“ఆనందకరమైన నిబంధన మార్గము,” లియహోనా, ఫిబ్ర. 2026.
లియహోనా నెలవారీ సందేశము, 2026 ఫిబ్రవరి
ఆనందకరమైన నిబంధన మార్గము
తండ్రి మరియు కుమారుని యొక్క సన్నిధిలో కుటుంబ సభ్యులు కలిసి ముద్రింపబడే అద్భుతము మరియు గొప్పతనం నా ఆత్మకు అత్యద్భుతమైన విస్మయం మరియు ఆనందాన్ని తెస్తుంది మరియు నన్ను కృతజ్ఞతాత్మతో నింపుతుంది.
ఎల్డర్ పాట్రిక్ కీరన్ మరియు ఆయన భార్య, జెన్నిఫర్
1848 లో ఇజ్రాయెల్ మరియు ఎలిజబెత్ హావెన్ బార్లో ఇల్లినాయిస్‌లోని నావూ నుండి సాల్ట్ లేక్ లోయకు బయలుదేరినప్పుడు, వారు నావూలోని ఒక చిన్న స్మశానవాటికలో పాతిపెట్టిన ఒక పసిబాలుడిని వదిలి వెళ్ళిపోయారు. ఆ బాలుడు వారి మొదటి బిడ్డ, పసివాడైన జేమ్స్ నతానియేల్ బార్లో 1841 మేలో పుట్టిన వెంటనే చనిపోయాడు.
సాల్ట్ లేక్ లోయకు బయలుదేరిన తరువాత, ఇజ్రాయెల్ మరియు ఎలిజబెత్ తమ కుమారుడి సమాధిని మరలా చూస్తారని ఎప్పడూ ఊహించియుండకపోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఇజ్రాయెల్ ఒక మిషనుపై పిలవబడినప్పుడు, అతడు తూర్పు వైపు ప్రయాణిస్తూ నావూ గుండా వెళ్ళాడు. ఎలిజబెత్ కోరిక మేరకు, అతడు వారి కుమారుడి సమాధిని కనుగొని, అతడి అవశేషాలను పట్టణానికి తూర్పున ఉన్న ప్రధాన స్మశానవాటికకు తరలించడానికి ఆగిపోయాడు.
ఒక రోజంతా వెతికినా ఫలితం లేకుండా పోయిన తర్వాత, ఇజ్రాయెల్ స్థానిక సంరక్షకుడి సహాయం కోరాడు. మరుసటి రోజు, వారు జేమ్స్ బంధువైన మేరీ పక్కన ఉన్న సమాధిని కనుగొన్నారు. విషాదకరంగా, శవపేటికలు కుళ్ళిపోయి, విరిగిపోయాయి. ఇజ్రాయెల్ తన భార్యకు రాసిన లేఖలో, “కాబట్టి నేను వాటిని దూరంగా ఉంచి, భవిష్యత్తు వరకు వాటిని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నాను” అని వ్రాశాడు.
అతడు సమాధి నుండి కాస్త దూరం నడిచేలోపే ఒక స్వరం విన్నాడు. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, అతడు ఇలా వ్రాసాడు, “అది వినబడలేదు, కానీ నా మనసుకు చాలా స్పష్టంగా ఉన్నది, నేను దానిని ఖండించలేకపోయాను: ‘నాన్నా, నన్ను ఇక్కడ వదలి వెళ్ళకండి.’” ఇజ్రాయేల్ సమాధి వద్దకు తిరిగి వచ్చాడు, చివరికి తన చిన్న బాలుడిని తీసివేయాలని నిర్ణయించుకున్నాడు. “అది నేను ఇంతకు ముందు అనుభవించని చాలా విచిత్రమైన ప్రశాంతతను మరియు మనశ్శాంతిని అనుభవించాను. … నేను ఇంతే చెబుతాను: నా జీవితంలో ఏ పనిని చేసినా నేను ఇంతగా స్పృహతో ఎప్పుడూ లేను.”
1853, సెప్టెంబరు 2న, ఇజ్రాయేల్ బార్లో మరియు సంరక్షకుడు, జేమ్స్ మరియు మేరీ శరీరాలను నావూలోని ప్రధాన స్మశాన వాటికకు తరలించారు, ఆ ప్రదేశాన్ని “తల మరియు పాదాల వద్దనున్న సమాధి రాళ్ళతో గుర్తించాడు.”
