“జూన్ 15–21. ‘యుద్ధము యెహోవాదే’: 1 సమూయేలు 17–18; 24– 26; 2 సమూయేలు 5-7,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“జూన్ 15–21. ‘యుద్ధము యెహోవాదే,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
David and Goliath [దావీదు మరియు గొల్యాతు], స్టీవ్ నెదర్‌కాట్ చేత
జూన్ 15–21: “యుద్ధము యెహోవాదే”
1 సమూయేలు 17–18; 24–26; 2 సమూయేలు 5–7
ఇశ్రాయేలు గోత్రములు వాగ్దాన దేశములో స్థిరపడినప్పటి నుండి, ఫిలిష్తీయులు వారి భద్రతకు కొనసాగుతున్న ముప్పుగా ఉన్నారు. గతములో ప్రభువు వారిని అనేకమార్లు విడిపించారు, కానీ ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క పెద్దలు ఇలా కోరారు, “మాకు రాజు కావలెను … మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించును” (1 సమూయేలు 8:19–20). కావున, సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు. అయినప్పటికీ, భయంకరుడును మహాకాయుడైన గొల్యాతు ఇశ్రాయేలు సైన్యముకు తన సవాలు విసిరినప్పుడు, అతడి మిగిలిన సైన్యమువలె—సౌలు “బహు భీతుడయ్యెను” (1 సమూయేలు 17:11). ఆ రోజు ఇశ్రాయేలును కాపాడినది సౌలు రాజు కాదు, కానీ దీనమనస్సుగల దావీదు అనే గొఱ్ఱెల కాపరి, అతడు ఏ ఆయుధాన్ని ధరించలేదు కానీ ప్రభువుయందు అబేధ్యమైన విశ్వాసమును ధరించియున్నాడు. ఈ యుద్ధము ఇశ్రాయేలుకు మరియు పోరాడుటకు ఆత్మీయ యుద్ధములను కలిగియున్న ఎవరికైనా, “యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడుకాడని” మరియు “యుద్ధము యెహోవాదే” (1 సమూయేలు 17:47) అని రుజువు చేసింది.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
1 సమూయేలు 17
ప్రభువు యొక్క సహాయముతో, నేను ఏ సవాలునైనా జయించగలను.
దావీదు మరియు గొల్యాతు కథ లేఖనాలలో బాగా తెలిసిన కథలలో ఒకటి. అయితే, మనము సాధారణంగా దావీదుపై దృష్టిపెడతాము. కానీ ఈసారి, మీరు 1 సమూయేలు 17 చదివినప్పుడు, ఈ అధ్యాయములో ఇతర జనుల మాటలను కూడా ధ్యానించండి (క్రింది జాబితా చూడండి). వారు మరియు వారి ఉద్దేశ్యాల గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? దావీదు గురించి మీరేమి నేర్చుకుంటారు? ఇది ఎలా భిన్నమైనది?
-
గొల్యాతు: 8–10, 43–44 వచనములు
-
ఏలీయాబు: 28వ వచనము
-
సౌలు: 33వ వచనము
-
దావీదు: 26, 32, 34–37, 39, 45–47 వచనములు
మీ కథ, దావీదు కథ అంతగా ప్రసిద్ధి చెందనప్పటికీ, గొల్యాతు పరిమాణంలో ఉన్న సవాళ్లను అధిగమించడాన్ని మరియు ప్రభువుపై విశ్వాసాన్ని అభ్యసించే అవకాశాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది. మీ కథలోని ప్రతికూలతను ఎదుర్కోవడం గురించి దావీదు ఉదాహరణ మీకు ఏమి బోధిస్తుంది? మీ సవాళ్ళలో ఒకదానిని మనస్సులో పెట్టకొని, మీరు అధ్యక్షురాలు కెమిలి ఎన్. జాన్సన్ గారి సందేశము “మీ కథను వ్రాయడానికి క్రీస్తును ఆహ్వానించండి” (లియహోనా, నవ. 2021, 80–82) కూడా చదవవచ్చు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం వెదకండి: నా సవాళ్లను నేను ఎలా చూడాలని ప్రభువు కోరుకుంటున్నారు? గతంలో ఆయన నాకు ఎలా సహాయం చేశారు? నా కథను వ్రాయడానికి నేను ఆయనను నమ్ముతున్నానని నేనెలా చూపించగలను?
