“అక్టోబరు 12–18. ‘సీయోను నొద్దకును విమోచకుడు వచ్చును’: యెషయా 58–66,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“అక్టోబరు 12–18. ‘సీయోను నొద్దకును విమోచకుడు వచ్చును,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
Jesus in the Synagogue at Nazareth [నజరేతు వద్ద సమాజమందిరంలో యేసు], గ్రెగ్ ఓల్సెన్ చేత
అక్టోబరు 12–18: “సీయోను నొద్దకును విమోచకుడు వచ్చును”
యెషయా 58–66
ఆయన పరిచర్య ప్రారంభంలో, యేసు క్రీస్తు తాను పెరిగిన నజరేతులో ఒక సమాజమందిరాన్ని సందర్శించారు. అక్కడ ఆయన లేఖనాలనుండి చదువుటకై నిలబడి, యెషయా గ్రంథాన్ని తెరిచారు మరియు యెషయా 61:1–2గా ఇప్పుడు మనకు తెలిసిన దానిని చదవారు. తరువాత ఆయనిలా ప్రకటించారు, “నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది.” ఇది ఆయన అభిషేకించబడ్డాడని రక్షకుని అత్యంత సూటియైన ప్రకటనలలో ఒకటి, ఆయనే “నలిగిన వారిని విడిపించును” మరియు “చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించును” (లూకా 4:16–21 చూడండి). ఈ లేఖనము ఆ రోజున వాస్తవంగా నెరవేర్చబడింది. మరియు యెషయా యొక్క మిగిలిన అనేక ప్రవచనాల వలె, అది మన కాలంలో నెరవేర్చబడుట కొనసాగుతున్నది. రక్షకుడు తన వద్దకు వచ్చిన విరిగిన హృదయము గల వారందరిని స్వస్థపరచుటను కొనసాగిస్తున్నారు. ఇంకా విడుదల అవసరమైన అనేకమంది బందీలున్నారు. ప్రభువు “క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుటకు” (యెషయా 65:17) మరియు “సమస్త జనముల యెదుట నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయు” (యెషయా 61:11) సమయము కొరకు—సిద్ధపడుటకు మహిమకరమైన భవిష్యత్తు అక్కడ ఉన్నది. యెషయాను చదవడం, ప్రభువు అంతకుముందు చేసిన దానిని, ఆయన చేస్తున్న దానిని మరియు తన జనుల కొరకు ఇంకా ఆయన చేయబోయే దానిని గమనించునట్లు చేస్తుంది.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
యెషయా 58:3–12
ఉపవాసం ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది మరియు అవసరంలో నున్న వ్యక్తులను ఆశీర్వదిస్తుంది.
ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా స్వచ్ఛందంగా ఆహారం తినకుండా ఎందుకు ఉంటారు? మీరు యెషయా 58:3–12 అధ్యయనం చేస్తున్నప్పుడు, మీరు ఉపవాసం ఉండడానికి గల కారణాల గురించి—అలాగే ఈ నియమాన్ని ఇవ్వడానికి ప్రభువుకు గల కారణాల గురించి మీరు ఆలోచించవచ్చు. ధ్యానించడానికి ఇక్కడ మరికొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి:
-
ఉపవాసం కొన్నిసార్లు ఆశీర్వాదం కంటే భారంగా ఎందుకు భావించబడుతుంది? (యెషయా 58:3–5 చూడండి). ఈ అధ్యాయంలో ప్రభువు యొక్క బోధనలు మీ కొరకు ఆ అవగాహనను ఎలా మారుస్తాయి?
-
“దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట” మరియు “ప్రతి కాడిని విరుగగొట్టుట” అనగా అర్థమేమైయుండవచ్చు? (యెషయా 58:6). ఉపవాసము ఇతరులను ఎలా దీవిస్తుంది? (7వ వచనము చూడండి).
-
ఉపవాసము యెషయా 58:8–12లో వివరించబడిన దీవెనలను మీకు ఎలా తెచ్చింది?
మీరు బోధించే వ్యక్తులను తెలుసుకోండి. “క్రీస్తును పోలిన బోధకునిగా ఉండుటలో మీరు బోధించే వ్యక్తులను తెలుసుకొనుట మరియు వారి హృదయాలలో ఏముందో అర్థం చేసుకొనుటకు కృషి చేయుట ఇమిడివుంది. వారు ఉత్తమంగా ఎలా నేర్చుకుంటారో మీరు తెలుసుకోవచ్చు. మీరు ప్రశ్నలు అడగవచ్చు, శ్రద్ధగా వినవచ్చు మరియు గమనించవచ్చు. అన్నింటిని మించి, ఆత్మ మాత్రమే ఇవ్వగల అవగాహన కొరకు మీరు ప్రార్థించవచ్చు. మీరు ఒక వ్యక్తిని ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, అంత ఎక్కువగా అతనికి లేదా ఆమెకు యేసు క్రీస్తు సువార్తలో వ్యక్తిగత అర్థాన్ని మరియు శక్తిని కనుగొనడంలో మీరు సహాయం చేయగలరు. మీరు ఒక వ్యక్తి యొక్క దాహాన్ని అర్థం చేసుకున్నప్పుడు, రక్షకుని జీవజలంతో దానిని ఎలా తీర్చాలో పరిశుద్ధాత్మ మీకు నేర్పగలరు” (రక్షకుని విధానములో బోధించుట, 13).
