“అక్టోబరు 26–నవంబరు 1. ‘వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చెదను’: యిర్మీయా 31–33; 36–39; విలాపవాక్యములు 1; 3,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“అక్టోబరు 26–నవంబరు 1. ‘వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చెదను,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
Jeremiah Lamenting the Destruction of Jerusalem [యెరూషలేము నాశనమును బట్టి యిర్మీయా విలపించుట], రెంబ్రాండ్ వాన్ రియన్ చేత
అక్టోబరు 26–నవంబరు 1: “వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చెదను”
యిర్మీయా 31–33; 36–39; విలాపవాక్యములు 1; 3
ఒక ప్రవక్తగా ఉండటానికి ప్రభువు యిర్మీయాను మొదట పిలిచినప్పుడు, అతడి నియమితకార్యము “పెల్లగించుట, విరుగగొట్టుట” (యిర్మీయా 1:10) అని ఆయన అతడికి చెప్పారు—మరియు యెరూషలేములో, పెల్లగించుటకు, విరుగగొట్టుటకు చెడుతనము అత్యధికంగా ఉన్నది. కానీ ఇది యిర్మీయా యొక్క నియమితకార్యములో కొంత భాగము మాత్రమే—అతడు “కట్టుటకు, నాటుటకు” (యిర్మీయా 1:10) కూడా పిలువబడ్డాడు. నిబంధన జనుల తిరుగుబాటు వలన విడువబడిన నిర్జనమైన శిధిలాలలో ఏమి కట్టబడవచ్చు లేదా నాటబడవచ్చు? మరోవిధంగా అడిగినట్లయితే, పాపము లేదా దుర్దశ మన జీవితాలను శిధిలాలలో విడిచిపెట్టినప్పుడు, మనము మరలా ఎలా కట్టగలము మరియు నాటగలము? “నీతి చిగురు”లో (యిర్మీయా 33:15) జవాబు నిలిచియున్నది, అది వాగ్దానమివ్వబడిన మెస్సీయ. ఆయన “ఒక క్రొత్త నిబంధనను” (యిర్మీయా 31:31) తెచ్చును—దానికి భక్తి యొక్క బాహ్య రూపమును మించి అవసరము. ఆయన ధర్మవిధి “[మన] మనస్సులలో” ఉంచబడాలి, “[మన] హృదయాలలో” వ్రాయబడాలి. ప్రభువు “[మన] దేవునిగా ఉండుటకు” మరియు మనము “[ఆయన] జనులుగా ఉండుటకు” (యిర్మీయా 31:33) నిజంగా అర్థము ఇదే. ఇది జీవితకాల ప్రక్రియ, మనము ఇంకా తప్పులు చేస్తాము మరియు అప్పుడప్పుడు దుఃఖించడానికి కారణాన్ని కలిగియుంటాము. కానీ మనము చేసినప్పుడు, ప్రభువు ఇలా వాగ్దానము చేస్తున్నారు, “వారి దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషమిచ్చెదను” (యిర్మీయా 31:13).
విలాపవాక్యములను సమీక్షించడానికి, లేఖన దీపికలో “విలాపవాక్యముల గ్రంథము” చూడండి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
యిర్మీయా 31; 33
ప్రభువు తన నిబంధన జనులను చెర నుండి బయటకు తీసుకువస్తారు.
యిర్మీయా 31; 33 లో ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళినప్పుడు, వారనుభవించే, “అంగలార్పును, మహా రోదన ధ్వనిని” (యిర్మీయా 31:15) ప్రభువు అంగీకరించారు. అయినప్పటికీ ఆయన ఓదార్పును, నిరీక్షణగల మాటలను కూడా ఇచ్చారు. మీరు ఈ అధ్యాయాలను చదివేటప్పుడు వాటి కొరకు చూడండి. మీకు వర్తించేలా మీరు ఏ వాగ్దానాలను కనుగొంటారు?
యిర్మీయా 31:31–34; 32:37–42
“వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.”
ఇశ్రాయేలీయులు ప్రభువుతో వారి నిబంధనను ఉల్లంఘించినప్పటికీ, ప్రభువు తన జనులతో మరలా ఒక “క్రొత్త” మరియు “నిత్యమైన నిబంధన” (యిర్మీయా 31:31; 32:40) చేస్తారని యిర్మీయా ప్రవచించాడు. ఆ నిబంధన ఏమిటి?
మీరు యిర్మీయా 31:31–34; 32:37–42 చదివినప్పుడు, ఇవి ధ్యానించండి:
-
దేవుని యొక్క నిబంధన జనులలో భాగముగా ఉండుట అనగా మీకు గల అర్థమేమిటి.
