2024 రండి, నన్ను అనుసరించండి
అక్టోబరు 5-11. “ఆయన మన రోగములను భరించెను మరియు మన వ్యసనములను వహించెను”: యెషయా 50–57


“అక్టోబరు 5-11. ‘ఆయన మన రోగములను భరించెను మరియు మన వ్యసనములను వహించెను’: యెషయా 50–57,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“అక్టోబరు 5–11. ‘ఆయన మన రోగములను భరించెను మరియు మన వ్యసనములను వహించెను,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

ముళ్ళ కిరీటాన్ని ధరించిన యేసు

The Mocking of Christ [క్రీస్తును ఎగతాళి చేయుట], కార్ల్ హైన్రిక్ బ్లాక్ చేత

అక్టోబరు 5-11: “ఆయన మన రోగములను భరించెను మరియు మన వ్యసనములను వహించెను”

యెషయా 50–57

అతడి పరిచర్య అంతటా, ఒక శక్తివంతుడైన విమోచకుని గురించి యెషయా మాట్లాడాడు. శతాబ్దాల తరువాత ఇశ్రాయేలీయులు బబులోనులో దాస్యములో ఉన్నప్పుడు, వారికి ఈ ప్రవచనాలు ప్రత్యేకంగా ప్రశస్థమైయుండవచ్చు. బబులోను గోడలు పడగొట్టగల వారెవరైనా నిజంగా ఒక శక్తివంతమైన విజేత. కానీ 52–53 అధ్యాయాలలో యెషయా వివరించిన మెస్సీయ ఆవిధమైన వ్యక్తి కాదు: “అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యుల వలన విసర్జింపబడినవాడును ఆయెను వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. … మొత్తబడినవానిగాను దేవుని వలన బాధింపబడినవానిగాను, శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి” (యెషయా 53:3–4).

అటువంటి ఊహించని విమోచకుడిని పంపడం ద్వారా, నిజమైన విడుదల గురించి దేవుడు మనకు బోధించారు. వ్యతిరేకత మరియు బాధ నుండి మనల్ని రక్షించడానికి, దేవుడు “తనకు తానే మొత్తబడిన, … శ్రమనొందిన” ఒకరిని పంపారు. కొందరు ఒక సింహమును ఆశించిన చోట, ఆయన ఒక గొఱ్ఱెపిల్లను పంపారు (యెషయా 53:7 చూడండి). నిశ్చయముగా, దేవుని త్రోవలు మన త్రోవల వంటివి కాదు (యెషయా 55:8–9 చూడండి). యేసు క్రీస్తు చెరసాలను తెరవడం మాత్రమే కాదు, కానీ అక్కడ మన స్థానాన్ని తీసుకోవడం ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేసారు. తానే వాటిని భరించడం ద్వారా ఆయన మన వ్యసనము మరియు విచారముల నుండి మనకు ఉపశమనాన్ని ఇస్తారు (యెషయా 53:4–5, 12 చూడండి). దూరమునుండి ఆయన మనల్ని రక్షించరు. “నిన్ను విడిచిపోని నిత్యమైన కృప” గల చర్యలయందు, ఆయన మనతోపాటు బాధననుభవిస్తారు (యెషయా 54:8, 10).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

యెషయా 50–52

ప్రభువు యొక్క జనుల కొరకు భవిష్యత్తు ప్రకాశవంతమైనది.

ఇశ్రాయేలీయులు చెరలో అనేక సంవత్సరాలు గడిపినప్పటికీ—ఆ చెర వారి బలహీనమైన ఎంపికల ఫలితంగా కలిగినప్పటికీ—నిరీక్షణతో భవిష్యత్తు వైపు చూడాలని ప్రభువు వారిని కోరుకున్నారు. మీకు నిరీక్షణను ఇచ్చునట్లు యెషయా సందేశంలో మీరు ఏమి కనుగొంటారు? అధ్యయనం చేయడంలో ఇలాంటి పట్టిక మీకు సహాయపడవచ్చు:

దేవుని గురించి నేనేమి నేర్చుకుంటాను (ఉదాహరణకు, యెషయా 50:2, 5–9; 51:3–8, 15–16; 52:3, 9–10 చూడండి)

నిరీక్షణ సందేశాలు (ఉదాహరణకు, యెషయా 50:9; 51:3–5, 11–12, 22–23; 52:9–10 చూడండి)

నిరీక్షణను నిజంగా మార్చడానికి నేనేమి చేయగలను (ఉదాహరణకు, యెషయా 50:10; 51:1–2, 6–9; 52:1–3, 9–11 చూడండి)

మోషైయ 12:20–24; 15:13–18; 3 నీఫై 20:29–46; సిద్ధాంతము మరియు నిబంధనలు 113:7–10; రస్సెల్ ఎమ్. నెల్సన్, “విశ్వాసంతో భవిష్యత్తును హత్తుకోండి,” లియహోనా, నవ. 2020, 73–76 కూడా చూడండి.

