“మన ప్రియమైన రక్షకుని విజయం,” లియహోనా , 2026 ఏప్రిల్.
లియహోనా నెలవారీ సందేశము, 2026 ఏప్రిల్
మన ప్రియమైన రక్షకుని విజయం
యేసు క్రీస్తు ఇచ్చిన అమూల్యమైన బహుమతి యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు లేవు. ఇది మరొకరి నుండి ఎప్పటికీ అవసరం పడదు. ఆయన “అందరి కోసం ఒకేసారి” శ్రమను అనుభవించారు.
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, మన రక్షకుని యొక్క అపరిమితమైన బహుమతి అయిన యేసు క్రీస్తు వారి ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తూ, అధ్యయనం చేస్తూ మరియు దానిలో అపారమైన ఓదార్పును పొందుతున్న కొద్దీ నేను మరింత వినయపూర్వకముగా మారాను. గెత్సేమనేలో, సిలువపై మరియు సమాధి వద్ద జరిగిన దాని వల్ల మానవాళి యొక్క విధి ఎంత పూర్తిగా మారిపోయిందో అర్థం చేసుకోవడం మానవ మేధస్సుకు దాదాపు అసాధ్యం.
మనమందరం హృదయ విదారకతను మరియు బాధను ఎదుర్కొంటాము
అపొస్తలుడిగా నా పిలుపులో, నేను విస్తృతంగా ప్రయాణించాను మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, యువత మరియు పెద్దలను కలిసే భాగ్యం నాకు లభించింది. జీవితంలో చాలా ఆనందకరమైన క్షణాలు ఉంటాయి, కానీ నేను నా కళ్ళతో చూసిన మరియు నా హృదయ లోతుల్లో అనుభూతి చెందిన ఒక విషయం ఏమిటంటే, సంతోషం మరియు ఆనందంతో పాటు, జీవితంలో హృదయాన్ని కలచివేసే బాధాకరమైన మరియు శ్రమతో కూడిన క్షణాలు కూడా ఉంటాయి.
పిల్లలు నిద్రపోతున్న సమయంలో వారి ఇంట్లోకి చొరబడిన వ్యక్తి చేతిలో దారుణంగా మరణించిన తల్లిదండ్రుల యొక్క నలుగురు చిన్న పిల్లలతో కలిసి కూర్చున్న సందర్భాన్ని, లేదా చిన్నతనంలో నమ్మకస్తుడైన బంధువు ద్వారా వేధింపులకు గురైన స్త్రీని కలవడం, లేదా సైకిల్ నుండి పడి మెదడుకు గాయమై త్వరలోనే మరణించబోయే ఒక చిన్న అమ్మాయి పడక పక్కన కూర్చోవడం, లేదా తన భర్త తనను మరియు తన దేవాలయ నిబంధనలను చాలా సంవత్సరాలుగా ఘోరమైన రీతిలో మోసం చేసినందుకు ఏడుస్తున్న ఒక స్త్రీ యొక్క రోదనను వినడం నేను ఎప్పటికీ మర్చిపోలేను.
వయోజనుడైన తమ బిడ్డ ఇకపై సువార్త సత్యాలను నమ్మకపోవడమే కాకుండా, కుటుంబంలోని ఇతరుల విశ్వాసాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించినప్పుడు ఒక దంపతులు అనుభవించిన బాధను నేను అనుభూతి చెందాను. గొప్ప భవిష్యత్తు పొందే సామర్థ్యం కలిగిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, తీవ్ర మనస్తాపానికి గురైన అతని తల్లిదండ్రులను మరియు స్నేహితులను నేను సందర్శించాను. పాపం చేసి, నిజంగా పశ్చాత్తాపపడాలనుకునే వారి దైవిక విచారాన్ని మరియు ఆ పాపం వల్ల ప్రభావితమైన వారు అనుభవించిన వినాశనాన్ని నేను అనుభూతి చెందాను.
