“మార్చి 3–9, ‘నా నుండి నేర్చుకొనుము,’ సిద్ధాంతము మరియు నిబంధనలు 19,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 19,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Gethsemane’s Path [గెత్సేమనే మార్గము] నుండి వివరణ, స్టీవ్ మెక్‌గింటీ చేత.
మార్చి 3-9: “నా నుండి నేర్చుకొనుము”
సిద్ధాంతము మరియు నిబంధనలు 19
మార్టిన్ మరియు లూసీ హారిస్‌లకు న్యూయార్క్‌లోని పాల్మైరాలో ఉత్తమమైన పొలాలలో ఒకదానిని సంపాదించడానికి కొన్నేళ్ళు పట్టింది. కానీ ముద్రించువానికి చెల్లించడానికి మార్టిన్ తన పొలాన్ని తాకట్టు పెడితేనే మోర్మన్ గ్రంథము ప్రచురించబడగలదని 1829లో స్పష్టమైంది. మోర్మన్ గ్రంథము గురించి మార్టిన్ సాక్ష్యాన్ని కలిగియున్నాడు, కానీ లూసీ సాక్ష్యం కలిగిలేదు. మార్టిన్ తాకట్టుపెట్టిన తర్వాత మోర్మన్ గ్రంథము సరిగ్గా అమ్ముడుపోకపోతే అతడు తన పొలాన్ని కోల్పోతాడు, తన వివాహాన్ని చిక్కుల్లో పెట్టుకుంటాడు మరియు సమాజంలో అతని ప్రతిష్ఠకు నష్టం కలుగుతుంది. మన పరిస్థితులు మార్టిన్ వాటి నుండి భిన్నంగా ఉన్నప్పటికీ, అతడు ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలను ఏదో ఒక సమయంలో మనమందరం ఎదుర్కొంటాము: నా దృష్టిలో యేసు క్రీస్తు సువార్తకున్న విలువేమిటి? దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి సహాయపడేందుకు ఏ త్యాగానికి నేను సిద్ధంగా ఉన్నాను? మోర్మన్ గ్రంథము యొక్క మొదటి 5000 ప్రతులు ముద్రింపబడగలిగేందుకు తన పొలాన్ని తాకట్టు పెట్టాలని చివరకు మార్టిన్ హారిస్ నిర్ణయించుకున్నాడు. కానీ ఈ త్యాగము కూడా—మరియు మనం చేసే ఏ త్యాగమైనా—“అందరికంటే గొప్పవాడైన” (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18) యేసు క్రీస్తు యొక్క త్యాగముతో పోల్చితే చిన్నదే, ఆయన పశ్చాత్తాపపడిన వారిని రక్షించడానికి ప్రతీ స్వేదరంధ్రం నుండి రక్తం చిందించారు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 19:1–12
“దేవుడనైన నాకు అంతము లేదు.”
19వ ప్రకరణములోని బయల్పాటు “మార్టిన్ హారీస్‌కు వచ్చిన ఆజ్ఞయని … నిత్యుడగు దేవుని చేత ఇవ్వబడినదని” జోసెఫ్ స్మిత్ వివరించాడు (ప్రకరణ శీర్షిక). 1–12 వచనాలలో ప్రభువు తన నిత్య స్వభావాన్ని నొక్కిచెప్పే స్థలాల కోసం చూడండి. ప్రభువు గురించి ఈ విషయాన్ని తెలుసుకోవడం మార్టిన్ హారిస్‌కు ఎందుకు ముఖ్యమైనదని మీరనుకుంటున్నారు? దీనిని తెలుసుకోవడం మీకు ఎందుకు ముఖ్యమైనది?
యేసు క్రీస్తు ఎందుకు “ఆదియును అంతమును” అని పిలువబడతారని మీరనుకుంటున్నారు? (1వ వచనము).
సిద్ధాంతము మరియు నిబంధనలు 19:15–20
యేసు క్రీస్తు బాధను అనుభవించినందువలన నేను పశ్చాత్తాపపడి, ఆయన యొద్దకు రాగలను.