ఇజ్రాయేల్ సమాధి ప్రక్కన నిలిచియున్నప్పుడు, “నేను మొదటి పునరుత్థానం ఉదయం [జేమ్స్]తో బయటకు రావడానికి యోగ్యతగా ఎంచబడేలా, నన్ను మరియు నాకు దగ్గరున్న సమస్తమును ప్రభువు చేతులకు అంకితం చేసుకోవాలనే కోరికను అనుభవించాను,” అని అతడు ఎలిజబెత్‌తో చెప్పాడు.
పరిశుద్ధ నిబంధనలతో కలిపి, యేసు క్రీస్తు యొక్క సువార్త పట్ల ఇజ్రాయేల్ యొక్క భక్తి, క్రీస్తు అతడికి, అతని పూర్వీకులకు మరియు తన సంతానానికి అన్ని ఆశీర్వాదాలలో అత్యంత గొప్పదైన నిత్యజీవాన్ని సాధ్యం చేయడానికి అనుమతిస్తుంది
మనలో ప్రతీఒక్కరి విషయంలో అదే నిజము.
జేరీ గార్న్స్ చేత ఛాయాచిత్రము, సంఘ ఉపయోగం కొరకు మాత్రమే నకలు చేయబడవచ్చు
పరిశుద్ధ వాగ్దానాలు
మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు, మనలో ప్రతిఒక్కరిని మనం ఊహించగలిగిన దానికి మించి ప్రేమిస్తున్నారు. బాప్తీస్మము సమయంలో మరియు ప్రభువు మందిరములో మనకు ఇవ్వబడిన నిబంధనలకు సంబంధించిన వాగ్దానము చేయబడిన దీవెనల ద్వారా వ్యక్తపరచబడినంత స్పష్టంగా వారి ప్రేమ మరెక్కడా కనిపించదు.
“బయల్పరచబడిన మతములో అత్యంత ముఖ్యమైన భావనలలో ఒకటి, పరిశుద్ధ నిబంధన,” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ (1924-2025) బోధించారు. “చట్టపరమైన భాషలో, ఒక నిబంధన సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్గాల మధ్య ఒప్పందాన్ని సూచిస్తుంది. అయితే మతపరమైన భావనలో, ఒక నిబంధన చాలా ముఖ్యమైనది. అది దేవునితో ఒక పరిశుద్ధమైన వాగ్దానము.”
మనం చేసే మరియు పాటించే ప్రతి పరిశుద్ధమైన వాగ్దానము మనల్ని ఆశీర్వదిస్తుంది. పరలోక తండ్రి మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తు మనల్ని వారి దగ్గరగా తీసుకొనిరావాలని కోరుతున్నారు. వారు మనం నేర్చుకోవడానికి మరియు విశ్వాసము, జ్ఞానమునందు ఎదగడానికి మనకు సహాయపడాలని కోరుతున్నారు. వారు పరలోకపు శక్తితో మనకు వరమివ్వాలని కోరుతున్నారు. ఆటువంటి దీవెనలు అందని ప్రపంచంలో మనం స్వస్థత మరియు శాంతిని పొందాలని వారు కోరుతున్నారు. ఈ జీవితంలో మరియు రాబోయే లోకములో మనం సంతోషాన్ని అనుభవించాలని వారు కోరుతున్నారు. ఈ పరిపూర్ణమైన ప్రేమ నుండి ప్రవహిస్తూ, వారితో నిబంధన బంధంలోకి ప్రవేశించే అవకాశాన్ని వారు మనకు అందిస్తారు. వారాంతము సంస్కార సమావేశమందు ఆ నిబంధనలకు తిరిగి ఒడంబడిక చేసే దీవెనను మనం కలిగియున్నాము.
మనం కృతజ్ఞతగల ఆత్మతో సంస్కారమును తీసుకుంటాము ఎందుకనగా యేసు క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొని, ఆయనను జ్ఞాపకము చేసుకొని, మరియు ఆయన ప్రాయశ్చిత్త వరము ద్వారా మన కొరకు చూపబడిన ఆయనకు గల ప్రేమను జ్ఞాపకం చేసుకునే ఆనందకరమైన దీవెనను మనం కలిగియున్నాము—ఆయన మనకోసం బాధపడ్డాడు, రక్తము చిందించాడు, మరియు చనిపోయాడు. ఆయన ఆజ్ఞలను పాటించడానికి, మన నిబంధనలను క్రొత్తవిగా చేయడానికి, మరియు ఒక క్రొత్త నిబంధన చేయడానికి మన సమ్మతిని చూపడానికి వారాంతపు అవకాశంతో కూడ సంస్కారము మనల్ని దీవిస్తుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి).
