2024 రండి, నన్ను అనుసరించండి
జనవరి 19–25. ఆదాము హవ్వల పతనము: ఆదికాండము 3–4; మోషే 4–5


“జనవరి 19–25. ఆదాము హవ్వల పతనము: ఆదికాండము 3–4; మోషే 4–5,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“జనవరి 19–25. ఆదాము హవ్వల పతనము,” రండి, నన్ను అనుసరించండి: 2026

ఆదాము హవ్వలు

Adam and Eve [ఆదాము హవ్వలు], డగ్లస్ ఎమ్. ఫ్రైయర్ చేత

జనవరి 19–25: ఆదాము హవ్వల పతనము

ఆదికాండము 3–4; మోషే 4–5

మొదట, ఆదాము హవ్వల పతనము యొక్క వృత్తాంతము విషాదభరితంగా అనిపించవచ్చు. ఆదాము హవ్వలు అందమైన ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. బాధ, వేదన మరియు మరణము ఉన్న లోకంలోకి వారు పంపివేయబడ్డారు (ఆదికాండము 3:16–19 చూడండి). వారు తమ పరలోక తండ్రి నుండి వేరుచేయబడ్డారు. కానీ మోషే గ్రంథములో ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా పునరుద్ధరించబడిన సత్యాలు పతనంపై మనకు ప్రత్యేకమైన దృక్పథాన్ని అందిస్తాయి.

అవును, ఏదెను తోట అందమైనది. కానీ ఆదాము హవ్వలకు అందమైన పరిసరాలకు మించినది అవసరము. వారికి అవసరమైనది—మనందరికి అవసరమైనది—ఎదగడానికి ఒక అవకాశము. ఏదెను తోటను విడిచిపెట్టడం అనేది దేవుని వద్దకు తిరిగివెళ్ళి, క్రమంగా ఆయన వలె కావడానికి అవసరమైన మొదటి అడుగు. దానర్థము వ్యతిరేకతను ఎదుర్కోవడం, ఎంపికలు చేయడం, తప్పులు చేయడం, పశ్చాత్తాపపడడాన్ని నేర్చుకోవడం మరియు రక్షకుడిని నమ్మడం, ఆయన ప్రాయశ్చిత్తము వృద్ధిని మరియు “మన విమోచనానందమును” (మోషే 5:11) సాధ్యం చేస్తుంది. కాబట్టి మీరు ఆదాము హవ్వల పతనము గురించి చదివినప్పుడు, కనిపించే విషాదంపై కాకుండా సాధ్యతలపై—ఆదాము హవ్వలు కోల్పోయిన పరదైసుపై కాకుండా వారి ఎంపిక వలన మనము పొందే మహిమపై దృష్టి పెట్టండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆదికాండము 3; మోషే 4

దేవుని ప్రణాళికలో పతనము ఒక ఆవశ్యకమైన భాగము.

ఆదాము హవ్వల యొక్క ఎంపిక మర్త్యత్వంలో మనం అనుభవించే అనేక ఇబ్బందులకు దారితీసిందనేది నిజం. కానీ దానర్థం మనము వారి ఎంపికకు చింతిస్తున్నామని కాదు. మీరు ఆదికాండము 3 మరియు మోషే 4 చదువుతున్నప్పుడు, దేవుని ప్రణాళికకు పతనం ఎందుకు ముఖ్యమైనది? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు.

మోషే 5:9–12 ప్రకారం, పతనం గురించి ఆదాము హవ్వలు ఎలా భావించారు? ఈ పతనమైన ప్రపంచంలో మీ అనుభవాలకు మీరు వారి మాటలను ఎలా అన్వయించగలరు? 2 నీఫై 2:19–25 నుండి మీరింకేమి నేర్చుకుంటారు?

మోషైయ 3:19; ఆల్మా 12:21-37; మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 29:39–43 కూడా చూడండి.

ఫలమును పట్టుకొనిన హవ్వ

Leaving Eden (ఏదెనును విడిచిపెట్టుట), ఆన్నీ హెన్రీ నాడెర్ చేత

ఆదికాండము 3:1–7; మోషే 4:22–31; 5:4–15

యేసు క్రీస్తు నిరీక్షణను, విమోచనను అందజేస్తారు.

