“డిసెంబరు 29–జనవరి 4. యేసు క్రీస్తు యొక్క మొదటి నిబంధన: పాత నిబంధనకు పరిచయము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“పాత నిబంధనకు పరిచయము,” రండి, నన్ను అనుసరించండి: 2026
డిసెంబరు 29–జనవరి 4: యేసు క్రీస్తు యొక్క మొదటి నిబంధన
పాత నిబంధనకు పరిచయము
ఈ సంవత్సరము పాత నిబంధనను అధ్యయనం చేయడం గురించి మీరు ఆలోచించినప్పుడు, మీరు ఎలా భావిస్తారు? ఆతృతగా? అస్థిరంగా? భయంగా? ఈ భావావేశములు అన్నీ గ్రహింపదగినవి. పాత నిబంధన ప్రపంచంలోని ప్రాచీన రచనల సేకరణలలో ఒకటి, ఇది ఉత్తేజకరమైనదిగా మరియు భయపెట్టేదిగా రెండు విధాలుగా చేయగలదు. ఈ రచనలు పురాతన సంస్కృతి నుండి వచ్చాయి, అవి అన్యమైనవిగా మరియు కొన్నిసార్లు వింతగా లేదా అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇంకా ఈ రచనలలో మనకు తెలిసినట్లుగా అనిపించే అనుభవాలను కలిగి ఉన్న వ్యక్తులను చూస్తాము. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త యొక్క దైవత్వానికి సాక్ష్యమిచ్చే సువార్త ఇతివృత్తాలను మనము గుర్తిస్తాము. అవును, అబ్రాహాము, శారా, హన్నా మరియు దానియేలు జీవించిన జీవితాలు, కొన్ని విధాలుగా మనకంటే చాలా భిన్నమైనవి. కానీ వారు కూడా మనందరి వలే—కుటుంబ ఆనందము, కుటుంబ అసమ్మతి, విశ్వాసపు క్షణాలు మరియ అస్థిరమైన క్షణాలు, విజయాలు మరియు అపజయాలను అనుభవించారు. మరి ముఖ్యముగా, వారు విశ్వాసమును సాధన చేసారు, పశ్చాత్తాపపడ్డారు, నిబంధనలు చేసారు, ఆత్మీయ అనుభవాలు కలిగియున్నారు మరియు రక్షకుని వాగ్దానాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. వారి జీవితాల్లో దేవుడు ఎలా భాగమయ్యాడో తెలుసుకున్నప్పుడు, మనలో కూడా మనం ఆయనను చూస్తాము మరియు కీర్తనాకారునితో ఇలా అంటాము: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. … అది నీ సేవకునికి ప్రియమైనది” (కీర్తన 119:105, 140).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
పాత నిబంధన యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తుంది.
పాత నిబంధనలో గొప్ప ఆధ్యాత్మిక పోషణను కనుగొనడానికి ఒక మార్గం ఏమిటంటే, జీవాహారమైన యేసు క్రీస్తు కోసం వెదకడం (యోహాను 6:48 చూడండి). ఉదాహరణకు, క్రింది వాటిలో మీరు రక్షకుడిని ఎలా చూస్తారు?
-
మన్నా (నిర్గమకాండము 16:4, 11–15; యోహాను 6:35)
-
బలియిచ్చే గొర్రెపిల్ల (నిర్గమకాండము 12:3–5; యోహాను 1:29)
-
ఇత్తడి సర్పము (సంఖ్యాకాండము 21:4–10; యోహాను 3:14).
-
యోనా (యోనా 1:4–17; మత్తయి 12:38–41)
ఈ ఉదాహరణలు ఆయన గురించి ఏమి బోధిస్తాయి? పాత నిబంధనలో యేసు క్రీస్తు గురించి మీకు ఇప్పటికే తెలిసిన ఇతర సూచికలు ఏవి?
