2024 రండి, నన్ను అనుసరించండి
జూలై 13–19. “అతడు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునందు నమ్మకముంచెను”: 2 రాజులు 16–25


“జూలై 13–19. ‘అతడు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునందు నమ్మకముంచెను’: 2 రాజులు 16–25,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“జూలై 13–19. ‘అతడు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునందు నమ్మకముంచెను,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

బబులోనులో నుండి బహిష్కరించబడుతున్న యూదుల యొక్క పెద్ద సమూహం

The Flight of the Prisoners [పారిపోతున్న ఖైదీలు], జేమ్స్ జాక్ జోసెఫ్ టీసొ మరియు ఇతరుల చేత

జూలై 13–19: “అతడు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునందు నమ్మకముంచెను”

2 రాజులు 16–25

ప్రవక్తయైన ఎలీషా యొక్క శక్తివంతమైన పరిచర్య ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు యొక్క ఉత్తర రాజ్యము యొక్క జనులు పశ్చాత్తాపపడలేదు. చివరకు అష్షూరు సామ్రాజ్యము ఇశ్రాయేలు పది గోత్రములను జయించి, చెదరగొట్టింది. ఇది ఇలా ఉండగా, యూదా యొక్క దక్షిణ రాజ్యము యొక్క పరిస్థితి ఏమీ బాగోలేదు; అక్కడ విగ్రహారాధన విస్తృతంగా వ్యాప్తి చెందింది.

ఈ సమస్త ఆత్మీయ క్షీణత మధ్య, లేఖన వృత్తాంతములు ఇద్దరు యూదా రాజుల గురించి చెప్తాయి, వారు కొంతకాలం వారి జనులను ప్రభువు వైపు త్రిప్పారు. వారిలో ఒకరు హిజ్కియా. అతడి పాలనలో, అష్షూరీయులు యూదాలో అధిక భాగమును జయించారు. కానీ హిజ్కియా మరియు అతడి జనులు ప్రభువునందు విశ్వాసమును చూపారు, ఆయన ఒక అద్భుతమైన విధానములో యెరూషలేమును రక్షించారు. తరువాత, మరొక విశ్వాసభ్రష్టత్వపు కాలము తరువాత యోషీయా రాజయ్యాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తిరిగి కనుగొనుట వలన కొంతవరకు ప్రేరేపించబడిన యోషీయా, తన జనుల యొక్క మత జీవితాన్ని పునరుద్ధరించే సంస్కరణలను తీసుకువచ్చాడు.

ఇశ్రాయేలు మరియు యూదా వలె మనమందరం మంచి మరియు చెడు ఎంపికలు చేస్తాము. మన జీవితాలకు కొన్ని సంస్కరణలు అవసరమని మనం గ్రహించినప్పుడు, యూదా చరిత్రలోని చీకటి సంవత్సరాల్లో ఈ రెండు ప్రకాశవంతమైన సమయాల నుండి మనం ప్రోత్సాహాన్ని పొందవచ్చు. బహుశా హిజ్కియా మరియు యోషీయా మాదిరులు “మన దేవుడైన యెహోవాను నమ్ముకొనుటకు” (2 రాజులు 18:22) మనల్ని ప్రేరేపించగలవు.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

2 రాజులు 18–19

సెమినరీ చిహ్నము
నా విశ్వాసం సవాలు చేయబడినప్పుడు నేను ప్రభువుపట్ల నిజాయితీగా ఉండగలను.