దావీదు కథలో తర్వాత కొన్ని విషాదకరమైన అధ్యాయాలు ఉన్నాయని మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు (ఉదాహరణకు, 2 సమూయేలు 11 చూడండి). గొల్యాతుతో యుద్ధం చేసిన తర్వాత దావీదుకు కొన్ని సలహాలు ఇచ్చే అవకాశం మీకు ఉంటే, మీరు ఏమి చెబుతారు? ఈ సలహా మీ జీవితానికి ఎలా వర్తిస్తుంది?
The Lord Will Deliver Me
1 సమూయేలు 17:26–50
క్రీస్తుపై విశ్వాసం ఉన్న ఒక వ్యక్తి మార్పు తీసుకురాగలడు.
వ్యక్తిగత సవాళ్లతో పాటు, ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే పెద్ద, సంక్లిష్టమైన సమస్యలను కూడా మనము ఎదుర్కొంటాము. మంచి శక్తులకు వ్యతిరేకంగా చెడు శక్తులు “యుద్ధానికి సమకూడినప్పుడు” (1 సమూయేలు 17:1), మన వ్యక్తిగత ప్రయత్నాలు ఎలా మార్పును తీసుకురాగలవని మనం ఆశ్చర్యపోవచ్చు. మీకు నిరీక్షణను ఇచ్చునట్లు దావీదు కథలో మీరు ఏమి కనుగొంటారు?
True Friendship and Self-Respect [నిజమైన స్నేహం మరియు ఆత్మాభిమానము], విల్సన్ ఆంగ్ చేత (వివరణ)
1 సమూయేలు 18
“యోనాతాను [దావీదు]ను ప్రాణంగా ప్రేమించెను.”
మీరు 1 సమూయేలు 18 చదువుతున్నప్పుడు, సౌలు మరియు అతని కుమారుడు యోనాతాను (దావీదు కాకపోతే, అతను తదుపరి రాజు అవుతాడని ఊహించి ఉండేవాడు) విభేదించడాన్ని పరిగణించండి. దావీదు విజయానికి సౌలు మరియు యోనాతాను ఎలా ప్రతిస్పందించారు? ఈ అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకోగలరు?
యేసు క్రీస్తును మీకు గుర్తుచేసేలా యోనాతాను వైఖరులు మరియు చర్యలలో మీరు ఏమి కనుగొంటారు?
“లేఖనములను పోల్చుట” (1 నీఫై 19:23). దావీదు, యోనాతాను మరియు సౌలు వంటి వ్యక్తుల ఉద్దేశ్యాలు మరియు చర్యల నుండి నేర్చుకోవడానికి లేఖనాలు గొప్ప అవకాశాలను అందిస్తాయి. లేఖనాల్లో ఎవరూ దోషరహితంగా లేరని మీరు కనుగొంటారు. కాబట్టి, ఉదాహరణకు, దావీదు యొక్క విశ్వాసపూరితమైన ఎంపికల గురించి మీరు చదువుతున్నప్పుడు, అతని తప్పుల నుండి కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. అలా చేయడం మనలోని సంభావ్య బలహీనతలను గుర్తించడంలో మరియు “[ఇతరులు] ఉన్నదానికంటే అధిక వివేకముగా ఉండుటను నేర్చుకోవడంలో” (మోర్మన్ 9:31) మనకు సహాయపడగలదు.
1 సమూయేలు 24–26
క్షమాపణ అనేది శాంతి మరియు స్వస్థతకు నిశ్చయమైన మార్గం.
1 సమూయేలు 24–26లో, గర్వం, క్షమాపణ మరియు స్వీయ నియంత్రణ గురించిన పాఠాల కోసం చూడండి. మీ అధ్యయనంలో భాగంగా ఎల్డర్ మార్క్ ఎ. బ్రాగ్ గారి సందేశము క్రీస్తు వంటి స్థిరత్వం,” (లియహోనా, మే 2023, 60–63) చదవడాన్ని కూడా మీరు పరిగణించవచ్చు. ఈ అధ్యాయాల్లో దావీదు, అబీగయీలు మరియు ఇతరులు క్రీస్తు వంటి స్థిరత్వాన్ని ఎలా ప్రదర్శించారు—లేదా ప్రదర్శించడంలో విఫలమయ్యారు? క్రీస్తు వంటి స్థిరత్వాన్ని చూపించడానికి మీకు గల అవకాశాలేవి?
