2024 రండి, నన్ను అనుసరించండి
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ప్రవక్తలు మరియు ప్రవచనము


“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ప్రవక్తలు మరియు ప్రవచనము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“ప్రవక్తలు మరియు ప్రవచనము,” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

ఆలోచనల చిహ్నము

జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు

ప్రవక్తలు మరియు ప్రవచనము

పాత నిబంధన యొక్క సాంప్రదాయ క్రైస్తవ విభాగంలో, చివరి విభాగం (యెషయా నుండి మలాకీ వరకు) “ప్రవక్తలు” అని పిలువబడింది. ఈ భాగము, దాదాపు పాత నిబంధనలో నాలుగవ వంతు, దేవునిచేత నియమించబడిన సేవకుల మాటలను కలిగియున్నది, వారు ప్రభువుతో మాట్లాడారు మరియు దాదాపు క్రీ.పూ. 900 మరియు 500 మధ్య ప్రజలతో ఆయన సందేశాన్ని పంచుకుంటూ, ఆయన కొరకు మాట్లాడారు.

ప్రవక్తలు దేవుని చిత్తాన్ని తెలియజేస్తారు

ప్రవక్తలు మరియు ప్రవచనము పాత నిబంధన అంతటా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులు దర్శనాలను చూసారు మరియు పరలోక దూతలతో మాట్లాడారు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు మరియు ఆయన చిత్తమును ఇశ్రాయేలీయులకు తెలియజేసాడు. మొదటి మరియు రెండవ రాజుల గ్రంథాలు ప్రవక్తలైన ఏలీయా మరియు ఎలీషాల యొక్క జ్ఞాపకార్థమైన కార్యములను మరియు సందేశాలను సమగ్రంగా వివరిస్తాయి. పాత నిబంధన మిర్యాము మరియు దెబోరా వంటి ప్రవక్త్రిలతో పాటు, ప్రవచానత్మక ఆత్మతో దీవించబడిన రిబ్కా మరియు హన్నావంటి మిగిలిన స్త్రీలను గూర్చి కూడా మాట్లాడుతుంది. కీర్తనలు ఆనవాయితీగా ప్రవక్తలచేత వ్రాయబడనప్పటికీ, అవి కూడా ప్రవచనాత్మతో నింపబడ్డాయి, ప్రత్యేకించి అవి మెస్సీయ రాకడను సూచిస్తాయి.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులకు ఇవేవీ ఆశ్చర్యకరంగా అనిపించవు. వాస్తవానికి, ప్రవక్తలు చరిత్రలో ఆసక్తికరమైన వ్యక్తులు మాత్రమే కాదు, కానీ దేవుని ప్రణాళికలో ఆవశ్యకమైన భాగమని యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త మనకు బోధిస్తుంది. ప్రవక్తలను పాత నిబంధన కాలములకు ప్రత్యేకమైనట్లుగా కొందరు చూడగా, మనము వారిని పాత నిబంధన కాలములతో మనకు ఉమ్మడిగా ఉన్నవారిగా చూస్తాము.

కానీ, యెషయా లేదా యెహెజ్కేలు నుండి ఒక అధ్యాయమును చదవడం, ప్రస్తుత సంఘ అధ్యక్షుని నుండి ఒక సర్వసభ్య సమావేశ సందేశాన్ని చదవడం నుండి భిన్నంగా ఉండవచ్చు. కొన్నిసార్లు ఆ ప్రాచీన ప్రవక్తలు మనకు చెప్పడానికి ఏదైనా కలిగియున్నారని చూడడం కష్టమైనది కావచ్చు. ఏదేమైనా, నేడు మనం జీవించే ప్రపంచం వారు ప్రకటించిన, ప్రవచించిన ప్రపంచం నుండి చాలా భిన్నమైనది. మనము సజీవ ప్రవక్తను కలిగియున్నాము అనే వాస్తవము ఒక ప్రశ్నను రేకెత్తించవచ్చు: ప్రాచీన ప్రవక్తల మాటలను చదవడానికి ప్రయత్నం అవసరం—మరియు ఆ ప్రయత్నం ఎందుకు విలువైనది?

లిఖిస్తున్న ప్రాచీన ప్రవక్త

Fulness of Times [సంపూర్ణ కాలములు], గ్రెగ్ ఓల్సెన్ చేత

ప్రాచీన ప్రవక్తలు మనకు చెప్పడానికి ఏదో కలిగియున్నారు

చాలా వరకు, ఈనాటి జనులు పాత నిబంధన ప్రవక్తల యొక్క ప్రాథమిక ప్రేక్షకులు కాదు. మన కడవరి-దిన ప్రవక్తలు ఈరోజు మన తక్షణ సమస్యలను పరిష్కరించినట్లుగా—ఆ ప్రవక్తలు వారి కాలము మరియు ప్రదేశంలో వారు పరిష్కరించే తక్షణమైన సమస్యలను కలిగియున్నారు.