మనలో అనేకమంది మన విశ్వాసాన్ని సవాలు చేసే అనుభవాలను కలిగియున్నాము. అష్షూరు సైన్యము యెరూషలేమును సమీపించినప్పుడు, హిజ్కియా మరియు అతని జనులకు అటువంటి సవాళ్ళలో ఒకటి వచ్చింది. మీరు 2 రాజులు 18–19 చదివినప్పుడు, ఆ సమయమందు మీరు యెరూషలేములో నివసిస్తున్నట్లు ఊహించుకోండి. ఉదాహరణకు, 2 రాజులు 18:28–37; 19:10–13 లో అష్షూరీయుల వెక్కిరింపులను వినినప్పుడు మీరు ఎలా భావించియుండవచ్చు? మీరు ఏమి చేసియుండవచ్చు? ఇశ్రాయేలీయులు ప్రభువును విశ్వసించకపోవడానికి అష్షూరీయుల కారణాలను, నేడు మన విశ్వాసాన్ని అనుమానించడానికి సాతాను చెప్పిన కారణాలతో పోల్చండి. మీరు ప్రభువును ఎందుకు విశ్వసిస్తున్నారనే దానికి మీ కారణాలతో అష్షూరీయుల కారణాలను కూడా మీరు విభేదించవచ్చు.

ఈ సందర్భంలో హిజ్కియా చేసిన దాని నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? (2 రాజులు 19:1–7, 14–19 చూడండి). ప్రభువు ఎలా స్పందించారు? (2 రాజులు 19:35–37 చూడండి). హిజ్కియా ఎందుకు విశ్వాసంగా నిలిచాడని మీరనుకుంటున్నారు? (2 రాజులు 18:5–7 చూడండి). కష్టకాలములందు ప్రభువు మిమ్మల్ని ఎలా బలపరిచారో ధ్యానించండి. ఆయనపై మీ నమ్మకాన్ని పెంచుకోవడానికి మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడినట్లు భావిస్తున్నారు?

అధ్యక్షులు జెఫ్రీ ఆర్. హాలండ్ గారి సందేశము, “భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము!” (లియహోనా, మే 2022, 34–36) భయం లేదా సందేహాలు గల సమయాల్లో సహాయకరమైన సలహాను కలిగియుంది. మీకు సహాయపడేలా ఈ వనరులలో మీరు ఏమి కనుగొంటారు?

2 దినవృత్తాంతములు 31–32; 3 నీఫై 3–4; యోర్గ్ క్లెబింగెట్, “కడవరి దినాలలో సాహసముగల శిష్యత్వము,” లియహోనా, మే 2022, 107–10 కూడా చూడండి.

లేఖన అధ్యయన సహాయములను ఉపయోగించండి. లేఖనాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడేందుకు సంఘము అనేక వనరులను అందిస్తుంది. ఉదాహరణకు, సువార్త గ్రంథాలయములో మీరు సంఘ పత్రికలను కనుగొనవచ్చు. అదనంగా, మీరు పాత నిబంధనను చదువుతున్నప్పుడు, రండి, నన్ను అనుసరించండి లోనున్న “జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు” వ్యాసాలలో మీరు సహాయకరమైన సందర్భాన్ని మరియు అంతర్దృష్టులను కనుగొనగలరు. ‘ఇంటికి రండి’ అని యేసు ఇశ్రాయేలీయులందరిని పిలుస్తున్నారు అనే శీర్షికగల వ్యాసము 2 రాజులు 16–25 గురించిన మీ అధ్యయనానికి సహాయపడవచ్చు.

కలిసి లేఖనాలను చదువుతున్న కుటుంబము

2 రాజులు 19:20–37

అన్ని విషయములు ప్రభువు హస్తములలో ఉన్నాయి.

అతడి సైన్యము యెరూషలేమును జయించగలదని నమ్మడానికి అష్షూరు రాజైన సన్హెరీబుకు మంచి కారణమున్నది (2 రాజులు 17; 18:33–34; 19:11–13 చూడండి). కానీ సన్హెరీబు కోసం ప్రభువు ఒక సందేశాన్ని కలిగియున్నారు, అది యెషయా ప్రవక్త ద్వారా ఇవ్వబడింది. అది 2 రాజులు 19:20–34 లో నమోదు చేయబడింది. ప్రభువు యందు మరియు ఆయన ప్రణాళికయందు మీరు విశ్వాసము కలిగియుండునట్లు మీకు సహాయపడేలా ఆయన సందేశంలో మీరు కనుగొన్న సత్యములేవి?

