2024 రండి, నన్ను అనుసరించండి
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: పాత నిబంధనలో కవిత్వమును చదువుట


“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: పాత నిబంధనలో కవిత్వమును చదువుట,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“పాత నిబంధనలో కవిత్వమును చదువుట,” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

ఆలోచనల చిహ్నము

జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు

పాత నిబంధనలో కవిత్వమును చదువుట

పాత నిబంధన గ్రంథాలలో, ఆదికాండము నుండి ఎస్తేరు వరకు మనము ఎక్కువగా కథలను చూస్తాము—అవి ఒక ఆత్మీయ దృష్టికోణము నుండి చారిత్రక సంఘటనలను వివరించే కథన వృత్తాంతాలు. నోవహు ఒక ఓడను నిర్మించాడు, మోషే ఇశ్రాయేలీయులను విడిపించాడు, హన్నా ఒక కుమారుని కోసం ప్రార్థించింది మొదలైనవి. యోబును మొదలుకొని, మనం భిన్నమైన రచనా శైలిని కనుగొంటాము. ఈ గ్రంథాలలో, పాత నిబంధన రచయితలు లోతైన భావాలను లేదా స్మారక ప్రవచనాలను గుర్తుంచుకోదగిన రీతిలో వ్యక్తీకరించడానికి కవితా భాష వైపు మొగ్గు చూపారు.

పాత నిబంధన యొక్క చారిత్రక గ్రంథాలన్నిటిలో కవిత్వము వెదజల్లిన కొన్ని మాదిరులను మనము ఇదివరకే చూసాము. యోబు గ్రంథము నుండి మనము దానిని ఎక్కువగా చూస్తాము. యోబు, కీర్తనలు మరియు సామెతల గ్రంథాలు దాదాపు పూర్తిగా కవిత్వమును కలిగియుండి, యెషయా, యిర్మీయా మరియు ఆమోసు వంటి ప్రవక్తల రచనలలో భాగాలుగా ఉన్నాయి. కవిత్వము చదవడం ఒక కథను చదవడం కంటే భిన్నంగా ఉంటుంది కనుక, దానిని గ్రహించడానికి తరచుగా వేరే విధానము అవసరము. పాత నిబంధన కవిత్వంలో మరింత అర్థాన్ని కనుగొనడంలో మీకు సహాయపడే కొన్ని ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి.

హెబ్రీ కవిత్వము గురించి తెలుసుకొనుట

ముందుగా, పాత నిబంధనలో హెబ్రీ కవిత్వము కొన్ని ఇతర రకాల కవితల వలె పద్యముపై ఆధారపడిలేదని గమనించుట మీకు సహాయపడవచ్చు. లయ, పదబంధము మరియు శబ్దాల పునరావృతం ప్రాచీన హెబ్రీ కవిత్వం యొక్క సాధారణ లక్షణాలైనప్పటికీ, ఈ విషయాలు సాధారణంగా అనువాదంలో కోల్పోబడతాయి. అయినప్పటికీ, ఆలోచనలు లేదా ఉపాయములు పునరావృతమై కొన్నిసార్లు “సాదృశ్యము” అని పిలువబడే ఒక లక్షణమును మీరు గమనిస్తారు. యెషయా నుండి ఇది ఒక సాధారణ ఉదాహరణ:

ఓ సీయోనూ, నీ బలము ధరించుకొనుము;

యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. (యెషయా 52:1)

29వ కీర్తనలో అనేక సాదృశ్యాలు ఉన్నాయి—ఉదాహరణకు:

యెహోవా స్వరము బలమైనది;

యెహోవా స్వరము ప్రభావము గలది. (కీర్తనలు 29:4)

రెండవ వరుస మొదటి వరుసకు సాదృశ్యముగా ఉందని తెలుసుకొనుట ద్వారా లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడాన్ని సులభతరం చేసే ఒక సంఘటన ఇక్కడున్నది.

మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను,

మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండ చేసితిని. (ఆమోసు 4:6)

ఈ ఉదాహరణలలో, కవి స్వల్ప తేడాలతో ఒక ఆలోచనను పునరావృతం చేశాడు. ఈ పద్ధతి పునరావృత ఆలోచనను నొక్కి చెప్పగలదు మరియు దానిని మరింత పూర్తిగా వివరించడానికి లేదా అభివృద్ధి చేయడానికి తేడాలను ఉపయోగించగలదు.

ఇతర సందర్భాలలో, ఈ మాదిరిలో ఉన్నట్లుగా రెండు సాదృశ్యపు వాక్యాలు వ్యతిరేక ఆలోచనలను తెలుపడానికి అదే భాషను ఉపయోగిస్తాయి:

మృదువైన మాట క్రోధమును చల్లార్చును:

నొప్పించు మాట కోపమును రేపును. (సామెతలు 15:1)

ఈ విధమైన సాదృశ్యము ఆకస్మికంగా జరగలేదు. రచయితలు దానిని ఉద్దేశ్యపూర్వకంగా చేసారు. ఇది శక్తి మరియు అందం రెండింటితో ఆధ్యాత్మిక భావాలను లేదా సత్యాలను వ్యక్తపరచడంలో వారికి సహాయపడింది. కనుక పాత నిబంధన రచనలో మీరు సాదృశ్యమును గమనించినప్పుడు, రచయిత యొక్క సందేశమును గ్రహించడానికి అది మీకు ఎలా సహాయపడుతుందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉదాహరణకు, “సుందర వస్త్రములతో” “బలమును” మరియు “యెరూషలేముతో” “సీయోనును” సంబంధింప చేయుట ద్వారా యెషయా ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? (యెషయా 52:1). “నొప్పించు మాటలు” అనే వాక్యభాగానికి వ్యతిరేకమైనది “మృదువైన మాట” అని మనకు తెలిసినప్పుడు దాని గురించి మనము ఏమి ఊహించగలము? (సామెతలు 15:1).

కలం మరియు కాగితపు చుట్ట‌తో పాత నిబంధన రచయిత

He Restoreth My Soul [ఆయన నా ఆత్మను పునరుద్ధరించును], వాల్టర్ రేన్ చేత

ఒక క్రొత్త స్నేహితునిగా హెబ్రీ కవిత్వము

కొంతమంది కవిత్వం చదవడాన్ని కొత్త వ్యక్తిని కలవడంతో పోలుస్తారు. పాత నిబంధన కవిత్వాన్ని చదవడం, సుదూర దేశం మరియు విదేశీ సంస్కృతి నుండి మనకు భిన్నమైన భాష మాట్లాడే వ్యక్తిని మరియు రెండు వేల సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని కలవడం వంటిది కావచ్చు. ఈ వ్యక్తి బహుశా మొదట మనం అర్థము చేసుకోలేని విషయాలను మాట్లాడవచ్చు, కానీ వారికి మనతో మాట్లాడడానికి విలువైనది ఏదీ లేదని దానర్థము కాదు. వారి దృష్టి కోణం నుండి విషయాలను చూడడానికి ప్రయత్నిస్తూ, మనము వారితో కాస్త సమయాన్ని గడపాలి. మన హృదయాలలో, వాస్తవంగా మనం ఒకరినొకరం బాగా అర్థము చేసుకోవడాన్ని మనం కనుగొనవచ్చు. మనం సహనం మరియు కనికరం చూపిస్తే, మనకు కొత్తగా పరిచయమైన వ్యక్తి చివరికి ప్రియమైన స్నేహితుడిగా మారవచ్చు.

