“ఫిబ్రవరి 2–8. ‘ప్రభువు తన జనులను సీయోను అని పిలిచెను’: మోషే 7,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“ఫిబ్రవరి 2–8. ‘ప్రభువు తన జనులను సీయోను అని పిలిచెను’,” రండి, నన్ను అనుసరించండి: 2026
Enoch Sees the Meridian of Time [హనోకు మధ్యస్థ కాలమును చూచును], జెన్నిఫర్ పేజెట్ చేత
ఫిబ్రవరి 2–8: “ప్రభువు తన జనులను సీయోను అని పిలిచెను”
మోషే 7
చరిత్ర అంతటా, హనోకు మరియు అతని జనులు సాధించిన దానిని సాధించాలని జనులు ప్రయత్నించారు: పేదరికము లేదా హింస లేని ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడం. దేవుని జనులుగా మనము ఈ కోరికను పంచుకుంటాము. దానిని మనం సీయోనును నిర్మించడం అని పిలుస్తాము, అందులో పేదవారి పట్ల శ్రద్ధ చూపడం మరియు శాంతిని పెంచడానికి అదనంగా, నిబంధనలు చేయడం, నీతియందు కలిసి నివసించడం, ఒకరితో ఒకరు మరియు “సీయోనుకు రాజు” (మోషే 7:53) అయిన యేసు క్రీస్తుతో ఏకమవ్వడం వంటివి ఉన్నాయి. ప్రపంచం, మీ సంఘం లేదా మీ కుటుంబం మీరు కోరుకున్నట్లుగా లేనట్లయితే, హనోకు మరియు అతని జనులు దానిని ఎలా చేసారు? అని అడగడం సహాయకరంగా ఉంటుంది. వారి చుట్టూ వివాదమున్నప్పటికీ వారు ఏవిధంగా “ఏక హృదయము, ఏక మనస్సు” (మోషే 7:18) గలవారైరి? సీయోను గురించి మోషే 7 మనకిచ్చే అనేక వివరాలలో, కడవరి-దిన పరిశుద్ధుల కొరకు ఇది ప్రత్యేకంగా విలువైనది కావచ్చు: సీయోను అనునది ఒక పట్టణము మాత్రమే కాదు—అది హృదయము మరియు ఆత్మ యొక్క స్థితి. ప్రభువు బోధించినట్లుగా, సీయోను అనగా “హృదయశుద్ధి గలవారు”(సిద్ధాంతము మరియు నిబంధనలు 97:21). కాబట్టి సీయోనును నిర్మించుటకు సరైన మార్గము దానిని మన హృదయాలలో, ఇళ్ళలో ప్రారంభించడం కావచ్చు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
నేను సీయోనును నిర్మించడంలో సహాయం చేయగలను.
ప్రవక్త జోసెఫ్ స్మిత్ మొదట హనోకు మరియు అతని పరిశుద్ధ పట్టణము గురించి తెలుసుకున్నప్పుడు, అతను ప్రేరణ పొందాడు. “భూమిపై ప్రభువు మళ్లీ సీయోనును స్థాపించే రోజు వచ్చిందని అతనికి తెలుసు” (Saints, 1:108–9) మరియు అతను సీయోనును నిర్మించడానికి జీవితకాల అన్వేషణను ప్రారంభించాడు. మోషే 7 చదవడం ఈరోజు కూడా ఆ ప్రయత్నాన్ని కొనసాగించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు.
“సీయోను అంటే ఏమిటి?” మరియు “ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది?” అనే ప్రశ్నలను అన్వేషించడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు. మీరు మోషే 7, ప్రత్యేకించి 16–21, 27, 53, 62–69 వచనాలు అధ్యయనం చేస్తున్నప్పుడు, మీకు వచ్చే సమాధానాలను జాబితా చేయడాన్ని పరిగణించండి.
ఈ ప్రశ్నలకు మీ సమాధానాలు సీయోనును నిర్మించడానికి మనము ఇంకా చాలా పని చేయాల్సి ఉందని స్పష్టం చేయవచ్చు. కాబట్టి దీనిని మనం ఎలా చేస్తాము? ఎవరితోనైనా “ఏక హృదయం మరియు ఏక మనస్సు” (మోషే 7:18) కలిగియున్నారని మీరు భావించిన సమయాల గురించి ఆలోచించడం సహాయపడవచ్చు. బహుశా అది ఒక వార్డు, కుటుంబం లేదా పని లేదా పాఠశాలలో సమూహంలో అయ్యుండవచ్చు. నీతియుక్తమైన ఐక్యతను సృష్టించడానికి జనులు ఏమి చేసారు?