-
మీ హృదయములో ఆయన ధర్మశాస్తము వ్రాయబడియుండుట అనగా అర్థమేమిటి.
-
మీరు ఆయనతో నిబంధనలు చేసినప్పుడు ప్రభువు ఏమి వాగ్దానం చేస్తారు.
-
ప్రభువుతో మీ నిబంధన సంబంధం మిమ్మల్ని ఎలా మారుస్తుంది.
మీరు పవిత్ర విధులలో పాల్గొన్నప్పుడు మీరు దేవునితో ఏ వాగ్దానాలు చేసారు? ఆయన మీకు చేసిన వాగ్దానాలను ఎలా నెరవేరుస్తున్నారు?
డేవిడ్ ఎ. బెడ్నార్, “నీవు నాయందును నేను నీయందును నిలిచియుందుము; కాబట్టి నాతో నడువుము,” లియహోనా, మే 2023, 123–26 కూడా చూడండి.
యిర్మీయా 36
నన్ను చెడు నుండి మరల్చడానికి లేఖనాలు శక్తి కలిగియున్నాయి.
యిర్మీయా 36:2-3 ప్రకారం, అతని ప్రవచనాలను నమోదు చేయాలని యిర్మీయాను ప్రభువు ఎందుకు ఆజ్ఞాపించారు? మీరు యిర్మీయా 36 చదివినప్పుడు, ఈ ప్రవచనాలను గూర్చి క్రింది జనులు ఎలా భావించారో గమనించండి:
-
ప్రభువు (1–3, 27–31 వచనములు చూడండి)
-
యిర్మీయా (4–7, 32 వచనములు చూడండి)
-
బారాకు (4, 8–10, 14–18 వచనములు చూడండి)
-
యెహూది మరియు యెహోయాకీము రాజు (20–26 వచనములు చూడండి)
-
ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా (25వ వచనము చూడండి)
లేఖనాల గురించి మీరు ఎలా భావిస్తున్నారో ధ్యానించండి. చెడు నుండి మరలిపోవడానికి అవి మీకు ఎలా సహాయపడ్డాయి?
యిర్మీయా 37–39
దేవుని ప్రవక్తలను అనుసరించడంలో దృఢంగా ఉండండి.
యిర్మీయా 37:1–3, 15–21; 38:1–6, 14–28 లో, యిర్మీయా ప్రభువు యొక్క నిజమైన ప్రవక్త అని రాజైన సిద్కియా విశ్వసించాడనడానికి మీరు ఏ రుజువును చూస్తారు? సిద్కియా నమ్మలేదనడానికి మీరు ఏ రుజువును చూస్తారు? ఈ పోలిక నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? మీరు యిర్మీయా 39 చదివినప్పుడు, సిద్కియా మరియు అతని జనులు ప్రవక్తను అనుసరించి, ప్రభువు ఆజ్ఞలను పాటించి ఉంటే, అప్పుడు జరిగే మార్పు గురించి ఆలోచించండి. (1 నీఫై 1–2లో లీహై కుటుంబానికి జరిగిన దానితో సిద్కియాకు జరిగిన దానిని పోల్చండి.)
యిర్మీయా 38:6–13; 39:15–18
సరైనదాని కోసం నిలబడడంలో నేను ధైర్యంగా ఉండగలను.
యిర్మీయా ప్రవచనాలు తమ సైనికులను యుద్ధం చేయడానికి ఇష్టపడకుండా చేస్తున్నాయని రాజు అధికారులు భావించారు, కాబట్టి వారు యిర్మీయాను బురద గొయ్యిలో వేసారు (యిర్మీయా 38:1–4 చూడండి). యిర్మీయా 38:6–13లో, కూషీయుడగు ఎబెద్మెలెకు జవాబులో మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? యిర్మీయా 39:15–18లో ఎబెద్మెలెకుకు ప్రభువు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కూడా గమనించండి.
మీరు ఎబెద్మెలెకు మాదిరిని ఎలా అనుసరించగలరు?
The Cry of Jeremiah [యిర్మీయా యొక్క విలాపము]
విలాపవాక్యములు 1; 3
పాపము వలన నేను అనుభవించే విచారము నుండి ప్రభువు ఉపశమనం కలిగించగలరు.
విలాపవాక్యముల గ్రంథము యెరూషలేము, దాని దేవాలయము నాశనమైన తరువాత వ్రాయబడిన కవితల సేకరణను కలిగియున్నది. అవి కాపాడబడడం ఎందుకు ముఖ్యమైనదని మీరనుకుంటున్నారు? విలాపవాక్యములు 1 మరియు 3 లోని ఏ రూపకములు ఇశ్రాయేలు అనుభవించిన గొప్ప విచారము గురించి గ్రహించడానికి మీకు సహాయపడతాయో పరిగణించండి. క్రీస్తునందు మీరు కనుగొనే నిరీక్షణా సందేశాలు ఏవి? (ప్రత్యేకించి, విలాపవాక్యములు 3:20–33 చూడండి; మత్తయి 5:4; యాకోబు 4:8–10; ఆల్మా 36:17–20 కూడా చూడండి).