2 రాజులు 21–23

లేఖనాలు ప్రభువు వైపు నా హృదయమును త్రిప్పగలవు.

మీకు ఆత్మీయంగా ఏదైనా కొదువుగా ఉన్నట్లు మీరెప్పుడైనా భావించారా? దేవునితో మీ అనుబంధము బలమైనదిగా కాగలదని మీరు భావించియుండవచ్చు. ఆయన యొద్దకు తిరిగి రావడానికి మీకు సహాయపడినదేమిటి? మీరు 2 రాజులు 21–23 చదివినప్పుడు ఈ ప్రశ్నలను గూర్చి ధ్యానించండి, అవి మనష్షే రాజు ఏలుబడిలో యూదా రాజ్యము ప్రభువు నుండి ఏవిధంగా దూరమైంది (2 రాజులు 21 చూడండి) మరియు జనులు ఆయన వైపుకు తిరిగి రావడానికి యోషీయా రాజు వారికి ఏవిధంగా సహాయము చేసాడో వివరిస్తాయి (2 రాజులు 22–23 చూడండి). యోషీయా మరియు అతని జనులు ఎలా మరియు ఎందుకు మారారు? (2 రాజులు 22:8–11; 23:1–6, 21, 24 చూడండి).

అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ యోషీయా రాజు కథను “అన్ని గ్రంథాలలోని అత్యుత్తమ కథలలో ఒకటి” అని పేర్కొన్నారు (Teachings of Presidents of the Church: Spencer W. Kimball [2006], 62). యోషీయా రాజు గురించి అధ్యక్షులు కింబల్ గారి మాటలను చదవండి (62–64 పేజీలు ). బహుశా మీరు లేఖనంలోని ఒక భాగం మీలో “శక్తివంతంగా పనిచేసినప్పటి” అనుభవం గురించి ఆలోచించవచ్చు. ఇలాంటి మరిన్ని అనుభవాలను పొందడానికి మీరు ఏమి చేయవచ్చు?

ఆల్మా 31:5 కూడా చూడండి.

12:25

Josiah and the Book of the Law

2 రాజులు 23:1–25

నిబంధన అనేది ప్రభువుకు మరియు నాకు మధ్య లోతైన నిబద్ధత.

2 రాజులు 23:3లో యోషీయా చేసిన నిబంధన గురించి ఏది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది? మీరు 23వ అధ్యాయం చదవడాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ప్రభువు పట్ల తనకున్న నిబద్ధతను చూపించడానికి యోషీయా ఏమి చేసాడో గమనించండి (ఈ నమూనా చివర ఉన్న చిత్రాన్ని కూడా చూడండి). ఆయనపట్ల మీ నిబద్ధతను మీరెలా చూపగలరు?

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

2 రాజులు 18:3–6; 19:14–19

పరలోక తండ్రిని మరియు యేసు క్రీస్తును నేను నమ్మగలను.

  • 2 రాజులు 18:3, 5–6లో, హిజ్కియాను మంచి రాజుగా చేసిన వాటిని కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయండి. తర్వాత మీరు కలిసి 2 రాజులు 19:14–19 చదివినప్పుడు, అతను ప్రభువును నమ్మాడని అతను ఎలా చూపించాడో వారు కనుగొనగలరు. మీరు యేసు చిత్రాన్ని చూసి, మనం ఆయనను ఎందుకు నమ్మగలము అనే దాని గురించి మాట్లాడవచ్చు. మనము ప్రభువును నమ్ముతున్నామని మనమెలా చూపగలము?

2 రాజులు 22:1–7

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నన్ను నమ్మవచ్చు.

  • 2 రాజులు 22:1లో, యోషీయా రాజు అయినప్పుడు అతని వయస్సు ఎంత ఉందో తెలుసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి. 2వ వచనములో యోషీయా గురించి మనం ఏమి నేర్చుకుంటాము? “కుడి ఎడమలకు” తిరగక ప్రభువును అనుసరించడాన్ని వివరించగల ఒక ప్రోత్సాహకార్యక్రమమును పరిగణించండి.

