“పునఃస్థాపన స్వరములు: జోసెఫ్ స్మిత్ కుటుంబము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“జోసెఫ్ స్మిత్ కుటుంబము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
పునఃస్థాపన స్వరములు
జోసెఫ్ స్మిత్ కుటుంబము
మనలో ప్రతి ఒక్కరూ మన కుటుంబ జీవితము వలన తీవ్రంగా ప్రభావితం చేయబడ్డాము మరియు జోసెఫ్ స్మిత్ దానికి భిన్నంగా లేడు. అతని తల్లిదండ్రుల మత విశ్వాసాలు మరియు అభ్యాసాలు పునఃస్థాపనను సాధ్యం చేసే విశ్వాసపు విత్తనాలను నాటాయి. జోసెఫ్ దినచర్య ఈ నివాళిని నమోదు చేస్తుంది: “నాకు చాలా గౌరవప్రదమైన తల్లిదండ్రులను ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పదాలు మరియు భాష సరిపోవు.”
ఈ క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యానాలు అతని తల్లియైన లూసీ మాక్ స్మిత్ ; అతని సోదరుడు విలియం స్మిత్; మరియు ప్రవక్త స్వయంగా ఉదహరించినవి, అవి స్మిత్ కుటుంబములో గల మతపరమైన ప్రభావానికి క్షణ దర్శనాన్ని మనకిస్తాయి.
జోసెఫ్ స్మిత్ కుటుంబము, డాన్ బాక్స్టర్ చేత
లూసీ మాక్ స్మిత్
“[సుమారు 1802 లో], నేను అనారోగ్యానికి గురయ్యాను. … నాలో నేను ఇలా అనుకున్నాను, క్రీస్తు మార్గాలు నాకు తెలియదు కాబట్టి నేను చనిపోవడానికి సిద్ధంగా లేను, నాకు క్రీస్తుకు మధ్య అంధకారమయమైన అగాధము ఉన్నట్లు అనిపించింది, దానిని దాటడానికి ప్రయత్నించే ధైర్యం నాకు లేదు. …
“నేను ప్రభువు వైపు చూసాను, నా పిల్లలను పెంచడానికి మరియు నా భర్త హృదయాన్ని ఓదార్చడానికి నన్ను బ్రతికించమని ప్రభువును అర్థించాను మరియు వేడుకున్నాను; ఆవిధంగా నేను రాత్రంతా మేల్కొని ఉన్నాను. … ఆయన నన్ను బ్రతకనిస్తే, ఆయనకు సరైన సేవ చేయడానికి వీలు కల్పించే ఆ మతము అది బైబిల్లో ఉన్నా లేదా ఎక్కడ దొరికినా సరే అది ప్రార్థన, విశ్వాసం ద్వారా పరలోకమునుండి పొందవలసి ఉన్నా సరే దానిని పొందుటకు నేను ప్రయత్నిస్తానని నేను దేవునితో నిబంధన చేసాను. చివరికి ఒక స్వరం నాతో ఇట్లనెను, ‘వెదకుము నీకు దొరుకును, తట్టుము అది నీకు తెరవబడును. నీ హృదయమును ఓదార్పు పొందనిమ్ము. నీవు దేవునియందు విశ్వాసము కలిగియున్నావు; నాయందు కూడా విశ్వాసము కలిగియుండుము.’ …
“ఈ సమయం నుండి నేను నిరంతరం బలము పొందాను. మతం అనే విషయంపై నా మనస్సు పూర్తిగా ఆక్రమించబడినప్పటికీ దాని గురించి నేను కొద్దిగా చెప్పాను, మరియు పరలోక విషయాలు నాకు బోధించడానికి దేవుని మార్గాలు తెలిసిన ఒక భక్తుడిని నేను వెదకగలిగిన వెంటనే నేను పూర్తి శ్రద్ధ వహిస్తానని అనుకున్నాను.”
విలియం స్మిత్
“మా అమ్మ చాలా భక్తిగల స్త్రీ మరియు ఆమె తన పిల్లల సంక్షేమం పట్ల చాలా ఆసక్తి కలిగి ఉండేది, మా ఆత్మల రక్షణ కొరకు మేము నిమగ్నమవ్వడానికి, లేదా (ఆనాడు ఉపయోగించే పదం వలె) ‘మతాన్ని పొందడానికి’ ఇప్పుడు మరియు ఇకమీదట తల్లి ప్రేమ సూచించే ప్రతి మార్గాన్ని ఆమె ఉపయోగించుకుంది. కూడికలకు హాజరుకావాలని ఆమె మమ్ములను ప్రోత్సహించింది, మరియు దాదాపు మా కుటుంబం మొత్తం మతముపై, సత్యాన్వేషణపై ఆసక్తి చూపింది.”
“నాకు ఊహ తెలిసినప్పటి నుండి మాకు ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థనలు జరిగేవి. నాన్న తన కళ్ళజోడును ఎప్పుడూ తన చొక్కా జేబులో పెట్టుకునేవారని నాకు బాగా జ్ఞాపకముంది, … మరియు అబ్బాయిలమైన మేము ఆయన తన కళ్ళజోడు బయటకు తీయడం చూసినప్పుడు, అది ప్రార్థనకు సిద్ధం కావడానికి ఒక సంకేతమని మాకు తెలుసు మరియు మేము గమనించకపోతే అమ్మ ఇలా చెబుతుంది, ‘విలియం,’ లేదా నిర్లక్ష్యంగా ఉన్న ఎవరైనా, ‘ప్రార్థనకు సిద్ధంగా ఉండండి.’ ప్రార్థన తరువాత మేము ఒక పాట పాడేవారము.”
లేఖనాలు అధ్యయనం చేయమని జోసెఫ్ సీనియర్ మరియు లూసీ స్మిత్‌లు తమ కుటుంబానికి నేర్పించారు.
జోసెఫ్ స్మిత్
“నాకు తెలిసినంతవరకు [నా తండ్రి] తన జీవితంలో నీచమైనది అని చెప్పబడు ఎటువంటి అల్పమైన చర్య ఎప్పుడూ చేయలేదని నేను ఇప్పుడు చెప్తున్నాను. నా తండ్రి మరియు ఆయన జ్ఞాపకశక్తి అంటే నాకు చాలా ఇష్టం; ఆయన చేసిన గొప్ప పనుల జ్ఞాపకం, నా మనస్సుపై గొప్ప ప్రభావము చూపింది; తండ్రిగా ఆయన దయగల మాటలలో అనేకము నా హృదయ ఫలకంపై వ్రాయబడ్డాయి. ఆయన జీవిత చరిత్రను ఎంతో ఆదరించే ఆలోచనలు నా మనస్సును చుట్టుముట్టాయి మరియు నేను పుట్టినప్పటి నుండి నా పరిశీలన ద్వారా అవి అక్కడ నాటబడ్డాయి, ఆ ఆలోచనలు నాకు పవిత్రమైనవి. … నా తల్లి కూడా గొప్పవారిలో ఒకరు, మరియు స్త్రీలందరిలో ఉత్తమురాలు.”