యెషయా 58:13–14
విశ్రాంతిదినమున ప్రభువును గౌరవించడం సంతోషాన్నిస్తుంది.
విశ్రాంతిదినము మీకు “మనోహరమైనదా”? మీరు యెషయా 58:13–14ను అధ్యయనం చేసినప్పుడు, ప్రభువు యొక్క దినమున మీరు మరింత ఆనందాన్ని ఎలా పొందవచ్చో ఆలోచించండి. ఉదాహరణకు, “[ఆయన] పరిశుద్ధ దినమున నీకిష్టమైన పనులు చేయకుండుట” అనగా అర్థమేమైయుండవచ్చు? “నీవు యెహోవాయందు [ఆనందించుట]” మరియు “నీకిష్టమైన పనులు చేయుట” మధ్య తేడా ఏమిటి?
యెషయా 59:9–21; 61:1–3; 63:7–9
యేసు క్రీస్తు నా రక్షకుడు మరియు విమోచకుడు.
యెషయా 58–66లో యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త నియమిత కార్యమునకు బహుళ సూచికలను మీరు కనుగొంటారు. మీరు చదివేటప్పుడు వాటి కొరకు చూడండి. ప్రత్యేకించి, రక్షకుడిని వర్ణించడానికి ఉపయోగించబడిన బిరుదులు మరియు పదాలను గమనించండి. ఉదాహరణకు:
-
యెషయా 59:16–21లో “మధ్యవర్తి” యొక్క వివరణలో ఏది మిమ్మల్ని ఆకట్టుకున్నది? 9–15 వచనములలో వివరించబడిన పరిస్థితులను రక్షకుడు ఎలా అధిగమిస్తారు?
-
యేసు క్రీస్తు తాను మెస్సీయనని నజరేతు జనులకు ప్రకటించినప్పుడు, ఆయన యెషయా 61:1–3 నుండి వ్యాఖ్యానించారు (లూకా 4:16–21 చూడండి). ఈ వచనాలలో వివరించబడిన విధానాలలో యేసు క్రీస్తు మిమ్మల్ని మరియు ఇతరులను ఎలా దీవించారు? బూడిదెకు ప్రతిగా పూదండను ఆయన ఎలా ఇచ్చారు?
3:24Jesus Declares He Is the Messiah
-
ఎటువంటి “యెహోవా కృపాతిశయమును” మీరు “చెప్పగలరు”? (యెషయా 63:7–9 చూడండి).
-
యెషయా 58–66లో రక్షకునికి ఏ ఇతర సూచికలను మీరు కనుగొంటారు?
మోషైయ 3:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 133:46–53 కూడా చూడండి.
A Gift of Light [వెలుగు యొక్క బహుమానము], ఈవా టిమోతి చేత
యెషయా 60; 62
“యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును.”
కడవరి దినాలలో యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రపంచాన్ని ఎలా దీవిస్తుందో బోధించడానికి, యెషయా 60 మరియు 62 వెలుగు మరియు చీకటి, కళ్ళు మరియు చూడడం గురించి మాట్లాడతాయి. యెషయా 60:1–5, 19–20; 62:1–2 లో ఈ భావనల కొరకు చూడండి. ఈ అధ్యాయాలను మీరు చదివినప్పుడు, దేవుడు తన పిల్లలను చీకటి నుండి ఆయన వెలుగుకు ఎలా సమకూర్చుతున్నారో ధ్యానించండి. ఈ కార్యములో మీ పాత్ర ఏమిటి?
1 నీఫై 22:3–12; 3 నీఫై 18:24; సిద్ధాంతము మరియు నిబంధనలు 14:9; బోన్ని హెచ్. కార్డన్, “వారు చూచునట్లు,” లియహోనా, మే 2020, 78–80 కూడా చూడండి.
యెషయా 64:1–5; 65:17–25; 66
వెయ్యేండ్ల పరిపాలన సమయమందు క్రీస్తు భూమిని పరిపాలిస్తారు.
