“నవంబరు 9–15. “రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు”: దానియేలు 1–7,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“నవంబరు 9–15. ‘రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
Daniel Interprets Nebuchadnezzar’s Dream [నెబుకద్నెజరు కలకు దానియేలు భావము చెప్పును], గ్రాంట్ రామ్ని క్లాసన్ చేత
నవంబరు 9–15: “రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు”
దానియేలు 1–7
యేసు క్రీస్తు నందు మీ విశ్వాసము కారణంగా బహుశా ఎవరూ మిమ్మల్ని మండుచున్న అగ్నిగుండంలోకి లేదా సింహాల గుహలోకి పడవేస్తామని ఎప్పుడూ బెదిరించరు. కానీ మనలో ఏ ఒక్కరూ విశ్వాస పరీక్ష లేకుండా ఈ జీవితాన్ని దాటలేరు. దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో వంటివారి మాదిరి నుండి మనమందరము లాభం పొందగలము, వారు శక్తివంతమైన బబులోను సామ్రాజ్యము చేత యౌవన బందీలుగా కొనిపోబడ్డారు (2 రాజులు 24:10–16 చూడండి). ఈ యౌవనులు భిన్నమైన విలువలతోనున్న అపరిచిత సంప్రదాయము చేత చుట్టుముట్టబడ్డారు మరియు తమ నమ్మకాలు, నీతియుక్తమైన ఆచారాలను విడిచిపెట్టాలనే గొప్ప శోధనలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వారు తమ నిబంధనల పట్ల యధార్థముగా నిలిచారు. వారు దీనిని ఎలా చేసారు? దేవుడు మనందరిని చేయమని అడిగిన చిన్న మరియు సరళమైన విషయాలు—ప్రార్థించడం, ఉపవాసం చేయడం, మంచి స్నేహితులను ఎంచుకోవడం, దేవుడిని నమ్మడం, ఇతరులకు వెలుగు కావడం వంటివాటిని వారు చేసారు. ఐగుప్తులోని యోసేపు మరియు పర్షియాలోని ఎస్తేరు వలె బబులోనులోని దానియేలు, అతని స్నేహితులు దేవునియందు తమ విశ్వాసాన్ని నిలుపుకున్నారు మరియు దేవుడు అద్భుతకార్యాలను చేసారు, అవి నేటికీ విశ్వాసులను ప్రేరేపిస్తున్నాయి.
దానియేలు గ్రంథాన్ని సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “దానియేలు“ చూడండి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
దానియేలు 1; 3; 6
నా విశ్వాసము పరీక్షించబడినప్పుడు నేను ప్రభువు యందు నమ్మికయుంచగలను.
ఒకవిధంగా, మనమందరము బబులోనులో నివసిస్తున్నాము. మన ప్రమాణాలతో రాజీపడడానికి మరియు క్రీస్తుపై విశ్వాసం నుండి వైదొలగడానికి మనం తరచుగా శోధనలను ఎదుర్కొంటాము. మీరు దానియేలు 1, 3 మరియు 6 చదువుతున్నప్పుడు, దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు వారికి తప్పు అని తెలిసినవాటిని చేయడానికి ఏవిధంగా ఒత్తిడి చేయబడ్డారో గమనించండి. ఈ సందర్భాలలో వారు ఎలా స్పందించారు? (దానియేలు 1:10–13; 3:15–18; 6:10 చూడండి). మీ విశ్వాసం యొక్క ఫలితాలేవి? మీరు వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు, ప్రభువునందు నమ్మికయుంచడానికి మీకు సహాయపడగలిగేలా ఈ అనుభవాల నుండి మీరేమి నేర్చుకుంటారు? క్రింది ప్రశ్నలను కూడా పరిగణించండి:
-
తప్పు అని మీకు తెలిసిన పనిని చేయడానికి మీరు ఎప్పుడు ఒత్తిడికి గురయ్యారు? ఆయన ఆజ్ఞలను పాటించినందుకు ప్రభువు మిమ్మల్ని ఎలా దీవించారు?
-
మీ విశ్వాసము మీరు కోరిన అద్భుతకార్యాలకు దారితీయకపోతే ఎలా? (ఉదాహరణకు, ఆల్మా 14:8–13 చూడండి). దానియేలు 3:13–18లో మీరు చదివిన దానిని బట్టి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఈ ప్రశ్నకు ఎలా జవాబిచ్చియుంటారని మీరనుకుంటున్నారు? మీరు మీ పరీక్షలను ఎలా ఎదుర్కొంటారనే దానిని వారి మాదిరి ఎలా ప్రభావితం చేయగలదు?
-
మీ నీతియుక్తమైన ఎంపికలు ఇతరులను ప్రభువుపై ఎక్కువ విశ్వాసానికి ఎలా నడిపించగలవు? (దానియేలు 2:47; 3:28–29 చూడండి). మీ ఎంపికలు ఇతరులపై చూపగల ప్రభావాల గురించి ధ్యానించండి.