కొంతమంది నిరీక్షణను కోల్పోయే అనేక పరిస్థితులను అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ ప్రస్తావించారు మరియు నిరీక్షణను ఎక్కడ పొందాలనే సలహా ఇచ్చారు:
“మనలో కొందరు మన జీవితాలను నిరాశ, నిస్పృహ మరియు దుఃఖంతో నింపవచ్చు. ప్రపంచంలో ప్రబలంగా కనిపిస్తున్న గందరగోళాన్ని ఎదుర్కోవడానికి చాలామంది నిస్సహాయంగా భావిస్తారు. మరికొందరు బలహీనమైన విలువలు మరియు క్షీణిస్తున్న నైతిక ప్రమాణాలచేత బలవంతంగా అధిగమించబడుతున్న కుటుంబ సభ్యుల గురించి వేదన చెందుతారు. … లోకంలోని దుష్టత్వాన్ని, క్రూరత్వాన్ని చక్కదిద్దడం వీలుకాదని అంగీకరించడానికి చాలామంది అయిష్టంగానే ఒప్పుకుంటున్నారు. వారు ఆశలు వదులుకున్నారు. …
“… పాపం మరియు అతిక్రమం కారణంగా మనలో కొందరు నిరీక్షణ కోల్పోయి ఉండవచ్చు. ఒక వ్యక్తి ప్రపంచ విధానాల్లో ఎంత లోతుగా మునిగిపోగలడంటే, అతను వాటి నుండి బయటపడే మార్గాన్ని చూడలేడు మరియు నిరీక్షణను కోల్పోతాడు. ప్రత్యర్థి యొక్క ఈ ఉచ్చులో పడిన వారందరికీ నా విన్నపం ఏమిటంటే, ఎప్పటికీ ఆశ వదులుకోవద్దు! విషయాలు ఎంత నిరాశాజనకంగా అనిపించినప్పటికీ లేదా అవి ఇంకా ఎంత నిరాశాజనకంగా మారగలిగినప్పటికీ, దయచేసి నన్ను నమ్మండి, మీరు ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండవచ్చు. ఎల్లప్పుడూ” (“The Joy of Hope Fulfilled,” Ensign, Nov. 1992, 31–32).
ఇతరులు తమ స్వంత అభ్యాసానికి బాధ్యత వహించడంలో సహాయపడండి. కొన్నిసార్లు అభ్యాసకులు తెలుసుకోవాలని మనం భావిస్తున్న వాటిని వారికి చెప్పడమే బోధించడానికి సులభమైన మార్గంగా అనిపిస్తుంది. అయితే, సులభమైన మార్గం ఎల్లప్పుడూ ఉత్తమమైన మార్గం కాదు. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు: “మన ఉద్దేశ్యం ‘నేను వారికి ఏమి చెప్పగలను?’ అని కాదు. బదులుగా, మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు ఏమిటంటే, ‘నేను వారిని ఏమి చేయమని ఆహ్వానించగలను? వారు ప్రతిస్పందించడానికి ఇష్టపడితే, వారి జీవితాలలోకి పరిశుద్ధాత్మను ఆహ్వానించడాన్ని ప్రారంభించే ఏ ప్రేరేపిత ప్రశ్నలను నేను అడుగగలను?’” (evening with a General Authority, Feb. 7, 2020, broadcasts.ChurchofJesusChrist.org; రక్షకుని విధానములో బోధించుట, 25 కూడా చూడండి). అభ్యాసకులు తమ అభ్యాసానికి బాధ్యత వహించడంలో సహాయపడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఈ నమూనాలో అభ్యాసకులు శోధించడానికి, ధ్యానించడానికి, జాబితాలను రూపొందించడానికి, చిత్రాలను చూడటానికి, వస్తు పాఠాలలో పాల్గొనడానికి, గీయడానికి, పంచుకోవడానికి మరియు వారు నేర్చుకున్న వాటిని అన్వయించడానికి ఆహ్వానించబడ్డారు.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
యిర్మీయా 31:3
పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు “శాశ్వతమైన ప్రేమతో” నన్ను ప్రేమిస్తున్నారు.
