డిసెంబరు 8–14: ‘మేము నమ్ముచున్నాము’: విశ్వాస ప్రమాణాలు మరియు అధికారిక ప్రకటనలు 1 మరియు 2,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“విశ్వాస ప్రమాణాలు మరియు అధికారిక ప్రకటనలు 1 మరియు 2,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
To All Worthy Male Members [యోగ్యులైన పురుష సభ్యులందరికి] నుండి వివరణ, ఎమ్మా ఆల్లెబిస్ చేత
డిసెంబరు 8-14: “మేము నమ్ముచున్నాము”
విశ్వాస ప్రమాణాలు మరియు అధికారిక ప్రకటనలు 1 మరియు 2
జోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శనము నాటి నుండి దేవుడు బయల్పాటు ద్వారా తన సంఘమును నడిపించుట కొనసాగించారు. కొన్ని సందర్భాల్లో, ఆ బయల్పాటు సంఘము యొక్క విధానాలు మరియు అభ్యాసాలకు మార్పులను కలిగి ఉంది. అధికారిక ప్రకటనలు 1 మరియు 2 ఈ విధమైన బయల్పాటును ప్రకటించాయి—ఒకటి బహు వివాహ ఆచరణ యొక్క ముగింపుకు దారితీసింది, మరొకటి యాజకత్వ దీవెనలు అన్ని జాతుల ప్రజలకు లభ్యమయ్యేలా చేసింది. ఇటువంటి మార్పులు నిజమైన మరియు సజీవుడైన దేవుని చేత నడిపించబడి, నిజమైన మరియు జీవించియున్న ప్రవక్తతోపాటు “జీవము గల సత్య సంఘమును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:30) కలిగియుండడంలో ఒక భాగము.
కానీ నిత్య సత్యము గురించి మన అవగాహన మారినప్పటికీ, అది మారదు. కొన్నిసార్లు బయల్పాటు సత్యముపై అదనపు వెలుగునిస్తుంది. విశ్వాస ప్రమాణాలు ఈ స్పష్టమైన ప్రయోజనాన్ని అందిస్తాయి. సంఘము నిత్య సత్యముపై దృఢంగా స్థాపించబడింది, అయితే, “మనుష్య కుమారుల పరిస్థితులకు అనుకూలముగా తన కరుణాకటాక్షములు ఉండునట్లు ప్రభువు చిత్త ప్రకారముగా” ఇంకా వృద్ధిచెందగలదు మరియు మారగలదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:15). మరొక విధముగా, “దేవుడు బయలుపరచిన సమస్తమును, ఇప్పుడు ఆయన బయలుపరచు సమస్తమును మేము నమ్ముచున్నాము, దేవుని రాజ్యమునకు సంబంధించిన గొప్ప మరియు ముఖ్యమైన సంగతులనేకము ఆయన ఇంకా బయలుపరచునని మేము నమ్ముచున్నాము” (విశ్వాస ప్రమాణాలు 1:9).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
పునఃస్థాపించబడిన సువార్త యొక్క మూలాధార సత్యాలను విశ్వాస ప్రమాణాలు కలిగియున్నాయి.
విశ్వాస ప్రమాణాలను అధ్యయనం చేయడానికి ఈ విధానాన్ని పరిగణించండి: ప్రతీ విశ్వాస ప్రమాణం కొరకు, మీరు విశ్వసించేదాన్ని వివరించడానికి “చిన్న-పాఠం” తయారుచేయండి. మీ చిన్న-పాఠంలో సంబంధిత లేఖనం, చిత్రం, కీర్తన లేదా పిల్లల పాట లేదా విశ్వాస ప్రమాణం బోధించే సత్యాన్ని జీవించడం గురించి వ్యక్తిగత అనుభవం ఉండవచ్చు.
పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మీకున్న సంబంధంలో ఈ సత్యాలు ఎలాంటి తేడాను కలిగిస్తాయి? విశ్వాస ప్రమాణాలు మీ సువార్త అధ్యయనాన్ని ఎలా మెరుగుపరిచాయి లేదా ఇతరులతో సువార్తను పంచుకోవడంలో మీకు ఎలా సహాయపడ్డాయి?
విశ్వాస ప్రమాణాలు 1:9; అధికారిక ప్రకటనలు 1 మరియు 2
యేసు క్రీస్తు యొక్క సంఘము బయల్పాటు ద్వారా నడిపించబడుతుంది.
