Doctrine and Covenants 2025
పునఃస్థాపన స్వరములు: మన పూర్వీకుల కొరకు బాప్తిస్మము, “ఒక మహిమకరమైన సిద్ధాంతము”


“పునఃస్థాపన స్వరములు: మన పూర్వీకుల కొరకు బాప్తిస్మము, ‘ఒక మహిమకరమైన సిద్ధాంతము,’” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“మన పూర్వీకుల కొరకు బాప్తిస్మము, ‘ఒక మహిమకరమైన సిద్ధాంతము,’” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

పునఃస్థాపన స్వరముల చిహ్నము

పునఃస్థాపన స్వరములు

మన పూర్వీకుల కొరకు బాప్తిస్మము, “ఒక మహిమకరమైన సిద్ధాంతము”

నావూ దేవాలయంలోని బాప్తిస్మపు తొట్టె యొక్క చిత్తుపటం

నావూ దేవాలయంలోని బాప్తిస్మపు తొట్టె పన్నెండు ఎద్దులపై ఉంచబడినట్లు ఈ చిత్తుపటం చూపుతుంది.

ఫీబి మరియు విల్ఫర్డ్ వుడ్రఫ్

Portrait engraving of Orson Pratt

మృతుల కొరకు బాప్తిస్మము యొక్క సాధ్యత గురించి జోసెఫ్ స్మిత్ బోధించడం ప్రారంభించినప్పుడు, ఫీబి వుడ్రఫ్ నావూ దగ్గరలో నివసించేది. ఇంగ్లండులో సువార్త సేవ చేస్తున్న తన భర్త విల్ఫర్డ్‌కు ఆమె దాని గురించి ఇలా వ్రాసింది:

“మరణించిన మరియు ఈ సువార్తను వినే అవకాశం కలిగియుండని తమ బంధువులలో ఎవరి కొరకైనా మరియు తమ పిల్లలు, తల్లిదండ్రులు, సహోదర సహోదరీలు, తాత మామ్మలు, బాబాయిలు, మామయ్యలు, పిన్నిలు, అత్తల కొరకు కూడా ఈ సంఘములోని వారు బాప్తిస్మము తీసుకోవచ్చని బయల్పాటు ద్వారా సహోదరుడు జోసెఫ్ తెలుసుకున్నారు. … వారి స్నేహితుల కొరకు వారు బాప్తిస్మము పొందిన వెంటనే వారు చెరసాల నుండి విడుదల చేయబడతారు మరియు వారు వారిని పునరుత్థానములో హక్కుగా పొంది, వారిని సిలెస్టియల్ రాజ్యములోనికి తీసుకురాగలరు—ఈ సిద్ధాంతము సంఘము చేత మనఃపూర్వకముగా స్వీకరించబడింది మరియు వారు గుంపులు గుంపులుగా ముందుకు వెళ్ళి, కొందరు ఒక్క రోజులో 16 సార్లు కూడా బాప్తిస్మము పొందుతున్నారు.”

ఈ సూత్రము గురించి తరువాత విల్ఫర్డ్ వుడ్రఫ్ ఇలా అన్నారు: “దాని గురించి నేను విన్న క్షణం నా ఆత్మ ఆనందంతో గంతులు వేసింది. … నేను ముందుకు వెళ్ళి, మరణించిన నా బంధువులలో నాకు తెలిసిన వారందరి కొరకు బాప్తిస్మము తీసుకున్నాను. … మృతుల కొరకు బాప్తిస్మము గురించి మాకు బయల్పరుస్తూ ఈ బయల్పాటు వచ్చినప్పుడు నాకు హల్లెలూయా అని అరవాలనిపించింది. పరలోకపు దీవెనలలో ఆనందించే హక్కును మనం కలిగియున్నామని నేను భావించాను.”

వైలేట్ కింబల్

Portrait of Vilate Kimball.

