“పునఃస్థాపన స్వరములు: తొలుత పరివర్తన చెందినవారు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“తొలుత పరివర్తన చెందినవారు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
పునఃస్థాపన స్వరములు
తొలుత పరివర్తన చెందినవారు
సంఘము స్థాపించబడక ముందే, “పొలము ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 4:4) అని ప్రభువు ప్రకటించారు. తరువాతి నెలల్లో, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘమును కనుగొనడానికి సత్యాన్వేషకులు అనేకమంది దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు, ఈ వ్యాఖ్యానము నిజమని నిరూపించబడింది.
తొలుత పరివర్తన చెందిన వీరిలో అనేకులు పునఃస్థాపనకు పునాది వేయడంలో సాధనముగా ఉన్నారు మరియు వారి పరివర్తన కథలు నేడు మనకు విలువైనవి. యేసు క్రీస్తు యొక్క సువార్తకు పరివర్తన చెందడానికి వారు చూపిన అదే విశ్వాసము మనకు కావాలి.
అబిగేల్ కాల్కిన్స్ లియోనార్డ్
అబిగేల్ కాల్కిన్స్ లియోనార్డ్ సుమారు ముప్ఫైల మధ్య వయస్సులో ఉన్నప్పుడు, తన పాపాల కొరకు క్షమించబడాలని కోరుకుంది. అప్పుడప్పుడు ఆమె బైబిలు చదివింది మరియు క్రైస్తవ సంఘాల నుండి జనులు ఆమె ఇంటిని దర్శించారు, కానీ ఒక సంఘము నుండి మరొక దానిని వేరుచేసినది ఏమిటని ఆమె గందరగోళానికి గురయ్యింది. “ఒక ఉదయాన నేను నా బైబిలు తీసుకొని, అడవిలోకి వెళ్ళి మోకరించాను” అని ఆమె చెప్పింది. ఆమె మనఃపూర్వకముగా ప్రభువును ప్రార్థించింది. ఆమె ఇలా చెప్పింది, “వెంటనే నేనొక దర్శనము చూసాను, నా ప్రక్కనుండి ఒకరి తర్వాత ఒకరుగా విభిన్న తెగలు వెళ్ళాయి మరియు ఒక స్వరము నన్ను పిలిచి ఇలా అన్నది: ‘ఇవన్నీ లాభము కొరకు నిర్మించబడినవి.’ తరువాత, దానిని మించి నేనొక గొప్ప వెలుగును చూసాను మరియు పై నుండి ఒక స్వరము ఇలా వినిపించింది: ‘నేను ఒక జనమును ఉదయింపజేసెదను, వారు నా వారని చెప్పుకొనుటకు మరియు దీవించుటకు నేను ఆనందించెదను.’” కొద్దిరోజుల తర్వాత, అబిగేల్ మోర్మన్ గ్రంథము గురించి విన్నది. అప్పటికింకా ఆమె దగ్గర దాని ప్రతి లేనప్పటికీ, “పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు బహుమానము ద్వారా ఆ గ్రంథము యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని” ఆమె కోరుకుంది మరియు ఆమె “వెంటనే దాని ఉనికిని భావించింది”. చివరకు ఆమె మోర్మన్ గ్రంథాన్ని చదువగలిగినప్పుడు, ఆమె “దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉంది.” ఆమె మరియు ఆమె భర్త లైమన్ 1831లో బాప్తిస్మము పొందారు.
థామస్ బి. మార్ష్
థామస్ బి. మార్ష్ యువకునిగా ఉన్నప్పుడు, అతడు బైబిలు చదివి, ఒక క్రైస్తవ సంఘములో చేరాడు. కానీ అతడు తృప్తి చెందలేదు, చివరకు సంఘాలన్నిటి నుండి వెనుకకు మళ్ళాడు. అతడిలా అన్నాడు, “నేను కొంత ప్రవచనాత్మను కలిగియున్నాను మరియు ఒక క్రొత్త సంఘము ఉదయిస్తుందని, అది స్వచ్ఛమైన సత్యమును కలిగియుంటుందని (ఒక మత నాయకునికి) చెప్పాను.” అది జరిగి ఎంతోకాలము కాకముందే, బోస్టన్, మస్సాచుసెట్స్‌లో ఉన్న తన ఇంటిని వదిలి పశ్చిమానికి ప్రయాణించాలని థామస్ ఒక ఆత్మీయ ప్రేరేపణ పొందాడు. అతడు వెదుకుతున్న దానిని కనుగొనలేక పశ్చిమ న్యూయార్క్‌లో మూడు నెలలు గడిపిన తర్వాత, అతడు ఇంటికి బయలుదేరాడు. దారిలో, “జోసెఫ్ స్మిత్ అనబడే యువకుని చేత కనుగొనబడిన బంగారు గ్రంథము” గురించి మీరు విన్నారా అని ఒక స్త్రీ థామస్‌ను అడిగింది. ఈ ఆలోచన చేత ఆకర్షించబడిన థామస్ వెంటనే పాల్మైరాకు ప్రయాణించి, ముద్రణాలయము వద్ద మార్టిన్ హారిస్‌ను కలుసుకున్నాడు, అప్పుడే మోర్మన్ గ్రంథము యొక్క మొదటి 16 పేజీలు ముద్రణాలయము నుండి వస్తున్నాయి. ఆ 16 పేజీల ప్రతినొకదానిని తీసుకోవడానికి థామస్ అనుమతించబడ్డాడు మరియు అతడు వాటిని తన ఇంటికి, అతని భార్య ఎలిజబెత్ వద్దకు తెచ్చాడు. “అది దేవుని కార్యమని నమ్ముతూ” గ్రంథాన్ని చూసి “ఆమె చాలా సంతోషించింది” అని అతడు గుర్తుచేసుకున్నాడు. తరువాత థామస్ మరియు ఎలిజబెత్ తమ పిల్లలతో పాటు న్యూయార్క్‌కు బదిలీ అయ్యారు మరియు బాప్తిస్మము పొందారు. (థామస్ బి. మార్ష్ గురించి అదనపు సమాచారము కొరకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 31 చూడండి.)
