2024 రండి, నన్ను అనుసరించండి
జూలై 27–ఆగష్టు 2. “నేను చేయుపని గొప్పది”: ఎజ్రా 1; 3–7; నెహెమ్యా 2; 4–6; 8


“జూలై 27–ఆగష్టు 2. ‘నేను చేయుపని గొప్పది’: ఎజ్రా 1; 3–7; నెహెమ్యా 2; 4–6; 8,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“జూలై 27–ఆగష్టు 2. ‘నేను చేయుపని గొప్పది,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

యెరూషలేము యొక్క గోడలు తిరిగి కట్టబడ్డాయి

I Have a Great Work to Do [నేను చేయవలసిన గొప్ప పని కలదు], టైసన్ స్నో చేత

జూలై 27–ఆగష్టు 2: “నేను చేయుపని గొప్పది”

ఎజ్రా 1; 3–7; నెహెమ్యా 2; 4–6; 8

సుమారు 70 ఏళ్ళు యూదులు బబులోనులో చెరపట్టబడియున్నారు. వారు యెరూషలేమును, దేవాలయమును కోల్పోయారు మరియు అనేకులు దేవుని ధర్మశాస్త్రానికి తమ నిబద్ధతను మరచిపోయారు. కానీ, దేవుడు వారిని మరచిపోలేదు. వాస్తవానికి, “మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలములకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును” (యిర్మీయా 29:10) అని తన ప్రవక్త ద్వారా ఆయన ప్రకటించారు. ఈ ప్రవచనానికి అనుగుణంగా, ప్రభువు తన జనులు తిరిగి యెరూషలేముకు, మరీ ముఖ్యంగా వారి నిబంధనలకు తిరిగి రావడానికి ఒక మార్గాన్ని కల్పించారు. మరియు ఆయన “ఒక గొప్ప పని” (నెహెమ్యా 6:3) సాధించిన సేవకులను పుట్టించారు : జెరుబ్బాబెలు అనే గవర్నరు ప్రభువు మందిర పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. ఒక యాజకుడు మరియు లేఖకుడైన ఎజ్రా, జనులు తమ హృదయాలను ప్రభువు యొక్క ధర్మశాస్త్రం వైపు మళ్లించడానికి సహాయం చేశాడు. మరియు నెహెమ్యా యెరూషలేము చుట్టూ ఉన్న రక్షణ గోడల పునర్నిర్మాణానికి నాయకత్వం వహించాడు. వారు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు, కానీ వారు ఊహించని మూలాల నుండి కూడా సహాయం పొందారు. వారి అనుభవాలు మన అనుభవాలను ప్రేరేపించి, తెలియజేయగలవు, ఎందుకంటే మనము కూడా గొప్ప పనిని చేస్తున్నాము. వారి పనివలె, మన పని ఎక్కువగా యెహోవా మందిరము, ప్రభువు యొక్క ధర్మశాస్త్రము మరియు ఆయన యందు మనము కనుగొను ఆత్మీయ రక్షణకు సంబంధించినది.

ఎజ్రా మరియు నెహెమ్యా గ్రంథాలను సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “ఎజ్రా” మరియు “నెహెమ్యా” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఎజ్రా 1

ప్రభువు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి జనులను ప్రేరేపిస్తారు.

పారసీకదేశము బబులోనును జయించిన తర్వాత, దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ఒక యూదుల సమూహాన్ని యెరూషలేముకు పంపవలెనని పారసీకదేశపు రాజైన కోరెషు ప్రభువు చేత ప్రేరేపించబడ్డాడు. మీరు ఎజ్రా 1 చదువుతున్నప్పుడు, ముఖ్యమైన ఈ పనిలో యూదులకు సహకరించడానికి ఏమి చేయడానికి కోరెషు సిద్ధంగా ఉన్నాడో గమనించండి. ఆయన సంఘ సభ్యులు కాని వారితోపాటు, మీ చుట్టూ ఉన్న స్త్రీ పురుషుల ద్వారా ప్రభువు పనిచేయడాన్ని మీరెలా చూస్తారు? ప్రభువు మరియు ఆయన కార్యము గురించి ఇది మీకు ఏమి సూచిస్తుంది?

యెషయా 44:24–28 కూడా చూడండి.

ఎజ్రా 3:8–13; 6:16–22

ప్రభువు మందిరము ఆనందకరమైన స్థలము.

బబులోనీయులు యెరూషలేముపై దండయాత్ర చేసినప్పుడు, వారు దేవాలయాన్ని దోచుకొని, దానిని పడగొట్టి తగులబెట్టారు (2 రాజులు 25:1–10; 2 దినవృత్తాంతములు 36:17–19 చూడండి). దీనికి సాక్ష్యులైన యూదుల మధ్య మీరున్నట్లయితే, మీరెలా భావించియుండవచ్చని మీరనుకుంటున్నారు? (కీర్తనలు 137 చూడండి). దశాబ్దాల తర్వాత, దేవాలయాన్ని పునర్నిర్మించడానికి తిరిగి వెళ్ళేందుకు వారు అనుమతించబడినప్పుడు యూదులు ఎలా భావించారో గమనించండి (ఎజ్రా 3:8–13; 6:16–22 చూడండి). అది ప్రభువు మరియు ఆయన మందిరము గురించి మీ స్వంత భావాలను ధ్యానించేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. వేడుక జరుపుకోవడానికి దేవాలయ నిర్మాణం ఎందుకు ఒక కారణం?

