“మార్చి 2–8. ‘దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము’,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“మార్చి 2–8. ‘దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము’,” రండి, నన్ను అనుసరించండి: 2026
Esau Sells His Birthright [ఏశావు తన జ్యేష్ఠత్వమును యాకోబుకు అమ్మివేయును], గ్లెన్ ఎస్. హాప్కిన్‌సన్ చేత (వివరణ)
మార్చి 2–8: “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము”
ఆదికాండము 24–33
దేవుని నుండి మీ కోసం మీరు ఆశీర్వాదం ఎలా పొందగలరు? అబ్రాహాము మరియు శారాల మనవడు అయిన యాకోబు వృత్తాంతం, ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకున్న వ్యక్తి యొక్క కథ అని మీరు అనవచ్చు. జ్యేష్ఠ కుమారుడు జన్మహక్కు దీవెనను పొందిన సంస్కృతిలో, యాకోబు తన కవల సోదరుడు ఏశావు పుట్టిన వెంటనే జన్మించాడు. “యాకోబు” అనే పేరుకు “భర్తీ చేసేవాడు” అని అర్థం—ఒకరి స్థానంలో మరొకరిని భర్తీ చేసేవాడు. ఏశావు జన్మహక్కు ఆశీర్వాదానికి అనర్హుడైనందున అతని వారసునిగా ఏశావును భర్తీ చేయడానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించడం ద్వారా యాకోబు ఆ పేరుకు అనుగుణంగా జీవించాడు (ఆదికాండము 25:30–34; 26:34–35; 27:36 చూడండి). ఫలితంగా కుటుంబంలో అసమ్మతి ఏర్పడింది మరియు యాకోబు తన ప్రాణాలు కాపాడుకోవడానికి అరణ్యానికి పారిపోవలసి వచ్చింది.
చాలా సంవత్సరాల తర్వాత, దేవుడు యాకోబును ఇంటికి తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపించారు. దారిలో, యాకోబు వినయంతో, మళ్ళీ దేవుని నుండి ఆశీర్వాదం కోరాడు. లేఖనాలు ఈ సమయాన్ని యాకోబుకు “పెనుగులాట”గా వర్ణించాయి మరియు అతడు, “నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని” (ఆదికాండము 32:26) నిన్ను పోనియ్యను అన్నాడు. అప్పుడు పాఠం—మరియు ఆశీర్వాదం వచ్చింది. దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చారు—దానర్థము, ఇతర విషయాల మధ్య, “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము.” దేవుని యొక్క అత్యంత విలువైన ఆశీర్వాదాలను, ఆయన నిబంధన ఆశీర్వాదాలను పొందాలంటే, మరొకరి స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం లేదని ఇశ్రాయేలు తెలుసుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలను కొనుగోలు చేయలేము, స్వాధీనం చేసుకోలేము లేదా గెలుపొందలేము. ఇశ్రాయేలు పేరుకు తగ్గట్టుగా జీవించే వారందరికీ—తమ జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళందరికీ ఆయన వాటిని ఉచితంగా ఇస్తారు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
ఆదికాండము 24
నిబంధన వివాహము దేవుని నిత్య ప్రణాళికకు ఆవశ్యకమైనది.
ఆదికాండము 24 చదువుతున్నప్పుడు, అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహాన్ని ఎందుకంత ముఖ్యమైనదిగా భావించాడని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వివాహం దేవునికి ఎందుకు ముఖ్యమైనది?
దృఢమైన వివాహానికి మరియు కుటుంబానికి దోహదపడే ఏ లక్షణాలను మీరు రిబ్కాలో కనుగొన్నారు? (ప్రత్యేకించి 15–28, 57–61 వచనాలు చూడండి).
ఆదికాండము 25:29–34
నేను తాత్కాలిక విషయాల కంటే శాశ్వతమైన విషయాలకు విలువ ఇవ్వగలను.
ఇస్సాకు మరియు రిబ్కాల సంస్కృతిలో, పెద్ద కొడుకు జన్మహక్కును పొందడం అంటే అర్థం, కుటుంబ సంరక్షణ కోసం ఎక్కువ బాధ్యతలతో పాటు గొప్ప వారసత్వాన్ని పొందడం. మీరు ఆదికాండము 25:29–34 చదువుతున్నప్పుడు, ఒక భోజనమునకు బదులుగా ఏశావు తన జ్యేష్టత్వమును వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడియుండవచ్చో ఆలోచించండి. ఈ వృత్తాంతంలో మీ కోసం మీరు ఏ పాఠాలు కనుగొన్నారు? రెండు జాబితాలను రూపొందించడం సహాయపడవచ్చు: (1) దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్న నిత్య దీవెనలు మరియు (2) మీ దృష్టిని మరల్చగల లోక విషయాలు. తర్వాత మీరు “జన్మ హక్కును” మొదటి జాబితా నుండి మరియు “చిక్కుడుగింజల వంటకాన్ని” రెండవదాని నుండి వేరే పదాలతో భర్తీ చేసి, ఆ గద్యభాగాన్ని చదవవచ్చు. మీరు రక్షకునిపై మరియు ఆయన సువార్త యొక్క నిత్య దీవెనలపై ఎలా దృష్టి పెడతారు?