అదే సమయంలో, ప్రవక్తలు తక్షణ సమస్యలను మించి కూడా చూడగలరు. వారు ఏ సమయానికైనా మరియు ప్రదేశానికైనా తగినట్లుగా నిత్య సత్యములను బోధిస్తారు. బయల్పాటుతో దీవించబడి, వారు దేవుని కార్యము యొక్క విస్తృతమైన దృక్పథమును చూస్తారు. ఉదాహరణకు, యెషయా తన కాలంలో జనులను వారి పాపాల గురించి హెచ్చరించాడు. భవిష్యత్తులో 200 ఏళ్లు జీవించే ఇశ్రాయేలీయుల విడుదల గురించి కూడా అతను వ్రాసాడు. అదే సమయంలో, దేవుని జనులందరూ కోరుకునే విడుదల గురించి ఆయన బోధించాడు. మరియు అతడు ఈనాటికీ నెరవేరడానికి వేచియున్న ప్రవచనాలను వ్రాసాడు—“క్రొత్త భూమి” (యెషయా 65:17), అది “యెహోవాను గూర్చి జ్ఞానముతో నిండియున్నది” ( యెషయా 11:9), అక్కడ చెదిరిపోయిన ఇశ్రాయేలు గోత్రములు సమకూర్చబడును, అక్కడ “రాజ్యములు యుద్ధము చేయ నేర్చుకొనుట మానివేయును” (యెషయా 2:4) వంటి వాగ్దానములు. యెషయా వంటి పాత నిబంధన ప్రవక్తల మాటలను చదవడం నుండి వచ్చిన ఆనందము మరియు ప్రేరేపణలో భాగము ఏదనగా, వారు ఊహించిన మహిమకరమైన దినములో మనము ఒక పాత్రను పోషించుట.

కాబట్టి మీరు ప్రాచీన ప్రవచనాలను చదివినప్పుడు, అవి వ్రాయబడిన సందర్భం గురించి తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది—కానీ మీరు వాటిలో మిమ్మల్ని మీరు చూసుకోవాలి లేదా “వాటిని [మీతో] పోల్చుకోవాలి” (1 నీఫై 19:24; 23వ వచనము కూడా చూడండి). కొన్నిసార్లు దానికి అర్థము బబులోనును ఒక ప్రాచీన పట్టణముగా చూడకుండా, పాపము మరియు గర్వము యొక్క చిహ్నముగా చూడడం. దానర్థం ఏ సమయంలోనైనా మరియు ప్రదేశంలోనైనా ఇశ్రాయేలును దేవుని జనులుగా అర్థం చేసుకోవడం కావచ్చు. లేదా సీయోనును కేవలం యెరూషలేముకు మరో పదంగా చూసే బదులు, దేవుని యొక్క జనులు హత్తుకునే కడవరి-దిన కారణంగా చూడడం దానర్థం కావచ్చు.

బహు విధాలుగా ఒక ప్రవచనం నెరవేర్చబడగలదని మనము గ్రహిస్తాము కనుక లేఖనాలను మన జీవితాలతో మనం పోల్చుకోగలము. యెషయా 40:3 లోని ప్రవచనము ఒక మంచి మాదిరి: “అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి.” బబులోనులో చెరపట్టబడిన యూదులకు, ఈ వ్యాఖ్యానము చెరనుండి బయటకు మరియు యెరూషలేముకు తిరిగి వెళ్లుటకు ప్రభువు ఒక మార్గమును ఇచ్చుటను సూచించియుండవచ్చు. మత్తయి, మార్కు మరియు లూకాలకు ఈ ప్రవచనము బాప్తిస్మమిచ్చు యోహానును సూచించింది, అతడు రక్షకుని యొక్క మర్త్య పరిచర్య కొరకు మార్గమును సిద్ధపరిచాడు. మరియు క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిచర్య కొరకు సిద్ధపాటుగా నేడు ఈ ప్రవచనం ఇంకా నెరవేర్చబడుతున్నదని జోసెఫ్ స్మిత్ బయల్పాటును పొందాడు. ఇంకా మనము గ్రహించగలిగే విధానాలలో, ప్రాచీన ప్రవక్తలు మనతో మాట్లాడారు. వారు ప్రాచీన ఇశ్రాయేలుకు అన్వయించినట్లుగా మనకు సంబంధించిన అనేక ప్రశస్థమైన, నిత్యమైన సత్యములను బోధించారు.