కనుక మీరు యెషయా నుండి ఒక గద్యభాగమును చదివినప్పుడు, ఉదాహరణకు, దానిని ఒక క్రొత్త పరిచయస్థునితో మీ మొదటి పరిచయముగా భావించండి. “నా సాధారణ అభిప్రాయం ఏమిటి?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రతీ మాటను మీరు గ్రహించనప్పటికీ—గద్యభాగము మీరు ఎలా భావించేలా చేయాలి? తరువాత సాధ్యమైతే, దానిని మరలా అనేకసార్లు చదవండి. బిగ్గరగా చదవడాన్ని పరిగణించండి; కొందరు వ్యక్తులు ఆ విధంగా అదనపు అర్థాన్ని కనుగొంటారు. యెషయా ఎంపిక చేసిన ప్రత్యేకమైన మాటలు, ప్రత్యేకంగా మీ మనస్సులో ఒక చిత్రమును గీసే మాటలను గమనించండి. ఆ చిత్రాలు మీరు ఎలా భావించేలా చేస్తాయి? యెషయా భావాల గురించి అవి ఏమి సూచిస్తున్నాయి? పాత నిబంధన కవుల యొక్క మాటలను మీరు ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే, అంత ఎక్కువగా లోతైన ఆత్మీయ సందేశాన్ని వ్యక్తీకరించడానికి వారు ఉద్దేశపూర్వకంగా వారి మాటలను మరియు పద్ధతులను ఎంచుకున్నారని మీరు కనుగొంటారు.

లేఖనాలను అధ్యయనం చేస్తున్న ఇద్దరు స్త్రీలు

కవితలు అద్భుతమైన స్నేహితులు కాగలవు, ఎందుకనగా అవి మన భావాలను, అనుభవాలను గ్రహించడానికి మనకు సహాయపడతాయి. పాత నిబంధన కవితలు ప్రత్యేకంగా ప్రశస్థమైనవి, ఎందుకంటే అవి దేవునితో మన అనుబంధానికి సంబంధించిన—మన అత్యంత ముఖ్యమైన భావాలను, అనుభవాలను గ్రహించడానికి మనకు సహాయపడతాయి.

పాత నిబంధనలో కవిత్వమును మీరు అధ్యయనం చేసినప్పుడు, లేఖన అధ్యయనము మనల్ని యేసు క్రీస్తు యొద్దకు నడిపించినప్పుడు అది అత్యంత విలువైనదని జ్ఞాపకముంచుకోండి. ఆయన యందు మీ విశ్వాసమును వృద్ధి చేసే చిహ్నములు, ఊహాచిత్రములు మరియు సత్యముల కొరకు వెదకండి. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపణలను వినండి.

జ్ఞాన సాహిత్యము

పాత నిబంధన కవిత్వములో ఒక వర్గమును పండితులు “జ్ఞాన సాహిత్యము” అని పిలుస్తారు. యోబు, సామెతలు మరియు ప్రసంగి ఈ వర్గములోకి వస్తాయి. స్తుతి, దుఃఖము మరియు ఆరాధన యొక్క భావాలను కీర్తనలు వ్యక్తపరుస్తుండగా, జ్ఞాన సాహిత్యము శాశ్వతమైన సలహా లేదా లోతైన, తాత్విక ప్రశ్నలపై దృష్టిసారిస్తుంది. ఉదాహరణకు, యోబు గ్రంథము దేవుని యొక్క న్యాయమును, మానవ బాధ వెనుక గల కారణాలను అన్వేషిస్తుంది. మునుపటి తరములనుండి సేకరించబడి, ఆమోదించబడిన తెలివైన సూక్తులతో పాటు, మంచిగా ఎలా జీవించాలి అనే సలహాను సామెతలు ఇస్తాయి. జీవితం యొక్క ఉద్దేశమును ప్రశ్నించునట్లు ప్రసంగి చేస్తుంది—ప్రతిదీ అశాశ్వతమైనదిగా మరియు యాదృచ్ఛికంగా అనిపించినప్పుడు, నిజమైన అర్థాన్ని మనం ఎక్కడ కనుగొనగలము? జ్ఞాన సాహిత్యాన్ని దేవుడు మరియు ఆయన సృష్టించిన లోకము గురించి పరిశీలనలను పంచుకోవాలనుకునే ప్రేరేపిత సలహాదారులతో ఆలోచనాత్మక సంభాషణలుగా మీరు భావించవచ్చు—మరియు ఈ విషయాలను మునుపటి కంటే కొంచెం మెరుగ్గా అర్థం చేసుకోవడంలో అది మీకు సహాయపడవచ్చు.