సహోదరి వుడ్రఫ్ వలె వైలేట్ కింబల్ కూడా ఆమె భర్త హిబర్ సువార్తను ప్రకటిస్తూ దూరంగా ఉన్నప్పుడు మృతుల కొరకు బాప్తిస్మము గురించి విన్నది. ఆమె ఆయనకు ఇలా వ్రాసింది:

“అధ్యక్షులు స్మిత్ ఒక క్రొత్త మరియు మహిమకరమైన విషయాన్ని తెలిపారు … అది సంఘములో గొప్ప పునరుద్ధరణకు కారణమయ్యింది. అదేమనగా, మృతుల కొరకు బాప్తిస్మము పొందడం. దీని గురించి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, 29వ వచనములో పౌలు మాట్లాడాడు. బయల్పాటు ద్వారా దీని గురించి మరింత పూర్తి వివరణను జోసెఫ్ పొందారు. … ఈ సువార్త వెలుగులోనికి రాకముందు మరణించిన తమ బంధువులందరి కొరకు, తమ ముత్తాత, ముత్తమ్మల కొరకు కూడా బాప్తిస్మము పొందే విశేషావకాశాన్ని ఈ సంఘము కలిగియుంది. … ఆ విధంగా చేయడం ద్వారా మనము వారి కొరకు ప్రతినిధులుగా పనిచేస్తాము; మరియు మొదటి పునరుత్థానంలో ముందుకు వచ్చే విశేషాధికారాన్ని వారికి ఇస్తాము. వారికి సువార్త బోధించబడుతుందని ఆయన చెప్తున్నారు … కానీ ఆత్మలు బాప్తిస్మము పొందడమనేది లేదు. … ఈ క్రమము ఇక్కడ బోధించబడినందున, జలములు నిరంతరం తీరిక లేకుండా ఉన్నాయి. సమావేశ సమయంలో ఒక్కొక్కసారి ఎనిమిది నుండి పదిమంది ఎల్డర్లు నదిలో ఒకేసారి బాప్తిస్మము ఇచ్చారు. … మా అమ్మ కోసం నేను బాప్తిస్మము తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఇంటికి వచ్చేవరకు వేచియుందామని నేను లెక్కించాను, కానీ క్రిందటిసారి ఈ విషయంపై జోసెఫ్ మాట్లాడినప్పుడు, ముందుకు వెళ్ళి వీలైనంత త్వరగా తమ స్నేహితులను ఈ చెరనుండి విడిపించమని ప్రతీఒక్కరికి ఆయన సలహా ఇచ్చారు. కాబట్టి నేను ఈ వారంలో వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది పొరుగువారు వెళ్తున్నారు. కొంతమంది ఇప్పటికే చాలాసార్లు బాప్తిస్మము పొందారు. … ఆవిధంగా ప్రతి ఒక్కరికీ అవకాశం ఉందని నువ్వు చూడవచ్చు. ఇది మహిమకరమైన సిద్ధాంతము కాదా?”

ఫీబి చేస్

Portrait of Phebe Chase

నావూ దేవాలయంలో బాప్తిస్మము తొట్టె పూర్తయినప్పుడు, నదికి బదులు అందులో ప్రాతినిధ్య బాప్తిస్మములు నిర్వహించబడ్డాయి. నావూ నివాసియైన ఫీబి చేస్, “మరణించిన మన వారి కోసం మనం బాప్తిస్మము పొందగలిగి, సీయోను కొండమీద రక్షకులుగా మారే స్థలముగా” బాప్తిస్మపు తొట్టెను వర్ణిస్తూ దేవాలయం గురించి తన తల్లికి వ్రాసింది. ఆమె ఇలా వివరించడం కొనసాగించింది, ఈ తొట్టెలో “నేను ప్రియమైన నా తండ్రి కోసం మరియు నా స్నేహితులందరి కోసం బాప్తిస్మము తీసుకున్నాను. … ఇప్పుడు మీ అమ్మ, నాన్నలను విడుదల చేయగలిగేలా వారి పేర్లు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మరణించిన వారిని విడుదల చేయాలని నేను కోరుతున్నాను. … ప్రభువు మరలా మాట్లాడి, ప్రాచీన క్రమమును పునరుద్ధరించారు.”