  • 2 రాజులు 22:3–7లో వివరించబడిన పనివారు దేవాలయమును తిరిగి కట్టడానికి ఉపయోగించబడిన ద్రవ్యముతో “వారు నమ్మకంగా వ్యవహరించినందున” నమ్మబడ్డారు (7వ వచనము). ఈ వచనాలను చదివిన తర్వాత, మీరు మరియు మీ పిల్లలు మిమ్మల్ని నమ్మి అప్పగించిన విషయాల గురించి మాట్లాడవచ్చు. ఈ వచనములలోని పనివారివలే మనము నమ్మకస్థులుగా ఎలా ఉండగలము?

యోషీయా రాజుతో లేఖకుడు

యోషీయా రాజుకు లేఖనముగల కాగితపు చుట్టను తీసుకొస్తున్న లేఖకుడు యొక్క వివరణ, రాబర్ట్ టి. బారెట్ చేత

2 రాజులు 22:8–11; 23:2–3

యేసు క్రీస్తును అనుసరించమని లేఖనాలు నాకు బోధిస్తాయి.

  • 2 రాజులు 22–23లో యోషీయా రాజు కథను పరిచయం చేయడానికి, మీరు గదిలో ఎక్కడో ఒక చోట లేఖనాల ప్రతిని దాచవచ్చు. దాన్ని కనుగొనడానికి మీ పిల్లలను ఆహ్వానించండి. అప్పుడు యోషీయా యొక్క యాజకులలో ఒకరు దేవాలయంలో లేఖనాలను కనుగొన్నప్పుడు ఏమి జరిగిందో మీరు పంచుకోవచ్చు (2 రాజులు 22:8–11 చూడండి; పాత నిబంధన కథలు, 148–49లో “రాజైన యోషీయా” కూడా చూడండి). మన దగ్గర లేఖనాలు లేకపోతే మనకు ఏమి జరుగవచ్చు? ఈ రోజు మన వద్ద లేఖనాలు ఉన్నాయని మీరు ఎందుకు సంతోషిస్తున్నారో పరస్పరం పంచుకోండి.

    1:36

    King Josiah

  • 2 రాజులు 23:2–3 చదివిన తరువాత, మీరు మరియు మీ పిల్లలు “ప్రభువు వెంట నడవడానికి” (3వ వచనము) మిమ్మల్ని ప్రేరేపించిన లేఖనాల గురించి మాట్లాడవచ్చు.

2 రాజులు 23:1–3

నేను దేవునితో చేసిన నా నిబంధనలను పాటిస్తాను.

  • యోషీయా మరియు అతని జనులు దేవుని ఆజ్ఞలను నేర్చుకున్నప్పుడు, వారు వాటిని జీవించడానికి ఒక నిబంధన చేసారు. మీ పిల్లలతో కలిసి 2 రాజులు 23:1–3లో దాని గురించి చదవండి మరియు ప్రభువు యొక్క ఆజ్ఞల గురించి జనులు ఎలా భావించారో చూపించే పదాలు లేదా వాక్యభాగాలను కనుగొనడంలో వారికి సహాయపడండి. బహుశా మీ పిల్లలు నిలబడి, “నిబంధనను [స్థిరపరచడం]” అంటే అర్థం ఏమిటో మాట్లాడవచ్చు. తరువాత వారు ఒక ప్రదేశంలో నడుస్తూ, “ప్రభువు వెంట నడవడం” అంటే ఏమిటో మాట్లాడవచ్చు. ఆ తర్వాత, వారు తమ హృదయాలపై చేతులు వేసి, మన నిబంధనలను “[మన] పూర్ణహృదయంతో” పాటించగల మార్గాలను సూచించవచ్చు.

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

విగ్రహాన్ని తాళ్లతో క్రిందికి లాగుతున్న వ్యక్తులు

నగరం నుండి విగ్రహాలను తొలగిస్తున్న యోషీయా జనులు; విలియం హోల్ చేత వివరణ

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: యేసు క్రీస్తును అనుసరించమని లేఖనాలు నాకు బోధిస్తాయి