“దేవుణ్ణి ప్రేమించండి, మీ పొరుగువారిని ప్రేమించండి,” యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు మార్గదర్శి (2022)
“దేవుణ్ణి ప్రేమించండి, మీ పొరుగువారిని ప్రేమించండి,” యౌవనుల బలము కొరకు
దేవుణ్ణి ప్రేమించండి, మీ పొరుగువారిని ప్రేమించండి
మత్తయి 22:37–40
మంచి ఎంపికలు చేసుకోవడానికి మీకు సహాయపడేలా, దేవుడు ఆజ్ఞలను ఇస్తారు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన ఇలా చేస్తారు. మరియు దేవుని ఆజ్ఞలకు లోబడడానికిగల ఉత్తమమైన కారణం, మీరు ఆయనను ప్రేమించడమే. దేవుని యొక్క ఆజ్ఞలలో ప్రేమ ప్రధానమైనది.
నిత్య సత్యాలు
దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయనే మీ తండ్రి. ఆయన పరిపూర్ణమైన ప్రేమ మీరు ఆయనను ప్రేమించడానికి మిమ్మల్ని ప్రేరేపించగలదు. పరలోక తండ్రి పట్ల మీకున్న ప్రేమ మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రభావం అయినప్పుడు, అనేక నిర్ణయాలు సులభంగా మారతాయి.
యేసు బోధించిన ఆజ్ఞలలో అన్నిటికంటే ముఖ్యమైన రెండు ఆజ్ఞలు, దేవుణ్ణి ప్రేమించండి మరియు మీ పొరుగువారిని ప్రేమించండి. మరియు మీ పక్కింటివారు ఎవరు? ప్రతి ఒక్కరు! లేఖనాలలో మరియు ప్రవక్తల ద్వారా బోధించబడిన మిగతావన్నీ ఈ రెండు ఆజ్ఞలకు అనుసంధానించబడి ఉన్నాయి.
జనులందరూ మీ సహోదరులు మరియు సహోదరీలు—వాస్తవానికి, మీకు భిన్నముగానున్న వ్యక్తులు లేదా మీతో విభేదించే వ్యక్తులతో సహా. తన పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని పరలోక తండ్రి కోరుకుంటున్నారు. మీరు ఆయన పిల్లలకు సేవ చేసినప్పుడు, మీరు ఆయనకు సేవ చేస్తున్నారు.
ఆహ్వానాలు
దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆయన పట్ల ప్రేమను చూపండి. ఉదాహరణకు, సంస్కారము కొరకు విశ్వాసముగా సిద్ధపడడం మరియు దానిలో పాలుపొందుకొనుటతో సహా, విశ్రాంతిదినమును పవిత్రంగా ఆచరించడం ద్వారా, మీరు వారంలో ఒక రోజును ఆయనకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నారని దేవునికి చూపిస్తారు. మీరు ఉపవాసం ఉండి, దశమభాగాలు మరియు అర్పణలు చెల్లిస్తున్నప్పుడు, భౌతిక విషయముల కంటే ఆయన కార్యము మీకు చాలా ముఖ్యమైనదని మీరు దేవునికి చూపిస్తారు. మీరు దేవుని నామమును మరియు క్రీస్తు నామమును, ఎన్నడూ వ్యర్థంగా లేదా సాధారణంగా ఉపయోగించకుండా భక్తితో ఉపయోగించడం ద్వారా, మీ కొరకు వారు చేసిన సమస్తమునకు మీరు కృతజ్ఞత కలిగియున్నారని చూపిస్తారు.
ప్రతి ఒక్కరినీ దేవుని బిడ్డగా భావించండి. యేసు క్రీస్తు శిష్యుడిగా, మీరు అన్ని జాతులు, మతాలు మరియు ఇతర సమూహాల ప్రజలను ప్రేమ, గౌరవం మరియు కలుపుగోలుగా చూసుకోవడంలో ముందుండవచ్చు—ముఖ్యంగా కొన్నిసార్లు బాధాకరమైన పదాలు మరియు చర్యలకు గురైన వారిని. ఒంటరిగా, ఏకాకిగా లేదా నిస్సహాయంగా భావించే వారిని చేరుకోండి. మీ ద్వారా పరలోక తండ్రి ప్రేమను అనుభూతి చెందడానికి వారికి సహాయం చేయండి.
మీ భాష దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల ప్రేమను ప్రతిబింబించేలా చూసుకోండి—మీరు స్వయంగా సంభాషిస్తున్నప్పుడుగాని లేక వర్చువల్గా సంభాషిస్తున్నప్పుడుగాని. ఉత్తేజపరిచే విషయాలను చెప్పండి—వేరుపరచేవి, బాధ కలిగించే లేదా అభ్యంతరకరమైనది ఏదైనా చెప్పకండి, కనీసం హాస్యంగా కూడా చెప్పకండి. మీ మాటలు శక్తివంతమైనవిగా ఉండవచ్చు. మంచి కొరకు వాటిని శక్తివంతంగా ఉండనివ్వండి.
దేవుని పిల్లలందరినీ ప్రేమించడం ఇంటివద్దనే ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ రక్షకుని యొక్క ప్రేమను అనుభూతిచెందే ప్రదేశంగా మీ ఇంటిని మార్చేందుకు మీ వంతు కృషి చేయండి.
వాగ్దానం చేయబడిన దీవెనలు
మీరు ఆయన ఆజ్ఞలకు లోబడుట ద్వారా మరియు ఆయనతో మీ నిబంధనలను పాటించడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరిచినప్పుడు దేవునితో మీ సంబంధం మరింతగా హెచ్చింౘబడుతుంది.
