ఆసియా ప్రాంతీయ నాయకత్వ సందేశం
కష్ట సమయాలలో నన్ను కాపాడడానికి నా నిబంధనలు సహాయపడతాయి
బాప్తిస్మము తరువాత, మనము నిర్ధారణ మరియు పరిశుద్ధాత్మ వరమును పొందుతాము. పరిశుద్ధాత్మ మనకు ఆదరణనిస్తుంది మరియు జీవితంలోని సవాళ్ళను అధిగమించడానికి మనకు మార్గనిర్దేశం చేస్తుంది. పరిశుద్ధాత్మతో మన సంభాషణ ప్రారంభించడానికి, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మనలను మనం పవిత్రంగా ఉంచుకోవాలి, లేఖనాలను అధ్యయనం చేయడానికి మరియు ధ్యానించడానికి నిశ్శబ్దమైన సమయాన్ని కనుగొని, ఆ నిశ్శబ్దమైన, సున్నితమైన స్వరాన్ని ఆలకించాలి.
నా మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ప్రారంభపు కొన్ని నెలల్లో, రాత్రివేళ నా భార్యకు సహాయం చేస్తూ బిడ్డను చూసుకోవడం వల్ల నేను పూర్తిగా అలసిపోయేవాడిని. కొన్ని రోజులు నేను లేఖన అధ్యయనాన్ని దాటవేయడం ప్రారంభించాను. నా జీవితం అస్తవ్యస్తంగా ఉందని నేను భావించాను మరియు మార్పు అవసరమని నాకు తెలిసింది. ప్రతి ఉదయం ఒక గంట ముందుగా నిద్రలేచి, ఇన్స్టిట్యూట్ మాన్యువల్‌తో పాటు మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాను. నా భారాలను భరించడానికి నాకు మరింత ఆధ్యాత్మిక శక్తి లభించింది. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ద్వారా నేను మరింత ఆనందం మరియు శాంతిని అనుభవించాను.
గత సంవత్సరం, నా భార్యకు భయానకమైన వార్త అందింది. ఆమె తల్లికి మరియు తండ్రికి ఇద్దరికీ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కొన్ని నెలల తర్వాత, నా తండ్రికి శస్త్రచికిత్స జరిగింది, అలాగే నా భార్యకు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్న రొమ్ము తిత్తులు రెండు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అదృష్టవశాత్తూ, శస్త్రచికిత్స తర్వాత వచ్చిన ఫలితాలు క్యాన్సర్ లేదని చూపించాయి. తర్వాత, మా కుమార్తెకు అపెండిసైటిస్ వచ్చింది. ఇదంతా ఆరు నెలల్లోనే జరిగింది మరియు వారిలో ఎవరికీ ఇంతకు ముందు శస్త్రచికిత్స జరగలేదు. దాదాపు అదే సమయంలో, నాకు ఒక కొత్త సంఘ పిలుపు వచ్చింది, దానికి విస్తృతమైన ప్రయాణం మరియు సమయం అవసరం మరియు నా కొత్త ఉద్యోగం నన్ను చాలా రాత్రులు ఆలస్యంగా పని చేయించింది.
ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి, రక్షకుడు మాత్రమే నాకు సహాయం చేయగలరని నాకు తెలుసు. నేను లేఖనాలను అధ్యయనం చేయడంలో ఎక్కువ సమయం గడపడం, నా ప్రయాణ సమయంలో సర్వసభ్య సమావేశం ప్రసంగాలను వినడం మరియు దేవాలయంలో ఆరాధించడం ద్వారా ఆయనకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాను. నేను ఆందోళనలో మునిగిపోవడం కాకుండా, సిలెస్టియల్‌గా ఆలోచించి, దేవాలయంలో నేను చేసుకున్న నిబంధనల శక్తిపై ఆధారపడాలని ఎంచుకున్నాను. ఇది నాకు శాంతిని తీసుకువచ్చింది. రక్షకుడు ఇలా వాగ్దానం చేసారు, “శాంతి మీ కనుగ్రహించి వెళ్ళుచున్నాను: నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను: లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి” (యోహాను 14:27).
ఈ అనుభవాలు నన్ను రక్షకునికి దగ్గరగా తీసుకువచ్చాయి. పవిత్ర విధుల ద్వారా నేను చేసిన నిబంధనలు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో నా సంబంధాన్ని బలపరిచాయి. “…ఆ విధులలో, దైవత్యము యొక్క శక్తి ప్రత్యక్షపరచబడును” (సి&ని 84:20) అని నేను నిజంగా నమ్ముతున్నాను. మనం దేవాలయములో నిబంధనలు చేసినప్పుడు, మన కొరకు మరియు మన కుటుంబాల కొరకు పరలోకము నుండి శక్తిని పొందగలము. హీలమన్ యొక్క ఈ బోధనపై మనం ఆధారపడవచ్చు: “…మీరు మీ పునాదిని దేవుని కుమారుడైన క్రీస్తు మరియు మన విమోచకుని యొక్క బండపై కట్టవలెనని జ్ఞాపకముంచుకొనుడి; అపవాది తన బలమైన గాలులను, సుడిగాలి యందు అతని బాణములను పంపునప్పుడు, అతని సమస్త వడగళ్ళు మరియు బలమైన గాలివాన మిమ్ములను కొట్టునప్పుడు, దౌర్భాగ్యపు అగాధము మరియు అంతము లేని శ్రమకు మిమ్ములను క్రిందికి లాగుకొనిపోవుటకు అది మీపై ఏ శక్తి కలిగియుండదు, ఏలయనగా మీరు కట్టబడిన ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది మరియు మనుష్యులు ఆ పునాదిపై కట్టబడిన యెడల ఎన్నటికీ పడిపోరు.” (హీలమన్ 5:12).
నిబంధనలు చేసి పాటించడం ద్వారా రక్షకునిపై మనం దృఢమైన పునాదిని నిర్మించినప్పుడు, శ్రమలు కలిగిననూ మనం మనశ్శాంతిని కలిగి ఉండవచ్చు మరియు భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉండవచ్చు. బాప్తిస్మము తర్వాత మనం అదనపు నిబంధనలు చేయడం ద్వారా—యాజకత్వ నియామకం, వరము పొందుట మరియు ముద్ర వేయబడడంతో సహా—మనం దేవునితో సన్నిహిత సంబంధంతో ఆశీర్వదించబడ్డాము. ప్రతి విధి మన జీవితాల్లోకి తెచ్చే ఆశీర్వాదాలకు మనం అర్హులం. దేవుని సన్నిధిలో పూర్తి విశ్వాసం పొందే వరకు మన విశ్వాసం మరింత బలంగా పెరుగుతుంది. ప్రతి ఆలోచనలో మనం ఆయన వైపు చూసినప్పుడు, మనం “సందేహించము, భయపడము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36).
యేసు క్రీస్తు మన రక్షకుడని మరియు ఆయన జీవిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనకు మన అవసరతలు తెలుసు మరియు నిబంధనలు చేసి వాటిని పాటించేవారు లోకసంబంధమైన అనిశ్చితి మరియు భయం నుండి రక్షించబడతారని ఆయన వాగ్దానం చేశారు. మనం ఎల్లప్పుడూ ఆయన శాంతిని మనతో కలిగి ఉండవచ్చు మరియు జీవితంలోని అన్ని సవాళ్లను విశ్వాసముతో అధిగమించవచ్చు. ■