“పునఃస్థాపన స్వరములు: లిబర్టీ చెరసాల,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“లిబర్టీ చెరసాల,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
పునఃస్థాపన స్వరములు
లిబర్టీ చెరసాల
మిస్సోరిలోని లిబర్టీలో నిర్బంధించబడినప్పుడు, గవర్నరు ఆదేశాల మేరకు రాష్ట్రము నుండి తరిమివేయబడిన కడవరి-దిన పరిశుద్ధుల సంకట స్థితి గురించి సమాచారమిచ్చే లేఖలను జోసెఫ్ స్మిత్ అందుకున్నారు. ఒక తీక్షణమైన లేఖ ఆయన భార్య ఎమ్మా నుండి వచ్చింది. ఆమె మాటలు మరియు వాటికి జవాబుగా జోసెఫ్ వ్రాసిన లేఖలు సంఘ చరిత్రలో ఈ కష్టకాలములో వారి బాధలు మరియు వారి విశ్వాసాన్ని వ్యక్తం చేసాయి.
1838–39 యొక్క చలికాలంలో జోసెఫ్ స్మిత్ మరియు ఇతరులు ఈ చెరసాలలో ఉంచబడ్డారు.
జోసెఫ్ స్మిత్‌కు ఎమ్మా స్మిత్ నుండి లేఖ, 1839, మార్చి 7
ప్రియమైన భర్తకు,
ఒక స్నేహితుని ద్వారా పంపే అవకాశమున్నందున, నేను వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా మనోభావాలన్నీ వ్రాయడానికి నేను ప్రయత్నించకూడదు, ఎందుకంటే మీరున్న పరిస్థితులు, మనల్ని వేరుచేస్తున్న గోడలు, ఊచలు, గడియలు, ప్రవహిస్తున్న నదులు, పారుతున్న కాలువలు, ఎత్తైన కొండలు, మునుగుతున్న లోయలు, విస్తరిస్తున్న పచ్చికబయళ్ళు మరియు మిమ్మల్ని ముందుగా చెరసాలలో బంధించి, ఇంకా అక్కడే ఉంచడం, అనేక ఇతర ఆలోచనలు నా మనోభావాలను వర్ణింపశక్యము కాకుండా చేసాయి.
మనం అమాయకులమని నాకు తెలియకపోయినా మరియు దైవిక కృప తిన్నగా అడ్డుపడకపోయినా, నేను భరించిన బాధలను నేను ఎన్నడూ సహింపగలిగి ఉండేదాన్ని కాదని నేను ఖచ్చితంగా ఎరుగుదును … ; కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను మరియు మీ కోసం ఇంకా ఎక్కువ సహించవలసి రావడం దయగల దేవుని చిత్తమైతే, అది నాకు సమ్మతమే.
చాలా అస్వస్థతతో ఉన్న ఫ్రెడ్రిక్ తప్ప, మేమంతా ప్రస్తుతానికి క్షేమమే.
ఇప్పుడు నా చేతులలో ఉన్న పసివాడు అలెగ్జాండర్ మీ జీవితంలో మీరు చూసిన ఉత్తమమైన చిన్నపిల్లల్లో ఒకడు. అతడు ఎంత బలంగా ఉన్నాడంటే, ఒక కుర్చీ సహాయంతో అతడు గది అంతా పరుగెత్తుతాడు. …
మన చిన్న పిల్లలు తప్ప, దాదాపు మనం కలిగియున్న వాటన్నిటినీ మరియు మన ఇంటిని విడిచిపెట్టి, ఆ ఒంటరి చెరసాలలో బంధించబడిన మిమ్మల్ని వదిలి మిస్సోరి రాష్ట్రం బయటకు నేను ప్రయాణించినప్పుడు నా మనోభావాలు, నా మనస్సులోని ఆలోచనలు దేవుడికి తప్ప మరెవరికీ తెలియవు. వదలివెళ్ళాలనే ఆలోచనే ఒక మనిషి భరించగలిగిన దానికంటే ఎక్కువ కష్టమైనది.…
…అయినా ముందుముందు మనకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. … ఎప్పటికీ నీ ప్రియమైన,
ఎమ్మా స్మిత్
జోసెఫ్ స్మిత్ నుండి ఎమ్మా స్మిత్‌కు లేఖ,1839, ఏప్రిల్ 4
ప్రియాతి ప్రియమైన భార్యకు.
గురువారం రాత్రి నీకు వ్రాయాలని, నా పరిస్థితిని నీకు తెలియజేయాలని సూర్యాస్తమయ వేళ, ఈ ఒంటరి చెరసాల కిటికీల గుండా చూస్తూ నేను కూర్చున్నాను. రాత్రి పగలు కోపంతోనున్న కాపలాదారుని పర్యవేక్షణలో, ఒంటరితనం, చీకటి, మురికిగానున్న చెరసాల యొక్క కీచుమనే ఇనుప తలుపులు, గోడలు, కిటికీల లోపల నేను ఉన్నప్పటి నుండి ఇప్పటికి సుమారు ఐదు నెలల ఆరు రోజులు అయ్యుండవచ్చని నేననుకుంటున్నాను. దేవునికి మాత్రమే తెలిసిన మనోభావాలతో నేను ఈ లేఖ వ్రాస్తున్నాను. ఈ పరిస్థితులలో నా ఆలోచనలను వ్రాయడం లేదా చెప్పడం అసాధ్యం లేదా మేము అనుభవించిన దానిని అనుభవించని వారికి వాటిని వివరించడం దేవదూతలకు కూడా అసాధ్యం. … మా విడుదల కోసం మేము యెహోవా బలముపై మాత్రమే ఆధారపడతాము, ఇంకెవరిపైన కాదు మరియు ఒకవేళ ఆయన దానిని చేయకపోతే, అది జరుగదు, నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేకమంది మమ్మల్ని చంపాలని కోరుతున్నారు; మేము ఏదో నేరం చేసామని కాదు. … నా ప్రియమైన ఎమ్మా, నేను నీ గురించి, పిల్లల గురించి నిరంతరం ఆలోచిస్తున్నాను. … నేను పసివాడైన ఫ్రెడ్రిక్‌ను, జోసెఫ్, జూలియా, అలెగ్జాండర్, జోయానాలను మరియు ఓల్డ్ మేజర్ (పెంపుడు కుక్క)ను చూడాలనుకుంటున్నాను. … నిన్ను చూడడానికి నేను వట్టికాళ్ళతో, తలపై ఏమీ లేకుండా, అర్థనగ్నంగా ఇక్కడి నుండి నీ దగ్గరకు సంతోషంగా నడుస్తాను, అది నాకు కష్టం కాదు, అద్భుతంగా అనిపిస్తుంది. … నా బాధలన్నిటిని నేను ధైర్యంతో సహిస్తున్నాను, నాతో ఉన్నవారు కూడా; మాలో ఏ ఒక్కరూ సంకోచించడం లేదు. [మన పిల్లలు] నన్ను మరచిపోకుండా చూడమని నిన్ను కోరుతున్నాను. నాన్న వారిని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నారని, వారి దగ్గరకు రావడానికి అల్లరిమూకల నుండి తప్పించుకోవడానికి ఆయన చేయగలిగినదంతా చేస్తున్నారని వారితో చెప్పు. వారు మంచి పిల్లలుగా ఉండాలని, అమ్మ మాట వినాలని నాన్న చెప్పారని వారితో చెప్పు.…
నీ
జోసెఫ్ స్మిత్ జూ.