మానసిక అనారోగ్యం కారణంగా బాధపడేవారు మరియు వారికి సహాయం చేసే అవకాశం లేక నిశ్శబ్దంగా వేదనను అనుభవించే వారి ఇద్దరి హృదయ విదారక స్థితినీ నేను చూశాను. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు మరియు భూకంపాల వల్ల కలిగే అపారమైన వ్యక్తిగత నష్టాన్ని నేను చూశాను. రాజకీయ తుఫానులు, యుద్ధాలు మరియు విధ్వంసం కారణంగా దేశాలలో తలెత్తిన కల్లోలాన్ని, అమాయకులుగా ఉంటూ సరైనది చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై ఊహించని విపత్తులు వచ్చిపడినప్పుడు కలిగే వేదనను కూడా నేను గమనించాను.
Healing Hands [స్వస్థపరిచే చేతులు], కోల్బీ లార్సెన్ చేత, కాపీ చేయరాదు
రక్షకుడు మనల్ని ఆదరిస్తారు
ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారుడు అయిన అధ్యక్షుడు జేమ్స్ ఇ. ఫౌస్ట్ (1920–2007), యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు: “బాధించబడిన వారు తమ శ్రమలను అధిగమించడానికి చేయగలిగినదంతా చేయాలి, మరియు రక్షకుడు ‘తన ప్రజల బలహీనతలను బట్టి వారికి ఆదరిస్తారు’ [ఆల్మా 7:12]. ఆయన మన భారాలను మోయడానికి సహాయం చేస్తారు. కొన్ని గాయాలు ఎంత బాధాకరమైనవి మరియు లోతైనవి అంటే, ఉన్నతమైన శక్తి యొక్క సహాయం లేకుండా మరియు తదుపరి జీవితంలో సంపూర్ణ న్యాయం మరియు పునరుద్ధరణ జరుగుతుందనే నిరీక్షణ లేకుండా అవి నయం కావు. … ఆయన మన బాధను అర్థం చేసుకుంటారు మరియు మన చీకటి సమయాల్లో కూడా మనతో కలిసి నడుస్తారు.”
నేను రక్షకుని ప్రేమకు మరియు యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా మనకు వాగ్దానం చేయబడిన అంతము లేని దీవెనల పట్ల మరింతగా ఆకర్షితుడనయ్యాను. జీవితంలో అపారమైన బాధను కలిగించే కష్టతరమైన అనుభవాల నుండి ఆయన మనల్ని రక్షించలేదు, కానీ శాశ్వతమైన శ్రమల నుండి మరియు పరలోకపు తండ్రి నుండి వేరు చేయబడకుండా మనల్ని కాపాడారు మరియు ఆయన అనుభవించిన సర్వవ్యాప్త శ్రమల ద్వారా, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందాన్ని మరియు నిత్య సంతోషాన్ని పొందే అవకాశాన్ని మనకు ప్రసాదించారు.
అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ మనకు ఇలా గుర్తుచేశారు: “ఇప్పటివరకు, దేవుడు మనుష్యులకు అందించిన అన్నిటికంటే గొప్ప మర్త్య సహాయం, రక్షకుడైన యేసుక్రీస్తును మనకు ప్రసాదించడం, ఆయన మన పాపాలకు వెల చెల్లించడానికి శ్రమలు అనుభవించారు మరియు పశ్చాత్తాపపడిన పాపాలకు క్షమాపణను అందించారు. ఆ కనికరముగల మరియు మహిమాన్వితమైన ప్రాయశ్చిత్తము, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం అనేది సువార్త యొక్క మొదటి సూత్రం ఎందుకు అని వివరిస్తుంది. ఆయన ప్రాయశ్చిత్తం ‘మృతుల పునరుత్థానమును తెచ్చును’ ( ఆల్మా 42:23), మరియు అది ‘లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయును’ (ఆల్మా 34:8), మన పశ్చాత్తాపపడిన పాపాలన్నింటినీ తుడిచివేసి, మన మర్త్య బలహీనతలలో మనకు సహాయం చేసే శక్తిని మన రక్షకుడికి ప్రసాదిస్తుంది.”
