Doctrine and Covenants 2025
ఫిబ్రవరి 10–16: “నీవు అజేయుడవగునట్లు”: సిద్ధాంతము మరియు నిబంధనలు 10–11


“ఫిబ్రవరి 10–16: ‘నీవు అజేయుడవగునట్లు’: సిద్ధాంతము మరియు నిబంధనలు 10–11,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 10–11,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

బల్లపై నున్న మోర్మన్ గ్రంథపు చేతివ్రాత ప్రతులు

అసలైన మోర్మన్ గ్రంథపు చేతివ్రాత ప్రతుల నకలు.

ఫిబ్రవరి 10-16: “నీవు అజేయుడవగునట్లు”

సిద్ధాంతము మరియు నిబంధనలు 10–11

మోర్మన్ గ్రంథపు అనువాదము ముందుకు సాగినప్పుడు, ఒక ప్రశ్న తలెత్తింది: కోల్పోబడిన అనువాద పేజీల గురించి జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీ ఏమి చేయాలి? న్యాయంగా అయితే వెనుకకు వెళ్ళి మరలా ఆ భాగాన్ని అనువదించాలి, కానీ వారు చూడలేని దానిని ప్రభువు చూసారు: దుష్టులు జోసెఫ్ యొక్క ప్రేరేపిత కార్యముపై సందేహం కలుగజేయడానికి ఆ పేజీలలోని పదాలను మార్చడానికి కుట్రపన్నుతున్నారు. ఆ సమస్యను నివారించడానికి మరియు పనిని ముందుకు కొనసాగించడానికి దేవుడు ఒక ప్రణాళికను కలిగియున్నారు. “ఆయనయందొక వివేకమైన ఉద్దేశ్యము నిమిత్తము” (1 నీఫై 9:5) వేల సంవత్సరాల క్రితం, అదే కాలవ్యవధిలో రెండవ గ్రంథాన్ని వ్రాయడానికి దేవుడు నీఫైని ప్రేరేపించారు.

“అపవాది యొక్క కుయుక్తి కంటే నా జ్ఞానము గొప్పదని,” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 10:43) ప్రభువు జోసెఫ్‌తో చెప్పారు. విశ్వాసాన్ని బలహీనపరచడానికి విరోధి యొక్క ప్రయత్నాలు తీవ్రమవుతున్న మన కాలంలో అభయమిచ్చు సందేశమది. మనము చేయాలని దేవుడు పిలిచిన కార్యములో జోసెఫ్ వలె మనము “నమ్మకముగా ఉండి, కొనసాగగలము” (3వ వచనము). మన యెదుట “నరకపు ద్వారములు నిలువజాలకుండా” ఇదివరకే ఆయన మార్గమును ఏర్పరిచారని అప్పుడు మనము కనుగొంటాము (69వ వచనము).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 10:1–33

“సాతాను తన దుష్ట సంకల్పమును సాధించుటకు దేవుడు అనుమతించడు.”

అతని ఉనికిని మనము మరచిపోవాలని లేదా కనీసం మనల్ని ప్రభావితం చేసే అతని ప్రయత్నాలను గుర్తించడంలో మనం విఫలమవ్వాలని సాతాను కోరుకుంటాడు (2 నీఫై 28:22–23 చూడండి). కానీ సాతాను నిజమని మరియు అతడు దేవుని కార్యాన్ని నిరంతరము క్రియాశీలకంగా వ్యతిరేకిస్తాడని సిద్ధాంతము మరియు నిబంధనలు 10 లో ప్రభువు యొక్క మాటలు నిర్ధారిస్తాయి. 1–33 వచనాలలో, సాతాను ప్రయత్నాల గురించి దేవునికి ఏమి తెలుసో గుర్తించండి (62–63 వచనాలు కూడా చూడండి). సాతాను మిమ్మల్ని ఏవిధంగా శోధిస్తాడో చూడగలుగుటకు మీకు సహాయపడమని కూడా మీరు ప్రభువును అడగవచ్చు. 10వ ప్రకరణమును మీరు చదువుతున్నప్పుడు, సాతాను ప్రయత్నాలను నిరోధించడంలో రక్షకుడు మీకెలా సహాయపడగలరో ధ్యానించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 10:34–52

సెమినరీ చిహ్నము
“అపవాది యొక్క కుయుక్తి కంటే ప్రభువు యొక్క జ్ఞానము గొప్పది.”

