“పునఃస్థాపన స్వరములు: ఒహైయోలో సమకూడుట,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“ఒహైయోలో సమకూడుట,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
పునఃస్థాపన స్వరములు
ఒహైయోలో సమకూడుట
Kirtland Village [కర్ట్‌లాండ్ గ్రామము], ఆల్ రౌండ్స్ చేత
ఫీబి కార్టర్
1830లలో ఒహైయోలో సమకూడిన అనేకమంది పరిశుద్ధులలో ఫీబి కార్టర్ ఒకరు. ఆమె తల్లిదండ్రులు చేరనప్పటికీ, ఇరవై ఏళ్ళ వయస్సులో ఆమె ఈశాన్య సంయుక్త రాష్ట్రాలలో సంఘములో చేరింది. పరిశుద్ధులతో ఏకమవ్వడానికి ఒహైయోకు వెళ్ళాలనే తన నిర్ణయం గురించి ఆమె తరువాత వ్రాసింది:
“నాలాగే నా స్నేహితులు నా ప్రయాణం గురించి ఆశ్చర్యపడ్డారు, కానీ లోపల ఉన్నదేదో నన్ను ముందుకు త్రోసింది. నేను ఇల్లు విడిచి వెళ్తున్నప్పుడు నేను భరించగలిగిన దానికంటే ఎక్కువగా మా అమ్మ బాధపడింది; నాలో ఉన్న ఆత్మ వలన కాకపోతే, చివరలో నేను సంకోచించి ఆగిపోయేదానిని. క్రూరమైన లోకంలోకి నన్ను ఒంటరిగా పంపడం కంటే నేను సమాధి కావడాన్ని చూడడం మేలని మా అమ్మ నాతో చెప్పింది.
“మనస్సుకు తగిలేలా ఆమె నాతో, ‘(ఫీబి),’ ‘మోర్మనిజం తప్పని తెలిస్తే నువ్వు తిరిగి నా దగ్గరకు వస్తావా?’ అంది.
“‘అవును అమ్మా; నేను వస్తాను,‘ అని నేను జవాబిచ్చాను. … నా జవాబు ఆమె బాధను ఉపశమింపజేసింది; కానీ విడిపోవడానికి మేము చాలా బాధపడ్డాము. నేను వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు, నేను వీడ్కోలు చెప్పే ధైర్యం చేయలేదు; అందువల్ల నేను ప్రతీఒక్కరికి వీడ్కోలు సందేశాలు వ్రాసి, వాటిని నా బల్లమీద పెట్టి పరిగెత్తుకుంటూ క్రిందికి వెళ్ళి బండి ఎక్కాను. ఆవిధంగా నేను నాకిష్టమైన చిన్ననాటి ఇంటిని వదిలిపెట్టి, దేవుని పరిశుద్ధులతో నా జీవితాన్ని ఏకం చేసుకోవడానికి వెళ్ళాను.”
ఆ వీడ్కోలు సందేశాలలో ఒకదానిలో ఫీబి వ్రాసింది:
“ప్రియమైన తల్లిదండ్రులకు—నేనిప్పుడు కొంతకాలం కోసం నా తల్లిదండ్రుల ఇంటిని విడిచి వెళ్ళబోతున్నాను … ఎంతకాలమో నాకు తెలియదు—కానీ నా పసితనం నుండి ఇప్పటివరకు నేను పొందిన దయ కొరకు నేను కృతజ్ఞతాభావాలు కలిగియున్నాను—అయితే, ఇప్పుడున్న దానికి భిన్నంగా దేవుడు ఆజ్ఞాపించాడు అనిపిస్తోంది. ఈ విషయాలన్నిటినీ దేవుని చేతికి అప్పగిద్దాము మరియు మనం దేవుడిని అత్యుత్తమంగా ప్రేమించినట్లయితే, అన్నీ మన మంచి కొరకే జరుగుతాయని నమ్ముతూ, ఇంతకాలం అనుకూల పరిస్థితులలో మనం కలిసి జీవించడానికి అనుమతించబడినందుకు కృతజ్ఞత కలిగియుందాము. మనం ఒకే దేవుడిని ప్రార్థించగలమని తెలుసుకుందాము, ఆయన తన ప్రాణులన్నిటి యొక్క మనఃపూర్వక ప్రార్థనలు వింటారు మరియు మన కొరకు ఉత్తమమైన దానిని మనకిస్తారు. …
“అమ్మా, నేను పశ్చిమానికి వెళ్ళాలనేది దేవుని చిత్తమని నేను నమ్ముతున్నాను మరియు వెళ్ళాలని చాలాకాలం నుండి నేను ఒప్పించబడ్డాను. ఇప్పుడు వెళ్ళడం నాకు సాధ్యపడింది … ; దీనిని చేసింది ప్రభువు యొక్క ఆత్మయేనని నేను నమ్ముతున్నాను, అది చాలు అన్నిటికీ. నీ బిడ్డ గురించి ఆందోళన పడవద్దు; ప్రభువు నన్ను ఓదారుస్తాడు. ప్రభువు నన్ను కాపాడతారని మరియు అత్యుత్తమమైన దానిని నాకిస్తారని నేను నమ్ముతున్నాను. … నేను వెళ్తున్నాను, ఎందుకంటే నా యజమాని పిలుస్తున్నాడు—ఆయన నా బాధ్యతను స్పష్టం చేసాడు.”