“యేసు క్రీస్తు మనకెంతో విలువైనవారు” అనే తన సందేశములో ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్, “యేసు క్రీస్తును జ్ఞాపకముంచుకొని, ఎల్లప్పుడూ ఆయనపై దృష్టిసారించండి” అని మనల్ని ప్రోత్సహించారు (లియహోనా, నవ. 2023, 98). పాత నిబంధనలో మాత్రమే కాకుండా మీ జీవితంలో కూడా యేసు క్రీస్తును కనుగొనడానికి మీరు చేయగల వాటికొరకు చూస్తూ ఆయన సందేశాన్ని చదవడాన్ని పరిగణించండి.
లేఖన దీపికలో “క్రీస్తు యొక్క గురుతులు లేదా చిహ్నాలు,” సువార్త గ్రంథాలయములో “యేసు క్రీస్తు,” కూడా చూడండి.
యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చే చిహ్నాల కొరకు చూడండి. “సమస్త విషయాలు వాటి పోలికచొప్పున ఉన్నవి, సమస్తము నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుటకు సృజించబడి, చేయబడినవి” (మోషే 6:63) అని ప్రభువు ఆదాముకు బోధించారు. మీరు చదువుతున్నా లేదా బోధిస్తున్నా, యేసు క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడం లేఖనాలలో అర్థాన్ని కనుగొనడానికి, ఆయన పట్ల మీ ప్రేమ మరియు విశ్వాసాన్ని పెంచుకోవడానికి మీకు సహాయపడగలదు. (రక్షకుని విధానములో బోధించుట, 7 చూడండి.)
యేసు క్రీస్తే పాత నిబంధనలోని యెహోవా.
అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు: “తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మన రక్షకునిగా, విమోచకునిగా పరిచయం చేసారు మరియు ‘ఆయనను ఆలకించుడి’ అని మనకు ఆజ్ఞాపించారు. ఈ నడిపింపు నుండి ‘దేవుడు’ లేదా ‘ప్రభువు’ చేత మాట్లాడబడిన మాటల యొక్క లేఖన నివేదికలు దాదాపు ఎల్లప్పుడు యెహోవా, పునరుత్థానుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాటలని మనము నిర్ధారిస్తాము” (“యేసు క్రీస్తు యొక్క బోధనలు,” లియహోనా, మే 2023, 102).
యేసు క్రీస్తు యొక్క బోధనలు
యూదుల నాయకులు యేసును ఆయన గుర్తింపు గురించి సవాలు చేసినప్పుడు, “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని” ఆయన ప్రకటించారు. ఈ మాటలు యేసును విన్న జనులను దిగ్భ్రాంతికి గురి చేసాయి మరియు వారు ఆయనను రాళ్ళతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు (యోహాను 8:58–59). కొంతమంది యూదులు యేసు చెప్పిన దానికి ఎందుకంత కలత చెందారో చూడడానికి నిర్గమకాండము 3:13–15; 6:3–5 చదవడాన్ని పరిగణించండి.
యేసు క్రీస్తే యెహోవా అని తెలుసుకోవడం మీకు ఎందుకు ముఖ్యమైనది?
ప్రభువు జోసెఫ్ స్మిత్ ద్వారా అనేక “స్పష్టమైన, ప్రశస్థమైన వాక్యములను” పునరుద్ధరించారు.
ఒక దర్శనంలో, ప్రభువు నీఫైకి బైబిలు ముందుకు రావడాన్ని చూపించారు, దాని నుండి అనేక “స్పష్టమైన, ప్రశస్థమైన వాక్యములు” తీసివేయబడతాయని వివరించారు. “స్పష్టమైన, ప్రశస్థమైన వాక్యములు తెలియజేయడానికి” ప్రభువు ఎలా ప్రణాళిక చేసారనే దానికొరకు చూస్తూ, 1 నీఫై 13:21–29, 38–42 చదవడాన్ని పరిగణించండి. 2 నీఫై 3:12 ప్రకారం, బైబిలు మరియు మోర్మన్ గ్రంథము ఎలా కలిసి పనిచేస్తాయి?
