“సంస్కారమును తీసుకోవాలని యేసు క్రీస్తు మనల్ని కోరాడు,” 2021 మార్చి లియహోనా
2021 మార్చి లియహోనా నెలవారీ సందేశము
సంస్కారమును తీసుకోవాలని యేసు క్రీస్తు మనల్ని కోరాడు
మనము ప్రతీవారము మన రక్షకుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము శుద్ధిచేయబడి, స్వస్థపరచబడతాము.
కార్ల్ హీన్రిచ్ బ్లోచ్ చేత ప్రభురాత్రి భోజనము,
ఆయన మరణించడానికి ముందు, యేసు క్రీస్తు ప్రభురాత్రి భోజనము అని పిలవబడే చివరి భోజనాన్ని భుజించాడు. ఈ భోజనము ముగింపులో, ఆయన తన అనుచరులకు సంస్కారమును పరిచయం చేసాడు. ఆయన రొట్టెను విరిచి, దానిని దీవించాడు. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి,” అని ఆయన చెప్పాడు (లూకా 22:19). తరువాత ఆయన ద్రాక్షారసపు గిన్నెను పట్టుకొని దీవించి, వారికిచ్చాడు.
వారపు ఆరాధనలో భాగము
యేసు క్రీస్తు యొక్క సంఘము భూమిపై పునఃస్థాపించబడినప్పుడు, సంస్కారము వారపు ఆరాధనలో భాగమైంది. సంఘ కూడికలో యాజకత్వము గలవారి చేత సంస్కారము దీవించబడి, అందించబడుతుంది. వారు లేఖనముల నుండి పదాలను ఉపయోగించి ప్రార్థిస్తారు (మొరోనై 4; 5 చూడండి). అప్పుడు జనసమూహంలో ప్రతిఒక్కరు యేసు క్రీస్తును, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ఆయన అడిగినట్లుగా జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టెను తిని, నీటిని త్రాగుతారు.
ఏంజెలా సూట్టర్ చేత ఛాయాచిత్రము
పాలుపంచుకొనుటకు సిద్ధపడుట
సంస్కారమును తీసుకోవడానికి సిద్ధపడేందుకు, మనము నిజాయితీగా మన జీవితాలు మరియు ఎంపికల గురించి ఆలోచించాలి. క్షమించమని దేవునిని అడగడంతో పాటు, గత వారంలో చేసిన తప్పులకు, పాపాలకు మనం పశ్చాత్తాపపడాలి. సంస్కారమును తీసుకోవడానికి మనము పరిపూర్ణంగా ఉండనవసరము లేదు, కానీ మన హృదయాలు వినయంగా ఉండాలి.
డెల్ పార్సన్ చేత గెత్సెమనేలో ప్రార్థన,
రొట్టె మరియు నీటిని మించి
సంస్కారమును తీసుకోవడం అనేది ఒక పరిశుద్ధమైన, పవిత్రమైన సమయము. మనము రొట్టెను, నీటిని తీసుకుంటున్నప్పుడు యేసు క్రీస్తు మన కొరకు ఇచ్చిన శరీరమును, రక్తమును మనం జ్ఞాపకము చేసుకుంటున్నామని సంస్కార ప్రార్థనలు మనకు గుర్తు చేస్తాయి. ఆయనను అనుసరిస్తామని, క్రైస్తవ జీవితం జీవిస్తామని మనం వాగ్దానం చేస్తాము. దేవుని ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నిస్తామని మనం వాగ్దానం చేస్తాము. బదులుగా, పరిశుద్ధాత్మ మనల్ని ఓదార్చి, నడిపింపునిచ్చి, స్వస్థపరుస్తాడు.
నిబంధనలను తిరిగి క్రొత్తగా చేయుట
మనలో బాప్తీస్మము పొందిన వారు పవిత్ర హృదయంతో సంస్కారమును తీసుకున్నప్పుడు, మనం బాప్తీస్మపు సమయంలో చేసిన నిబంధనను తిరిగి క్రొత్తగా చేస్తాము. దీనిలో పరిశుద్ధాత్మను పొందడం మరియు మనం మరలా బాప్తీస్మము పొందినట్లుగా పాపము నుండి శుద్ధిచేయబడడం ఉన్నాయి. మనలో ప్రతిఒక్కరికి యేసు అందిస్తున్న నిరీక్షణ మరియు కనికరము ఇదే. పశ్చాత్తాపపడి, క్షమించబడడానికి సమయం మించిపోలేదు.
గ్యారీ ఎల్. కాప్ చేత, మీరు నన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకొందురని, నకలు చేయబడదు
సంస్కారము గురించి లేఖనములు ఏమి చెప్తున్నాయి?
సంస్కారమును తీసుకోవడానికి ముందు, నిజాయితీగా మన అంతరంగములోనికి చూస్తూ మనల్ని మనం ఆత్మీయంగా పరీక్షించుకోవాలి (1 కొరింథీయులకు 11:28 చూడండి).
ఆయన పునరుత్థానము చెందిన తరువాత, యేసు అమెరికాలోని తన జనులకు సంస్కారమును ఎలా తీసుకోవాలో చూపించాడు (3 నీఫై 18 చూడండి).
సంస్కారము కొరకు రొట్టెను, నీటిని ఉపయోగించమని ఆధునిక ప్రవక్తలు మనకు చెప్పారు, కానీ మనము ఏమి తింటామో లేక త్రాగుతామో అనేది ముఖ్యము కాదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 27:2 చూడండి). కొన్నిసార్లు రొట్టె పడని వారు రొట్టె వంటి మరొక పదార్థాన్ని ఉపయోగించాలి.
© 2021 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, March 2021 యొక్క అనువాదము. Telugu. 17464 421
కార్ల్ హీన్రిచ్ బ్లోచ్ చేత ప్రభురాత్రి భోజనము; ఏంజెలా సూట్టర్ చేత ప్రార్థిస్తున్న యువతి ఛాయాచిత్రము; డెల్ పార్సన్ చేత గెత్సెమనేలో ప్రార్థన; గ్యారీ ఎల్. కాప్ చేత మీరు నన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకొందురని, నకలు చేయబడదు