మీరు 1 సమూయేలు 25 అధ్యయనం చేయడానికి, సహోదరి క్రిస్టిన్ ఎమ్. యీ గారి సందేశము “బూడిదకు ప్రతిగా పూదండ: క్షమాపణ యొక్క స్వస్థపరచు దారి” (లియహోనా, నవ. 2022, 36–39) సహాయపడగలదు. అబీగయీలు యేసు క్రీస్తు వలె ఎట్లున్నది?
2 సమూయేలు 5:17–25
ప్రభువు నాకు మార్గనిర్దేశాన్ని ఇవ్వగలరు.
దావీదు గొల్యాతును ఓడించిన తర్వాత కూడా ఫిలిష్తీయులతో అతని సమస్యలు తీరలేదు. 2 సమూయేలు 5:17–25ను మీరు చదివినప్పుడు, మీరు ఎదుర్కొనే సవాళ్లలో దావీదు మాదిరి మీకు ఎలా సహాయపడగలదో పరిగణించండి (1 సమూయేలు 23:2, 10–11; 30:8; 2 సమూయేలు 2:1 కూడా చూడండి). మీరు పొందిన బయల్పాటుపై పనిచేయడం ద్వారా మీరు ఎలా దీవించబడ్డారు?
2 సమూయేలు 7
దావీదుకు ప్రభువు వాగ్దానమిచ్చిన “మందిరము” ఏది?
ప్రభువుకు ఒక మందిరము, అనగా ఒక దేవాలయమును నిర్మిస్తానని దావీదు చెప్పినప్పుడు (2 సమూయేలు 7:1–3 చూడండి), వాస్తవానికి దావీదు కుమారుడు దానిని నిర్మిస్తాడని ప్రభువు జవాబిచ్చారు (12–15 వచనములు చూడండి; 1 దినవృత్తాంతములు 17:1–15 కూడా చూడండి). దానికి బదులుగా ప్రభువు దావీదుకు ఒక “నివాసమును”, అనగా ఒక వంశమును నిర్మిస్తానని మరియు అతని సింహాసనం శాశ్వతంగా ఉంటుందని కూడా చెప్పారు (2 సమూయేలు7:11, 16, 25–29; కీర్తనలు 89:3–4, 35–37 చూడండి). ఈ వాగ్దానము దావీదు యొక్క వారసుడు, మన నిత్య రాజు అయిన యేసు క్రీస్తునందు నెరవేర్చబడింది (మత్తయి 1:1; లూకా 1:32–33; యోహాను 18:33–37 చూడండి).
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
1 సమూయేలు 17:20–54
యేసు క్రీస్తునందు విశ్వాసము నాకు ధైర్యాన్ని కలిగించగలదు.
-
మీ పిల్లలు 1 సమూయేలు 17:20–54లో జరిగిన దానిని తెలుసుకొనేలా సహాయపడడానికి, పాత నిబంధన కథలు, 112-16లో ఉన్న “దావీదు మరియు గొల్యాతు”ను మీరు ఉపయోగించాలనుకోవచ్చు. అప్పుడు మీరు ఈ నమూనాలోని చిత్రాలు లేదా గీతల బొమ్మలను ఉపయోగించి కథను తిరిగి చెప్పడానికి వారిని అనుమతించవచ్చు. ఈ కథ నుండి వారు ఏమి నేర్చుకోవాలని ప్రభువు కోరుతున్నారని వారు అనుకుంటున్నారో అడగండి.
2:36David and Goliath
-
మీరు మరియు మీ పిల్లలు వారి జీవితంలో ఎదుర్కొనే కొన్ని కష్టమైన సవాళ్ల జాబితాను కూడా తయారు చేయవచ్చు. ఈ సవాళ్లలో సహాయపడగలిగేలా దావీదు చెప్పిన విషయాలను కనుగొనడంలో వారికి సహాయపడండి (1 సమూయేలు 17:26, 32, 34–37, 45–47 చూడండి). సవాళ్ళ సమయంలో యేసు క్రీస్తు మీకేవిధంగా సహాయపడ్డారో పంచుకోండి.