ఈ సంవత్సరం మీరు పాత నిబంధనను అధ్యయనం చేస్తున్నప్పుడు, నీఫై ముందుగా చూసిన “ఇతర గ్రంథము”లలో కొన్నిటిని కూడా మీరు చదువుతారు. వాటిలో ఇవి ఉన్నాయి:
-
మోషే గ్రంథము, బైబిలు యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదములో భాగము. ఇది ఆదికాండము 1–6 యొక్క ప్రస్తుత మూలగ్రంథములో కనుగొనబడని సత్యాలు మరియు వృత్తాంతాలను పునరుద్ధరిస్తుంది.
-
అబ్రాహాము గ్రంథము, జోసెఫ్ స్మిత్ పురాతన ఈజిప్షియన్ పాపిరిని పరీక్షిస్తున్నప్పుడు ఆయనకు బయల్పరచబడింది (see Topics and Questions, “Book of Abraham,” Gospel Library).
-
జోసెఫ్ స్మిత్ అనువాదము నుండి వివిధ గద్యభాగాలలో కొన్ని లేఖన దీపికలో కనిపిస్తాయి.
జోసెఫ్ స్మిత్ ద్వారా పునరుద్ధరించబడిన పాత నిబంధన వృత్తాంతాలకు కొన్ని ఉదాహరణలు ఇక్కడున్నాయి: హనోకు యొక్క సీయోను పట్టణము (మోషే 7:18–19), పరలోకమందలి సభ గురించి అబ్రాహాము యొక్క దర్శనము (అబ్రాహాము 3:22–28) మరియు మెల్కీసెదెకు యొక్క పరిచర్య (జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 14:25–40). ఈ వృత్తాంతాలు ఎందుకు మీకు “స్పష్టముగా మరియు ప్రశస్థముగా” ఉన్నాయి?
Adam and Eve Offering Sacrifices [బలులను అర్పిస్తున్న ఆదాము హవ్వలు], కీత్ లార్సన్ చేత (వివరణ)
దేవునితో నా నిబంధన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి పాత నిబంధన నాకు సహాయం చేస్తుంది.
పాత నిబంధన అనేది నిబంధన ద్వారా దేవుడు మనలను తన “స్వకీయ సంపాద్యము”గా మార్చుకోవాలని కోరుకునే కథ (నిర్గమకాండము 19:5). ఆ కారణంగా, పాత నిబంధనను చదవడానికి సిద్ధం కావడానికి ఒక మంచి మార్గం నిబంధనల గురించి—ప్రత్యేకంగా దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వంటి ప్రాచీన ప్రవక్తలకు మరియు వారి సంతతికి అందించిన శాశ్వతమైన నిబంధన గురించి తెలుసుకోవడం. నిబంధనల గురించి నేర్చుకోవడానికి ఒక గొప్ప విధానం, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశము “నిత్య నిబంధన” (లియహోనా, అక్టోబరు 2022, 4–11) చదవడం.
మీరు చదువుతున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: నిబంధనలు నాకెందుకు ముఖ్యమైనవి? ఆయనతో నా నిబంధనలను పాటించడం ద్వారా నేను దేవుని నుండి ఎలాంటి “ప్రత్యేకమైన ప్రేమ మరియు దయ” పొందగలను? మీరు ఈ సంవత్సరం పాత నిబంధనను చదువుతున్నప్పుడు, ఆయనతో మీ నిబంధన సంబంధాన్ని గురించి దేవుడు మీకు బోధించాలనుకుంటున్న విషయాలను గమనిస్తూ ఉండండి.
యిర్మీయా 31:31–34 కూడా చూడండి.
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
పాత నిబంధనలో నేను యేసు క్రీస్తు గురించి నేర్చుకోగలను.