మత్తయి 6:19–33; ఎమ్. రస్సెల్ బాల్లర్డ్, “అతి ముఖ్యమైన దానిని జ్ఞాపకముంచుకోండి,” లియహోనా, మే 2023, 105–7 కూడా చూడండి.
Jacob at Bethel [బేతేలు వద్ద యాకోబు], జేమ్స్ స్మేతమ్ చేత
ఆదికాండము 28
ప్రభువు మందిరము యొక్క నిబంధనలు దేవుని శక్తిని నా జీవితంలోకి తెస్తాయి.
రాతి దిండుపై నిద్రిస్తున్నప్పుడు, యాకోబు జీవితాన్ని మార్చే ఒక కలగన్నాడు. యాకోబు ఆ ప్రదేశానికి బేతేలు లేదా “దేవుని ఇల్లు” అని పేరు పెట్టడం, “నిశ్చయంగా ప్రభువు ఈ స్థలంలో ఉన్నాడు” (ఆదికాండము 28:16) అని ప్రకటించడం చాలా పవిత్రమైన అనుభవం.
మీరు ఆదికాండము 28 చదువుతున్నప్పుడు, ఏది ఈ అనుభవాన్ని యాకోబుకు అంత పవిత్రమైనదిగా చేసిందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. ఆ సమయంలో అతను ఏమి అనుభవిస్తున్నాడు? అతను ఎలా భావించి ఉండవచ్చు? ప్రభువు యొక్క మందిరాన్ని మీకు గుర్తు చేసే పదాలు మరియు వాక్యభాగాల కొరకు మీరు 10–22 వచనాలలో చూడవచ్చు. దేవుడు, ఆయన మందిరము మరియు ఆయన నిబంధనల గురించి మీరు పొందే మనోభావాలేవి?
ఈ నమూనా చివరలో యాకోబు కలని వర్ణించే వర్ణచిత్రం ఉంది; మీరు చదివేటప్పుడు దానిని చూడవచ్చు. మీరు అతని కల గురించి మీ స్వంత కళాత్మక వర్ణనను చేయవలసినట్లయితే, మీరు ఏమి చేస్తారు? మీరు కథ నుండి ఏ సత్యాలను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు?
దేవునికి దగ్గరగా భావించడానికి దేవాలయము మీకేవిధంగా సహాయపడుతుంది? అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశము “దేవాలయము మరియు మీ ఆత్మీయ పునాది” (లియహోనా, నవ. 2021, 93–96) లో ఈ ప్రశ్నకు జవాబుల కొరకు చూడడాన్ని పరిగణించండి. ప్రధాన చేతిపుస్తకము, 27.2 (సువార్త గ్రంథాలయము)లో ప్రభువు మందిరము యొక్క నిబంధనలు మరియు దీవెనలను పునర్వీక్షించాలని కూడా మీరు కోరుకోవచ్చు. ఈ నిబంధనలను పాటించడం దేవుని శక్తిని మీ జీవితంలోకి ఎలా తెస్తుంది?
సృజనాత్మకంగా ఉండండి. లేఖనాలను చదవడమే కాకుండా వాటి నుండి నేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వృత్తాంతాల చిత్రాలను గీసినట్లయితే వారు లేఖనాలను బాగా అర్థం చేసుకుంటారని కొంతమంది కనుగొంటారు. మరికొందరు లేఖనాలకు సంబంధించిన పవిత్ర సంగీతంలో ఆధ్యాత్మిక అంతర్దృష్టులను కనుగొంటారు. ఒక అభ్యాస మార్గానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి; విభిన్న విధానాలను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉండండి.
ఆదికాండము 29:31–35; 30:1–24
నా శ్రమలందు ప్రభువు నన్ను జ్ఞాపకముంచుకొనును.
మీరు ఆదికాండము 29:31–35 మరియు 30:1–24 చదువుతున్నప్పుడు, రాహేలు మరియు లేయాపట్ల దేవుని యొక్క కనికరమును వర్ణించే పదాల కొరకు చూడండి. దేవుడు ఎలా “[మీ] శ్రమను చూచియున్నాడు” మరియు మిమ్మల్ని “జ్ఞాపకము చేసుకున్నాడో” (ఆదికాండము 29:32; 30:22) ధ్యానించండి.
ఆదికాండము 32–33
రక్షకుడు నా కుటుంబాన్ని స్వస్థపరచగలరు.
యాకోబు కనానుకు తిరిగి వెళ్లినప్పుడు, అతని సహోదరుడైన ఏశావు అతడిని ఎలా స్వీకరిస్తాడోనని అతడు “మిక్కిలి భయపడి, తొందరపడెను” (ఆదికాండము 32:7). మీరు ఆదికాండము 32–33 చదువుతున్నప్పుడు, మీ స్వంత కుటుంబ సంబంధాల గురించి—బహుశా, ప్రత్యేకించి స్వస్థత అవసరమైన దాని గురించి ఆలోచించండి. ఈ కథ ఎవరో ఒకరిని సమీపించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఇటువంటి ప్రశ్నలు మీ పఠనమును నడిపించడానికి సహాయపడవచ్చు:
-
ఏశావును కలుసుకోవడానికి యాకోబు ఎలా సిద్ధపడ్డాడు?