ఆలోచనలు మరియు ప్రేరణను కనుగొనడానికి మీరు అన్వేషించగల కొన్ని ఇతర వనరులు ఇక్కడ ఉన్నాయి. అధ్యయనం చేయడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎంచుకోండి, ఆపై సీయోనును నిర్మించడానికి మీరు ఏమి చేయాలని ప్రేరణ పొందారో వ్రాయండి:
-
ఫిలిప్పీయులకు 2:1–4; 4 నీఫై 1:15–18; సిద్ధాంతము మరియు నిబంధనలు 97:21; 105:5.
-
యులిసెస్ సోవారెస్, “క్రీస్తు నందు సహోదర సహోదరీలు,” లియహోనా, నవ. 2023, 70–73.
-
డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “క్రీస్తు నందు ఏకమైయున్నారు,” లియహోనా, మే 2023, 77–80.
ఆయన జనులు ”ఏక హృదయము, ఏక మనస్సు” (మోషే 7:18) గలవారైయుండాలని దేవుడు కోరుతున్నారు.
యేసు క్రీస్తు “సీయోనుకు రాజు.”
యేసు క్రీస్తును మీ రాజుగా కలిగియుండడమనగా మీకు గల అర్థమేమిటి? ఈ వచనములో యేసు క్రీస్తు యొక్క ఇతర నామాలను గమనించండి. ఆయన గురించి అవి మీకేమి బోధిస్తాయి? “ద్వారము నొద్దకు వచ్చి, [ఆయన] యొద్దకు [ఎక్కి] వచ్చువాడు” అంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు?
దేవుడు తన పిల్లల కొరకు దుఃఖించును మరియు ఆనందించును.
కొద్దిమంది మనకు ఏమి జరిగినా మానసికంగా ప్రభావితం చేయబడని భిన్నమైన వ్యక్తిగా దేవుడిని చూస్తారు. మోషే 7లో నమోదు చేయబడిన దర్శనంలో హనోకు దేవుని గురించి భిన్నమైన దృక్కోణాన్ని పొందాడు. 28–40 వచనాలలో అతను దేవుని గురించి ఏమి నేర్చుకున్నాడు మరియు మీరు ఏమి నేర్చుకుంటారు? దేవుడు రోదించడం చూసి హనోకు ఎందుకు ఆశ్చర్యపోయాడని మీరు అనుకుంటున్నారు? ఆయన రోదిస్తారని తెలుసుకోవడం మీకెందుకు ముఖ్యమైనది?
దర్శనం కొనసాగుతుండగా, హనోకు కూడా రోదించాడు. కానీ సంతోషించడానికి గల కారణాలను కూడా దేవుడు అతనితో పంచుకున్నారు. మోషే 7:41–69లో వాటి కొరకు వెదకండి. మీ జీవితంలో “చేదు” (44వ వచనము) ఉన్నప్పటికీ “మీ హృదయమునెత్తికొని సంతోషించి చూడడానికి” మీకు సహాయపడే హనోకు దర్శనం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
అంత్యదినాలలో యేసు క్రీస్తు మరలా వస్తారు.
హనోకు దర్శనం, ముఖ్యంగా మోషే 7:59 67లో నమోదు చేయబడినది, రక్షకుని రెండవ రాకడ గురించి చరిత్రలో ఉన్న మొదటి ప్రవచనాలలో ఒకటి. ఈ వచనాలు అంత్యదినాలను వివరించే విధానంలో మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది? ఉదాహరణకు, 62వ వచనములోని ప్రవచనాలు నెరవేరుతున్నందుకు మీరు ఎలా భావిస్తున్నారో పరిగణించండి. కడవరి దినములలో దేవుని కార్యము గురించి ఈ వాక్యభాగములు మీకేమి బోధిస్తాయి?
హెన్రీ బి. ఐరింగ్, “సీయోనులోని సహోదరీలు,” లియహోనా, నవ. 2020, 67-69 కూడా చూడండి.
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
మనము “ఏక హృదయము, ఏక మనస్సు” గలవారము కావాలని దేవుడు కోరుతున్నారు.
-
హనోకు మరియు సీయోను గురించి తెలుసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయడానికి, మీరు పాత నిబంధన కథలలో (19–21) “ప్రవక్త హనోకు”ని ఉపయోగించవచ్చు. తర్వాత వారి స్వంత మాటలలో కథను తిరిగి చెప్పడంలో మీకు సహాయం చేయమని మీరు మీ పిల్లలను అడగవచ్చు. ఈ నమూనాలోని హనోకు చిత్రాలు సహాయపడవచ్చు.