ప్రాచీన ప్రవక్తలు యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చారు

బహుశా పాత నిబంధన ప్రవచనాలలో మిమ్మల్ని మీరు చూసుకోవడం కంటే చాలా ముఖ్యమైనది వాటిలో యేసు క్రీస్తును చూడటం. మీరు ఆయన కోసం వెదకినట్లయితే, ఆయన పేరు చెప్పబడకపోయినా కూడా మీరు ఆయనను కనుగొంటారు. యేసు క్రీస్తే పాత నిబంధన యొక్క దేవుడు, ప్రభువైన యెహోవా అని జ్ఞాపకముంచుకోవడం సహాయపడవచ్చు. ఏ సమయంలోనైనా ప్రవక్తలు ప్రభువు చేస్తున్న దానిని లేదా ఆయన చేయబోయే దానిని వివరించినప్పుడు, వారు రక్షకుని గూర్చి మాట్లాడుతున్నారు.

ఒక వ్యక్తిని సమీపిస్తున్న పునరుత్థానుడైన యేసు

The Lord Appearing unto Abraham [అబ్రాహాముకు ప్రత్యక్షమైన ప్రభువు], కీత్ లార్సన్ చేత

అభిషేకించబడిన వాడు, ఒక విమోచకుడు మరియు దావీదు వంశము నుండి రాబోయే రాజుకు సూచికలను కూడా మీరు కనుగొంటారు. ఇవన్నీ యేసు క్రీస్తు గురించిన ప్రవచనాలు. మరింత సాధారణంగా, మీరు విడుదల, క్షమాపణ, విమోచన మరియు పునఃస్థాపన గురించి చదువుతారు. మీ మనస్సులో, హృదయంలో రక్షకుడిని కలిగియుండి, ఈ ప్రవచనాలు సహజంగానే మిమ్మల్ని దేవుని కుమారునివైపు నడిపిస్తాయి. అన్నిటికంటే, ప్రవచనమును గ్రహించడానికి శ్రేష్ఠమైన విధానము “ప్రవచనానుసారమైన ఆత్మ” కలిగియుండుట, దానిని యోహాను “యేసును గూర్చి సాక్ష్యము” (ప్రకటన 19:10) అని మనకు చెప్పాడు.

వివరణలు

  1. వారి గ్రంథాల యొక్క నిడివిని బట్టి యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు మరియు దానియేలు తరుచుగా ప్రధాన ప్రవక్తలుగా సూచించబడ్డారు. మిగిలిన ప్రవక్తల గ్రంథాలు చాలా చిన్నవి గనుక, (హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా మరియు మలాకీ) వారు సామాన్య ప్రవక్తలుగా పిలువబడ్డారు. విలాపవాక్యములు రచనలలో భాగముగా భావించబడింది, ప్రవక్తలలో కాదు.

  2. ప్రవచనాత్మక గ్రంథాలు ఎలా సంగ్రహించబడ్డాయో మనకు తెలియదు. కొన్ని సందర్భాలలో, ఒక ప్రవక్త తన రచనలు మరియు ప్రవచనాల సేకరణను పర్యవేక్షించవచ్చు. మిగిలిన సందర్భాలలో, అవి వ్రాయబడియుండవచ్చు మరియు అతడి మరణం తరువాత సంగ్రహించబడియుండవచ్చు.

  3. నిర్గమకాండము 15:20; న్యాయాధిపతులు 4 చూడండి.

  4. ఆదికాండము 25:21–23; 1 సమూయేలు 1:20–28; 2:1–10 చూడండి.

  5. “దాని సమస్తము యొక్క ఉత్సాహము మరియు అత్యవసరతను ఒక్కసారి ఆలోచించండి: ఆదాము మొదలుకొని ప్రతీ ప్రవక్త మన దినమును చూసారు. ఇశ్రాయేలు సమకూడినప్పుడు మరియు రక్షకుని యొక్క రెండవ రాకడ కొరకు లోకము సిద్ధపడినప్పుడు, ప్రతీ ప్రవక్త మన దినము గురించి మాట్లాడారు. దాని గురించి ఆలోచించండి! భూగ్రహంపై ఇప్పటివరకు జీవించిన జనులందరిలో, మనము మాత్రమే ఈ చివరి, గొప్ప సమకూర్పు కార్యములో పాల్గొనడానికి అవకాశమివ్వబడ్డాము. అది ఎంత ఉత్సాహకరమైనది!” (Russell M. Nelson, “Hope of Israel” [worldwide youth devotional, June 3, 2018], Gospel Library). రోనాల్డ్ ఎ. రా‌స్బాండ్, “ప్రవచనము యొక్క నెరవేర్పు,” లియహోనా, మే 2020, 75–78 కూడా చూడండి.

  6. యెషయాను గూర్చి మాట్లాడుతూ రక్షకుడు ఇలా చెప్పారు, “అతడు పలికిన మాటల ప్రకారము అతడు పలికిన సంగతులున్నియు ఉండెను మరియు ఉండును” (3నీఫై 23:3; వివరణ చేర్చబడినది).

  7. మత్తయి 3:1–3; మార్కు 1:2–4; లూకా 3:2–6 చూడండి.

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 33:10; 65:3; 88:66 చూడండి.

  9. యెషయా 9:6–7; 61:1; హోషేయ 13:14; జెకర్యా 9:9 చూడండి.