జెరుబ్బాబెలు దేవాలయం వెలుపల యాజకులు

జెరుబ్బాబెలు దేవాలయము; శామ్ లాలర్ చేత వివరణ

ఎజ్రా 4-7; నెహెమ్యా 2; 46

సెమినరీ చిహ్నము
నేను చేయవలసిన ఒక ముఖ్యమైన కార్యమును దేవుడు కలిగియున్నారు.

ప్రభువు యొక్క కార్యమునకు వ్యతిరేకత లేకపోవడం అరుదు. జెరుబ్బాబెలు మరియు నెహెమ్యా చేత చేయబడిన ప్రయత్నాల విషయంలో ఇది సత్యము. ఈ కథల నుండి నేర్చుకోవడంలో మీకు సహాయపడే సరళమైన విధానం ఇక్కడ ఉంది మరియు వ్యతిరేకత ఉన్నప్పటికీ మీరు ప్రభువు పనిని ఎలా చేయవచ్చో పరిగణించండి:

జెరుబ్బాబెలు కొరకు దేవుని కార్యము (ఎజ్రా 4:3):

నెహెమ్యా కొరకు దేవుని కార్యము (నెహెమ్యా 2:17–18):

నా కొరకు దేవుని కార్యము:

జెరుబ్బాబెలు ఎదుర్కొన్న వ్యతిరేకత (ఎజ్రా 4:4–24):

నెహెమ్యా ఎదుర్కొన్న వ్యతిరేకత (నెహెమ్యా 2:19; 4:1–3, 7–8; 6:1–13):

నేను ఎదుర్కొనే వ్యతిరేకత:

జెరుబ్బాబెలు ఎలా స్పందించాడు (ఎజ్రా 5:1–2):

నెహెమ్యా ఎలా స్పందించాడు (నెహెమ్యా 2:20; 4:6, 9; 6:3–15):

నేను ఎలా స్పందించగలను:

దేవుడు మీకిచ్చిన పని గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, మీరు “యువతుల ఇతివృత్తము” లేదా “అహరోను యాజకత్వ సమూహ ఇతివృత్తము” (సువార్త గ్రంథాలయము) అధ్యయనం చేయవచ్చు.

రక్షకుని సేవలో “పని చేయుటకు మనస్సు కలిగియుండుట” అంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (నెహెమ్యా 4:6). “[మీ] దేవుని కరుణా హస్తముకొలది” అనగా అర్థమేమైయుండవచ్చు? (నెహెమ్యా 2:8; నెహెమ్యా 2:18; ఎజ్రా 7:6, 9, 27–28 కూడా చూడండి). ఆయనకు సేవ చేయడానికి మీ ప్రయత్నాల్లో ఆయన హస్తాన్ని మీరు ఎలా చూసారు?

నెహెమ్యా 8

నేను లేఖనములు చదివినప్పుడు, నేను దీవించబడ్డాను.

తరతరాల వరకు చెరలో ఉన్న యూదులు “మోషే ధర్మశాస్త్ర గ్రంథమునకు” (నెహెమ్యా 8:1) పరిమిత ప్రవేశాన్ని కలిగియున్నారు. నెహెమ్యా 8లో, ఎజ్రా జనులకు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాడు. ఎజ్రా మరియు అతని ప్రజలు దేవుని గురించి మరియు ఆయన వాక్యం గురించి ఎలా భావించారో చూపించేలా ఈ అధ్యాయంలో మీరు ఏమి కనుగొన్నారు? (ప్రత్యేకించి 1–12 వచనాలు చూడండి). దేవుడు మరియు ఆయన వాక్యం గురించి మీరెలా భావిస్తున్నారో మీ జీవితంలో ఏది చూపుతుంది?

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఎజ్రా 3:8–13; 6:16–22

ప్రభువు మందిరము ఆనందకరమైన స్థలము.

  • తమ దేవాలయాన్ని పునర్నిర్మించినప్పుడు యూదులు అనుభవించిన ఆనందాన్ని గురించి మీ పిల్లలకు బోధించడానికి, మీరు క్రింద ఉన్న చిత్రాన్ని వారికి చూపించవచ్చు. ఈ వ్యక్తులు ప్రభువు మందిరము వద్ద ఉండడానికి ఎందుకు సంతోషంగా ఉండియుండవచ్చనే దాని గురించి మాట్లాడండి. దేవాలయం మీకు ఎందుకు ఆనందకరమైన స్థలమో కూడా మీరు మీ పిల్లలకు చెప్పవచ్చు. పరలోక తండ్రికి మరియు రక్షకుడికి సన్నిహితంగా ఉండేందుకు దేవాలయం మీకు ఎలా సహాయం చేసింది?