అతని జనుల గురించి రెండు జతల వృత్తాంతాలను చేయడానికి అతడు ఎందుకు ప్రేరేపించబడ్డాడో నీఫైకి తెలియదు. మరియు రెండవ జతను బంగారు పలకలతో చేర్చడానికి అతడు ఎందుకు ప్రేరేపించబడ్డాడో మోర్మన్‌కు తెలియదు. కానీ దేవుడు “ఒక వివేకమైన ఉద్దేశ్యము” (1 నీఫై 9:5; మోర్మన్ వాక్యములు 1:7) కలిగియున్నారని ప్రవక్తలిద్దరూ నమ్మారు. ఆ ఉద్దేశ్యములో కనీసం కొంతభాగం నేడు మనకు తెలుసు: మోర్మన్ గ్రంథము నుండి కోల్పోబడిన 116 పేజీలను భర్తీచేయడానికి. వీటన్నిటి నుండి మీరు ఏమి నేర్చుకోవాలని ప్రభువు కోరుతున్నారని మీరనుకుంటున్నారు? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 10:34–52 చదువుతున్నప్పుడు ఆ ప్రశ్న గురించి ఆలోచించండి. ఈ వచనాల నుండి ప్రభువు గురించి మీరు నేర్చుకొనే సత్యాలను మీరు జాబితా చేయవచ్చు కూడా. ఈ సత్యాలు ఆయనతో మీ సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? 116 పేజీల నష్టానికి సిద్ధపడడంలో ప్రభువు యొక్క జ్ఞానం మరియు దూరదృష్టి గురించి ఏది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది?

మీ జీవితంలో ఆయన జ్ఞానం మరియు దూరదృష్టికి సాక్ష్యం కొరకు చూడడానికి ప్రేరేపించబడినట్లు కూడా మీరు భావించవచ్చు. ఎల్డర్ రొనాల్డ్ ఎ. రాస్బాండ్ గారి సందేశము “దైవ ప్రణాళిక ద్వారా” లోని వృత్తాంతాలను చదవండి—అవి మీ మనస్సులోకి మాదిరులను తీసుకురావచ్చు (లియహోనా, నవ. 2017, 55–57). అవి మీకు వచ్చినప్పుడు వాటిని వ్రాయడం గురించి ఆలోచించండి. మీ జీవితంలో ప్రభువు ఎలా పని చేస్తున్నారు? ఉదాహరణకు, ఆయన ఏ “యాదృచ్ఛికాలను” సిద్ధం చేసారు? మీ దీవెనల కొరకు ఆయన ఏ పునాదులు వేసారు? అవసరంలో ఉన్న ఒకరికి పరిచర్య చేయడానికి ఆయన మిమ్మల్ని ఎప్పుడు నడిపించారు?

రోమా 8:28; సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24 కూడా చూడండి.“Plan of Salvation [రక్షణ ప్రణాళిక],” సువార్త గ్రంథాలయం.

బంగారు పలకలతో బల్ల వద్ద కూర్చున్న ప్రవక్త మోర్మన్

Mormon Abridging the Plates [పలకలను సంక్షిప్తపరుస్తున్న మోర్మన్] నుండి వివరణ, టామ్ లోవెల్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 11

“[ప్రభువు యొక్క] ఆత్మ యందు నమ్మకముంచుము.”

అతని కొరకు ప్రభువు యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని జోసెఫ్ అన్న హైరం ఆతృతగా ఉన్నాడు, కాబట్టి అతని తరఫున బయల్పాటు కోరమని అతడు జోసెఫ్‌ను అడిగాడు. అలా చేయడానికి ప్రవక్త చాలా సంతోషించాడు, కానీ ఆ బయల్పాటులో ఉన్న కనీసం ఒక సందేశం ఏమనగా (సిద్ధాంతము మరియు నిబంధనలు 11), హైరం కూడా తన కొరకు బయల్పాటు కోరవచ్చు. మరియు “మంచి కోరికలు కలిగి, తమ కొడవలితో కోతకోయు వారందరు” కోరవచ్చు (27వ వచనము). మీరు 11వ ప్రకరణమును చదువుతున్నప్పుడు, వ్యక్తిగత బయల్పాటు గురించి ప్రభువు మీకు ఏమి బోధిస్తున్నారని మీరు భావిస్తున్నారు? 6–9 ప్రకరణములలో ఆయన ఆలీవర్ కౌడరీకి బోధించిన దానితో ఇది ఏవిధంగా సంబంధం కలిగియుంది? మీ కొరకు ఆయన కలిగియున్న ఇతర సందేశాలేవి?

ప్రశ్నలు అడగడానికి అభ్యాసకులను ఆహ్వానించండి. ప్రశ్నలు తరచు బయల్పాటుకు దారితీస్తాయి. మీరు మీ కుటుంబానికి లేదా ఒక సంఘ తరగతికి బోధిస్తున్నట్లయితే, ప్రశ్నలు అడగమని వారిని ప్రోత్సహించండి మరియు లేఖనాలలో జవాబులు కనుగొనడానికి వారికి సహాయపడండి. ఉదాహరణకు, వ్యక్తిగత బయల్పాటు గురించి వారికి ప్రశ్నలున్నట్లయితే, సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12–14లో జవాబుల కొరకు కలిసి వెదకండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 11:15–26

“(దేవుని) వాక్యాన్ని పొందడానికి” నేను వెదకినప్పుడు ఆయన ఆత్మను, శక్తిని నేను పొందుతాను.

