Doctrine and Covenants 2025
జూలై 21–27: “ఎక్కువగా ఇయ్యబడినవాని యొద్దనుండి ఎక్కువగా కోరబడును”: సిద్ధాంతము మరియు నిబంధనలు 81–83


“జూలై 21–27: ‘ఎక్కువగా ఇయ్యబడినవాని యొద్దనుండి ఎక్కువగా కోరబడును’: సిద్ధాంతము మరియు నిబంధనలు 81–83,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 81–83,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

ధనవంతుడైన యౌవనుడితో మాట్లాడుతున్న యేసు క్రీస్తు

Christ and the Rich Young Ruler [క్రీస్తు మరియు ధనవంతుడైన యౌవన అధికారి] నుండి వివరణ, హీన్రిచ్ హాఫ్‌మన్ చేత

జూలై 21-27: “ఎక్కువగా ఇయ్యబడినవాని యొద్దనుండి ఎక్కువగా కోరబడును”

సిద్ధాంతము మరియు నిబంధనలు 81–83

1832 మార్చిలో, ఉన్నత యాజకత్వము యొక్క అధ్యక్షత్వములో (ఇప్పుడు ప్రథమ అధ్యక్షత్వము అని పిలువబడుతోంది) జోసెఫ్ స్మిత్‌కు సలహాదారునిగా ఉండేందుకు ప్రభువు జెస్సీ గాస్‌ను పిలిచారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 81 సహోదరుడు జెస్సీ గాస్‌కు అతని క్రొత్త పిలుపు గురించి ఇవ్వబడిన బయల్పాటు. కానీ జెస్సీ గాస్ నమ్మకంగా సేవ చేయలేదు, కాబట్టి అతని స్థానంలో ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్‌ పిలువబడ్డాడు. బయల్పాటులో సహోదరుడు గాస్ పేరు స్థానంలో సహోదరుడు విలియమ్స్ పేరు వచ్చింది.

అది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ అది ప్రముఖ సత్యాన్ని సూచిస్తుంది: సిద్ధాంతము మరియు నిబంధనలులోని బయల్పాటులలో అధికము నిర్దిష్టమైన జనులకు ఉద్దేశించబడినవి, కానీ వాటిని మనకు అన్వయించుకోవడానికి మనము ఎల్లప్పుడు మార్గాలను వెదకగలము (1 నీఫై 19:23 చూడండి). “సడలిన మోకాళ్ళను బలపరచుము” అని ప్రభువు ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్‌కు ఇచ్చిన ఉపదేశమును మనము చదివినప్పుడు, మనము బలపరచవలసిన జనుల గురించి మనం ఆలోచించగలము (సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5). “ఈ నిబంధన ద్వారా మిమ్మల్ని మీరు బద్ధులుగా చేసుకొనుము,” అని ప్రభువు ఐక్య సంస్థ యొక్క సభ్యులకు ఇచ్చిన ఆహ్వానాన్ని మనం చదివినప్పుడు, మనం మన స్వంత నిబంధనల గురించి ఆలోచించగలము. మరియు “నేను సెలవిచ్చునది మీరు చేసిన యెడల, నేను బద్ధుడనైయుందును,” అని ఆయన చేసిన వాగ్దానమును ఆయన మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చదవగలము (సిద్ధాంతము మరియు నిబంధనలు 82:10, 15). మనము దీనిని చేయగలము, ఎందుకనగా “నేను ఒకనితో చెప్పునది, అందరితో చెప్పుచున్నాను” అని ప్రభువు ప్రకటించారు (5వ వచనము).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 81:4-5; 82:18-19

“నీ పొరుగువారికి నీవు గొప్ప మేలు చేయుదువు.”

సిద్ధాంతము మరియు నిబంధనలు 81–83లోని అనేక గద్యభాగాలలో, మన చుట్టూ అవసరంలో ఉన్న జనులకు సహాయపడమని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారు. వాటిని మీరు కనుగొనినప్పుడు, గద్యభాగాలను గుర్తించడాన్ని పరిగణించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 81:4–5లో అత్యంత వివరణాత్మక ఉదాహరణలలో ఒకటి ఉంది. ఈ వచనములను ధ్యానించడానికి మీకు సహాయపడేందుకు ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి:

  • ఒక వ్యక్తి “బలహీనుడు” కాగల కొన్ని విధానాలేవి? వారికి “సహాయం చేయడం” అంటే అర్థమేమిటి? నేను బలహీనంగా భావించినప్పుడు ఇతరుల క్రీస్తువంటి సేవ నాకు ఎప్పుడు సహాయం చేసింది?