డెల్ పార్సన్ చేత వర్ణించబడిన Prayer at Gethsemane [గెత్సెమనే వద్ద ప్రార్థన] నుండి వివరాలు, సంఘ ఉపయోగం కోసం మాత్రమే కాపీ చేయవచ్చు
నిత్యత్వము యొక్క కీలక ఘట్టం
భూమి మీద జీవించిన లేదా జీవించబోయే వారందరితో పోలిస్తే నేను వ్యక్తిగతంగా చూసిన శ్రమలు అత్యంత స్వల్పమైనవి. అయినప్పటికీ, మానవాళి అందరి పాపాలు మరియు బాధల కోసం రక్షకుడు తాను అనుభవించిన ఆ పవిత్రమైన, సర్వవ్యాప్త శ్రమల సమయంలో ఆయన హృదయం, మనస్సు, శరీరం మరియు ఆత్మలో ఏమి జరిగి ఉంటుందో అని ఆలోచించినప్పుడు, నా హృదయంలోని ఆ భావాలను నాకు తెలిసిన ఏ పదాలతో కూడా నేను వర్ణించలేను.
యెరూషలేము నగర గోడల వెలుపల ఉన్న ఒలీవల కొండపై యేసు “గెత్సేమనే అనబడిన చోటికి” (మత్తయి 26:36) వెళ్ళినప్పుడు, నిత్యత్వమంతటిలోనూ అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభమైంది. ఆయన తన శిష్యులతో, “మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది” (మత్తయి 26:38) అని చెప్పెను.
ఆయన, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని” (మత్తయి 26:39) ప్రార్థించెను. ఆయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి, వారు నిద్రపోతూ ఉండడం చూసి, మళ్ళీ వెళ్ళి, రెండవసారి ప్రార్థించెను. “నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక. … మరియు [ఆయన] ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను” (మత్తయి 26:42, 44).
యేసు ఆ చేదు గిన్నెను తాగి, తోటలో మరియు సిలువపై మన మర్త్య అవగాహనకు మించి బాధపడ్డారు. పాపం లేకుండా, ఆయన మన పాపాలన్నింటినీ స్వయంగా స్వీకరించారు, మనం ఆయన వద్దకు వచ్చి పశ్చాత్తాపపడినప్పుడు, మన పాపాలు మరియు భారాలు మన నుండి తొలగిపోతాయి. ( 2 కొరింథీయులకు 5:21 చూడండి).
యేసు యొక్క బాధ, మరణం మరియు ప్రాయశ్చిత్త బలి చాలా కాలంగా ఎదురుచూడబడ్డాయి. యేసు జన్మించడానికి 700 సంవత్సరాల ముందే యెషయా, "యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను" అని ప్రవచించారు” (యెషయా 53:6). యేసు తన జీవితాన్ని, తన యందు విశ్వాసముంచి తమ పాపముల నుండి పశ్చాత్తాపపడే వారందరి “పాప క్షమాపణ నిమిత్తము”మత్తయి 26:28, “ఒక విమోచన క్రయధనముగా ” (మత్తయి 20:28; 1 తిమోతి 2:6 కూడా చూడండి) ఇస్తున్నట్లు మాట్లాడారు. యేసు మన “పాపముల కొరకు శ్రమపడెనని” (1 పేతురు 3:18), ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది (1 పేతురు 2:24చూడండి), అని పేతురు వివరించాడు. మన తండ్రి సన్నిధికి మనం తిరిగి వెళ్ళడానికి వీలుగా, మరెవరూ చేయలేని పనిని ఆయన చేశారు. ఆయన “మన యతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడెను” (యెషయా 53:5).
గెత్సెమనేలోని శ్రమల తర్వాత, ఆయన వేదన కొనసాగింది—ఆయనతో కలిసి నడిచిన ఒకరి ద్వారానే జరిగిన ద్రోహం, అన్యాయమైన పాలకుల ముందు ఎదురైన అవమానం, ఆయన శరీరాన్ని కొరడాలతో కొట్టినప్పుడు కలిగిన నొప్పి, క్రూరులు మరియు దయలేని సైనికులు ఆయన తలపై ముళ్ళ కిరీటాన్ని ఒత్తి ఉంచడం (యోహాను 18:2–3, 12–14; మార్కు 15:15–20 చూడండి), మరియు ఆయన గొల్గొతా వైపు వెళుతుండగా ఆయన వీపుపై గాయపడిన మాంసం మీద భారీ సిలువ మ్రానును ఉంచడం (యోహాను 19:16–17 చూడండి).