గెత్సేమనేలో రక్షకుడు అనుభవించిన బాధ గురించి దానిని గమనించిన వారి దృష్టికోణం నుండి క్రొత్త నిబంధన వివరిస్తుంది. సిద్ధాంతము మరియు నిబంధనలు 19:15–20లో, యేసు క్రీస్తు తన బాధ గురించి తన స్వంత మాటలలో చెప్పారు. ఈ పవిత్రమైన వ్యక్తిగత వృత్తాంతాన్ని మీరు చదువుతున్నప్పుడు, రక్షకుడు తన బాధను ఎలా వర్ణించారో చూడండి. ప్రతీ పదము లేదా వాక్యభాగము మీకు బోధించేదానిని పరిగణించండి. రక్షకుడు బాధను అనుభవించడానికి ఎందుకు సమ్మతించారు? యోహాను 15:13; మోషైయ 3:7; ఆల్మా 7:11–12; సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13లో మీరు మరిఎక్కువగా కనుగొనవచ్చు.
రక్షకుని బాధ గురించి మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు మీకు కలిగే భావాలు ఇటువంటి ప్రశ్నలను ప్రేరేపించవచ్చు: నా పాపాల కొరకు రక్షకుడు ఎందుకు బాధననుభవించాలి? ఆయన త్యాగము యొక్క సంపూర్ణ దీవెనలను పొందడానికి నేనెందుకు పశ్చాత్తాపపడాలి? మీరు ఈ ప్రశ్నలు మరియు ఇతర వాటి గురించి ఎల్డర్ యులిసెస్ సోవారెస్ గారి సందేశము యేసు క్రీస్తు: మన ఆత్మల యొక్క పోషకుడు (లియహోనా, మే 2021, 82–84) లో అంతర్దృష్టులను కనుగొనవచ్చు. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు, ఏ మనోభావాలు మీ మనస్సులోకి వస్తాయి? యేసు క్రీస్తు మరియు మీ కొరకు ఆయన త్యాగము గురించి మీ భావాలను నమోదు చేయడాన్ని పరిగణించండి.
మీ అధ్యయనం మరియు ఆరాధనలో భాగంగా, మీరు వినగలిగే లేదా పాడగలిగే ఒక కీర్తన కోసం మీరు వెదకవచ్చు, అది మీ తరఫున రక్షకుడు భరించిన బాధల కొరకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
మీరు భావించిన మరియు అధ్యయనం చేసిన దాని ఫలితంగా మీరు ఏమి చేయాలని పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు కోరుతున్నారని మీరు భావిస్తున్నారు?
The Savior Suffers in Gethsemane
సిద్ధాంతము మరియు నిబంధనలు 19:23
యేసు క్రీస్తు నుండి నేర్చుకొని, ఆయనను అనుసరించడం ద్వారా శాంతి కలుగుతుంది.
“నా నుండి నేర్చుకొనుము” అనే రక్షకుని ఆహ్వానాన్ని పరిగణించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 19లో యేసు క్రీస్తు గురించి మీరేమి నేర్చుకుంటారు? మీ ఆలోచనలను నమోదు చేయండి మరియు శాంతిని కనుగొనడానికి రక్షకుని గురించిన ఈ సత్యాలు మీకేవిధంగా సహాయపడతాయో ధ్యానించండి. మీ దృష్టిలో “[ఆయన] ఆత్మ యొక్క సాత్వీకములో నడుచుట” అనగా అర్థమేమిటి?
హెన్రీ బి. ఐరింగ్, “వ్యక్తిగత శాంతిని కనుగొనడం,” లియహోనా, మే 2023, 29–31 కూడా చూడండి.
Peace in Christ
సిద్ధాంతము మరియు నిబంధనలు 19:26–41
భూలోక నిధుల కంటే దేవుని దీవెనలు గొప్పవి.
మోర్మన్ గ్రంథము పాల్మైరాలో ఎక్కువగా అమ్ముడుపోలేదు. దాని ఫలితంగా, ముద్రించువానికి అప్పు చెల్లించడానికి మార్టిన్ హారిస్ తన పొలంలో పెద్ద భాగాన్ని అమ్మివేయవలసి వచ్చింది (see “The Contributions of Martin Harris,” in Revelations in Context, 7–8). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 19:26–41ను చదువుతున్నప్పుడు మార్టిన్ త్యాగమును, దాని మూలంగా మీరు పొందిన దీవెనలను ధ్యానించండి. మీరు త్యాగం చేయాలని ప్రభువు అడిగిన దాని గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. “సంతోషంగా” మరియు “ఆనందంగా” మీరు ఈ త్యాగాలను చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా ఈ వచనాలలో మీరేమి కనుగొన్నారు? (15–20 వచనాలు కూడా చూడండి).