ఆదాము హవ్వల కథ యేసు క్రీస్తు ద్వారా వచ్చే నిరీక్షణ మరియు విమోచనకు సంబంధించినది. ఎందుకో చూడడానికి, మీరు ఆదికాండము 3:1–7; మోషే 4:22–31లో పతనం యొక్క ఫలితాలను వెదకడం మరియు మీరు కనుగొన్న వాటిని గుర్తించడం లేదా జాబితా చేయడం ద్వారా ప్రారంభించవచ్చు. ఈ ఫలితాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? తర్వాత ఈ ప్రభావాల నుండి మనలను విమోచించడానికి దేవుని ప్రణాళిక కోసం చూస్తూ, మీరు మోషే 5:4–15ను శోధించవచ్చు. దేవదూత వారిని సందర్శించిన తర్వాత ఆదాము హవ్వలు ఎందుకు “ఆనందంగా” ఉన్నారు? పరలోక తండ్రి ప్రణాళిక గురించి వారి నుండి మీరేమి నేర్చుకుంటారు?

2:44

Because of Him

ఆదికాండము 3:16; మోషే 4:22

ఆదాము, హవ్వను “ఏలును” అనగా అర్థమేమిటి?

ఈ లేఖన భాగానికి అర్థము ఒక భర్త తన భార్యపట్ల నిర్దయగా వ్యవహరించడం న్యాయమేనని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడుతున్నది. మన కాలంలో, కుటుంబములో తమ దైవిక బాధ్యతలను నెరవేర్చడంలో భార్యాభర్తలు ఒకరినొకరు సమాన భాగస్వాములుగా చూడాలని ప్రభువు యొక్క ప్రవక్తలు బోధించారు (“కుటుంబము: ప్రపంచానికి ఒక ప్రకటన” [సువార్త గ్రంథాలయము] చూడండి). ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ మరియు సహోదరి రూత్ లిబ్బెర్ట్ రెన్‌లండ్ ఇలా వివరించారు, నీతిమంతుడైన ఒక భర్త “పరిచర్య చేయాలని చూస్తాడు; తన తప్పులను ఒప్పుకొని, క్షమాపణ కోరతాడు; మెచ్చుకోవడానికి వేగంగా ఉంటాడు; కుటుంబ సభ్యుల ప్రాధాన్యతల గురించి ఆలోచిస్తాడు; తన కుటుంబానికి ‘జీవితపు అవసరాలను, రక్షణను’ అందించడానికి గల బాధ్యత యొక్క గొప్ప బరువును అతడు మోస్తాడు; తన భార్యను అత్యంత మర్యాదతో, గౌరవంతో ఆదరిస్తాడు. … అతడు తన కుటుంబాన్ని దీవిస్తాడు” (The Melchizedek Priesthood: Understanding the Doctrine, Living the Principles [2018], 23).

మోషే 4:1-4

సెమినరీ చిహ్నము
ఎదగడానికి నాకు కర్తృత్వము మరియు వ్యతిరేకత కావాలి.

ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ ఇలా బోధించారు, “సంతాన సాఫల్య విషయములో, మన పరలోక తండ్రి యొక్క లక్ష్యం, తన పిల్లలు సరైనది చేయడం మాత్రమే కాదు; అది ఆయన పిల్లలు సరైనది చేయడానికి ఎన్నుకోవడం మరియు చివరికి ఆయనలా మార్పు చెందటం” (“నేడు మీరు కోరుకొనుడి,” లియహోనా, నవ. 2018, 104). మనం సరైనది చేయాలని ఎంచుకోవడం పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో ఎందుకు చాలా ముఖ్యమైనది?

మీరు మోషే 4:1–4 చదువుతున్నప్పుడు, ఎంచుకునే మీ హక్కును—మీ కర్తృత్వాన్ని రక్షించడానికి పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు ఏమి చేసారో చూడండి. వారి రక్షణ శక్తిని మీరు ఎలా పొందగలరు? ఉపాయముల కొరకు, యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు మార్గదర్శి (4–5) లోని “ప్రేరేపిత ఎంపికలు చేయండి” విభాగాన్ని చదవడాన్ని పరిగణించండి.

2 నీఫై 2:11–20, 25–30లో కర్తృత్వము గురించి లీహై బోధించిన దానిని కూడా చదవడాన్ని పరిగణించండి. కర్తృత్వము కొరకు వ్యతిరేకత ఎందుకు అవసరము? మిమ్మల్ని “ఎంచుకోవడానికి స్వతంత్రులుగా” చేసినందుకు యేసు క్రీస్తు పట్ల మీరు మీ కృతజ్ఞతను ఎలా చూపించగలరు? (2 నీఫై 2:27).