ప్రతీ ఒక్కరిని చేర్చుకోవడానికి ప్రయత్నించండి. రక్షకుడు “అందరిని తన వద్దకు రమ్మని, తన మంచితనము నందు పాలుపొందమని ఆహ్వానించుచున్నాడు” (2 నీఫై 26:33). మీరు మీ కుటుంబానికి లేదా ఒక తరగతికి బోధిస్తున్నట్లయితే, ప్రతిఒక్కరికీ ఏదో ఒక విధంగా పాల్గొనడానికి అవకాశం ఇవ్వగల మార్గాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, ధ్యానించడానికి మరియు వ్యాఖ్యానించడానికి మీరు ప్రతి వ్యక్తికి ఒక లేఖన గద్యభాగాన్ని, సమావేశ సందేశంలోని ఒక భాగాన్ని లేదా ఒక కీర్తన నుండి ఒక చరణాన్ని ఇవ్వవచ్చు. పాల్గొనమని ఎవరినీ ఒత్తిడి చేయవద్దు, కానీ వారికి అవకాశాలు ఇవ్వండి.
Shadrach, Meshach, and Abednego in the Fiery Furnace [మండుచున్న అగ్నిగుండములో షద్రకు, మేషాకు, అబేద్నెగోలు],
దానియేలు 2
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము భూమి మీద దేవుని రాజ్యము.
నెబుకద్నెజరు యొక్క కల భవిష్యత్తులో ఇహలోకపు రాజ్యాల గురించి, అలాగే భవిష్యత్తులో “ఎన్నడూ నాశనము కలుగని” (దానియేలు 2:44) దేవుని రాజ్యము గురించి ముందుగా చెప్పడాన్ని బయల్పాటు ద్వారా దానియేలు చూసాడు. “ప్రవచించబడిన ఆ కడవరి-దిన రాజ్యమే సంఘము” అని, “మనుష్యుని చేత సృష్టించబడలేదు, కానీ పరలోక దేవుని చేత స్థాపించబడిందని మరియు ‘చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన’ ఆ రాయి ముందుకు పొర్లుతూ భూమిని నింపునని” ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ బోధించారు (“Why the Church,” Liahona, Nov. 2015, 111). దానియేలు 2:34–35, 44–45లో రాయి యొక్క వర్ణనలను మీరు చదువుతున్నప్పుడు, దేవుని యొక్క కడవరి-దిన రాజ్యము గురించి ఆలోచించండి. ఈ కార్యములో మీ పాత్ర ఏమిటి?
ChurchofJesusChrist.org
God Gave Them Knowledge
దానియేలు 2:1–30
బయల్పాటును పొందడానికి ఆధ్యాత్మిక సిద్ధపాటు అవసరం.
మీరు దానియేలు 2:1–15ని సమీక్షిస్తున్నప్పుడు, మీరు దానియేలు స్థానంలో ఉన్నట్లయితే మీకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. దానియేలు ఏమి చేసాడు? (దానియేలు 2:16–18 చూడండి). దేవుడు దానియేలును ఎలా సిద్ధం చేశారనే దాని గురించి దానియేలు 1:17 నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు? ప్రభువు యొక్క సహాయం పొందిన తర్వాత దానియేలు మాటలు మరియు చర్యల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు? (దానియేలు 2:19–30 చూడండి).
దానియేలు 7:13-14
యేసు క్రీస్తు నిత్యుడగు తండ్రి యొక్క కుమారుడు.
రక్షకుని భూసంబంధమైన పరిచర్య సమయంలో, చాలామంది యూదులు రాబోయే మెస్సీయను సూచించడానికి దానియేలు 7:13 నుండి “మనుష్య కుమారుడు” అనే బిరుదును పరిగణించారు. దానియేలు 7:13–14 నుండి మెస్సీయ గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? (మోషే 6:57 కూడా చూడండి).
రక్షకుడు తరచుగా తనను తాను “మనుష్య కుమారుడు” అని ప్రస్తావించేవారు. కొన్ని ఉదాహరణలను సమీక్షించడాన్ని పరిగణించండి: మత్తయి 25:31; మార్కు 9:31; 10:45. ఈ వచనాలలో ఆయన తన గురించి ఏమి బోధిస్తున్నారు? మార్కు 14:61-64లో, యేసు తన మర్త్య జీవితంలోని చివరి రోజున ఈ బిరుదును ఉపయోగించారు. ఆయన ప్రకటనను విన్న జనుల నుండి వచ్చిన స్పందనను గమనించండి. మనుష్య కుమారుని గురించిన దానియేలు ప్రవచనం మార్కు 15లో అతనికి జరిగిన దాని గురించి మీ భావాలను ఎలా ప్రభావితం చేస్తుంది?
తాను “మనుష్య కుమారుడనని” ప్రకటించినందుకు యేసు ద్వేషించబడినట్లే, సత్యాన్ని ప్రకటించినందుకు మీరు కూడా హింసను ఎదుర్కోవచ్చు. దానియేలు 7:13–14 లోని ప్రవచనాన్ని సిద్ధాంతము మరియు నిబంధనలు 121:29, 46 లోని వాగ్దానాలతో పోల్చండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 49:6 కూడా చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
దానియేలు 1; 3; 6
కష్టంగా ఉన్నప్పుడు కూడా సరైనది చేయడానికి యేసు నాకు సహాయం చేస్తారు.