1 సమూయేలు 18:1-4
మంచి స్నేహితులు దేవుని నుండి దీవెన కాగలరు.
-
యోనాతాను మరియు దావీదుల స్నేహం నుండి మీ పిల్లలు నేర్చుకోవడానికి మీరు ఎలా సహాయం చేయగలరు? దావీదుకు ప్రాతినిధ్యం వహించడానికి ఒకటి, యోనాతానుకు ప్రాతినిధ్యం వహించడానికి మరొకటి చొప్పున ప్రతి బిడ్డకు రెండు కాగితపు హృదయాలను ఇవ్వడం ఒక మార్గం కావచ్చు. ఆ తర్వాత, ఈ ఇద్దరు స్నేహితులు ఒకరిపట్ల ఒకరు కలిగి ఉన్న ప్రేమను నొక్కి చెప్పే కొన్ని వాక్యభాగాలను 1 సమూయేలు 18:1–4 నుండి కలిసి చదవండి. అప్పుడు మీ పిల్లలు ఒక స్నేహితుని పట్ల ప్రేమను ఎలా చూపించగలరో వారి కాగితపు హృదయాలపై వ్రాయవచ్చు లేదా గీయవచ్చు.
2 సమూయేలు 5:19, 23
నాకు మార్గదర్శకత్వం అవసరమైతే, నేను పరలోక తండ్రిని అడుగగలను.
-
ఈ అధ్యాయాలలో, దావీదు ఇశ్రాయేలు యొక్క రాజు అయ్యాడు. మీ పిల్లలు రాజుగా లేదా రాణిగా నటించడం సరదాగా ఉండవచ్చు. వారు ఎలాంటి చట్టాలు చేస్తారు? సహాయం కోసం వారు ఎక్కడికి వెళతారు? దావీదుకు సహాయం అవసరమైనప్పుడు, అతను సమాధానాల కోసం “విచారణ చేసాడు” లేదా ప్రార్థించాడని మీ పిల్లలు కనుగొనడంలో సహాయపడండి. ఉదాహరణకు, మీరు 2 సమూయేలు 5:19, 23 చదువుతున్నప్పుడు, “విచారించారు” అనే పదాన్ని వినమని మరియు అది విన్నప్పుడు చేతులు కట్టుకోమని పిల్లలను ఆహ్వానించండి. దావీదుకు తన కొత్త పాత్రలో ప్రభువు యొక్క సహాయం ఎందుకు అవసరం?
-
మీరు పరలోక తండ్రి సహాయం కోసం ప్రార్థించిన సమయాల గురించి ఒకరికొకరు చెప్పుకోండి. ఆయన మీకు సహాయం చేయడం వల్ల వచ్చిన తేడా ఏమిటి?
2 సమూయేలు 7:16–17
యేసు క్రీస్తు నా నిత్య రాజు.
-
పాత నిబంధనలో మనం చదివిన రాజులందరికీ లోపాలు ఉన్నాయి మరియు వారి రాజ్యాలు అన్నీ ముగిశాయి. కానీ యేసు క్రీస్తు పరిపూర్ణమైన రాజు మరియు శాశ్వతంగా పరిపాలిస్తారు. 2 సమూయేలు 7:16–17లో దావీదు రాజుకు ప్రవక్త నాతాను చెప్పినదానిని కలిసి చదవడం ద్వారా మీరు దీన్ని కనుగొనడంలో మీ పిల్లలకు సహాయపడగలరు. దావీదు రాజ్యానికి అంతం ఎలా ఉండదు? దావీదు వంశస్థుడైన యేసు క్రీస్తు మన రాజు అని బోధించే లూకా 1:32–33; యోహాను 18:33–37; మరియు ప్రకటన 19:16 వంటి లేఖన గద్యభాగాలను కనుగొని చదవడంలో మీ పిల్లలకు సహాయపడండి. భూమ్మీద ఉన్న రాజుల నుండి యేసు ఎలా భిన్నంగా ఉన్నారు? యేసు క్రీస్తును మన నిత్య రాజుగా మనమెలా గౌరవించాలి?
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.