సిలువను మోసుకొస్తున్న యేసు

Because of Love [ప్రేమ వలన], ఏంజెలా జాన్సన్ చేత

అభ్యాసకులు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుటకు సహాయము చేయండి. “పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తులను తెలుసుకొని, వారి ప్రేమను అనుభవించడంలో అభ్యాసకులకు సహాయపడుట కంటే ఎక్కువగా ఒక బోధకునిగా మీరు చేసేదేదీ అభ్యాసకులను దీవించదు” (రక్షకుని విధానములో బోధించుట8). మీరు ఇతరులకు యెషయా 50-57 బోధించడానికి సిద్ధమవుతున్నప్పుడు, ఇశ్రాయేలు యొక్క సవాళ్లు, క్రీస్తు గురించి యెషయా ప్రవచనాలు మరియు వారి స్వంత పోరాటాలలో దైవిక సహాయం పొందడం మధ్య సంబంధాలను చూడడానికి మీరు వారికి ఎలా సహాయం చేయవచ్చో పరిగణించండి.

యెషయా 53.

సెమినరీ చిహ్నము
యేసు క్రీస్తు నా పాపములు, బాధలు తనపై తీసుకున్నారు.

లేఖనములో కొన్ని అధ్యాయాలు యేసు క్రీస్తు యొక్క విమోచనా కార్యము గురించి యెషయా 53 కంటే చాలా అందంగా వర్ణించాయి. ఈ శక్తివంతమైన బోధనలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు అన్వయించడానికి ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలను పరిగణించండి:

  • కథలు మరియు చలనచిత్రాలు తరచుగా ప్రజలను రక్షించే కథానాయకులను ఎలా చిత్రీకరిస్తాయో ధ్యానించండి లేదా చర్చించండి. ఆ చిత్రీకరణలను యెషయా 53లోని రక్షకుని వర్ణనలతో పోల్చండి.

  • ప్రతీ వచనమును చదివిన తర్వాత, సమస్త జనుల కొరకు మరియు ప్రత్యేకంగా మీ కొరకు—ఆయన భరించిన “వ్యసనములు,” “బాధలు” మరియు “అతిక్రమములు”—రక్షకుడు అనుభవించిన వాటిని ధ్యానించడానికి ఆగండి. మీరు చదివేటప్పుడు “మేము” మరియు “మన” వంటి పదాలకు బదులుగా “నేను” మరియు “నా” వంటి పదాలను ఉంచండి. ఈ వచనాలు మీలో ఏ భావాలను లేదా ఆలోచనలను ప్రేరేపిస్తాయి?

  • రక్షకుడు మన కోసం వహించే వ్యసనములు మరియు బాధలలో కొన్ని ఏవి?

    5:25

    My Kingdom Is Not of This World

  • యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తానికి సంబంధించిన సంఘటనల చిత్రాలను కనుగొనండి (Gospel Art Book [సువార్త కళా పుస్తకము], సంఖ్యలు 56–60 చూడండి). అప్పుడు మీరు చిత్రాలలోని సంఘటనలను వివరించే వాక్యభాగాలను యెషయా 53లో కనుగొనవచ్చు. ఈ బోధనలు మిమ్మల్ని ఏమి చేయమని ప్రేరేపిస్తాయి?

యెషయా 54; 57:15–19

నేను ఆయన వద్దకు తిరిగి వెళ్ళాలని యేసు క్రీస్తు కోరుతున్నారు.

మన పాపములు లేదా బలహీనతల వలన ప్రభువు నుండి దూరంగా భావించిన సమయాలు మనందరికీ ఉన్నాయి. ఆయన ఎప్పటికైనా వారిని క్షమించగలరనే ఆశను కొందరు కోల్పాయారు. అటువంటి సమయాల్లో భరోసా మరియు ప్రోత్సాహము కొరకు చదవడానికి యెషయా 54 మరియు 57 గొప్ప అధ్యాయములు. ప్రత్యేకించి యెషయా 54:4–10; 57:15–19 లో, ఏ పదాలు రక్షకుడు మీ గురించి ఎలా భావిస్తున్నారనే దానిని మీకు బోధిస్తాయి? ఆయన గురించి ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది?

ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ ఇలా బోధించారు:

“మన జీవితాలు ఎంత పూర్తిగా నాశనమైపోయాయి అన్నది ముఖ్యం కాదు. మన పాపాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి, మన బాధ ఎంత లోతుగా ఉంది, ఎంత ఒంటరిగా ఉన్నాము, ఎంత వదిలివేయబడ్డాము లేదా మన హృదయాలు ఎంత విచ్ఛిన్నం అయ్యాయన్నది ముఖ్యం కాదు. నిరీక్షణ లేనివారు, నిరాశతో జీవిస్తున్నవారు, నమ్మక ద్రోహం చేసినవారు, తమ నిజాయితీని విడిచిపెట్టినవారు లేదా దేవునికి దూరమైనవారు కూడా పునర్నిర్మించబడవచ్చు. …

“సువార్త యొక్క ఆనందకరమైన వార్త ఇది: మన ప్రేమగల పరలోక తండ్రి అందించిన సంతోషము యొక్క నిత్య ప్రణాళిక కారణంగా మరియు యేసు క్రీస్తు యొక్క అనంతమైన త్యాగం ద్వారా, మనం మన పతనమైన స్థితి నుండి విమోచింపబడి, స్వచ్ఛతకు పునఃస్థాపించబడడమే కాకుండా, మర్త్యమైన ఊహలను కూడా అధిగమించి, నిత్య జీవితానికి వారసులుగా మరియు దేవుని యొక్క వర్ణించలేని మహిమలో భాగస్వాములుగా కాగలము” (“He Will Place You on His Shoulders and Carry You Home,” Liahona, May 2016, 102).

పాట్రిక్ కీరన్, “మిమ్మల్ని గృహానికి తీసుకురావడమే దేవుని ఉద్దేశం,” లియహోనా, మే 2024, 87–89 కూడా చూడండి.

యెషయా 55–56

“నా నిబంధనను ఆధారము చేసుకోమని” ప్రభువు అందరిని ఆహ్వానిస్తున్నారు.

తరతరాలుగా, దేవుని నిబంధన జనులుగా ఇశ్రాయేలీయులు గుర్తించబడ్డారు. అయినప్పటికీ, దేవుని ప్రణాళిక ఎల్లప్పుడు ఒకటి కంటె ఎక్కువ రాజ్యాలను కలిగియుంటుంది. ఏలయనగా “దప్పిగొనువారందరు,” “నీళ్ళ యొద్దకు … రండి” (యెషయా 55:1) అని ఆహ్వానించబడ్డారు. యెషయా 55 మరియు 56 చదివినప్పుడు, దీనిని మనస్సులో ఉంచుకోండి మరియు దేవుని యొక్క జనులుగా ఉండడమంటే అర్థమేమిటో ధ్యానించండి. ఆయన నుండి “పూర్తిగా వేరుచేయబడినట్లుగా” భావించిన వారికి దేవుని యొక్క సందేశమేమిటి? (యెషయా 56:3). “నా నిబంధనను ఆధారము చేసుకొను” (యెషయా 56:4–7 చూడండి) వారి యొక్క స్వభావాలు మరియు క్రియలను వివరించే వచనాలను గుర్తించడాన్ని పరిగణించండి.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

యెషయా 51–52

“[నా] బలము ధరించుకొనుము” అని ప్రభువు నన్ను ఆహ్వానిస్తున్నారు.

  • యెషయా 51:9, 17; 52:1–2, 9లో “లెమ్ము,” “నిలువుము” మరియు “నీ బలము ధరించుకొనుము” వంటి వాక్యభాగాలను కనుగొనడం, ఆపై వాటిని నటించి చూపడం మీ పిల్లలకు సరదాగా ఉండవచ్చు. అలా చేసిన తర్వాత, లేవడం, నిలవడం మరియు ఆధ్యాత్మికంగా బలాన్ని ధరించుకోవడం అంటే ఏమిటో మీరు మాట్లాడవచ్చు. ఈ వచనాలలో ఏమి చేయమని ప్రభువు మనల్ని అడుగుతున్నారు?