“దేవుని రాజ్యమునకు సంబంధించిన గొప్ప మరియు ముఖ్యమైన సంగతులనేకము [దేవుడు] ఇంకా బయలుపరచునని మేము నమ్ముచున్నాము” (విశ్వాస ప్రమాణాలు 1:9). ఈ సూత్రాన్ని మనస్సులో ఉంచుకొని, అధికారిక ప్రకటనలు 1 మరియు 2 పునర్వీక్షించండి మరియు నిరంతర బయల్పాటులో మీ విశ్వాసాన్ని బలపరిచే పదాలు, వాక్యభాగాల కొరకు చూడండి. ఈ బయల్పాటులు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయి? పరలోక తండ్రి రాజ్యము యొక్క కార్యాన్ని అవి ఎలా ముందుకు తీసుకువెళ్ళాయి?
సంఘము నేడు “సర్వశక్తిమంతుడగు దేవుని ప్రేరేపణతో” నడిపించబడుతున్నది అనడానికి మీరు ఏ సాక్ష్యం చూస్తున్నారు? (అధికారిక ప్రకటన 1). ప్రభువు తన సంఘాన్ని మరియు మీ జీవితాన్ని ఎలా నడిపిస్తున్నారనే దాని కొరకు చూస్తూ, బహుశా మీరు ఇటీవలి సర్వసభ్య సమావేశ సందేశాలలో ఒకటి లేదా ఎక్కువ వాటిని సమీక్షించవచ్చు. సంఘాధ్యక్షుడి నుండి ఇటీవలి సందేశం ప్రారంభించడానికి సరైనది కావచ్చు.
ప్రభువు తన ప్రవక్తల ద్వారా ఏమి బోధిస్తున్నారో అర్థం చేసుకోవడానికి లేదా అంగీకరించడానికి మీరు లేదా మీరు ఇష్టపడే ఎవరైనా కష్టపడినట్లయితే మీరు ఏమి చేయగలరు? ఒక ప్రవక్త కొరకు మీరు ఎందుకు కృతజ్ఞత కలిగియున్నారు?
ఆమోసు 3:7; 2 నీఫై 28:30; అలెన్ డి. హేనీ, “కడవరి దినముల కొరకు జీవించియున్న ఒక ప్రవక్త,” లియహోనా, మే 2023, 25–28 కూడా చూడండి.
దేవుని కార్యము తప్పక ముందుకు సాగాలి.
“ప్రకటనపత్రం గురించి అధ్యక్షులు విల్ఫర్డ్ ఉడ్రఫ్ ఇచ్చిన మూడు ప్రసంగముల నుండి తీసుకొనబడిన భాగము”లలో(అధికారిక ప్రకటన 1 యొక్క అంతమున), ప్రభువు బహు వివాహ ఆచారమును ముగించడానికి ప్రవక్త చెప్పిన కారణాలేవి? దేవుని కార్యము గురించి ఇది మీకేమి బోధిస్తుంది?
విల్ఫర్డ్ ఉడ్రఫ్, హెచ్. ఇ. పీటర్‌సన్ చేత
నాకు పూర్తి అవగాహన లేనప్పటికీ, నేను ప్రభువు యందు నమ్మకముంచగలను.
కొంతకాలం ఆఫ్రికన్ సంతతికి చెందిన సంఘ సభ్యులకు యాజకత్వ నియామకము మరియు దేవాలయ విధులు ఎందుకు అందుబాటులో లేవో మనకు తెలియదు. ఆ విధానం గురించి సమాధానం లేని ప్రశ్నలను ఎదుర్కొన్నప్పుడు కూడా, చాలామంది నల్లజాతి కడవరి-దిన పరిశుద్ధులు ప్రభువును నమ్మారు (సామెతలు 3:5 చూడండి) మరియు వారి జీవితమంతా ఆయనపట్ల విశ్వాసంగా ఉన్నారు. వారి విశ్వాసం మరియు అనుభవాల గురించి తెలుసుకోవడం మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారి వృత్తాంతాలలో ఇక్కడ కొన్ని history.ChurchofJesusChrist.org వద్ద కనుగొనబడతాయి:
మీరు అధికారిక ప్రకటన 2 చదువుతున్నప్పుడు, ఆయన సంఘము యొక్క విధానాలను నిర్దేశించడానికి ప్రభువు యొక్క ప్రక్రియ గురించి మీరేమి నేర్చుకుంటారు? మీకు పరిపూర్ణ గ్రహింపు లేనప్పటికీ ప్రభువు నందు నమ్మికయుంచడాన్ని మీరెలా నేర్చుకున్నారో ధ్యానించండి.