పార్లీ మరియు థాంక్‌ఫుల్ ప్రాట్
థామస్ మార్ష్ వలె, బైబిలు నుండి వారు గ్రహించినట్లుగా సువార్తను బోధించాలనే ఉద్దేశముతో ఒహైయోలో వర్థిల్లుతున్న తమ పొలమును విడిచిపెట్టాలనే ఆత్మీయ ప్రేరేపణలకు పార్లీ మరియు థాంక్‌పుల్ ప్రాట్‌లు స్పందించారు. పార్లీ తన సోదరునితో ఇలా చెప్పాడు, “ఈ విషయాల యొక్క ఆత్మ ఇటీవల నా మనస్సుపై ఎంత శక్తివంతంగా పనిచేసిందంటే, నేను విశ్రమించలేకపోయాను.” వారు తూర్పు న్యూయార్క్ చేరుకున్నప్పుడు, ఆ ప్రాంతంలో కొంతకాలం ఉండాలని పార్లీ ప్రేరేపించబడ్డాడు. అతడు లేకుండా థాంక్‌పుల్ ముందుకు సాగుతుందని వారు నిర్ణయించుకున్నారు. “దేశము యొక్క ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పని ఒకటున్నది మరియు అది ఏమిటో లేదా దానిని చేయడానికి ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు; కానీ అది చేయబడినప్పుడు నేను తిరిగివస్తాను” అని పార్లీ ఆమెకు చెప్పాడు. అక్కడే పార్లీ మొదటిసారి మోర్మన్ గ్రంథము గురించి విన్నాడు. “ఆ గ్రంథం మీద వింత ఆసక్తి కలిగింది నాకు,” అన్నాడతడు. అతడు ఒక ప్రతిని అడిగి, రాత్రంతా దానిని చదివాడు. ఉదయానికి, “లోకంలోని సంపదలన్నిటి కంటే ఎక్కువగా దానికి విలువిస్తూ” ఆ గ్రంథము నిజమని అతడు తెలుసుకున్నాడు. కొద్దిరోజులలోనే పార్లీ బాప్తిస్మము పొందాడు. తరువాత అతడు థాంక్‌పుల్ దగ్గరకు తిరిగి వెళ్ళాడు, ఆమె కూడా బాప్తిస్మము పొందింది. (పార్లీ పి. ప్రాట్ గురించి అదనపు సమాచారము కొరకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 32 చూడండి.)
Parley P. Pratt Reads the Book of Mormon [మోర్మన్ గ్రంథమును చదువుతున్న పార్లీ పి. ప్రాట్], జెఫ్రీ హీన్ చేత
సిడ్నీ మరియు ఫీబి రిగ్డన్
మిస్సోరిలో సువార్త సేవకు న్యూయార్క్ నుండి వెళ్ళే దారిలో పార్లీ ప్రాట్ మరియు అతని తోటి పనివారు మెంటార్, ఒహైయోలో ఉన్న సిడ్నీ మరియు ఫీబి రిగ్డన్ ఇంటివద్ద ఆగారు—పార్లీ ఒహైయోలో ఉన్నప్పటి నుండి వారతనికి పాత స్నేహితులు. సిడ్నీ ఒక క్రైస్తవ పరిచారకుడు మరియు పార్లీ అతని సమూహములో ఒకప్పటి సభ్యుడు మరియు అతడిని ఆత్మీయ సలహాదారునిగా యెంచాడు. పార్లీ ఆతృతగా మోర్మన్ గ్రంథము మరియు యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన గురించి తన స్నేహితులకు చెప్పాడు. మొదట మోర్మన్ గ్రంథము గురించి సందేహించినప్పటికీ, క్రొత్త నిబంధనలో వివరించబడిన నిజమైన సంఘము యొక్క పునఃస్థాపన గురించి సిడ్నీ వెదుకుతున్నాడు మరియు అతడు కనుగొన్నాడు. “కానీ నేను నీ గ్రంథాన్ని చదువుతాను మరియు అది దేవుని నుండి బయల్పాటో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను” అని అతడు తన స్నేహితుడైన పార్లీతో చెప్పాడు. రెండు వారాలు అధ్యయనం చేసి, ప్రార్థించిన తర్వాత, అతడు మరియు ఫీబి ఇద్దరూ ఆ గ్రంథము నిజమైనదని ఒప్పించబడ్డారు. కానీ సంఘములో చేరడం తన కుటుంబానికి పెద్ద త్యాగమవుతుందని కూడా సిడ్నీకి తెలుసు. సమాజంలో అతని సామాజిక హోదాతో పాటు, ఒక పరిచారకునిగా తన ఉద్యోగాన్ని అతడు తప్పకుండా కోల్పోతాడు. దీని సాధ్యాసాధ్యాలను గురించి అతడు మరియు ఫీబి చర్చించినప్పుడు, ఫీబి ఇలా చెప్పింది, “నేను దాని పర్యవసానాలను ఆలోచించాను, … చావైనా బ్రతుకైనా దేవుని చిత్తాన్ని జరిగించడమే నా కోరిక.”