“బాప్తీస్మము సమయంలో చేసిన నిబంధనలను క్రొత్తవిగా చేయుటకు సంస్కారములో పాలుపొందుతుందామనే భావ వ్యక్తీకరణను తరచుగా నేను వింటాను. అది నిజమైనప్పటికి, ఇది అంతకంటే ఎక్కువే,” అని అధ్యక్షులు నెల్సన్ చెప్పారు. “నేనొక నూతన నిబంధన చేసాను. మీరు నూతన నిబంధనలు చేసారు. … అప్పుడు దానికి బదులుగా ఆయన ఆత్మను ఎల్లప్పుడు మనతో కలిగియుంటామని [ప్రభువు] ప్రకటన చేసారు. ఎంత గొప్ప దీవెన!”
మనం పశ్చాత్తాపడి, శుద్ధమైన హృదయంతో సంస్కారమును తీసుకొన్నప్పుడు, మనం పరిశుద్ధాత్మను పొందుతాము మరియు “మనం మరలా బాప్తీస్మము పొందినట్లుగా పాపము నుండి శుద్ధి చేయబడతాము. మనలో ప్రతిఒక్కరికి యేసు అందిస్తున్న నిరీక్షణ మరియు కనికరము ఇదే.”
క్రీస్తు యొక్క విమోచన ప్రేమ ద్వారా పశ్చాత్తాపపడి క్షమాపణ పొందడం ఎంత ఆనందంగా ఉంది!
జెన్నిఫర్ రోజ్ మాడీ చేత నావూ ఇల్లినాయ్ దేవాలయం యొక్క ఛాయాచిత్రము
ఆయన ఆనందకరమైన గృహము
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షుడైన తరువాత, అధ్యక్షులు నెల్సన్, సంఘ అధ్యక్షునిగా తన మొదటి బహిరంగ సందేశముతో ప్రారంభించి, నిబంధన మార్గము గురించి తరచుగా మాట్లాడారు. “పశ్చాత్తాపము మరియు నీటి ద్వారా బాప్తిస్మము” (2 నీఫై 31:17), ద్వారా ఆ మార్గములో మనం ప్రవేశిస్తాము, తదుపరి సందర్భములో ఆయనిలా చెప్పారు, “తరువాత దేవాలయంలో మరింత సంపూర్ణంగా దానిలో ప్రవేశిస్తాము.”
సంస్కారమును తీసుకొనుట మన నిబంధనలను, దాని సంబంధిత దీవెనలను గూర్చి మనకు జ్ఞాపకం చేసినట్లే, దేవాలయంలో ప్రతినిధి కార్యము చేయడం కూడ అదేవిధంగా ఉన్నది. చనిపోయిన వారి కోసం ప్రతినిధిగా విధులను మనం నెరవేర్చినప్పుడు, మనం చేసిన పరిశుద్ధ వాగ్దానాలను మరియు మనం పొందే వాగ్దాన దీవెనలను జ్ఞాపకం చేసుకుంటాము.
నిబంధన మార్గము ద్వారా, మనం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు వారి సంతానం కోసం వాగ్దానం చేయబడిన అన్ని దీవెనలకు వారసులమవుతాము. ఆ వాగ్దానమివ్వబడిన దీవెనలు ఉన్నప్పటికినీ, అబ్రాహాము, ఇస్సాకు, మరియు యాకోబులు సులభమైన జీవితాలను గడపలేదు, మరియు మనం కూడ అంతే. మనం “అన్నివిషయములలో పరీక్షించబడినప్పుడు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 136:31;101:4–5 కూడా చూడండి) మనము కూడా వారి వలే, వ్యతిరేకతను, శిక్షను, మరియు నష్టమును ఎదుర్కొంటాము. పాతకాలపు ప్రవక్తలు మరియు నీతిమంతులైన పరిశుద్ధుల వలే, మనం ఎవరిని నమ్మవచ్చో మనకు తెలుసు (2 నీఫై 4:19 చూడండి).