పాల్గొనడాన్ని పెంచండి. అనేక అభ్యాస కార్యక్రమాలను వ్యక్తులుగా, కుటుంబంగా లేదా తరగతిగా; చిన్న సమూహాలలో; లేదా జతలుగా చేయవచ్చు. అవకాశం లేని వ్యక్తులు పాల్గొనడానికి వివిధ రకాల పద్ధతులను ఉపయోగించండి. ఈ ప్రోత్సాహకార్యక్రమం కోసం, మీరు మోషే 4 మరియు యౌవనుల బలము కొరకు మార్గదర్శిని చదవడానికి ఒక వ్యక్తిని లేదా సమూహాన్ని ఆహ్వానించవచ్చు, ఆ సమయంలో మరొక సమూహం 2 నీఫై 2 లోని వచనాలను అధ్యయనం చేస్తుంది. అప్పుడు వారు తమ విభాగంలో నేర్చుకున్న వాటిని ఒకరికొకరు బోధించవచ్చు.

మోషే 4:4–12; 5:13–33

సాతాను నన్ను “మోసపుచ్చుటకు మరియు గ్రుడ్డివానిగా చేయుటకు” ప్రయత్నిస్తాడు.

మీరు మోషే 4:4–12; 5:13–33 చదువుతున్నప్పుడు, ఆదాము హవ్వలను మరియు వారి పిల్లలను శోధించడానికి సాతాను ప్రయత్నించిన మార్గాలను జాబితా చేయడాన్ని పరిగణించండి. అతడు ఈ రోజు ఇలాంటి వాటిని ఎలా ప్రయత్నిస్తాడు? సాతాను మోసాలను నిరోధించడానికి పరలోక తండ్రి మీకు ఎలా సహాయం చేస్తారు?

మోషే 4:13-16, 27

“దేవుడును ప్రభువైన నేను … చొక్కాయిలను చేయించి వారికి తొడిగించితిని.”

నిషేధించబడిన ఫలమును తినిన తరువాత, ఆదాము హవ్వలు తమ దిగంబరత్వాన్ని దాచుకోవడానికి ప్రయత్నించారు. తరువాత, ప్రభువు వారికి దుస్తులు ఇచ్చారు. మీరు మోషే 4:13–16, 27 చదువుతున్నప్పుడు, క్రింది వాటిని పరిగణించండి:

  • లేఖనాలలో దిగంబరత్వము మరియు దుస్తులు దేనిని సూచించగలవో ధ్యానించండి (ఉదాహరణకు, ప్రకటన 7:9, 13–15; 2 నీఫై 9:14; సిద్ధాంతము మరియు నిబంధనలు 109:22–26, 76 చూడండి). దిగంబరత్వము మరియు దుస్తులతో ఆదాము హవ్వల యొక్క అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

  • మీరు దేవాలయంలో వరము పొందియున్నట్లయితే, మీ దేవాలయ వస్త్రం యొక్క ప్రాముఖ్యత మరియు అది దేనిని సూచిస్తుందనే దాని గురించి ఆదాము హవ్వలు మీతో ఏమి చెప్పవచ్చో పరిగణించండి.

4:12

Sacred Temple Clothing

మోషే 5:4–9, 16–26

సమ్మతి మరియు విధేయత గల హృదయంతో నేను అర్పించినప్పుడు, దేవుడు నా బలులను అంగీకరిస్తారు.

మీరు మోషే 5:4–9, 16–26 చదువుతున్నప్పుడు, బలి పట్ల ఆదాము హవ్వలు మరియు వారి కుమారులు కయీను మరియు హేబేలుల వైఖరులను పరిగణించండి. ప్రభువు హేబేలు బలిని అంగీకరించి, కయీను దానిని ఎందుకు అంగీకరించలేదు?

ఏమి త్యాగం చేయమని ప్రభువు మిమ్మల్ని అడుగుతారు? ఆ బలుల గురించి మీ ఆలోచనా విధానాన్ని మార్చేలా ఈ వచనాలలో ఏదైనా ఉన్నదా?

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆదికాండము 3; మోషే 4; 5:8–15

పతనము నుండి యేసు క్రీస్తు మనల్ని రక్షిస్తారు.