-
“ఏక హృదయము మరియు ఏక మనస్సు” (మోషే 7:18) అంటే ఏమిటో అర్థం చేసుకోవడంలో మీ పిల్లలకు సహాయపడడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది: ఒక కాగితపు హృదయాన్ని తయారు చేసి, దానిని ముక్కలుగా కత్తిరించండి, ప్రతి బిడ్డకు ఒకటి ఉంటే సరిపోతుంది. తమ ముక్కపై వారి పేరును వ్రాయనివ్వండి మరియు హృదయాన్ని ఒకచోట చేర్చడానికి కలిసి పని చేయండి. వారు అలా చేస్తున్నప్పుడు, ప్రతీ బిడ్డలో మీరు ఇష్టపడే విషయాల గురించి మాట్లాడవచ్చు.
-
మోషే 7:18–21, 62–63, 68–69లో “సీయోను” అనే పదం ఎన్నిసార్లు కనిపిస్తుందో లెక్కించడంలో మీ పిల్లలకు సహాయం చేయండి. వారు ఆ పదాన్ని కనుగొన్న ప్రతిసారీ, సీయోను గురించి ఆ వచనం ఏమి చెబుతుందో కనుగొనడంలో వారికి సహాయపడండి (లేఖన దీపిక, “సీయాను,” సువార్త గ్రంథాలయము కూడా చూడండి). ఈ వచనములలో వర్ణించిన జనుల వలే ఎక్కువగా మనము ఎలా ఉండగలము?
వ్యక్తిగత లేఖన అధ్యయనమును ప్రోత్సహించండి. మీరు ఇంట్లో మీ కుటుంబానికి లేదా ఆదివారం తరగతిలో బోధిస్తున్నా, యేసు క్రీస్తుపై శాశ్వతమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఇతరులకు సహాయపడే ఉత్తమ మార్గాలలో ఒకటి, లేఖనాలతో వ్యక్తిగత అనుభవాలను వెదకడం అలవాటు చేసుకోవడంలో వారికి సహాయపడడం. లేఖనాలతో మీరు కలిగియున్న అనుభవాలను పంచుకోండి మరియు వారి అనుభవాలను పంచుకొనేలా కుటుంబం లేదా తరగతి సభ్యులను ప్రోత్సహించండి. లేఖనాలను చదవడం ఇతరులను ఎలా ఆశీర్వదిస్తున్నదో మనం విన్నప్పుడు, ప్రభువు నుండి అవే ఆశీర్వాదాలు పొందాలని కోరుకోవడానికి మనం తరచుగా ప్రేరేపించబడతాము. (రక్షకుని విధానములో బోధించుట, 25 చూడండి.)
ఆయనను అనుసరించడానికి నేను ఎన్నుకోవాలని పరలోక తండ్రి కోరుకుంటున్నారు.
-
మీ పిల్లలకు మోషే 7:32–33ని పరిచయం చేయడానికి, వారు ఇటీవల చేయవలసివచ్చిన ఒక ఎంపిక గురించి మీరు వారితో మాట్లాడవచ్చు. అప్పుడు మనం ఏమి ఎంచుకోవాలని పరలోక తండ్రి కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి మీరు వచనాలను కలిసి చదవవచ్చు. మనం ఆయనను ఎంచుకున్నామని చూపించడానికి మనం ఏ ఎంపికలు చేయవచ్చు? బహుశా మీ పిల్లలు ఈ ఎంపికలలో ఒకదానిని నటించి చూపవచ్చు మరియు ఇతరులు అది దేనిని సూచిస్తుందో ఊహించవచ్చు.
యేసు భూమికి తిరిగి వస్తారు.
-
మోషే 7:59లో హనోకు ప్రభువును ఒక ప్రశ్న అడిగాడు. దాన్ని కనుగొనడానికి మీ పిల్లలను ఆహ్వానించండి, ఆపై 60వ–వచనములో సమాధానాన్ని కనుగొనమని వారిని అడగండి. ఎవరైనా ఇంటికి తిరిగి వస్తారని వారు ఎదురుచూస్తున్న సమయం గురించి కూడా మీరు వారితో మాట్లాడవచ్చు. వారు ఎలా భావించారు మరియు సిద్ధంగా ఉండటానికి వారు ఏమి చేసారో వారిని అడగండి. యేసు తిరిగి రావడానికి మనం ఎలా సిద్ధపడవచ్చు?
-
రక్షకుడు జనులకు కనిపించిన సమయాల చిత్రాలను చూపించడాన్ని పరిగణించండి (Gospel Art Book [సువార్త కళా పుస్తకము], సంఖ్యలు. 60, 82, 83 మరియు 84 వంటివి). చిత్రాలలో ఉన్న వ్యక్తులు ఏమి చేస్తున్నారు? యేసును కలుసుకున్నప్పుడు జనులు ఎలా భావించి ఉండవచ్చు? యేసు మళ్లీ వచ్చినప్పుడు ఆయనను చూడడం గురించి పిల్లలు ఎలా భావిస్తున్నారో వారిని పంచుకోనివ్వండి.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.