2024 రండి, నన్ను అనుసరించండి
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ఇశ్రాయేలు సంతతి


“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ఇశ్రాయేలు సంతతి,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“ఇశ్రాయేలు సంతతి,” రండి, నన్ను అనుసరించండి: 2026

ఆలోచనల చిహ్నము

జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు

ఇశ్రాయేలు సంతతి

ఎక్కడో తూర్పు కనాను అరణ్యములో, యాకోబు తన కవల సోదరుడైన ఏశావును కలుసుకోవడం కోసం భయంగా ఎదురుచూసాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం యాకోబు చివరిసారిగా ఏశావును చూసినప్పుడు, ఏశావు అతన్ని చంపాలనుకున్నాడు. దేవుని నుండి ఒక దీవెనను కోరుతూ, యాకోబు అరణ్యములో పెనుగులాడుతూ రాత్రంతా గడిపాడు. యాకోబు యొక్క విశ్వాసము, పట్టుదల మరియు తీర్మానము ఫలితంగా, దేవుడు అతడి ప్రార్థనలకు జవాబిచ్చారు. ఆ రాత్రి యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది, మిగిలిన విషయాల మధ్య, ఆ పేరుకు అర్థము “అతడు దేవునితో పోరాడి గెలిచెను” (ఆదికాండము 32:28, పాదవివరణ ).

యబ్బోకు నది

యబ్బోకు నది దగ్గర, యాకోబు ఇశ్రాయేలు పేరును పొందాడు.

బైబిలులో ఇశ్రాయేలు పేరు కనబడుట ఇదే మొదటిసారి మరియు గ్రంథమంతటా, చరిత్ర అంతటా స్థిరంగా ఉంచబడిన పేరు అది. త్వరలో ఆ పేరు ఒకరికంటే ఎక్కువమందికి సూచించబడింది. ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు మరియు వారి వంశస్థులు సమిష్టిగా “ఇశ్రాయేలు సంతతి,” “ఇశ్రాయేలు గోత్రములు,” “ఇశ్రాయేలు సంతానము,” లేదా “ఇశ్రాయేలీయులు” అని పిలువబడ్డారు.

చరిత్ర అంతటా, ఇశ్రాయేలు సంతానము, వారు ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రములలో ఒకదాని నుండి రావడాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించారు. వారి వంశము వారి నిబంధన గుర్తింపులో ముఖ్యమైన భాగము. అపొస్తలుడైన పౌలు తాను “బెన్యామీను గోత్రము” (రోమా 11:1) వాడనని ప్రకటించాడు. కంచు పలకలు తీసుకొని రావడానికి లీహై తన కుమారులను యెరూషలేముకు పంపడానికి గల కారణము ఆ పలకలు “అతడి పితరుల యొక్క వంశావళిని” కలిగియుండడమే” (1 నీఫై 5:14). లీహై తాను యోసేపు వంశస్థుడనని కనుగొన్నాడు మరియు ఇశ్రాయేలు సంతతితో వారి సంబంధాన్ని గురించి అతని సంతానం యొక్క అవగాహన తరువాతి సంవత్సరాల్లో వారికి ముఖ్యమైనదని నిరూపించబడింది.

నేడు సంఘములో, మీరు ఇశ్రాయేలు గురించి “ఇశ్రాయేలును సమకూర్చుట” వంటి వ్యక్తీకరణలలో వినవచ్చు. మనము “ఇశ్రాయేలు యొక్క విమోచకుడు,” “ఇశ్రాయేలు నిరీక్షణ” మరియు “ఇశ్రాయేలు యొక్క ఎల్డర్లు” గురించి పాడతాము. ఈ సందర్భాలలో, మనము ప్రాచీన ఇశ్రాయేలు రాజ్యము లేదా ఇజ్రాయేల్ అని పిలువబడిన ఆధునిక దేశము గురించి మాట్లాడడం లేదు లేదా పాడడం లేదు. బదులుగా, మనము యేసు క్రీస్తు యొక్క సంఘములోనికి ప్రపంచ దేశాల నుండి సమకూర్చబడిన వారిని సూచిస్తున్నాము. దేవునితో పోరాడి గెలిచిన వారు, ఆయన దీవెనలను మనఃపూర్వకంగా వెదికేవారు మరియు బాప్తిస్మము ద్వారా ఆయన నిబంధన జనులుగా మారిన జనులను మనము సూచిస్తున్నాము. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి మాటల్లో, ఇశ్రాయేలుగా ఉండడం అంటే “మన జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడం, … దేవుడిని మన జీవితాల్లో అత్యంత శక్తివంతమైన ప్రభావంగా ఉండనివ్వడం” అని అర్థం.

మీ గోత్రజనకుని దీవెన ఇశ్రాయేలు సంతతి యొక్క గోత్రములలో ఒక దానితో మీ సంబంధమును ప్రకటిస్తుంది. అది కుటుంబ చరిత్రలో ఆసక్తికరమైన భాగముకంటె అధికమైనది. అది మీ వర్తమానం మరియు భవిష్యత్తుతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఇశ్రాయేలు సంతతిలో భాగముగా ఉండుట అనగా మీరు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో ఒక నిబంధన సంబంధమును కలిగియున్నారని అర్థము. అనగా, మీరు అబ్రాహాము వలె దేవుని పిల్లలకు “ఒక దీవెనగా ఉంటారు” (ఆదికాండము 12:2; అబ్రాహాము 2:9–11) అని అర్థము. దాని అర్థము, పేతురు యొక్క మాటలలో, “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు” (1 పేతురు 2:9). దాని అర్థము, మీరు “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిస్తారు”—ఆయనతో మీ నిబంధనలను మీరు గౌరవించినప్పుడు, మీరు “దేవునితో పోరాడి గెలిచిన” వారు.

వంశవృక్షము

Family Tree of Jacob (Israel) [యాకోబు (ఇశ్రాయేలు) యొక్క వంశవృక్షము], బ్రెంట్ ఎవెన్స్ చేత

వివరణలు

  1. ఆదికాండము 32:24–32 కూడా చూడండి. ఇశ్రాయేలు పేరుకు “దేవుడు పరిపాలించును” లేదా “దేవుడు పోరాడును లేదా పోరాడి గెలుచును” మరియు “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము”తోపాటు ఇతర అర్థములున్నాయి.

  2. ఆల్మా 26:36; 3 నీఫై 20:25 చూడండి.

  3. Hymns (1985), nos. 6, 259319.

  4. రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము,” లియహోనా, నవ. 2020, 92.