  • మీ పిల్లలు యెషయా 51:1, 4, 7 కూడా చదివి, ప్రభువు ఎవరితో మాట్లాడుతున్నారో మరియు వారిని ఏమి చేయమంటున్నారో గుర్తించగలరు. ప్రభువును “ఆలకించడం” అంటే ఏమిటి? మనం ప్రభువును “ఆలకిస్తున్నాము” అని ఆయనకు ఎలా చూపించగలము?

యెషయా 53:3–9

యేసు క్రీస్తు నా పాపములు, బాధలు తనపై తీసుకున్నారు.

  • మీరు మరియు మీ పిల్లలు యేసు క్రీస్తు బాధను మరియు మరణాన్ని చూపే అనేక చిత్రాలను చూడవచ్చు (ఉదాహరణకు, Gospel Art Book [సువార్త కళా పుస్తకము], సంఖ్యలు 56, 5758 చూడండి). అప్పుడు మీరు యెషయా 53:3–6, 9ని కలిసి చదివి, చిత్రాలలో ఏమి జరుగుతుందో వివరించే పదాల కోసం చూడవచ్చు. యెషయా ఈ సత్యాలను అవి జరగడానికి వందల సంవత్సరాల ముందు పంచుకున్నాడని మీ పిల్లలకు అర్థమయ్యేలా సహాయం చేయండి. జనులు ఈ విషయాలను చాలా సంవత్సరాల ముందుగానే తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? (ఆల్మా 39:15–19 చూడండి).

  • యెషయా 53:4 నుండి, “ఆయన మన రోగములను భరించెను మరియు మన వ్యసనములను వహించెను” అని చదివిన తర్వాత, మీ పిల్లలు బరువైన వస్తువును ఎత్తడానికి ప్రయత్నించవచ్చు (లేదా ఎత్తినట్లు నటించవచ్చు). “రోగము” మరియు “వ్యసనము” లేదా విచారము ఎలా భారంగా మరియు మోయడానికి కష్టంగా అనిపించవచ్చు అనే దాని గురించి మాట్లాడండి. యేసు మన “రోగములు,” “వ్యసనములు” మరియు “అతిక్రమములు” లేదా పాపములను ఎందుకు మోస్తున్నారు? (ఆల్మా 7:11–12 కూడా చూడండి).

పిల్లలతో యేసు క్రీస్తు

యెషయా 55:6

నేను ప్రభువును వెదకగలను మరియు ఆయనను వేడుకోగలను.

  • యెషయా 55:6 గురించి మీ పిల్లలకు బోధించడానికి, మీరు గదిలో ఎక్కడైనా యేసు చిత్రాన్ని దాచవచ్చు. చిత్రాన్ని కనుగొని, యెహోవా … దొరుకు కాలమునందు ఆయనను వెదకడానికి గల ఒక మార్గాన్ని చెప్పమని మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. అప్పుడు పిల్లలలో ఒకరు చిత్రాన్ని దాచిపెట్టేలా చేసి, మీరు ప్రోత్సాహ కార్యక్రమాన్ని పునరావృతం చేయవచ్చు.

యెషయా 55:8–9

నా మార్గముల కంటే యెహోవా మార్గములు ఎంతో యెత్తుగా ఉన్నాయి.

  • యెషయా 55:9 చదివిన తర్వాత, మీ పిల్లలు పీటపై నిలబడి, వారు “ఎత్తులో” ఉన్నప్పుడు విషయాలు ఎలా భిన్నంగా ఉంటాయో మాట్లాడడం సరదాగా ఉండవచ్చు. లేదా యెషయా 55:9ని వారికి అర్థమయ్యేలా చిత్రించవచ్చు. అప్పుడు మీరు మన మార్గాల కంటే ఉన్నతమైన ప్రభువు మార్గాల్లో కొన్నింటిని చర్చించవచ్చు. ఉదాహరణకు, పాపుల పట్ల ఆయన వ్యవహరించే విధానం ఏమిటి? (మార్కు 2:15–17 చూడండి). ఇతరులను నడిపించే ఆయన మార్గం ఏమిటి? (మత్తయి 20:25–28 చూడండి). ప్రభువు యొక్క ఉన్నతమైన మార్గాలను మరియు ఆలోచనలను మీరు విశ్వసించడం ఎలా నేర్చుకున్నారో మీ పిల్లలతో పంచుకోండి.

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

యేసు యొక్క చిత్రపటం

His Light [ఆయన వెలుగు], మైఖేల్ మామ్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: నేను ప్రభువును వెదకగలను మరియు ఆయనను వేడుకోగలను