  • ఉపమానరీతిలో ఒక వ్యక్తి చేతులు “వడలునట్లు” ఏది చేయగలదు? ఆ చేతులను నేనెలా “పైకెత్తగలను”?

  • “సడలిన మోకాళ్ళు” అనగా అర్థమేమిటి? అవి ఎలా బలపరచబడతాయి?

రక్షకుడు మీ కోసం వీటిని ఎలా చేస్తారు?

ఈ వచనమును చదవడం బహుశా మీరు “సహాయం చేయగల,” “పైకెత్తగల” లేదా “బలపరచగల” ఒకరిని మీకు గుర్తు చేసియుండవచ్చు. ఆ వ్యక్తికి పరిచర్య చేయడానికి మీరేమి చేస్తారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 82: 18–19 లో ఇతరులకు సేవ చేయడం గురించి మీరు ఇంకేమి నేర్చుకుంటారు?

5:1

Teachings of Thomas S. Monson: Rescuing Those in Need

జేకబ్ 2:17–19; మోషైయ 18:8–9 కూడా చూడండి.

4:21

Works of God

బేతెస్ద కోనేరు వద్ద యేసు క్రీస్తు

కార్ల్ హీన్రిచ్ బ్లాచ్ (1834–1890), క్రైస్ట్ హీలింగ్ ది సిక్ ఎట్ బెథెస్డా, 1883, ఆయిల్ ఆన్ కాన్వాస్, 100 ¾ x 125 ½ అంగుళాలు. బ్రిగమ్ యంగ్ యూనివర్శిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, జాక్ ఆర్. మరియు మేరీ లోయిస్ వీట్లీ అందించిన నిధులతో కొనుగోలు చేయబడింది, 2001.

సిద్ధాంతము మరియు నిబంధనలు 82:3

రక్షకుడు నాకు చాలా ఇచ్చారు మరియు నా నుండి చాలా కోరుతున్నారు.

ఈ వచనాన్ని చదవడం దేవుడు మీకు ఇచ్చిన భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను సమీక్షించమని మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. మీరు 82వ ప్రకరణములో మిగిలిన భాగాన్ని చదివేటప్పుడు దీన్ని గుర్తుంచుకోండి. దేవుడు మీ నుండి ఏమి కోరుతున్నారని మీరు భావిస్తున్నారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 82:8–10

సెమినరీ చిహ్నము
ఆజ్ఞలు మనపట్ల దేవుని ప్రేమకు నిదర్శనము.

ప్రభువు ఇన్ని ఆజ్ఞలను ఎందుకిస్తారని మీరు లేదా మీకు తెలిసిన వారెవరైనా ఎప్పుడైనా ఆశ్చర్యపడితే, సిద్ధాంతము మరియు నిబంధనలు 82:8–10 సహాయపడగలదు. మీరు ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి ఎందుకు ఎంచుకున్నారని ఎవరికైనా వివరించడానికి ఈ వచనాలలోని ఏ అంతరార్థములు మీకు సహాయపడగలవు? సహాయపడగలిగేలా మీరు ఆజ్ఞలను దేనితో పోల్చవచ్చు? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 1:37–38; 130:20–21లో అదనపు అంతర్దృష్టులను కనుగొనవచ్చు. ఆజ్ఞలను దీవెనలుగా చూడాలని మీకు ఏ అనుభవాలు నేర్పించాయి?

5:41

Blessed and Happy Are Those Who Keep the Commandments of God

దేవుడు మీకు ఇచ్చిన కొన్ని ఆజ్ఞల గురించి ఆలోచించండి. ఆయన గురించి మరియు ఆయన చిత్తం గురించి ఈ ఆజ్ఞలు మీకు ఏమి బోధించాయి? (8వ వచనము చూడండి). ఈ ఆజ్ఞలను పాటించడం ద్వారా మీ జీవితం ఎలా ప్రభావితమైంది?