  • మీరు మీ పిల్లలతో కలిసి ఎజ్రా 3:10–13 చదువుతున్నప్పుడు, దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నప్పుడు యూదులు ఎలా భావించారో చూపించే పదాలను కనుగొనడంలో వారికి సహాయం చేయండి. మీరు 13వ వచనము ముగింపుకు చేరుకున్నప్పుడు, మీరు కలిసి ఆనందంగా కేకలు వేయవచ్చు. ప్రభువు మనకు దేవాలయాలను ఇచ్చారని ఆనందించడానికి కారణాలను ఆలోచించడంలో మీ పిల్లలకు సహాయపడండి. ఆ ఆనందాన్ని మనం ఎలా చూపించగలం?

  • మీరు పాడేటప్పుడు దేవాలయాల చిత్రాలను కూడా చూడవచ్చు.

దేవాలయం దగ్గర ఆనందంగా నడుస్తున్న కుటుంబం

నెహెమ్యా 2:17–20; 6: 1–9

ఆయన “గొప్ప పనిని” చేయడానికి ప్రభువు నాకు సహాయం చేస్తారు.

  • నెహెమ్యా కథను మీ పిల్లలతో పంచుకోండి (నెహెమ్యా 2:17–20; 6:1–9; లేదా పాత నిబంధన కథలు, 173-74లో “నెహెమ్యా” చూడండి). మీరు నెహెమ్యా 2:20 చదువుతున్నప్పుడు, మీరు మరియు మీ పిల్లలు “లేచి నిలబడి” యెరూషలేము గోడలను నిర్మించడంలో సహాయం చేస్తున్నట్లు నటించవచ్చు. లేదా మీ పిల్లలు బ్లాక్‌లు లేదా ఇతర వస్తువులతో గోడను నిర్మించడాన్ని ఆనందించవచ్చు. వారు అలా చేస్తున్నప్పుడు, పరలోక తండ్రి మనం చేయాలని కోరుతున్న ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించడంలో మీరు వారికి సహాయం చేయవచ్చు.

    1:38

    Nehemiah

  • మీరు నెహెమ్యా 6:9 చదువుతున్నప్పుడు, “నా చేతులను బలపరచుము” అని మీరు చెప్పినప్పుడు మీ పిల్లల్ని చేతులు పైకెత్తమని ఆహ్వానించండి. దేవుడు తన పని చేయడానికి మీ చేతులను బలపరుస్తున్నట్లు మీరు భావించిన సమయం గురించి పిల్లలకు చెప్పండి.

నెహెమ్యా 8:1–12

లేఖనాలు ఒక దీవెన వంటివి.

  • ఎజ్రా లేఖనాలను చదవడం విన్నప్పుడు జనులు ఏమి చేశారో వివరించే నెహెమ్యా 8:2–3, 5–6, 8–9, 12లోని కొన్ని వాక్యభాగాలను బిగ్గరగా చదవండి. మీరు చదివేటప్పుడు, మీ పిల్లలు ఈ వాక్యభాగాలను ప్రదర్శించగలరు. అప్పుడు మీరు లేఖనాలను చదివినప్పుడు లేదా విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.

  • మీరు నెహెమ్యా 8:8ని కలిసి చదువుతున్నప్పుడు, లేఖనాలను అర్థం చేసుకోవడానికి వారికి ఏమి సహాయం చేస్తుందో మీ పిల్లలను అడగవచ్చు. రక్షకుని గురించి లేఖనాల నుండి వారు నేర్చుకున్న వాటిని పంచుకోవడానికి మీ పిల్లలను ఆహ్వానించండి.

లేఖనాలలో నిత్య సత్యం కొరకు చూడండి. “లేఖనాలు సువార్త సత్యాలతో నిండి ఉన్నాయి, కానీ కొన్నిసార్లు వాటిని కనుగొనడానికి జాగ్రత్తగా ప్రయత్నించడం అవసరం. మీరు లేఖనాల నుండి కలిసి నేర్చుకుంటున్నప్పుడు, ఆగి, మీరు బోధించే వారిని వారు గమనించిన సువార్త సత్యాల గురించి అడగండి. ఈ సత్యాలు పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళికతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూడడానికి వారికి సహాయపడండి. కొన్నిసార్లు నిత్య సత్యాలు లేఖనాలలో పేర్కొనబడ్డాయి, కొన్నిసార్లు అవి మనం చదివే వ్యక్తుల కథలు మరియు జీవితాలలో వివరించబడ్డాయి. మీరు చదువుతున్న వచనాల యొక్క చారిత్రక నేపథ్యాన్ని, అలాగే వచనాల యొక్క అర్థాన్ని మరియు అవి ఈ రోజు మనకు ఎలా వర్తిస్తాయి అనే విషయాన్ని కలిసి అన్వేషించడం కూడా సహాయకరంగా ఉండగలదు” (రక్షకుని విధానములో బోధించుట22).

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

పత్రము చదువుతున్న ఎజ్రా

Ezra at the Water Gate [నీటి గుమ్మము వద్ద ఎజ్రా], © Providence Collection/licensed from goodsalt.com

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: లేఖనాలు ఒక దీవెన వంటివి