“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: పాత నిబంధన చదవడము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“పాత నిబంధన చదవడము,” రండి, నన్ను అనుసరించండి: 2026
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు
పాత నిబంధన చదవడము
ప్రభువును నమ్మడానికి తన సహోదరులను ప్రేరేపించాలని నీఫై కోరుకున్నప్పుడు, అతడు మోషే గురించి కథలను మరియు యెషయా నుండి బోధనలను పంచుకున్నాడు. దేవుని వాగ్దానాలలో విశ్వాసం కలిగియుండమని ప్రారంభ క్రైస్తవులను ప్రోత్సహించాలని అపొస్తలుడైన పౌలు కోరుకున్నప్పుడు, అతడు వారికి నోవహు, అబ్రాహాము, శారా, రాహాబు మరియు ఇతరుల విశ్వాసం గురించి గుర్తు చేసాడు. అవి “ఆయన గురించి సాక్ష్యమిస్తాయని” (యోహాను 5:39) వివరిస్తూ, “లేఖనాలను పరిశోధించమని” యేసు క్రీస్తు యూదుల నాయకులకు చెప్పినప్పుడు, ఆయన మాట్లాడుతున్నది మనం పాత నిబంధన అని పిలిచే వ్రాతల గురించి.
మరొకమాటలో, మీరు పాత నిబంధన చదివినప్పుడు, అక్షరాలా వేల సంవత్సరాలుగా దేవుని జనులను ప్రేరేపించిన, ఓదార్పునిచ్చిన మరియు ప్రోత్సహించిన పదాలను మీరు చదువుతున్నారు.
కానీ చాలా కాలం క్రితం వ్రాసినది నిజంగా నేటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయం చేయగలదా? అవును, సహాయం చేయగలదు! ప్రత్యేకించి మీరు పాత నిబంధన నిజంగా ఎవరిని గురించినది అని గుర్తుంచుకుంటే.
యేసు క్రీస్తు యొక్క నిబంధన
మీరు, మీ కుటుంబము ఏ సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ, జవాబు ఎల్లప్పుడూ యేసు క్రీస్తే. కాబట్టి పాత నిబంధనలో సమాధానాలను కనుగొనడానికి, ఆయన కోసం వెదకండి. అది ఎల్లప్పుడూ సులభం కాదు. మీరు ఓపికగా ఆలోచించి, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వెదకవలసి రావచ్చు. కొన్నిసార్లు ఆయనను గురించిన నిర్దేశాలు యెషయా ప్రకటనలో ఉన్నట్లుగా చాలా నేరుగా కనబడుతున్నాయి, “మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. … సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును” (యెషయా 9:6). ఇతర స్థలములలో, రక్షకుడు మరింత సూక్ష్మంగా, చిహ్నములు మరియు సారూప్యతల చేత సూచించబడ్డారు—ఉదాహరణకు, జంతు బలుల యొక్క వర్ణనల ద్వారా లేదా యోసేపు తన అన్నలను క్షమించి, వారిని కరువు నుండి రక్షించే వృత్తాంతము ద్వారా.
లోకమునకు వెలుగు, స్కాట్ సమ్నర్ చేత
మీరు పాత నిబంధనను అధ్యయనం చేసినప్పుడు, రక్షకునియందు గొప్ప విశ్వాసమును మీరు వెదకినట్లయితే, మీరు దానిని కనుగొంటారు. బహుశా ఈ సంవత్సరము అది మీ అధ్యయనము యొక్క లక్ష్యము కావచ్చు. యేసు క్రీస్తుకు మిమ్మల్ని దగ్గరగా తెచ్చే గద్యభాగాలు, కథలు మరియు ప్రవచనాలను కనుగొనుటకు మరియు వాటిపై దృష్టిసారించుటకు ఆత్మ మిమ్మల్ని నడిపించేలా ప్రార్థించండి.