10వ వచనము నుండి ప్రభువు గురించి మీరేమి నేర్చుకుంటారు? ప్రభువు “బద్ధుడైయుండడం” అంటే ఏమిటని మీరు అనుకుంటున్నారు? (15వ వచనము కూడా చూడండి).

మీ జీవితంలో ప్రభువు తన వాగ్దానాలను ఎలా నిలుపుకున్నారు? వారు ఆశించిన దీవెనలు పొందనందున ఆజ్ఞలను పాటించడానికి ప్రేరేపించబడని వ్యక్తికి మీరు ఏమి చెప్పగలరు? ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ గారి సందేశము “దేవునితో మన సంబంధము”లో ఏవైనా సహాయకరమైన అంతర్దృష్టులను మీరు కనుగొన్నారా? (లియహోనా, మే 2022, 78-80).

సిద్ధాంతము మరియు నిబంధనలు 82:10

ప్రభువు తన స్వంత అద్భుతమైన మార్గాలలో మనల్ని దీవిస్తారు.

యువతుల ప్రధాన అధ్యక్షత్వము యొక్క మాజీ సభ్యురాలైన సహోదరి వర్జీనియా హెచ్. పియర్స్, అన్యాయమైన ఎంపికలు చేస్తున్న తన పిల్లల గురించి తీవ్రంగా చింతిస్తున్న ఒక మహిళ గురించి మాట్లాడారు. దాదాపు భయాందోళనలో, ఆమె వారి తరఫున ప్రభువు యొక్క దీవెనలను వెదకడానికి తాను ఆలోచించగలిగిన ప్రతీదాన్ని ప్రయత్నించింది. మనఃపూర్వకమైన ప్రార్థనతో పాటు, ఆమె దేవాలయ హాజరును పెంచాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించింది మరియు తన పిల్లల హృదయాలను మార్చడం ద్వారా ప్రభువు ఈ ముఖ్యమైన త్యాగాన్ని గౌరవిస్తారని ఖచ్చితంగా భావించింది. ఆ మహిళ ఇలా నివేదించింది:

“పదేళ్ల పాటు అధిక దేవాలయ హాజరు మరియు నిరంతర ప్రార్థనల తర్వాత, నా పిల్లల ఎంపికలు మారలేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. …

“కానీ నేను మారాను. నేను భిన్నమైన మహిళను. … నాకు మృదువైన హృదయం ఉంది. నేను కరుణతో నిండి ఉన్నాను. నేను నిజంగా ఎక్కువ చేయగలను మరియు భయం, ఆందోళన, అపరాధం, నింద మరియు దిగులు లేకుండా ఉన్నాను. నేను నా సమయ పరిమితులను వదులుకున్నాను మరియు ప్రభువు కోసం వేచి ఉండగలుగుతున్నాను. మరియు ప్రభువు శక్తి యొక్క వ్యక్తీకరణలను నేను తరచుగా అనుభవిస్తున్నాను. ఆయన నాపట్ల మరియు నా పిల్లల పట్ల తనకున్న ప్రేమను తెలియజేసే మృదు కనికరములను, చిన్న సందేశాలను పంపుతారు. నా అంచనాలు మారిపోయాయి. నా పిల్లలు మారతారని ఆశించే బదులు, నేను తరచూ ఈ మృదు కనికరములను ఆశిస్తున్నాను మరియు వాటి పట్ల కృతజ్ఞతతో నిండి ఉన్నాను. …

“నా ప్రార్థనలు మారాయి. నేను మరింత ప్రేమను వ్యక్తం చేస్తున్నాను మరియు మరింత కృతజ్ఞతతో ఉన్నాను. … ప్రభువు అద్భుతమైన మార్గాల్లో పనిచేస్తారు మరియు నేను నిజంగా శాంతితో నిండి ఉన్నాను, అది అన్ని అవగాహనలను అధిగమించింది (in “Prayer: A Small and Simple Thing,” At the Pulpit [2017], 288–89).

సిద్ధాంతము మరియు నిబంధనలు 83

“విధవరాండ్రు, దిక్కులేని పిల్లలు ఆదరించబడవలెను.”