మన మర్త్య జీవితం మన ఉనికిలో ఒక క్షణం మాత్రమే, కానీ ఆ క్షణం—కొన్నిసార్లు చాలా కష్టమైనది—శాశ్వతమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అవును, మన పరలోక తండ్రి మనం నేర్చుకోవాలని, వృద్ధి చెందాలని కోరుతున్నారు. మరియు అవును, ఆ అభివృద్ధి కొన్నిసార్లు నిరాశను, మరియు బాధను కలిగిస్తుంది. అయితే ఆయన మన జీవితాలు అందమైనవిగా మరియు ఆశాజనకమైనవిగా ఉండాలని కోరుతున్నారు. ఆ లక్ష్యంతో, ఆయన వద్దకు మన తిరుగు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ఆయన మనకు ఒక రక్షకుడిని అందించారు, ఆయన తండ్రితో మన నిబంధనల యొక్క“హామీదారుడు.” యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా, దేవాలయంలో తండ్రి తన పిల్లలకు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తారు.
ఆయన ప్రేమ మరియు ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా, మన రక్షకుడు మనం జీవితంలో ఎదుర్కొనే ప్రతిదానిని పరిష్కరించారు మరియు స్వస్థపరిచారు. ఆయన పరిశుద్ధ మందిరము—ఆయన ఆనందకరమైన గృహము—వలన వ్యతిరేకతలు ఉన్నప్పటికినీ అంతా సవ్యంగా ఉంటుంది. నిబంధన పాటించుట యొక్క ఔషదము విచారము, బాధ, దుఃఖము, మరియు నిరాశను తుడిచివేస్తుంది. మనం చింతించవలసిన లేదా భయపడవలసిన అవసరం లేదు. బదులుగా, మన విమోచన యొక్క వెల చెల్లించబడిందని (1 కొరింథీయులకు 6:20) మరియు నిత్యజీవానికి నిబంధన మార్గము వేయబడిందని మనం ఆనందించవచ్చు.
నిబంధన మార్గము నిజంగా విమోచించే ప్రేమ మార్గము. దేవాలయంలో మనం చేసిన నిబంధనలను మనం గౌరవించినప్పుడు, మనం గొప్ప శక్తిని, గొప్ప ప్రేమ, గొప్ప కనికరము, గొప్ప జ్ఞానమును, మరియు గొప్ప నిరీక్షణ యొక్క దీవెనలను పొందుతాము. తండ్రి మరియు కుమారుని యొక్క సన్నిధిలో కుటుంబ సభ్యులు కలిసి బంధింపబడే అద్భుతము మరియు గొప్పతనం—నా ఆత్మకు అత్యద్భుతమైన విస్మయం మరియు ఆనందాన్ని తెస్తుంది—మరియు నన్ను కృతజ్ఞతాత్మతో నింపుతుంది.
“మీ జీవితంలో ఏదైనా ఉపద్రవం సంభవించినప్పుడు, ఆత్మీయంగా ఉండడానికి సురక్షితమైన ప్రదేశం ఏమిటంటే దేవాలయ నిబంధనల పరిధిలో జీవించడమే!” అధ్యక్షులు నెల్సన్ ఇలా ఉపదేశించారు. నా స్వంత మధురమైన మరియు కొన్నిసార్లు చేదైన మర్త్య అనుభవము నుండి ఆ మాటల యొక్క యదార్ధతను నేను ఎరుగుదును.
ఇజ్రాయెల్ మరియు ఎలిజబెత్ మొదటి బిడ్డ, జేమ్స్ నతానియేల్ బార్లో 1841 మేలో పుట్టిన వెంటనే చనిపోయాడు. సంవత్సరాల తరువాత, అతడు లోగన్ యూటా దేవాలయంలో తన తల్లిదండ్రులతో ప్రతినిధిగా బంధింపబడ్డాడు.
అల్లెన్ గార్న్స్ చేత వివరణ
వారిని ఇంటికి సమకూర్చండి
ఇజ్రాయెల్ బార్లో తన పసిబాలునికి చివరి వీడ్కోలు చెప్పిన తరువాత, అతడు తన భార్యకు ఇలా వ్రాసాడు, “[జేమ్స్] సమాధి వద్దకు తిరిగి రావడానికి జీవితంలో ఇక ఎన్నడూ రాకుండా, దూరంగా ఉండాలనే ఆలోచనలు, నేను చాలా విచారించి, గుండె పగులుతున్నట్లు అనిపించి, అతడి సమాధిపై ఏడ్చాను.”