దైవికంగా భద్రపరచబడింది
పాత నిబంధన మానవజాతి యొక్క సమగ్రమైన మరియు ఖచ్చితమైన చరిత్రను ఇస్తుందని ఆశించవద్దు. అసలు రచయితలు మరియు సంగ్రహకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది అది కాదు. వారి విస్తారమైన ఆలోచన ఏమనగా దేవుని గురించి—ఆయన బిడ్డల కొరకు ఆయన ప్రణాళికను గూర్చి, ఆయన నిబంధన జనులవ్వడం అంటే అర్థమేమిటనే దాని గురించి మరియు మనం అసంపూర్ణులుగా ఉన్నప్పుడు విమోచనను ఎలా కనుగొనాలనే దాని గురించి బోధించడం. కొన్నిసార్లు వారు గొప్ప ప్రవక్తల జీవితాలనుండి వృత్తాంతములను కలిపి—వాటిని వారు గ్రహించినట్లుగా చారిత్రక సంఘటనలను సంబంధింపజేయడం ద్వారా దానిని చేసారు. ఆదికాండము దీనికొక మాదిరి, అలాగే యెహోషువ, న్యాయాధిపతులు, 1 మరియు 2 రాజులు వంటి గ్రంథములు కూడా. కానీ ఇతర పాత నిబంధన రచయితలు చారిత్రకంగా ఉండాలనే లక్ష్యం పెట్టుకోలేదు. బదులుగా, వారు కవిత్వము మరియు సాహిత్యం వంటి కళాకృతుల ద్వారా బోధించారు. కీర్తనలు మరియు సామెతలు ఈ వర్గానికి సరిపోతాయి. తరువాత యెషయా మరియు మలాకీ వంటి ప్రవక్తల యొక్క ప్రశస్థమైన మాటలున్నాయి, వారు ప్రాచీన ఇశ్రాయేలుతో దేవుని వాక్యము గురించి మాట్లాడారు—మరియు బైబిలు యొక్క అద్భుతము ద్వారా, నేటికి మనతో ఇంకా మాట్లాడుతున్నారు.
ఈ ప్రవక్తలు, కవులు మరియు సంగ్రహకులు అందరికి వేల సంవత్సరాల తరువాత ప్రపంచమంతటనున్న జనుల చేత వారి మాటలు చదవబడతాయని తెలుసా? మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఇదే జరిగిందని మనము ఆశ్చర్యపడతాము. రాజ్యములు లేచాయి, పడిపోయాయి, పట్టణాలు జయించబడ్డాయి, రాజులు జీవించారు మరియు మరణించారు; కానీ పాత నిబంధన వారందరినీ, తరము నుండి తరానికి, లేఖకుడి నుండి లేఖకుడికి, అనువాదం నుండి అనువాదానికి అధిగమించింది. కొన్ని విషయాలు కోల్పోబడవచ్చు లేదా మార్చబడవచ్చు, అయినప్పటికీ ఏదోవిధంగా అత్యధికం అద్భుతంగా కాపాడబడింది.
పాత నిబంధన ప్రవక్త, జుడిత్ ఎ. మెహర్ చేత (వివరణ)
ఈ సంవత్సరం మీరు పాత నిబంధన చదివినప్పుడు మీరు మనస్సులో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఇవి. దేవుడు మిమ్మల్ని, మీరు అనుభవిస్తున్న దానిని ఎరుగును గనుక ఆయన ఈ ప్రాచీన రచనలను భద్రపరిచారు. ఈ మాటలలో మీ కోసం ఆయన ఒక ఆత్మీయ సందేశమును సిద్ధపరిచారు, అది మిమ్మల్ని ఆయనకు దగ్గరగా తెచ్చి, ఆయన ప్రణాళికయందు మరియు ఆయన ప్రియమైన కుమారునియందు మీ విశ్వాసమును పెంచుతుంది. బహుశా మీకు తెలిసిన వారిని దీవించునట్లు ఒక గద్యభాగమునకు లేదా ఒక అంతరార్థమునకు—ఒక స్నేహితుడు, ఒక కుటుంబ సభ్యుడు లేదా ఒక సహ పరిశుద్ధునితో మీరు పంచుకోగల ఒక సందేశమునకు ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. అనేక అవకాశాలు ఉన్నాయి. ఇది ఆలోచించడానికి ఉత్సాహకరమైనది కాదా?
