య సత్యాలు
అన్ని యాజకత్వ తాళపుచెవులు మరియు అధికారం యేసు క్రీస్తు ద్వారా వస్తాయి. ప్రతి యాజకత్వ అధికారం కలిగియున్న ప్రతి ఒక్కరూ తన అధికారాన్ని ఆయనలోనే కనుగొనవచ్చు. ఈ అధికారాన్ని ఎవరు పొందుతారో మరియు యాజకత్వ తాళపుచెవులను ఎవరు పొందుతారో రక్షకుడు నిర్ణయిస్తారు. మనం ఆయన పరిపూర్ణ జ్ఞానాన్ని విశ్వసిస్తాము.
యేసు క్రీస్తు మన కాలంలో తన యాజకత్వమును పునఃస్థాపించారు. యాజకత్వమును ఎలా ఉపయోగించాలో ఆయన నిర్దేశిస్తారు. ఆదాము, మోషే, పేతురు మరియు చరిత్రలో ఉన్న అనేకమంది ఇతర ప్రవక్తలు యాజకత్వ తాళపుచెవులను పొందారు. మన కాలంలో, జోసెఫ్ స్మిత్ యాజకత్వ తాళపుచెవులను బాప్తిస్మమిచ్చు యోహాను, పేతురు, మోషే, ఏలీయా, ఎలిషా మరియు ఇతరుల నుండి అందుకున్నారు. ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహములోని ప్రతీ సభ్యుడు ఈ రోజు భూమిపై ఉన్న అన్ని యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్నారు. స్థానిక యాజకత్వ నాయకులు మరియు సమూహ అధ్యక్షులు కూడా తమ పిలుపుల కోసం యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉంటారు. యాజకత్వ తాళపుచెవులు దేవుని కార్యములో ప్రభావితంచేస్తాయి. వారు ఆ కార్యములో సహాయం చేయడానికి పురుషులకు మరియు మహిళలకు అధికారం మరియు శక్తిని ఇస్తారు.
యాజకత్వ అధికారం దేవుని పిల్లలందరినీ దీవిస్తుంది. యాజకత్వము పునఃస్థాపించబడినందున, మీరు విధులను స్వీకరించవచ్చు మరియు దేవునితో నిబంధనలు చేసుకోవచ్చు. అధికారం ఉన్న వ్యక్తి నుండి మీకు ఒక బాధ్యత లేదా పిలుపు అందినప్పుడు, మీరు దేవుని నామముతో పని చేయవచ్చు.
ఆహ్వానాలు
సంఘ పిలుపులను అంగీకరించి, నమ్మకంగా సేవ చేయండి. మీరు సంఘములో ఒక పిలుపును స్వీకరించినప్పుడు, ఆ పిలుపులో సేవ చేయడానికి దేవుని నుండి అధికారం పొంది మీరు ప్రత్యేకించబడతారు. మీ సేవ కోసం మీరు దేవుని నుండి మార్గదర్శకత్వం కూడా పొందవచ్చు. మీరు సేవ చేస్తున్నప్పుడు, మీరు యేసు క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆయన కొరకు మీకున్నంతలో అత్యుత్తమమైన దానిని చేయండి.
సేవ చేయడానికి దేవుడు పిలిచిన వారికి మద్దతు ఇవ్వండి. మద్దతు ఇవ్వడం అంటే సంఘ సమావేశంలో ఒక పేరు చదివినప్పుడు కేవలం చేయి పైకెత్తడం కంటే చాలా ఎక్కువ అర్థం ఉంది. దాని అర్థం మద్దతు ఇవ్వడం మరియు సహాయం చేయడం. యేసు క్రీస్తు తన సంఘంలో సేవ చేయడానికి పిలిచిన వారికి మీరు మద్దతు ఇస్తున్నారని చూపించడానికి మార్గాలను వెతకండి.
మీ సంఘ నాయకుల నుండి నియామకాలను నెరవేర్చండి—మీ సమూహము లేదా తరగతి అధ్యక్షత్వం నుండి వచ్చే బాధ్యతలతో సహా. వారికి దేవుని నుండి అధికారం ఉంది, ఆ పని కోసం వారు ఆ అధికారాన్ని మీకు అప్పగిస్తారు. మిమ్మల్ని ఎవరికైనా సేవ చేయడానికి, సంస్కార కూడికకు వచ్చే ప్రజలను స్వాగతించడానికి లేదా ఏదైనా కార్యకలాపంలో సహాయం చేయడానికి నియమించవచ్చు. అప్పగించిన పని ఏదైనప్పటికీ, దానిని యేసు క్రీస్తుకు శిష్యుడిగా ఉండటానికి మరియు దేవుని బిడ్డలకు సేవ చేయడానికి లభించిన ఒక అవకాశంగా చూడండి.