సిలువపై, గెత్సేమనేలో అనుభవించిన తీవ్రమైన వేదన ఏ మానవుడు భరించలేని తీవ్రతతో తిరిగి వచ్చింది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు, తన ప్రాణాన్ని అర్పించవలెనని తన తండ్రి ద్వారా ఇవ్వబడిన దైవిక ఆజ్ఞను ఒంటరిగా భరించారు. సైనికులు మరియు పాలకులు ఆయన నుండి దానిని తీసుకోలేకపోయారు (యోహాను 10:18 చూడండి). భక్తితో మరియు వినయంతో, యేసు తన తల వంచి, “సమాప్తమైంది” (యోహాను 19:30) అని అన్నారు.
ఆయన మర్త్య జీవితంలోని చివరి క్షణం పూర్తయింది. ఆయన ఇచ్చిన అమూల్యమైన బహుమతి యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి పదాలు లేవు. ఇది మరొకరి నుండి ఎప్పటికీ అవసరం పడదు. యేసు క్రీస్తు “ఒక్కసారియే” శ్రమ పడ్డారు (హెబ్రీయులకు 10:10).
ఆయన లేచియున్నారు!
ఆయన దైవిక నియమితకార్యము పూర్తయిన తర్వాత, మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సమాధి నుండి లేచి అమర్త్యత్వములోకి ప్రవేశించిన వ్యక్తిగా ఆయన అవుతారు (1 కొరింథీయులకు 15:21–23 చూడండి).
సమాధి వద్ద ఉన్న స్త్రీలతో, దేవదూతలు ఇలా అన్నారు:
“సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు?
“ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు” (లూకా 24:5–6).
ఆయన తన అపొస్తలులతో, “నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి” (లూకా 24:39) అని” అన్నారు. అటుపిమ్మట “ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను” (1 కొరింథీయులకు15:6). ప్రత్యక్ష సాక్షులు పునరుత్థానుడైన రక్షకుడిని చూశారు. ఆయన చనిపోలేదు. ఆయన సజీవంగా ఉన్నారు.
ఈ భూమిపై జీవించిన లేదా జీవించబోయే ప్రతి వ్యక్తిక కొరకు, యేసు క్రీస్తు మరణం యొక్క శాశ్వతమైన బంధనాల సంకెళ్లను తెంచారు (1 కొరింథీయులకు 15:22 చూడండి). ఆయన మన సర్వవ్యాప్త శత్రువును జయించారు; మరణమనే ఆ శత్రువు శాశ్వతంగా ఓడించబడింది.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ (1924–2025) ఇలా అన్నారు: “యేసు క్రీస్తు మీపాపాలను, మీ బాధలను, మీ హృదయ వేదనలను, మరియు మీ బలహీనతలను తనపై తీసుకున్నారు. మీరు వాటిని ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు! మీరు పశ్చాత్తాపపడినప్పుడు ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. మీకు అవసరమైన వాటిని ఆయన మీకు అనుగ్రహిస్తాడురు. ఆయన మీ గాయపడిన ఆత్మను స్వస్థపరుస్తారు. మీరు ఆయన కాడిని ధరించినప్పుడు, మీ భారాలు తేలికగా అనిపిస్తాయి. మీరు యేసు క్రీస్తును అనుసరించడానికి నిబంధనలు చేసి, వాటిని పాటించినట్లయితే, మీ జీవితంలోని బాధాకరమైన క్షణాలు తాత్కాలికమైనవని మీరు గ్రహిస్తారు. మీ బాధలు ‘క్రీస్తు యొక్క సంతోషమందు హరించివేయబడతాయి’ [ఆల్మా 31:38]”
ఆయనచే నియమించబడిన అపొస్తలులలో ఒకరిగా, ఆయన సజీవుడై ఉన్నారని నాకు నిశ్చయమైన మరియు ఖచ్చితమైన సాక్ష్యాన్ని అందించిన ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత క్షణాలను నేను అనుభవించాను. ఈ ఈస్టరు పండుగ సమయంలో, మనం ఆనందంగా పాటలు పాడుతున్నప్పుడు ఈ మాటలు మన మనస్సులలో మరియు హృదయాలలో సున్నితంగా నిలిచిపోవుగాక:”
© 2026 by Intellectual Reserve, Inc. All rights reserved. అ. సం. రాలలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, April 2026 యొక్క అనువాదము. Telugu. 20038 421