  • ఆదాము, హవ్వల పతనము గురించి మీ పిల్లలు బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడేందుకు, (పాత నిబంధన కథలు, 13–16 లో) “ఆదాము హవ్వలు” నుండి చిత్రాలను మీరు నకలు చేసి, వాటిని కత్తిరించుకోవచ్చు. తర్వాత మీరు ఆదాము హవ్వల అనుభవాలను చర్చిస్తున్నప్పుడు, ఆ చిత్రాలను వరుసక్రమంలో పెట్టడానికి మీరు కలిసి పనిచేయవచ్చు. మీరు చేస్తున్నప్పుడు, ఆదాము హవ్వలు ఏదెను తోట‌ను విడిచిపెట్టడం పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో ఎందుకు ముఖ్యమైనది అనే దాని గురించి మాట్లాడండి.

  • పతనం యొక్క ప్రభావాలను యేసు క్రీస్తు ఎలా అధిగమిస్తారో మీ పిల్లలు అర్థం చేసుకున్నప్పుడు ఆయన ప్రాయశ్చిత్తము కొరకు వారు కృతజ్ఞతలు తెలియజేయగలరు. మోషే 4:25; 6:48; రోమా 5:12; 2 నీఫై 2:22–23 లను మీరు కలిసి చదువుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని పూరించడానికి మార్గాలను కనుగొనడానికి మీ పిల్లలకు సహాయం చేయండి: “పతనము మూలముగా, నేను …” తర్వాత, మీరు కలిసి మోషే 5:8–11, 14–15; 6:59; ఆల్మా 11:42 చదువుతున్నప్పుడు, వారు ఈ వాక్యాన్ని పూరించగలరు: “యేసు క్రీస్తు మూలముగా, నేను …” యేసు క్రీస్తు పట్ల మీ కృతజ్ఞతను ఒకరితో ఒకరు పంచుకోండి.

మోషే 4:1-4

నేను సరియైన దానిని ఎంచుకోగలను.

  • కర్తృత్వము యొక్క సూత్రాన్ని పరిచయం చేయడానికి ఒక సాధారణ వస్తుపాఠాన్ని పరిగణించండి: ఈ వారం ప్రోత్సాహకార్యక్రమ పేజీకి రంగు వేయడానికి మీ పిల్లలను ఆహ్వానించండి, కానీ వారికి ఉపయోగించడానికి ఒక రంగు మాత్రమే ఇవ్వండి. ఎంపికలను కలిగి ఉండడం ఎందుకు మంచిది? ఆ తర్వాత మీరు మోషే 4:1–4 ను కలిసి చదివి, మనం తప్పు ఒప్పుల మధ్య ఎంచుకోవాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నారో మాట్లాడవచ్చు. మంచి ఎంపికలు చేయడానికి పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మనకు ఎలా సహాయం చేస్తారు?

  • యేసు క్రీస్తును అనుసరించడానికి వారు చేయగలిగే మంచి ఎంపికల గురించి ఆలోచించి, చిత్రాలను గీయడంలో మీ పిల్లలకు సహాయపడండి. మీరు ఒక మంచి ఎంపిక చేసిన సమయం గురించి ఒకరికొకరు చెప్పుకోవచ్చు మరియు ఆ తర్వాత మీరు ఎలా భావించారనే దాని గురించి మాట్లాడుకోవచ్చు.

ఆదాము హవ్వలు

The Fall [పతనము], రాబర్ట్ టి. బార్రెట్ చేత

మోషే 5:4, 8

నేను పరలోక తండ్రిని ప్రార్థించగలను.

  • ఆదాము హవ్వలు ఏదెను తోటను విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు, వారు ఇకపై పరలోక తండ్రితో ఉండలేరు. మీ పిల్లలతో కలిసి మోషే 5:4, 8 చదవండి మరియు ఆదాము హవ్వలు ఆయనకు సన్నిహితంగా భావించి, ఆయన మాట వినడానికి ఏమి చేశారో కనుగొనడంలో వారికి సహాయపడండి. మన ప్రార్థనలలో పరలోక తండ్రికి మనం చెప్పగలిగే కొన్ని విషయాలు ఏమిటి?

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

బలిపీఠం మీద బలి ఇచ్చే గొర్రెపిల్లతో ఆదాము హవ్వలు

In Similitude of the Sacrifice of the Only Begotten of the Father [తండ్రి యొక్క అద్వితీయ కుమారుని త్యాగమును పోలియున్నది], మైక్ మామ్ చేత (మోషే 5:5–9 చూడండి)

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: ఆదాము హవ్వల పతనము