శాల్లీ రాండల్

మృతుల కొరకు బాప్తిస్మము గురించి తన స్నేహితులకు మరియు కుటుంబానికి వ్రాస్తున్నప్పుడు శాల్లీ రాండల్ తన కొడుకు జార్జ్ చనిపోవడాన్ని గుర్తుచేసుకుంది:

“అది నాకెంతో కష్టకాలము, ఇప్పటికీ నన్ను నేను సమాధానపరచుకోలేకపోతున్నాను, కానీ … అతని తండ్రి అతని కోసం బాప్తిస్మము తీసుకున్నారు మరియు సువార్త యొక్క సంపూర్ణత్వాన్ని అది ఇప్పుడు బోధించబడినట్లుగా మేము నమ్మడం, స్వీకరించడం మరియు మా ప్రియమైన స్నేహితులందరి కొరకు బాప్తిస్మము తీసుకోగలగడం మరియు వారి గురించి ఏ మాత్రం సమాచారమున్నా వీలైనంతవరకు వారిని రక్షించగలగడం ఎంత మహిమకరమైన విషయం.

“వీలైనంతవరకు మన తాత మామ్మల వరకు మరణించిన మన సంబంధీకులందరి పేర్లు మీరు వ్రాయాలని నేను కోరుతున్నాను. నా స్నేహితులను రక్షించడానికి నేను చేయగలిగినది చేయాలని నేను అనుకుంటున్నాను మరియు ఈ గొప్ప పనిని ఒంటరిగా చేయలేనందున మీలో కొందరు నాకు సహాయపడడానికి వస్తే నేను చాలా సంతోషిస్తాను. … ఇది విచిత్రమైన సిద్ధాంతమని మీరనుకుంటారని నేను ఆశిస్తున్నాను, కానీ ఇది నిజమని మీరు కనుగొంటారు.”

వివరణలు

  1. విల్ఫర్డ్ వుడ్రఫ్‌కు ఫీబి వుడ్రఫ్ లేఖ, అక్టో. 6, 1840, సంఘ చరిత్ర గ్రంథాలయము, సాల్ట్‌ లేక్ సిటీ; అక్షరక్రమము మరియు విరామచిహ్నాలు ప్రామాణీకరించబడ్డాయి.

  2. విల్ఫర్డ్ వుడ్రఫ్, “Remarks,” Deseret News, మే 27, 1857, 91; విరామచిహ్నాలు ఆధునీకరించబడ్డాయి.

  3. హిబర్ సి. కింబల్‌కు వైలేట్ కింబల్ లేఖ, అక్టో. 11, 1840, సంఘ చరిత్ర గ్రంథాలయము, సాల్ట్ లేక్ సిటీ; అక్షరక్రమము మరియు విరామచిహ్నాలు ప్రామాణీకరించబడ్డాయి.

  4. ఫీబి చేస్ లేఖ, తేదీ వ్రాయబడలేదు, సంఘ చరిత్ర గ్రంథాలయము, సాల్ట్‌ లేక్ సిటీ; అక్షరక్రమము మరియు విరామచిహ్నాలు ప్రామాణీకరించబడ్డాయి. పరిశుద్ధులు మొదట మృతుల కొరకు బాప్తిస్మములు ప్రారంభించినప్పుడు, వ్యక్తులు కొన్నిసార్లు వారి పూర్వీకులలో స్త్రీ పురుషులిద్దరి తరఫున బాప్తిస్మము పొందారు. తరువాత, పురుషుల కొరకు పురుషులు మరియు స్త్రీల కొరకు స్త్రీలు బాప్తిస్మము పొందాలని బయల్పరచబడింది.

  5. శాల్లీ రాండల్ లేఖ, ఏప్రి. 21, 1844, సంఘ చరిత్ర గ్రంథాలయము, సాల్ట్‌ లేక్ సిటీ; అక్షరక్రమం మరియు విరామచిహ్నాలు ఆధునీకరించబడ్డాయి.