2 నీఫై 26:33 కూడా చూడండి. history.ChurchofJesusChrist.org;
“నాకు తెలియదు” అని చెప్పడం సరియైనదే. మీరు బోధించే వ్యక్తులకు సువార్త గురించి వారికున్న ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సహాయం చేసేందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి, అయితే ప్రతిదీ మీకు తెలిసియుండాలని ప్రభువు ఆశించరు. దేనికైనా ఎలా సమాధానం చెప్పాలో మీకు తెలియనప్పుడు, దానిని అంగీకరించండి. తర్వాత, బయల్పరచబడిన సిద్ధాంతాన్ని అభ్యాసకులకు సూచించండి మరియు మీకు తెలిసిన దాని గురించి నిజాయితీగా సాక్ష్యమివ్వండి.
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
నేను యేసు క్రీస్తు సువార్తను నమ్ముతున్నాను.
-
మీ పిల్లలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విశ్వాస ప్రమాణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడే కీర్తనలు లేదా పిల్లల పాటలను కనుగొని, పాడడాన్ని పరిగణించండి. బహుశా వారు కీర్తనలు మరియు పాటలను ఎంచుకోవడానికి మీకు సహాయపడగలరు. పాటలు విశ్వాస ప్రమాణాలతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూడడానికి మీ పిల్లలకు సహాయపడండి.
-
యేసు క్రీస్తు యొక్క సువార్త లేదా ఆయన సంఘము గురించి జనులు కలిగియుండగల ప్రశ్నలను వ్రాయడానికి మీరు మరియు మీ పిల్లలు కలిసి పనిచేయవచ్చు. తర్వాత విశ్వాస ప్రమాణాలు ఉపయోగించి ఆ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మీరు కలిసి పనిచేయవచ్చు. మనకు సువార్త గురించి ప్రశ్నలు ఉన్నప్పుడు మనం ఇంకా వేటిని పరిశీలించవచ్చు?
విశ్వాస ప్రమాణాలు 1:9; అధికారిక ప్రకటనలు 1 మరియు 2
ఆయన ప్రవక్త ద్వారా ప్రభువు తన సంఘాన్ని నడిపిస్తారు.
-
తొమ్మిదవ విశ్వాస ప్రమాణమును మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయపడేందుకు, బహుశా మీరు వారికి లేఖనాలను మరియు జీవించియున్న ప్రవక్త యొక్క చిత్రాన్ని (లేదా లియహోనా యొక్క ఇటీవలి సమావేశ సంచిక) ఇవ్వవచ్చు. “దేవుడు బయలుపరచిన సమస్తమును” అనే పదాలు మీరు చదివినప్పుడు లేఖనాలను మరియు “ఇప్పుడు ఆయన బయలుపరచు సమస్తమును” (విశ్వాస ప్రమాణాలు 1:9) అని మీరు చదివినప్పుడు చిత్రము లేదా పత్రికను ఎత్తి పట్టుకోమని వారిని అడగండి. మనకు ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తలు ఎందుకు అవసరం?
-
ఆహారం లేదా బొమ్మ వంటి వాటిని తయారు చేయడానికి సూచనలను అనుసరించడం ద్వారా ప్రవక్తల మాటలు మనల్ని ఎలా నడిపిస్తాయో మీ పిల్లలు తెలుసుకోవచ్చు. మీరు దీనిని ప్రవక్త ద్వారా యేసు క్రీస్తు మనకు ఇచ్చే సూచనలతో పోల్చవచ్చు. జీవించియున్న తన ప్రవక్త ద్వారా ప్రభువు నేడు మనకు బోధించిన కొన్ని విషయాలు ఏమిటి?
తన సంఘాన్ని నడిపించడానికి దేవుడు ప్రవక్తలను పిలుస్తారు.
అధికారిక ప్రకటనలు 1 మరియు 2
పరలోక తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రవక్తలు మనకు సహాయం చేస్తారు.
-
బహుశా ప్రాచీన లేఖనాలు ఆధునిక బయల్పాటుతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూడడం మీ పిల్లలు అధికారిక ప్రకటనలను అర్థం చేసుకోవడంలో సహాయపడవచ్చు. మీరు వారిని అపొస్తలుల కార్యములు 10:34–35 మరియు జేకబ్ 2:27–30 చదవమని అడగవచ్చు మరియు ఏ లేఖనము అధికారిక ప్రకటనలు 1కి సంబంధించినది (బహు వివాహము యొక్క ముగింపుకు దారితీసినది) మరియు ఏది అధికారిక ప్రకటనలు 2కు సంబంధించినదో (అన్ని జాతుల వారికి యాజకత్వ నియామకము మరియు దేవాలయ విధులు లభ్యమవుతాయని ప్రకటించినది) నిర్ధారించమని వారిని ఆహ్వానించవచ్చు. ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తలకు ప్రభువు తన చిత్తాన్ని బయల్పరుస్తారని మీ సాక్ష్యం చెప్పండి.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.