-
దానియేలు గ్రంథంలోని స్ఫూర్తిదాయకమైన కథల నుండి మీ పిల్లలు నేర్చుకోవడంలో సహాయపడడానికి, మీరు దానియేలు 1, 3 మరియు 6లోని సంఘటనల చిత్రాలను కనుగొనవచ్చు (ఈ వారం ప్రోత్సాహ కార్యక్రమ పేజీ లేదా Gospel Art Book [సువార్త కళా పుస్తకము], సంఖ్యలు 23, 25, 26 చూడండి). తర్వాత మీరు చిత్రాలను తిరగేసి ఉంచి, ఒక పిల్లవాడిని దానిని తిప్పి, అది సూచించే కథ గురించి మాట్లాడమని ఆహ్వానించవచ్చు. (సహాయం కొరకు, పాత నిబంధన కథలు, 154–56, 160–62, 163–65 లోని “దానియేలు, అతడి స్నేహితులు,” “షద్రకు, మేషాకు, అబేద్నెగో,” మరియు “దానియేలు మరియు సింహముల గుహ” చూడండి.)
1:39Daniel and His Friends
1:39Shadrach, Meshach, and Abed-nego
1:45Daniel and the Lions’ Den
-
దానియేలు 1, 3 మరియు 6లో దానియేలు మరియు అతని స్నేహితులు ఉన్నట్లుగా, వారు తప్పు ఎంపిక చేసుకునేలా ఒత్తిడికి గురయ్యే పరిస్థితుల గురించి ఆలోచించడంలో మీ పిల్లలకు సహాయపడండి. కష్టమైనప్పటికీ సరైన ఎంపిక చేసుకున్నందుకు మీరు ఎలా ఆశీర్వదించబడ్డారో ఒకరితో ఒకరు పంచుకోండి.
వాక్యం యొక్క జ్ఞానాన్ని నమ్ముట
దానియేలు 1:1-17
నేను నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని పరలోక తండ్రి కోరుతున్నారు.
-
దానియేలు మరియు అతని స్నేహితులు రాజు ఇచ్చిన మాంసాన్ని మరియు ద్రాక్షారసాన్ని తిరస్కరించడం గురించిన కథను చదవడం, ఈ రోజు మనకు పరలోక తండ్రి ఇచ్చిన ఆరోగ్య నియమం గురించి సంభాషణను ప్రేరేపించవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 89 చూడండి). బహుశా మీరు దానియేలు మరియు అతని స్నేహితులు పొందిన ఆశీర్వాదాల కోసం చూడవచ్చు మరియు వాటిని జ్ఞాన వాక్యంలో వాగ్దానం చేసిన ఆశీర్వాదాలతో పోల్చవచ్చు (దానియేలు 1:15–17 మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 89:18–21 చూడండి).
దానియేలు 2
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము భూమి మీద దేవుని రాజ్యము.
-
మీరు మీ పిల్లలతో కలిసి దానియేలు 2:31–35, 44–45 చదివేటప్పుడు, నెబుకద్నెజరు కల యొక్క చిత్రాన్ని గీయమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. కలలోని రాయి యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘమును సూచిస్తుందని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడండి. ఈ కల నుండి సంఘము గురించి మనం ఏమి నేర్చుకుంటాము? కడవరి దినాలలో తన సంఘాన్ని స్థాపించడానికి పరలోక తండ్రి చేసిన కొన్ని విషయాలను మీ పిల్లలు చెప్పవచ్చు. వారికి సహాయం కావాలంటే, మీరు సంఘ పునఃస్థాపన యొక్క సంఘటనల చిత్రాలను చూపవచ్చు (Gospel Art Book [సువార్త కళా పుస్తకము], సంఖ్యలు 90–95 చూడండి).
దానియేలు 6
తరచూ ప్రార్థించాలని పరలోక తండ్రి నన్ను కోరుతున్నారు.
-
పరలోక తండ్రిని ప్రార్థించడం దానియేలుకు ఎందుకు అంత ముఖ్యమైనది? బహుశా మీరు మరియు మీ పిల్లలు కలిసి దానియేలు 6 చదివేటప్పుడు ఆ ప్రశ్న గురించి మాట్లాడుకోవచ్చు. తర్వాత, ప్రార్థించడం మీకు ఎందుకు ముఖ్యమో మీరు ఒకరితో ఒకరు చెప్పుకోవచ్చు. మీ పిల్లలు వివిధ పరిస్థితులలో ప్రార్థిస్తున్న తమ చిత్రాలను గీయడాన్ని ఆనందించవచ్చు. మనం ఎక్కడ ఉన్నా లేదా మనకు ఏమి కావాలన్నా పరలోక తండ్రిని ప్రార్థించవచ్చని ఒకరికొకరు బోధించుకోవడానికి వారు తమ చిత్రాలను ఉపయోగించుకోవచ్చు.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.