-
పాత నిబంధనలోని పదాలు మరియు సంస్కృతి పిల్లలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండవచ్చు, కానీ యేసు క్రీస్తును చిహ్నాలు మరియు కథలలో చూడడానికి మీరు వారికి సహాయం చేయవచ్చు. బహుశా మీరు మరియు మీ పిల్లలు దిగువ చిత్రాన్ని చూడవచ్చు, ప్రవక్త యెషయా క్రీస్తు జననాన్ని ముందే చెప్పాడు. మీ పిల్లలు వారు చూసే వివరాలను సూచించనివ్వండి. వారి దృష్టిని ప్రత్యేకించి, శిశువైన యేసు వైపు మళ్లించండి. అప్పుడు యెషయా 7:14; 9:6లో రక్షకుని పుట్టుక గురించి యెషయా వ్రాసిన దానిని మీరు వారితో కలిసి చదువవచ్చు. ఈ సంవత్సరం పాత నిబంధనలో రక్షకుని కోసం వెదకడం గురించి మీరెలా భావిస్తున్నారో మీ పిల్లలతో పంచుకోండి.
Isaiah Writes of Christ’s Birth (The Prophet Isaiah Foretells Christ’s Birth) [యెషయా క్రీస్తు జననం గురించి వ్రాశాడు (ప్రవక్త యెషయా క్రీస్తు జననాన్ని ముందే చెప్పాడు)], హ్యారీ ఆండర్సన్ చేత
-
మీరు మరియు మీ పిల్లలు కూడా 23వ కీర్తన లేదా యెషయా 53:3–9 చదివి, యేసు క్రీస్తును మీకు గుర్తు చేసే పదాలను కనుగొనవచ్చు. ఆయన జీవితం మరియు ప్రాయశ్చిత్తం గురించి ఈ పదాలు మనకు ఏమి బోధిస్తాయి?
పరలోక తండ్రి నాతో నిబంధనలు చేయాలనుకుంటున్నారు.
-
పాత నిబంధనలో నిబంధనలు ప్రధాన ఇతివృత్తం. మీ పిల్లలకు ఈ ఇతివృత్తాన్ని పరిచయం చేయడానికి, కుటుంబం లేదా స్నేహితులతో వారు చేసే, పాటించే వాగ్దానాల గురించి మరియు ఈ వాగ్దానాలను పాటించడం ఎందుకు ముఖ్యమనే దాని గురించి మీరు వారితో మాట్లాడవచ్చు. తర్వాత మీరు బాప్తిస్మం యొక్క చిత్రాన్ని చూసి, మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవునితో చేసే వాగ్దానం లేదా నిబంధన గురించి మాట్లాడవచ్చు (మోషైయ 18:10, 13 చూడండి). మీరు దేవాలయ చిత్రాన్ని కూడా చూపవచ్చు మరియు మనము అక్కడ చేసే నిబంధనల గురించి మీ భావాలను పంచుకోవచ్చు.
-
ఈ వారం ప్రోత్సాహ కార్యక్రమ పేజీ మీ పిల్లలు పరలోక తండ్రితో నిబంధనలు చేయడానికి మరియు పాటించడానికి ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడగలదు.
యేసు క్రీస్తే పాత నిబంధనలోని యెహోవా.
-
వేర్వేరు సందర్భాలలో వేర్వేరు పేర్లతో ఉండే వారెవరైనా మీ పిల్లలకు తెలుసా? బహుశా తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు కార్యాలయంలో, ఇంట్లో మరియు సంఘములో విభిన్నంగా సంబోధించబడవచ్చు. ఆ పేర్ల గురించి మాట్లాడండి; తర్వాత నిర్గమకాండము 6:3 కలిసి చదివి, యేసు క్రీస్తు పుట్టకముందే ఆయన పిలువబడిన పేర్లను కనుగొనమని మీ పిల్లలను ఆహ్వానించండి (పాదవివరణ ఇ లోని జోసెఫ్ స్మిత్ అనువాదం కూడా చూడండి).
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.