2024 రండి, నన్ను అనుసరించండి
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: నిబంధన


“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: నిబంధన,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“నిబంధన,” రండి, నన్ను అనుసరించండి: 2026

ఆలోచనల చిహ్నము

జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు

నిబంధన

పాత నిబంధన అంతటా మీరు నిబంధన అనే పదాన్ని తరచు చదువుతారు. నేడు మనం నిబంధనలను దేవునితో చేసే పవిత్ర వాగ్దానాలుగా అనుకుంటాము, కానీ ప్రాచీన ప్రపంచంలో జనులు ఒకరితో ఒకరు జరిపే సంభాషణలలో కూడా నిబంధనలు ముఖ్యమైన భాగముగా ఉండేవి. వారి భద్రత మరియు బ్రతుకుదెరువు కోసం జనులు ఒకరినొకరు నమ్మవలసియుండెను మరియు ఆ నమ్మకాన్ని పదిలపరచు విధానమే నిబంధనలు.

కాబట్టి దేవుడు నిబంధనల గురించి హనోకు, నోవహు, మోషే మరియు ఇతరులతో మాట్లాడినప్పుడు, ఆయనతో ఒక నమ్మకమైన బంధంలో ప్రవేశించడానికి ఆయన వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ నిబంధనను మనం నూతన మరియు శాశ్వతమైన నిబంధన లేదా అబ్రాహాము నిబంధన అని పిలుస్తాము—ఇది దేవుడు అబ్రాహాము మరియు శారాతో చేసినది, తరువాత వారి వంశస్థులైన ఇస్సాకు మరియు యాకోబు (ఇశ్రాయేలు అని కూడా పిలువబడును)లతో నవీకరించినది. పాత నిబంధనలో ఇది కేవలం “నిబంధన”గా చెప్పబడినది. ప్రధానంగా తమనుతాము ఈ నిబంధన యొక్క వారసులుగా—నిబంధన జనులుగా ఎంచుకొనే జనుల వృత్తాంతముగా పాత నిబంధనను మీరు చూస్తారు.

ప్రత్యేకించి కడవరి-దిన పరిశుద్ధులకు అబ్రాహాము నిబంధన నేటికీ ముఖ్యమైనదిగా కొనసాగుతోంది. ఎందుకు? ఎందుకనగా మనం అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల యొక్క ప్రత్యక్ష వంశస్థులం అయినా, కాకపోయినా మనం కూడా నిబంధన జనులము. ఈ కారణం చేత, అబ్రాహాము నిబంధన ఏమిటో మరియు అది నేడు మనకు ఎలా అన్వయిస్తుందో గ్రహించడం ముఖ్యము.

అబ్రాహాము నిబంధన అనగానేమి?

“నీతికి గొప్ప అనుచరునిగా“ (అబ్రాహాము 1:2) ఉండాలని అబ్రాహాము కోరుకున్నాడు, కాబట్టి దేవుడు అతడిని నిబంధన సంబంధంలోకి ఆహ్వానించారు. ఈ కోరికను కలిగియున్న వారిలో అబ్రాహాము మొదటివాడు కాదు మరియు నిబంధనను పొందిన వారిలో అతడు మొదటివాడు కాదు. ఏదేమైనా, ఇది ఒక శాశ్వతమైన నిబంధన. అబ్రాహాము “పితరుల దీవెనల కొరకు” (అబ్రాహాము 1:2)—ఆదాము హవ్వలకు మరియు తరువాత ఈ దీవెనలను శ్రద్ధగా కోరిన వారికి నిబంధన ద్వారా అందించబడిన దీవెనల కొరకు అపేక్షించాడు.

అబ్రాహాముతో దేవుని నిబంధన అద్భుతమైన దీవెనలను వాగ్దానం చేసింది: ఒక స్వాస్థ్యము, అధిక సంతానము, యాజకత్వ విధులకు ప్రవేశము మరియు రాబోయే తరతరాలు గౌరవించే ఒక పేరు. కానీ ఈ నిబంధన యొక్క దృష్టి అబ్రాహాము మరియు అతని కుటుంబము పొందే దీవెనలపై మాత్రమే కాకుండా, దేవుని యొక్క మిగతా పిల్లల కొరకు వారు ఎలా దీవెన కాగలరు అనే దానిపై కూడా కేంద్రీకరించబడింది. “నీవు ఆశీర్వాదముగా నుందువు, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును” (ఆదికాండము 12:2–3) అని దేవుడు ప్రకటించారు.

ఈ నిబంధన అబ్రాహాము, శారా మరియు వారి వంశస్థులకు దేవుని పిల్లల మధ్య విశేష హోదా కల్పించిందా? కేవలము ఇతరులను దీవించుటకు ఇవ్వబడిన విశేషాధికారమని గ్రహించవలెను. “సువార్త యొక్క దీవెనలు, అవే రక్షణ యొక్క దీవెనలు అనగా నిత్యజీవము యొక్క దీవెనలను” పంచుకొనుచూ అబ్రాహాము కుటుంబము ”సమస్త జనములకు తీసుకొనివెళ్ళుటకు ఈ పరిచర్యను, యాజకత్వమును కలిగియుందురు” (అబ్రాహాము 2:9, 11). దేవుని యొక్క నిబంధన జనులుగా ఉండడమంటే వారు ఇతరుల కంటే మెరుగైనవారని అర్థం కాదు; ఇతరులు మెరుగ్గా ఉండేందుకు సహాయం చేయడం వారి బాధ్యత అని అర్థం.