“నా ఆత్మ లేఖనములయందు ఆనందించును” అని నీఫై అన్నాడు (2 నీఫై 4:15). మనం ఇప్పుడు పాత నిబంధన అని పిలిచేది—నీఫై చదివిన అవే పదాలు అనేకము మీరు చదివినప్పుడు మీరు కూడా అలాగే భావించవచ్చు.
పాత నిబంధనలోని గ్రంథాలు
పాత నిబంధన యొక్క అనేక క్రైస్తవ అనువాదాలలో, గ్రంథాలు మొదట ఒక సేకరణలో సంకలనం చేయబడినప్పుడు అవి ఎలా అమర్చబడి ఉన్నాయో దానికి భిన్నంగా ఏర్పాటు చేయబడ్డాయి. కనుక హెబ్రీయ బైబిలు గ్రంథాలను మూడు వర్గాలుగా వర్గీకరిస్తుంది—ధర్మశాస్త్రము, ప్రవక్తలు మరియు రచనలు—అనేక క్రైస్తవ బైబిళ్ళు గ్రంథాలను నాలుగు వర్గాలుగా అమర్చాయి: ధర్మశాస్త్రము (ఆదికాండము–ద్వితీయోపదేశకాండము), చరిత్ర (యెహోషువ–ఎస్తేరు), కవిత్వ గ్రంథాలు (యోబు–పరమగీతము) మరియు ప్రవక్తలు (యెషయా–మలాకీ).
ఈ వర్గాలు ఎందుకు ముఖ్యమైనవి? ఎందుకనగా మీరు అధ్యయనం చేసే గ్రంథము ఏ రకమైనదో తెలుసుకొనుట దానిని ఎలా అధ్యయనం చేయాలో గ్రహించడానికి మీకు సహాయపడగలదు.
“ధర్మశాస్త్రము” లేదా పాత నిబంధనలో మొదటి ఐదు గ్రంథాలను మీరు చదవడం ప్రారంభించినప్పుడు, మీ మనస్సులో ఉంచుకోవాల్సినది ఇక్కడున్నది. సాంప్రదాయకంగా మోషేకు ఆపాదించబడిన ఈ గ్రంథాలు, బహుశా కాలక్రమేణా అనేకమంది లేఖకులు మరియు సంగ్రహకుల చేతులలోనికి వెళ్ళియుండవచ్చు. మరియు శతాబ్దాలుగా, బైబిలు నుండి “స్పష్టమైన అతి ప్రశస్థమైన అనేక భాగములు” తీసివేయబడినట్లు మనకు తెలుసు (1 నీఫై 13:23–26 చూడండి). ఇంకను, మోషే గ్రంథాలు దేవుని ప్రేరేపిత వాక్యాలు, అయినప్పటికీ అవి—మర్త్యుల చేత పంపబడిన దేవుని కార్యము వలె—మానవ అపరిపూర్ణతలకు లోబడి ఉంటాయి (మోషే 1:41; విశ్వాస ప్రమాణాలు 1:8 చూడండి). అతడు సంగ్రహించుటకు సహాయపడిన పరిశుద్ధ మోర్మన్ గ్రంథ నివేదికను సూచిస్తూ, మొరోనై యొక్క మాటలు ఇక్కడ సహాయకరంగా ఉంటాయి: “ఇప్పుడు, లోపములున్న యెడల అవి మనుష్యుల యొక్క పొరపాటులైయున్నవి; అందువల్ల, దేవుని యొక్క క్రియలను ఖండించకుడి” (మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ). మరో మాటలో చెప్పాలంటే, లేఖన గ్రంథము దేవుని వాక్యముగా ఉండుటకు మానవ తప్పిదము నుండి విముక్తి పొందవలసిన అవసరము లేదు.