1832 ఏప్రిల్‌లో, మిస్సోరిలో సమకూడిన పరిశుద్ధులను దర్శించడానికి ప్రభువు చేత సూచించబడినట్లుగా జోసెఫ్ స్మిత్ దాదాపు 800 మైళ్ళు ప్రయాణించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:9 చూడండి). ఆయన అక్కడున్నప్పుడు, ఆయన దర్శించిన ఒక సమాజంలో ఒంటరిగా తమ పిల్లలను పెంచుతున్న విధవరాండ్రు చాలామంది ఉన్నారు. వారిలో ప్రవక్త వ్యక్తిగతంగా యెరిగియున్న ఫీబి పెక్ మరియు అన్నా రోగర్స్ ఉన్నారు. 1830లలో, మిస్సోరిలోని రాష్ట్ర చట్టాలు, మరణించిన తమ భర్త ఆస్తిపై విధవరాండ్రకు పరిమిత హక్కులను ఇచ్చాయి. విధవరాండ్రు, దిక్కులేని పిల్లల గురించి ప్రభువు ఎలా భావిస్తారనే దాని గురించి 83వ ప్రకరణము నుండి మీరేమి నేర్చుకుంటారు? ఈ పరిస్థితిలో మీ ప్రేమ లేదా శ్రద్ధ మూలముగా లాభము పొందే వారెవరైనా మీకు తెలుసా? మీరు విధవరాండ్రు, దిక్కులేని పిల్లలు, ఒంటరి తల్లులు మరియు అవసరంలో ఉన్న ఇతరులతో మీ వద్ద ఉన్న వాటిని పంచుకోవడానికి గల కొన్ని మార్గాలు ఏవి?

యెషయా 1:17; యాకోబు 1:27 కూడా చూడండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 81:3

“బహిరంగముగా మరియు [నా] అంతరంగములో” నేను దేవునికి ప్రార్థించగలను.

  • మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 81:3ను మీ పిల్లలతో కలిసి చదువుతున్నప్పుడు, వారు ప్రార్థన చేయగల వివిధ “బహిరంగ” మరియు “వ్యక్తిగత” స్థలాల గురించి ఆలోచించడంలో వారికి సహాయపడండి. ప్రార్థన గురించి ఒక కీర్తనను కూడా మీరు వారితోపాటు వినవచ్చు లేదా పాడవచ్చు. ప్రార్థన గురించి ముఖ్యమైన సత్యాన్ని బోధించే దేనినైనా కీర్తన నుండి ఒకరితో ఒకరు పంచుకోండి. మీరు పరలోక తండ్రితో భక్తిపూర్వకంగా మాట్లాడడం గురించి కూడా మాట్లాడవచ్చు.

  • మీ పిల్లలను వారి హృదయాలలో ప్రార్థించమని ప్రోత్సహించడానికి, మీరు వారికి కాగితపు హృదయాలను ఇచ్చి, వారు పరలోక తండ్రిని ప్రార్థించాలనుకుంటున్న దానిని గీయమని లేదా వ్రాయమని వారిని ఆహ్వానించవచ్చు. మనం ఏమి ఆలోచిస్తున్నామో మరియు అనుభూతి చెందుతున్నామో పరలోక తండ్రికి తెలుసునని మరియు మన ప్రార్థనలను మనం బిగ్గరగా చెప్పకపోయినా ఆయన వినగలరని సాక్ష్యమివ్వండి. మీరు మీ హృదయంలో ప్రార్థించగా పరలోక తండ్రి మీ ప్రార్థన వినినప్పటి ఒక అనుభవాన్ని మీరు వారితో పంచుకోవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5

అవసరంలో ఉన్న జనులకు సహాయపడమని ప్రభువు నన్ను కోరుతున్నారు.