మోర్మన్ గ్రంథము అనువదించబడడానికి ముందే పునఃస్థాపన కార్యములో సహాయపడేందుకు హైరం స్మిత్ ఆతృతగా ఉండెను. అతని కోరికల పట్ల ప్రభువు యొక్క స్పందనను మీరు చదువుతున్నప్పుడు, మీ దృష్టిలో “(దేవుని) వాక్యాన్ని పొందడం” (21వ వచనము) అనగా అర్థమేమిటో పరిగణించండి. దేవుని వాక్యాన్ని పొందడం శక్తితో ఆయనకు సేవచేయడానికి మీకెలా సహాయపడుతుంది?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 10:5

నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసినప్పుడు, నేను దేవుని నుండి బలము పొందుతాను.

  • ఈ వచనాన్ని మీ పిల్లలకు పరిచయం చేయడానికి, వారు “ఎల్లప్పుడూ” చేసే విషయాల గురించి మీరు వారిని అడగవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 10:5లో మనం ఎల్లప్పుడూ చేయాలని ప్రభువు చెప్తున్నదేమిటి? మనము దీనిని చేయాలని ఆయన ఎందుకు కోరుతున్నారు?

  • ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని జ్ఞాపకముంచుకోవడానికి మీ పిల్లలకు మీరు ఎలా సహాయపడగలరు? బహుశా వారు కొన్ని చిన్న, నున్నని రాళ్ళను సేకరించి, వాటిపై “సిద్ధాంతము మరియు నిబంధనలు 10:5” లేదా “ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి” అని రంగులు వేయవచ్చు. వారు తమ మంచం దగ్గర, పాఠశాల పుస్తకాలతో లేదా భోజనం చేసే చోట ప్రార్థన చేయమని వారికి గుర్తు చేయాలనుకుంటున్న వివిధ ప్రదేశాలలో తమ రాళ్ళను ఉంచవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 10:5 ప్రకారము, మనం ప్రార్థించినప్పుడు ప్రభువు మనల్ని ఎలా దీవిస్తారు? మీ పిల్లలు అదనపు జవాబులను ఒక పాటలో కనుగొనవచ్చు.

చిన్న రాళ్ళకు రంగులు వేస్తున్న బాలిక

సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12-13

మంచి చేయడానికి పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తారు.

  • ఆత్మ వారితో మాట్లాడుతున్నప్పుడు గుర్తించడాన్ని పిల్లలు నేర్చుకోగలరు. వారికి సహాయం చేయడానికి, గదిలో ఏదో ఒక చోట మీరు బల్బు లేదా ఫ్లాష్‌లైటు మరియు ఒక సంతోషకరమైన ముఖం యొక్క చిత్రాన్ని దాచిపెట్టవచ్చు; తర్వాత ఈ వస్తువులను కనుగొనమని మీ పిల్లలను అడగవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 11:13 చదవండి మరియు వారు కనుగొనిన వస్తువులకు సంబంధించిన పదాలను గుర్తించడానికి మీ పిల్లలకు సహాయపడండి. పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయం చేస్తారనే దాని గురించి ఈ పదాలు ఏమి బోధిస్తాయి?

  • మీ స్వంత ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకోవడం మీ పిల్లలు తమ జీవితాల్లో పరిశుద్ధాత్మ ప్రభావాన్ని గుర్తించడంలో సహాయపడగలదు. మీరు పంచుకున్నప్పుడు, వారి అనుభవాలను కూడా పంచుకోమని వారిని అడగండి. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఎలా గుర్తించగలమో చూస్తూ మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12–13ను కలిసి చదువవచ్చు కూడా. పరిశుద్ధాత్మ ద్వారా పరలోక తండ్రి మనల్ని నడిపించాలని కోరుతున్నారని సాక్ష్యమివ్వండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 11:21, 26

నేను సువార్త గురించి తెలుసుకోవాలి, తద్వారా సత్యాన్ని కనుగొనడంలో నేను ఇతరులకు సహాయం చేయగలను.

  • హైరమ్ స్మిత్ లాగానే, బహుశా మీ పిల్లలు ఇతరులతో సువార్తను పంచుకోవడానికి చాలా అవకాశాలు కలిగియుండవచ్చు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 11:21, 26ను కలిసి చదువవచ్చు మరియు అతను సువార్త బోధించగలిగేలా హైరమ్ ఏమి చేయాలని ప్రభువు చెప్పారో కనుగొనమని మీ పిల్లలను అడగండి. దేవుని వాక్యమును “పొందడం” అంటే అర్థమేమిటి? దీనిని మనము ఎలా చేయగలము? దేవుని వాక్యమును మన హృదయాలలో మనము ఎలా “భద్రపరచుకోవాలి”? బహుశా మీ పిల్లలు యేసు క్రీస్తు లేదా మోర్మన్ గ్రంథము గురించి ఇతరులతో పంచుకుంటున్నట్లు నటించి చూపవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

జోసెఫ్ మరియు హైరం స్మిత్ యొక్క చిత్రము

Joseph and Hyrum Smith [జోసెఫ్ మరియు హైరం స్మిత్], కెన్ కార్బెట్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