“పూర్వము కలిగిన బాధలు మరువబడినప్పటి” (యెషయా 65:16) దినము గురించి యెషయా మాట్లాడాడు. ఈ ప్రవచనము అనేక నెరవేర్పులను కలిగియుండగా, దాని పరిపూర్ణమైన భావనలో—యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, ఆ రోజు ఇంకా రావలసియున్నది. యెషయా 64:1–5; 65:17–25; 66 లో ఈ భవిష్యత్తు దినమును యెషయా వివరించాడు. “ఆనందించు” మరియు “ఆనందించుట” వంటి మాటలను అతడు ఎంత తరచుగా ఉపయోగించాడో గమనించండి. రక్షకుని రాకడ మీకు ఆనందించే దినముగా ఎందుకు ఉంటుందో ధ్యానించండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి మీరు ఏమి చేయగలరు?
విశ్వాస ప్రమాణాలు 1:10 కూడా చూడండి.
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
యెషయా 58:6–11
ఉపవాసం నన్ను మరియు అవసరంలో నున్న ఇతరులను ఆశీర్వదిస్తుంది.
-
బహుశా ఉపవాసం ఉండమని మీ పిల్లల్ని ప్రోత్సహించడానికి ఉత్తమమైన మార్గం—వారు సిద్ధంగా ఉన్నప్పుడు—ఈ చట్టం కోసం ప్రభువు ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయం చేయడమే. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి యెషయా 58:6–11ని కలిసి చదవండి: మనం ఎందుకు ఉపవాసం ఉంటాము? మనం ఎలా ఉపవాసం చేస్తాము?
-
ఉపవాసంతో మీకు అర్థవంతమైన అనుభవం ఉంటే, దానిని మీ పిల్లలతో పంచుకోండి. ప్రభువు మనకు ఈ చట్టాన్ని ఎందుకు ఇచ్చారో ఒక స్నేహితుడికి ఎలా వివరిస్తారని కూడా మీరు వారిని అడగవచ్చు.
యెషయా 58:13–14
విశ్రాంతిదినము నాకు మనోహరమైనది కాగలదు.
-
యెషయా 58:13–14 చదివిన తర్వాత, మీరు క్యాలెండర్‌లో వారంలోని రోజులను సూచించవచ్చు మరియు మీతో పాటు వాటిని చెప్పమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. మీరు విశ్రాంతిదినమునకు వచ్చినప్పుడు, ఆ రోజును “మనోహరమైనది” అని పిలవమని వారిని అడగండి. విశ్రాంతిదినము మీకు ఎందుకు మనోహరమైనదో వారికి చెప్పండి.
-
విశ్రాంతిదినమున మీరు “యెహోవాయందు ఆనందించగల” మార్గాలను పరస్పరం పంచుకోండి. బహుశా మీ పిల్లలు వారి ఆలోచనలను బొమ్మ గీయవచ్చు మరియు వాటిని “విశ్రాంతిదినపు ఆనందాల పెట్టె”లో ఉంచవచ్చు. ఆ తర్వాత, విశ్రాంతిదినమున చేయవలసిన పనుల గురించి వారికి ఆలోచనలు అవసరమైనప్పుడు, వారు పెట్టె నుండి ఒక ఆలోచనను తీసుకోవచ్చు.
Our Light [మన వెలుగు], డాన్ విల్సన్ చేత
యెషయా 60:1–3
రక్షకుడు నాకు వెలుగు వంటివారు.
-
మీరు యెషయా 60:1–3ను చదివేటప్పుడు మీ పిల్లలను కళ్ళు మూసుకోమని ఆహ్వానించవచ్చు. “వెలుగు” అనే పదం విన్నప్పుడు వారి కళ్ళు తెరవమని మరియు “చీకటి” అనే పదం విన్నప్పుడు వాటిని మళ్లీ మూసివేయమని వారిని అడగండి. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పరలోక తండ్రి వద్దకు తిరిగివెళ్ళే మన మార్గాన్ని చూడడానికి మనకు సహాయపడే ఒక వెలుగు లాంటివని వివరించండి.
యెషయా 65:17–25
యేసు మళ్ళీ వచ్చినప్పుడు, ఆయన శాంతిని, ఆనందాన్ని తెస్తారు.
-
రక్షకుడు మళ్లీ వచ్చినప్పుడు భూమి ఎలా ఉంటుందో యెషయా 65:17–25 వివరిస్తుంది. మీరు మీ పిల్లలతో ఈ వచనాలను చదివేటప్పుడు, యెషయా వివరించిన “క్రొత్త భూమి”లో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వారికి సహాయం చేయండి. ఇది “ఎల్లప్పుడు హర్షించి ఆనందించవలసిన” సమయం ఎందుకవుతుంది? (18వ వచనము).
-
రక్షకుని పునరాగమనం గురించి మీరు ఎదురు చూస్తున్న వాటిని ఒకరితో ఒకరు పంచుకోండి. ఆ రోజు కొరకు సిద్ధపడేందుకు మనం ఏమి చేయగలము?
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.