-
ఆదికాండము 32:9–12లో యాకోబు యొక్క ప్రార్థన గురించి మీరు ప్రత్యేకంగా గుర్తించినదేమిటి?
-
ఏశావు యొక్క మాదిరి నుండి క్షమాపణ గురించి మీరేమి నేర్చుకుంటారు?
-
కుటుంబ అనుబంధాలను బాగు చేయడానికి రక్షకుడు మనకు ఎలా సహాయపడగలరు?
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
ఆదికాండము 24:10–21
నేను ఇతరులపట్ల దయగా ఉండగలను.
-
రిబ్కా దయ యొక్క అద్భుతమైన ఉదాహరణను ఎత్తిచూపడానికి ఆదికాండము 24:10–21 లోని కథను మీరు సంక్షిప్తం చేస్తున్నప్పుడు, మీ పిల్లలకు దిగువ చిత్రాన్ని లేదా ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీని చూపవచ్చు. కథను అభినయించడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. ఇది మీరు మరియు మీ పిల్లలు చూసిన దయతో కూడిన చర్యల గురించి సంభాషణకు దారితీయవచ్చు.
-
రిబ్కా వలె మనం ఎలా దయ చూపగలం?
Old Testament Heroes [పాత నిబంధన కథానాయకులు], డిల్లీన్ మార్ష్ చేత (వివరణ)
ఆదికాండము 25:21–34
లోక విషయాల కంటే నిత్య విషయాలు ముఖ్యమైనవి.
-
మీ పిల్లలు ఆదికాండము 25:21–34లోని కథను అర్థం చేసుకోవడానికి (పాత నిబంధన కథలు, 38–41లో) “యాకోబు మరియు ఏశావు”ను ఉపయోగించడాన్ని పరిగణించండి. ఏశావు తన జన్మహక్కును చిక్కుడుగింజల వంటకం కోసం ఇచ్చివేయాలా వద్దా అని వారి సలహా కోరినట్లు మీ పిల్లలు ఊహించుకోవచ్చు. వారు అతనికి ఏమి చెబుతారు?
2:5Jacob and Esau
-
మీకు మరియు మీ పిల్లలకు ఏ విషయాలు శాశ్వతంగా ముఖ్యమైనవి? బహుశా మీ పిల్లలు ఈ విషయాలను సూచించే చిత్రాలు లేదా వస్తువులను కనుగొనవచ్చు. ఈ విషయాలు మనకు ముఖ్యమైనవని మనం ప్రభువుకు ఎలా చూపించగలము?
ఆదికాండము 28:10–22
నిబంధనలు పరలోక తండ్రి వద్దకు తిరిగి రావడానికి నాకు సహాయం చేస్తాయి.
-
మీరు ఆదికాండము 28:10–22 కలిసి చదువుతున్నప్పుడు, మన నిబంధనలు నిచ్చెనలా ఎలా ఉన్నాయో చెప్పడానికి మీరు ఒక నిచ్చెన లేదా మెట్లు (లేదా ఈ నమూనా చివరలో ఉన్న చిత్రం వంటిది) ఉపయోగించవచ్చు. బహుశా మీ పిల్లలు నిచ్చెన ఎక్కినట్లు నటించి, ఒక్కో అడుగు వేసేటప్పుడు, మనం దేవునికి లోబడతామని వాగ్దానం చేసే సమయాల గురించి మాట్లాడవచ్చు, అంటే మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు, సంస్కారమును తీసుకున్నప్పుడు లేదా దేవాలయానికి వెళ్ళినప్పుడు వంటివి. మన నిబంధనలు మనల్ని దేవునికి ఎలా దగ్గర చేస్తాయి?
ఆదికాండము 32:6–11; 33:1–4
నా కుటుంబాన్ని ప్రేమించడంలో పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నాకు సహాయం చేయగలరు.
-
ఈ వచనాలను పరిచయం చేయడానికి, అనేక సంవత్సరాలు కఠినభావాలు కలిగియున్న తర్వాత, యాకోబు మళ్ళీ ఏశావును కలవబోతున్నాడని మీరు వివరించవచ్చు. ఆదికాండము 32:6–11 కలిసి చదవండి. యాకోబు ఎలా భావించాడు? సహాయం పొందడానికి అతడు ఏమి చేసాడు? యాకోబు ప్రార్థనకు ప్రభువు ఎలా జవాబిచ్చారో కనుగొనడానికి ఆదికాండము 33:1–4 కలిసి చదవండి. యాకోబు మరియు ఏశావు ఈ రోజు మనతో మాట్లాడగలిగినట్లయితే, మన కుటుంబములో వివాదము ఉన్నప్పుడు, మనకు సహాయపడేందుకు వాళ్ళు ఏమి చెప్పవచ్చు?
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.