  • మీ పిల్లలతో కలిసి చేతులు మరియు మోకాళ్ళ చిత్రాలను గీయండి మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5లో ఈ శరీర భాగాలను కనుగొనమని మీ పిల్లలను అడగండి. ఈ వచనములో ఏమి చేయమని ప్రభువు మనల్ని అడుగుతున్నారు? మీరు “బలహీనంగా” లేదా “సడలినట్లుగా” భావించినప్పుడు జనులు మిమ్మల్ని బలపరిచిన కొన్ని మార్గాలను మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ChurchofJesusChrist.org మీరు సేవ గురించి ఒక పాటను కూడా పాడవచ్చు. ఈ వారంలో అవసరంలోనున్న కనీసం ఒక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రణాళికను రూపొందించడంలో మీ పిల్లలకు సహాయం చేయడాన్ని పరిగణించండి.

    2:18

    Pass It On

  • యేసు క్రీస్తు ఇతరులకు సేవ చేస్తున్న సాధారణ కథలను చెప్పడానికి మీరు చిత్రాలు లేదా వీడియోలను కూడా ఉపయోగించవచ్చు (ఈ నమూనా‌లోని చిత్రాలను చూడండి). ఇతరులకు సహాయం చేయడంలో రక్షకుని మాదిరిని మనం ఎలా అనుసరించవచ్చు?

    Christ raising the daughter of Jairus
ఆయన స్వస్థపరచిన స్త్రీతో యేసు క్రీస్తు

రక్షకుడు చేసినట్లుగా మనం కూడా అవసరంలోనున్న వ్యక్తులను చేరుకోవచ్చు.

మీ పిల్లలు వారి స్వంత ప్రేరేపణను పొందడంలో సహాయపడండి. బోధించడం అంటే కేవలం సత్యాన్ని పంచుకోవడం కంటే ఎక్కువ—దానర్థం, ఇతర వ్యక్తులు స్వతంత్ర అభ్యాసకులుగా మారడంలో సహాయపడడం. ఉదాహరణకు, వారు ఇతరులకు ఎలా సేవ చేయవచ్చో మీ పిల్లలకు చెప్పడానికి బదులుగా, వారు ఎవరికి సహాయం చేయగలరో తెలుసుకోవడానికి ప్రభువు యొక్క నడిపింపును వెదకమని వారిని ప్రోత్సహించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 82:10

నేను ఆయనకు విధేయత చూపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పరలోక తండ్రి దీవెనలను వాగ్దానం చేస్తారు.

  • పరలోక తండ్రి మనకు ఆజ్ఞలను ఎందుకిస్తారు? అనే ప్రశ్నకు జవాబుల కొరకు మీరు మరియు మీ పిల్లలు సిద్ధాంతము మరియు నిబంధనలు 82:8–10 లో చూడవచ్చు. ఆయన ఆజ్ఞల యొక్క ఉదాహరణల గురించి ఆలోచించడంలో మీరు మీ పిల్లలకు సహాయపడాలనుకోవచ్చు (ఉదాహరణకు, నిర్గమకాండము 20:4–17; మత్తయి 22:37–39; సిద్ధాంతము మరియు నిబంధనలు 89:5–17 చూడండి). మీరు మరియు మీ పిల్లలు వాటిలో కొన్నింటిని సూచించడానికి చిత్రాలను కనుగొనడం లేదా గీయడం చేస్తే అవి మీకు సహాయపడవచ్చు. పరలోక తండ్రి ఆజ్ఞలు మనపట్ల ఆయనకున్న ప్రేమను ఎలా చూపుతాయి?

  • బహుశా ఒక సాధారణ ఆట దేవుని ఆజ్ఞలను భారంగా కాకుండా దీవెనలుగా చూడడంలో మీ పిల్లలకు సహాయపడవచ్చు. ఒక వ్యక్తి కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్న మరొక వ్యక్తికి శాండ్‌విచ్ తయారు చేయడం లేదా చిత్రాన్ని గీయడం వంటి వాటిలో సహాయం చేయడానికి సూచనలు ఇవ్వగలడు. ఆహ్లాదకరమైనది మరియు సృజనాత్మకమైనది ఏదైనా ఆలోచించండి. తర్వాత, దేవుని ఆజ్ఞలు ఈ ఆటలోని సూచనల వలె ఎట్లున్నాయనే దాని గురించి మాట్లాడండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ఆయన స్వస్థపరచిన వ్యక్తితో యేసు క్రీస్తు

ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్న యేసు యొక్క వివరణ, డాన్ బర్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