Martin Harris Farm [మార్టిన్ హారిస్ పొలము] నుండి వివరణ, ఆల్ రౌండ్స్ చేత
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 19:16–19
యేసు క్రీస్తు నా కొరకు బాధలనుభవించారు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 19:16–19ను కలిసి చదవడం ద్వారా మీ పిల్లలు రక్షకుని పట్ల భక్తితో కూడిన గౌరవాన్ని, కృతజ్ఞతను భావించేలా మీరు సహాయపడగలరు. మీ పిల్లలు అర్థం చేసుకున్నారని నిశ్చయపరచడానికి మధ్యలో ఆపడం మరియు వారి భావాలను వ్యక్తపరచనివ్వడం గురించి ఆలోచించండి. ఉదాహరణకు, 16వ వచనములో యేసు మన కొరకు భరించిన “ఈ బాధలు” ఏవి? (మోషైయ 3:7; ఆల్మా 7:11–12 చూడండి). ఆయన బాధ గురించి ఆయన వర్ణన నుండి మనం ఏమి నేర్చుకుంటాము? ఆయన మన కోసం చేసిన దానికి మనం ఏవిధంగా మన కృతజ్ఞతను చూపగలము?
Chapter 51: Jesus Suffers in the Garden of Gethsemane
లేఖనాల నుండి నేర్చుకోవడానికి పిల్లలకు సహాయం చేయండి. లేఖనాలను చదవడం కొంతమంది పిల్లలకు కష్టం కావచ్చు. ఒక్క వచనము లేదా వాక్యభాగముపై దృష్టిసారించడం వారికి సహాయపడవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18–19, 24
యేసు క్రీస్తు కష్టంగా ఉన్నప్పుడు కూడా పరలోక తండ్రికి విధేయత చూపారు.
-
మన పాపాల కోసం బాధపడడం చాలా కష్టం, కానీ యేసు క్రీస్తు తన తండ్రికి విధేయత చూపడానికి, ఆయన పట్ల మరియు మన పట్ల తన ప్రేమను చూపించడానికి దానిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గెత్సేమనేలో (ఈ నమూనాలో ఉన్నదాని వలె) బాధపడుతున్న యేసు క్రీస్తు చిత్రాన్ని కలిసి చూడవచ్చు మరియు చిత్రంలో ఏమి జరుగుతుందనే దాని గురించి వారికి తెలిసినది చెప్పమని మీ పిల్లలను అడగవచ్చు. మన పాపాల కోసం బాధలు అనుభవించడం అనేది ఎవ్వరూ చేయనటువంటి కష్టతరమైన పని అని నొక్కి చెప్పడానికి మీరు కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18–19, 24 చదువవచ్చు, కానీ యేసు తన తండ్రిని మరియు మనల్ని ప్రేమిస్తున్నందున, ఆయన దేవుని చిత్తానికి లోబడ్డారు (మోషైయ 3:7 కూడా చూడండి). మనం చేయాలని దేవుడు కోరుతున్న కొన్ని కష్టమైన విషయాలేవి? ఆయనకు లోబడడానికి మనం ధైర్యాన్ని ఎలా కనుగొనగలము?
సిద్ధాంతము మరియు నిబంధనలు 19:23
“నా నుండి నేర్చుకొనుము, నా మాటలను వినుము.”
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 19:23లోని వాక్యభాగాలకు సరిపోయే సరళమైన అభినయాల గురించి ఆలోచించడానికి మీరు మీ పిల్లలకు సహాయపడవచ్చు. వారు అభినయిస్తున్నప్పుడు వచనాన్ని అనేకమార్లు చదవండి. మనం క్రీస్తు నుండి నేర్చుకొని, ఆయన మాటలను వినగల కొన్ని మార్గాలు ఏవి?
సిద్ధాంతము మరియు నిబంధనలు 19:38
భూలోక నిధుల కంటే దేవుని దీవెనలు గొప్పవి.
-
మీరు మరియు మీ పిల్లలు వంతులవారీగా మోర్మన్ గ్రంథము యొక్క ప్రతిని పట్టుకొని, దాని గురించి మీకిష్టమైనది పంచుకోవచ్చు. మోర్మన్ గ్రంథము ముద్రించబడేలా మార్టిన్ హారిస్ చేసిన త్యాగము గురించి క్లుప్తంగా మాట్లాడండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 19:38లో మార్టిన్‌కు ప్రభువు చెప్పినవాటిలో ఏది విశ్వాసంగా మరియు విధేయునిగా ఉండేందుకు అతనికి సహాయపడియుండవచ్చు? దేవునికి లోబడేందుకు లేదా ఆయన కార్యములో సహాయపడేందుకు వారు త్యాగము చేయగల దాని గురించి ఆలోచించడానికి మీ పిల్లలకు సహాయపడండి.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.