లియహోనా
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తిని పొందడం
2026 ఏప్రిల్ లియహోనా


ఆసియా ప్రాంతీయ నాయకత్వ సందేశం

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తిని పొందడం

లేఖనాలలో ఎంతమంది యేసు క్రీస్తు యొక్క స్వస్థపరిచే శక్తిని పొందగలిగారో చూడటం ప్రేరేపితంగా ఉంటుంది. మనుష్యులు రక్షకుని దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసముంచినప్పుడు మళ్ళీ మళ్ళీ అద్భుతాలు జరిగాయి. మార్కు 5:25–34 లో, అనేక సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు వస్త్రపు అంచును ముట్టి స్వస్థత పొందింది. యేసు ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను” అని అన్నాడు. అదేవిధంగా, మార్కు 10:46–52 లో, ఒక గ్రుడ్డివాడు యేసు దగ్గరలో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు, “యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము” అని కేకలు వేశాడు. అతనికి చూపు ఇచ్చిన తర్వాత, రక్షకుడు ఇలా ప్రకటించారు "నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను". ఆయన స్వస్థపరిచే శక్తిని పొందడానికి యేసు క్రీస్తునందు విశ్వాసం అవసరమని ఈ వృత్తాంతాలు స్పష్టంగా బోధిస్తాయి.

యేసు ఇక భూమిపై మన మధ్య భౌతికంగా సంచరించడం లేదు. ఈ రోజు మనం ఆయనకు దగ్గరగా ఎలా రాగలం మరియు ఆయన ప్రాయశ్చిత్త శక్తిని ఎలా పొందగలం? మోర్మన్ గ్రంథము ఆల్మా 7:21 లో " మలినమైనది లేదా అపవిత్రమైనది ఏదైనను దేవుని రాజ్యమందు స్వీకరించబడదు అని బోధిస్తుంది." పాపం నుండి వైదొలగడానికి మరియు పశ్చాత్తాపపడటానికి మనం ఒక జ్ఞానముగల నిర్ణయం తీసుకోవాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. పశ్చాత్తాపానికి హృదయ మార్పు అవసరం-యేసు క్రీస్తును అనుసరించాలనే హృదయపూర్వక కోరిక. నీటి ద్వారా బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మ నిర్ధారణ ద్వారా, మన శరీరాలు మరియు ఆత్మలు శుద్ధి చేయబడి, పరిశుద్ధపరచబడతాయి. ఈ పవిత్ర నిబంధనలు చేయడం ద్వారా, మనం మన రక్షకునితో ప్రత్యక్ష మరియు వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరుచుకుంటాము.

మనం పాటిస్తామని వాగ్దానం చేసిన ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు, ఈ నిబంధన అనుబంధం మనల్ని రక్షిస్తుంది మరియు బలపరుస్తుంది. కానీ జీవితం పరీక్షలు మరియు శోధనలతో నిండి ఉంటుంది మరియు కొన్నిసార్లు మనం తప్పిపోతాము. మనం తప్పులు చేసినప్పుడు, రక్షకుని యొక్క అంతములేని ప్రాయశ్చిత్తం తిరిగి మార్గాన్ని అందిస్తుంది. యోహాను 6 లో, యేసు కేవలం ఐదు రొట్టెలు మరియు రెండు చిన్న చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టగా, అందరి కడుపు నిండిన తరువాత ఆహారం ఇంకా మిగిలింది. ఆయన ప్రాయశ్చిత్త శక్తి తాత్కాలిక సమస్యలకే పరిమితం కాదని ఈ అద్భుతం వివరిస్తుంది - అది అంతంలేనిది. తరువాత యేసు ఇలా బోధించారు, "నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము” (యోహాను 6:54–56). ఆయన బలి ద్వారా అందరూ క్షమాపణ, స్వస్థత, ఆత్మీయ పునరుద్ధరణ పొందవచ్చని మరియు మరణాన్ని అధిగమించవచ్చని ఆయన మాటలు స్పష్టంగా చెబుతున్నాయి! ప్రతి వారం మనం సంస్కారంలో పాలుపంచుకోవడంతో, మనం కొత్తగా పరిశుద్ధపరచబడి, యేసు క్రీస్తుకు దగ్గరవుతాము. నిబంధన మార్గంలో ఉండటం ద్వారా, ఆయన ప్రాయశ్చిత్త శక్తిని మనం నిరంతరం పొందగలము.

మనకు అలాంటి పవిత్ర శక్తి అందుబాటులో ఉంది కాబట్టి, ఇతరులను ఆశీర్వదించడానికి దానిని ఉపయోగించడం కూడా మన బాధ్యత. మత్తయి 16:19 లో యేసు పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, భూలోకమందు మరియు పరలోకమందును బంధించగల/విప్పగల శక్తి ఇస్తానని బోధించారు. యాజకత్వ ఆశీర్వాదాలు, దేవాలయ విదులు మరియు జీవించి ఉన్నవారికి మరియు చనిపోయినవారికి పవిత్ర కార్యం ద్వారా, మనం ఆత్మలను దేవునికి దగ్గరగా తీసుకురావడానికి సహాయం చేస్తాము. ఈ విధులు యేసు క్రీస్తు ప్రాయశ్చిత్త శక్తిని లోతైన మరియు మరింత అర్థవంతమైన మార్గాలలో అనుభవించడానికి మనకు అనుమతిస్తాయి. ఈ పవిత్ర శక్తి గురించి మనం ఇతరులకు మన సాక్ష్యాన్ని అందించాలి. మనం రక్షకుని వద్దకు వస్తే, మనం ఏమి చేసినా, ఎన్ని భారాలను మోసినా, ఎన్నిసార్లు పడిపోయినా, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తి మనందరినీ రక్షించగలదు.

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తిని పొందడం అనేది పరలోకం నుండి వచ్చే అద్భుతమైన ఆశీర్వాదం, అది నిత్యత్త్వానికి దారితీస్తుంది. ఇది విశ్వాసం, పశ్చాత్తాపం, పవిత్ర నిబంధనలు మరియు విధుల ద్వారా నిరంతర పునరుద్ధరణ ద్వారా కనుగొనబడుతుంది. మనం క్రీస్తును అనుసరిస్తూ, ఇతరులు కూడా అలాగే చేయడానికి సహాయం చేస్తున్నప్పుడు, ఆయన అనంతమైన శక్తి మనల్ని స్వస్థపరుస్తుంది, మనల్ని బలపరుస్తుంది మరియు మన పరలోక తండ్రి వద్దకు తిరిగి నడిపిస్తుంది. మన ప్రియమైన కుటుంబ సభ్యులతో కలిసి మనం ఎప్పటికీ అంతిమ ఆనందాన్ని అనుభవిస్తాము.