ఈ నిబంధనయే అబ్రాహాము ఎంతగానో ఎదురుచూస్తున్న దీవెన. దీనిని పొందిన తర్వాత, అబ్రాహాము తన మనస్సులో ఇలా అనుకున్నాడు, “నీ సేవకుడు నిన్ను శ్రద్ధతో వెదికెను; ఇప్పుడు నిన్ను నేను కనుగొంటిని” (అబ్రాహాము 2:12).

అది వేల సంవత్సరాల క్రితం జరిగింది, కానీ ఈ నిబంధన మన కాలంలో పునఃస్థాపించబడింది. ఇది ప్రస్తుతం దేవుని జనుల జీవితాల్లో నెరవేర్చబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలను దీవిస్తూ దేవుని కార్యము పురోగమిస్తుండగా కడవరి దినాలలో నిబంధన యొక్క నెరవేర్పు ఊపందుకున్నది. అబ్రాహాము వలె నీతికి గొప్ప అనుచరునిగా ఉండగోరిన వారు, శ్రద్ధగా ప్రభువును వెదికిన వారెవరైనా దానిలో భాగం కాగలరు.

దేవాలయం యెదుట కుటుంబము

అబ్రాహాము నిబంధన పట్ల నా అభిప్రాయమేమిటి?

మీరు నిబంధన బిడ్డ. మీరు బాప్తిస్మము పొందినప్పుడు మరియు మీరు సంస్కారములో పాలుపొందినప్పుడు, మీరు దేవునితో ఒక నిబంధన చేస్తారు. మరియు దేవాలయం యొక్క పవిత్ర విధులతో మీరు నిబంధన యొక్క సంపూర్ణత్వాన్ని పొందుతారు.

ఈ నిబంధనలు మరియు విధుల ద్వారా మనము దేవుని జనులమవుతాము. మనము “శాశ్వతమైన బంధాలతో” ఆయనకు కట్టుబడి ఉంటాము. ఒక్కసారి మనం దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత,” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “మనము తటస్థంగా ఉన్న నేలను శాశ్వతంగా వదిలివేస్తాము. ఆయనతో అలాంటి బంధాన్ని ఏర్పరచుకున్న వారితో దేవుడు తన సంబంధాన్ని విడిచిపెట్టరు. నిజానికి, దేవునితో నిబంధన చేసుకున్న వారందరికీ ప్రత్యేకమైన ప్రేమ మరియు కరుణ లభిస్తాయి. … దేవునితో మన నిబంధన కారణంగా, మనకు సహాయం చేయడానికి ఆయన చేసే ప్రయత్నాలలో ఆయన ఎప్పటికీ అలసిపోరు మరియు మనపై కరుణతో కూడిన ఆయన సహనాన్ని మనం ఎప్పటికీ కోల్పోము.” పాత నిబంధనలో దేవుని యొక్క నిబంధన జనుల చరిత్రలో మీరు దీనిని చూస్తారు మరియు ఆయన నిబంధన సంతానంలో ఒకరిగా మీ స్వంత జీవితంలో మీరు దీనిని చూస్తారు.

చేతులు చాపి నీటిపై నిలబడిన యేసు

Be Not Afraid [భయపడవద్దు], డాన్ విల్సన్ చేత

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా అబ్రాహాము నిబంధన పునఃస్థాపించబడినందువలన ఇది మనకివ్వబడిన అమూల్యమైన గ్రహింపు. కాబట్టి నిబంధనల గురించి మీరు పాత నిబంధనలో చదివినప్పుడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుని సంబంధము గురించి మాత్రమే ఆలోచించకండి. మీతో ఆయన సంబంధము గురించి కూడా ఆలోచించండి. సంతానము లెక్కకు ఇసుక రేణువులగును అనే వాగ్దానం గురించి మీరు చదివినప్పుడు, నేడు అబ్రాహామును తండ్రిగా పిలిచే లక్షలమంది గురించి మాత్రమే ఆలోచించకండి. నిత్య కుటుంబాలు మరియు నిత్యవృద్ధి గురించి దేవుడు మీకిచ్చిన వాగ్దానమును గూర్చి కూడా ఆలోచించండి. ఒక స్వాస్థ్యమును గురించిన వాగ్దానము గూర్చి మీరు చదివినప్పుడు, అబ్రాహాముకు వాగ్దానమివ్వబడిన స్థలము గురించి మాత్రమే ఆలోచించకండి. భూమి యొక్క సిలెస్టియల్ భవితవ్యం—“యెహోవా కొరకు కనిపెట్టుకొనియున్న సాత్వికుల”కు వాగ్దానం చేయబడిన వారసత్వం గురించి కూడా ఆలోచించండి (మత్తయి 5:5; కీర్తన 37:9, 11). దేవుని నిబంధన జనులు “భూమి యొక్క సమస్త వంశములను” (అబ్రాహాము 2:11) దీవిస్తారనే వాగ్దానం గురించి మీరు చదివినప్పుడు, అబ్రాహాము లేదా అతని నుండి వచ్చిన ప్రవక్తల పరిచర్య గురించి మాత్రమే ఆలోచించకండి. మీ చుట్టూ ఉన్న కుటుంబాలకు దీవెనకరంగా ఉండడానికి—యేసు క్రీస్తు యొక్క నిబంధన అనుచరుడిగా—మీరు చేయగల దాని గురించి కూడా ఆలోచించండి.