-
మీరు మీ పిల్లలతో కలిసి యిర్మీయా 31:3ను చదివినప్పుడు, వారు లోహపు నాణెం వంటి చాలాకాలం పాటు ఉండే వస్తువులను (లేదా వస్తువుల చిత్రాలు) మరియు పండు ముక్క వంటి ఎక్కువ కాలం ఉండలేని వాటిని కనుగొనడంలో మీకు సహాయం చేయగలరు. మీరు “శాశ్వతము” అంటే ఏమిటో మాట్లాడవచ్చు మరియు పరలోక తండ్రి యొక్క “శాశ్వతమైన ప్రేమ” గురించి మీరు ఎలా భావించారో ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.
యిర్మీయా 31:31–34; 32:38–41
నా నిబంధనలను పాటించడానికి దేవుడు నాకు సహాయపడతారు.
-
మీ పిల్లలు ఒక కాగితంపై హృదయాన్ని గీయడాన్ని మరియు దేవునితో నిబంధనలు చేయడం గురించి యిర్మీయా 31:31-34 నుండి నేర్చుకునే విషయాలను హృదయంలో వ్రాయడాన్ని ఆనందించవచ్చు. బాప్తిస్మపు సమయంలో వారు చేసే నిబంధనను మీరు సమీక్షించవచ్చు (మోషైయ 18:10, 13 చూడండి) మరియు ఈ వాగ్దానాలను వారి హృదయాలలో వ్రాయడం అంటే ఏమిటో చర్చించవచ్చు.
యిర్మీయా 36:1–4
లేఖనాలు దేవుని వాక్యము.
-
మీ పిల్లలు యిర్మీయా, బారాకు మరియు రాజు గురించి నేర్చుకోవడానికి ఈ వారం ప్రోత్సాహకార్యక్రమ పేజీ సహాయపడగలదు (యిర్మీయా 36 చూడండి). వారు యిర్మీయా 36:4–10లోని పదాలకు సంబంధించిన అభినయాన్ని కూడా చేయవచ్చు, ఒక పుస్తకంలో వ్రాయడం (4వ వచనము చూడండి) మరియు జనుల కోసం లేఖనాలను చదవడం వంటివి (8, 10 వచనాలు చూడండి).
-
మీరు మరియు మీ పిల్లలు ఒకరి పుస్తకాన్ని మరియు లేఖనాల ప్రతిని చూసి ఈ పుస్తకాలు ఎలా విభిన్నంగా ఉన్నాయో మాట్లాడవచ్చు. లేఖనాల ప్రత్యేకత ఏమిటి? మీకు ప్రత్యేకమైన కొన్ని లేఖన గద్యభాగాలను పరస్పరం పంచుకోవడం స్ఫూర్తిదాయకంగా ఉండవచ్చు.
యిర్మీయా 38:6–13
సరియైన దాని కొరకు నేను నిలబడగలను.
-
యిర్మీయా 38:6–13లోని ఎబెద్మెలెకు కథను మీ పిల్లలు ఊహించుకోవడంలో సహాయం చేయడానికి మీరు నమూనా చివరిలో ఉన్న చిత్రాన్ని ఉపయోగించవచ్చు. ప్రభువు యొక్క ప్రవక్తకు సహాయం చేయడానికి ఎబెద్మెలెకు ధైర్యంగా ఏదైనా చేసిన ఒక వచనాన్ని కనుగొనడంలో మీరు వారికి సహాయపడవచ్చు. ఈ రోజు మన ప్రవక్త దేవునిచే పిలువబడ్డారని మనకు తెలుసు అని చూపించడానికి మనం ఏమి చేయవచ్చు?
విలాపవాక్యములు 1:1–2, 16; 3:22–26
రక్షకుడు నా పాపాలకు క్షమాపణ లభించేలా చేశారు.
-
విలాపవాక్యములను పరిచయం చేయడానికి, ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడనందున, యెరూషలేము మరియు దేవాలయము నాశనం చేయబడ్డాయని మీరు మీ పిల్లలకు వివరించవచ్చు. మీరు ఆ సమయంలో అక్కడ నివసిస్తుంటే మీకు ఎలా అనిపించి ఉంటుందో ఒకరితో ఒకరు పంచుకోవచ్చు (విలాపవాక్యములు 1:1–2, 16 చూడండి). విలాపవాక్యములు 3:22–26లోని సందేశం మీకు ఎలా నిరీక్షణను కలిగించియుండవచ్చు?
-
మీరు చేసిన చెడు ఎంపిక గురించి మీరు విచారంగా ఉన్న సమయాల గురించి కూడా మీరు ఒకరితో ఒకరు చెప్పుకోవచ్చు. యేసు క్రీస్తు అందించే క్షమాపణను అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడేలా విలాపవాక్యములు 3:22–26లో మనం ఏమి కనుగొంటాము?
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.