క్రీస్తువంటి సేవ ద్వారా మీరు మీ ప్రేమను వ్యక్తపరిచినప్పుడు ఇతరులతో మీ సంబంధం మరింతగా హెచ్చింౘబడుతుంది. ప్రపంచాన్ని మరింత ప్రేమపూర్వక ప్రదేశంగా మార్చడంలో మీరు ఆనందాన్ని పొందుతారు.
ప్రశ్నలు మరియు సమాధానాలు
నేను దేవుని ప్రేమను ఎలా అనుభవించగలను? పరలోక తండ్రి యొక్క ప్రేమ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రార్థన ద్వారా తరచుగా ఆయనతో మాట్లాడండి. మీ భావాలను ఆయనతో పంచుకోండి మరియు ఆయన నుండి వచ్చే అభిప్రాయాలను వినండి. లేఖనాలలో ఆయన మాటలను చదవండి. ఆయన మీ కొరకు చేసిన సమస్తం గురించి ఆలోచించండి. ఆయన ఆత్మ ఉన్న ప్రదేశాలలో మరియు కార్యకలాపాలలో సమయాన్ని వెచ్చించండి.
నాపట్ల చెడుగా ప్రవర్తించే వారితో సహా, అందరినీ నేను ప్రేమించాలని ప్రభువు ఆశిస్తున్నారా? మీ శత్రువులను ప్రేమించాలని మరియు మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థించాలని ప్రభువు ఆశిస్తున్నారు. అయితే, మీకు మానసిక హాని, శారీరక హాని లేదా ఆధ్యాత్మిక హాని కలిగించే పరిస్థితిలో మీరు ఉండాలని దీని అర్థం కాదు. మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన సరిహద్దులను నిర్దేశించుకోండి. మీరు బెదిరింపులకు లేదా దుర్వినియోగానికి గురవుతుంటే—లేదా ఇలా వేరొకరికి జరుగుతోందని మీకు తెలినా—నమ్మదగిన పెద్దవారితో మాట్లాడండి.
నేను వ్యతిరేక లింగానికి చెందిన సభ్యులను ఎప్పుడు మరియు ఎలా తెలుసుకోవాలి? ఇతరులను తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గం, స్వచ్ఛమైన స్నేహం. మీరు చిన్నతనంలో ఉన్నప్పుడే, ఎక్కువ మందితో మంచి స్నేహాలను ఏర్పరచుకోండి. కొన్ని సంస్కృతులలో, ఆరోగ్యకరమైన సమూహ కార్యకలాపాల ద్వారా యువత వ్యతిరేక లింగానికి చెందిన సభ్యులను తెలుసుకుంటారు. మీ భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు భద్రత కోసం, మీరు పరిణతి చెందే వరకు వన్-ఆన్-వన్ కార్యకలాపాలను వాయిదా వేయాలి—16 సంవత్సరాల వయస్సు మంచి మార్గదర్శకమైన వయస్సు. మీ తల్లిదండ్రులు మరియు సంఘ నాయకుల వద్ద సలాహా పొండండి. మీరు పెద్దవారైనప్పుడు ప్రత్యేకమైన సంబంధాలను కాపాడుకోండి. యేసు క్రీస్తు పట్ల మీ నిబద్ధతలను నిలబెట్టుకోవడానికి మీకు సహాయం చేసే వారితో సమయం గడపండి.
నా ఇల్లు ప్రేమ కలిగిన ప్రదేశం కాకపోతే నేనేమి చేయగలను? మీ రక్షకుడికి మీ పరిస్థితి తెలుసు మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. సహనము కలిగి ఉండండి, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉండండి మరియు మీ కుటుంబానికి మంచి ఉదాహరణగా ఉండండి. మీ వార్డు కుటుంబంలో సంబంధాలను పెంచుకోండి. యేసు క్రీస్తు బోధనలపై ఆధారపడే మీ స్వంత కుటుంబాన్ని నిర్మించడానికి ఇప్పుడే సిద్ధపడండి.
యెషయా 58:3–11 (ఉపవాసం యొక్క ఉద్దేశ్యాలు); 58:13–14 (విశ్రాంతిదినమును ఆచరించుట వలన కలిగే దీవెనలు); మలాకీ 3:8–10 (దశమభాగం చెల్లించడం వలన కలిగే దీవెనలు); లూకా 6:27–28 (మీ శత్రువులను ప్రేమించుడి); 10:25–37 (నా పొరుగువారు ఎవరు?); యోహాను 3:16–17 (దేవుడు మనలను ఎంతో ప్రేమించెను, కాబట్టి ఆయన తన కుమారుడిని పంపారు); 14:15 (మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాబట్టి ఆజ్ఞలను పాటిస్తాము); 1 యోహాను 4:19 (దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తాము); మోషైయ 2:17 (మనం ఇతరులకు సేవ చేసినప్పుడు, మనం దేవుణ్ణి సేవిస్తున్నాము) చూడండి.
దేవాలయ సిఫారసు ప్రశ్నలు
మీ కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో మీ వ్యక్తిగత మరియు బహిరంగ ప్రవర్తనలో యేసు క్రీస్తు సంఘము యొక్క బోధనలను అనుసరిస్తున్నారా?
మీ గృహములో మరియు సంఘములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా అనుసరించుటకు; మీ కూడికలు హాజరగుటకు; సంస్కారము కొరకు సిద్ధపడి యోగ్యతతో దానిలో పాలుపొందుటకు మీరు శ్రమిస్తున్నారా; మరియు మీ జీవితమును సువార్త యొక్క చట్టములు, ఆజ్ఞలకు అనుగుణముగా జీవిస్తున్నారా?
మీరు పూర్తి దశమభాగమును చెల్లించువారిగా ఉన్నారా?