1889, డిసెంబరు 4న ఎక్కువ కన్నీళ్ళు—ఈసారి ఆనందకరమైన భాష్పాలు కార్చబడినవని నేనూహిస్తున్నాను. ఆ రోజు, లోగన్ యూటా దేవాలయంలో పసివాడైన జేమ్స్ నతానియేల్ బార్లో తన తల్లిదండ్రులతో ముద్రింపబడ్డాడు. ఆ సమయానికి, ఇజ్రాయెల్ చనిపోయాడు, అందువలన ఇతరులు అతడికి మరియు జేమ్స్‌కు ప్రతినిధులుగా నిలబడ్డారు.
సహోదరి కీరన్, మరియు నాకు ఇజ్రాయెల్ మరియు ఎలిజబెత్ కొరకు ప్రత్యేకమైన సున్నితత్వము మరియు గొప్ప కనికరము ఉన్నాయి. మా మొదటి బిడ్డ, సీన్ అనే బాలుడు, కేవలం మూడు వారాల వయసులో గుండె శస్త్రచికత్స సమయంలో చనిపోయాడు. ఆ నష్టం మాకు ప్రపంచం ముగిసిపోయిందనే భావన కలిగించింది. ఆ సమయమందు, మేము బ్రతకగలమా అని ఆలోచించాము. మేము అతడిని ఇంగ్లండ్‌లోని అత్యంత చిన్న సమాధిలో పాతిపెట్టాము. పదిహేను సంవత్సరాల తరువాత, మా కుటుంబము సంఘములో పూర్తికాలము సేవ చేయడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌లో మా ఇంటి నుండి వెళ్ళమని అడగబడ్డాము, మరియు మేము ఆ చిన్న సమాధిని వదలి వెళ్ళాము.
పశ్చిమానికి కష్టమైన ప్రయాణంలో మేము మా బిడ్డను కోల్పోలేదు, మరియు బార్లోస్ వలే గ్రహింపశక్యము కాని కష్టాలను మేము అనుభవించలేదు, కానీ వారు అనుభవించిన దానిని మేము గ్రహించసాగాము. మా బాబు సమాధి చాలా దూరంగా ఉన్నది, అయినప్పటికినీ బార్లోస్ వలె మేము యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమునందు మరియు పరిశుద్ధ ముద్రణ నిబంధన ద్వారా మా కుటుంబపు నిత్య స్వభావమునందు స్థిరమైన విశ్వాసమును కలిగియున్నాము.
మనందరికీ సమాధి అవతల ఉన్న పూర్వీకులు మరియు ఇతర ప్రియమైనవారు ఉన్నారు, వారు మనతో, “నన్ను ఇక్కడ వదిలి వెళ్ళవద్దు” అని చెబుతున్నారు. దేవాలయ నిబంధనల వలన, ఏ ఒక్కరూ విడిచిపెట్టబడరు. మన విధి వారిని ప్రేమించడం, వారికి సేవ చేయడం, మరియు వారిని ఇంటికి తీసుకొని రావడానికి సహాయపడటం.
మన పరలోక తండ్రి మిమ్మల్ని, మరియు నన్ను మనల్ని ప్రేమిస్తున్నారు. “భూలోకములో [మనం] దేనిని బంధిస్తామో, అది పరలోకములోను బంధింపబడును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:8; మత్తయి 18:18 కూడా చూడండి). శాశ్వత బంధాలకు మరియు నిత్య కుటుంబాల పునఃకలయికలకు మార్గము సుగమం చేస్తూ మరణ బంధకాలను విరగగొట్టడానికి ఆయన తన కుమారుడిని పంపారు.
అందుకే మనకు విధులు ఉన్నాయి. అందుకే మనం నిబంధనలు చేస్తాము. అందుకే మనం దేవాలయాలు నిర్మిస్తున్నాము. అందుకే మనం దేవుని కార్యము మరియు మహిమకు మనల్ని మనం సమర్పించుకుంటాము (మోషే 1:39 చూడండి). తండ్రి, మరియు కుమారుని సన్నిధిలో నిత్య పునఃకలయిక మనకు మరియు మన ప్రియమైన వారికోసం ఎదురుచూస్తుందని ఎరిగినందుకే మనం కన్నీటి భాష్పాలను కారుస్తున్నాము.
మన నిబంధనలను పాటించి మరియు ఆయన మహిమకరమైన రక్షించే కార్యములో చేరినప్పుడు మనం సంతోషాన్ని, శాంతిని కనుగొందాము గాక.
© 2026 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, February 2025Monthly Liahona Message, February 2026 యొక్క అనువాదము. Telugu. 19933 421