వాగ్దానం చేయబడిన దీవెనలు
మీరు పొందే విధులు యేసుక్రీస్తుచే అధికారం పొందినవని మీరు నమ్మవచ్చు. యేసు క్రీస్తు సంఘాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే విషయాలలో ఇది ఒకటి. యాజకత్వ విధువుల ద్వారా దేవుని శక్తి వ్యక్తమవుతుంది.
మీరు ప్రభువు చేతులలో ఒక సాధనంగా మారతారు. మీరు ప్రభువు అధికారంతో మరియు యాజకత్వపు తాళపుచెవులను కలిగి ఉన్న ఆయన సేవకుల మార్గదర్శకత్వంలో సేవ చేస్తున్నప్పుడు, తన పనిలో ఇతరులకు ఎలా సేవ చేయాలో తెలుసుకోవడానికి ఆయన మీకు సహాయం చేస్తారు. యేసు క్రీస్తే మీ బలం. మీ సేవ మిమ్మల్ని ఆయనకు మరింత దగ్గరయ్యేలా చేస్తుంది మరియు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.
ప్రశ్నలు మరియు సమాధానాలు
నా వార్డులో ఎవరి వద్ద యాజకత్వ తాళపుచెవులు ఉన్నాయి? బిషప్పు మరియు ఎల్డర్ల, బోధకుల, పరిచారకుల సమూహముల అధ్యక్షులు యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉంటారు. దీని అర్థం, వార్డులోని ప్రతి ఒక్కరికీ సేవ చేయడానికి మరియు వారిని ఆశీర్వదించడానికి యాజకత్వాన్ని ఎలా ఉపయోగించాలో నిర్దేశించే బాధ్యతను ప్రభువు వారికి అప్పగించారు.
యాజకత్వ తాళపుచెవులు నన్ను ఎలా దీవిస్తాయి? బాప్తిస్మము మరియు సంస్కారము వంటి విధులకు యాజకత్వ తాళపుచెవుల ద్వారా అధికారం ఇవ్వబడుతుంది. మీరు సంఘములో ఒక పిలుపును స్వీకరించినప్పుడు, తాళపుచెవులను కలిగి ఉన్న ఒకరి మార్గదర్శకత్వంలో మీరు ప్రత్యేకించబడతారు. ఇది ఆ పిలుపులో సేవ చేయడానికి మీకు అధికారాన్ని ప్రసాదిస్తుంది. మీకు సేవ చేసే సంఘ నాయకులు మరియు బోధకులు కూడా తాళపుచెవుల ద్వారా యాజకత్వ అధికారాన్ని పొందారు.
పురుషులు మరియు మహిళలు యాజకత్వ అధికారంతో ఎలా సేవ చేస్తారు? యోగ్యులైన పురుషులకు యాజకత్వం ప్రసాదించబడుతుంది మరియు వారు పరిచారకుడు, బోధకుడు, యాజకుడు మరియు ఎల్డర్ వంటి యాజకత్వ స్థానములకు నియమించబడతారు. పిలుపులో సేవ చేయడానికి ప్రత్యేకించబడిన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ ఆ పిలుపును నెరవేర్చడానికి దేవుని నుండి యాజకత్వ అధికారాన్ని పొందుతారు. సంఘ నాయకుడి నుండి బాధ్యతను స్వీకరించే స్త్రీలు మరియు పురుషుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 35:24–27 (ప్రభువు ప్రసాదించిన తాళపుచెవుల ద్వారా సుంఘము నడిపించబడుతుంది); 107:18–20 (మెల్కీసెదెకు యాజకత్వము మరియు అహరోను యాజకత్వము యొక్క తాళపుచెవులు); 110:11–16 (మోషే, ఏలీయా మరియు ఏలీషా తాళపుచెవులను పునరుద్ధరించారు.) చూడండి.
దేవాలయ సిఫారసు ప్రశ్నలు
-
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షుడిని ప్రవక్తగా, దీర్ఘదర్శిగా మరియు బయల్పాటుదారునిగా, సమస్త యాజకత్వ తాళపుచెవులను ఉపయోగించుటకు అధికారము పొందిన ఏకైక వ్యక్తిగా మీరు ఆమోదిస్తున్నారా?
-
ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులను ప్రవక్తలుగా, దీర్ఘదర్శులుగా మరియు బయల్పాటుదారులుగా మీరు ఆమోదిస్తున్నారా?
-
సంఘము యొక్క ఇతర ప్రధాన అధికారులు మరియు స్థానిక నాయకులను మీరు ఆమోదిస్తున్నారా?