ఆసియా ప్రాంతీయ నాయకత్వ సందేశం
మన జీవితాలలో ఉద్దేశం మరియు అర్థాన్ని కనుగొనడం
పూర్వ మర్త్య జీవితములో, ఆత్మసంతానముగా ఉన్నప్పుడు, మనము పరలోక సలహామండలిలో పరలోక తండ్రి ప్రణాళికను అనుసరించడానికి నిర్ణయం తీసుకున్నాము. మనకు రక్షకుడు, యేసు క్రీస్తు ఇవ్వబడ్డారు, ఆయన ప్రాయశ్చిత్తం అందరికీ పునరుత్థానాన్ని అందిస్తుంది. మనం మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసు క్రీస్తుకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. అయితే, చాలా మంది ఆత్మసంతానం సాతాను మరియు అతని ప్రణాళికకు మద్దతు ఇచ్చారు, అందుచేత వారు దేవుని సన్నిధి నుండి బహిష్కరించబడ్డారు. మన కాలంలో కూడా, సాతాను తన అనుచరులను పాపములోకి నడిపించడం కొనసాగిస్తున్నాడు.
ఆదాము మరియు హవ్వలకు ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ, ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నింపడం. (ఆదికాండము 1:28, అబ్రాహాము 4:28) శరీరాన్ని పొందడం అనేది దేవుని ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగం మరియు మనం అభివృద్ధి చెందడానికి, మన జీవితంలో అర్థాన్ని కనుగొనడానికి వీలు కల్పిస్తుంది. కుటుంబాలను పెంచడం కొన్నిసార్లు సవాలుగా ఉన్నప్పటికీ, అది నేర్చుకోవడానికి మరియు నెరవేర్పు పొందడానికి ఒక దైవిక ఆధారం.
పరలోక తండ్రి తన బిడ్డలందరూ తమ జీవితాలలో ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నారు. రక్షణ ప్రణాళిక సంతోషానికి పరిపూర్ణ మార్గాన్ని అందిస్తుంది. మోషే 5:11లో, హవ్వ సంతోషంగా ఇలా ప్రకటించింది, “మనము అపరాధము చేయనియెడల మనమెన్నటికీ సంతానము కలిగియుండకపోవుదుము మరియు మంచి చెడులను, మన విమోచనానందమును, విధేయులందరికి దేవుడు అనుగ్రహించు నిత్యజీవమును యెరుగకపోదుము.” నేటి ప్రపంచంలో, సంతోషం తరచుగా అపార్థం చేసుకోబడుతుంది. యేసు క్రీస్తు యొక్క సువార్త మరింత స్పష్టమైన దృక్పథాన్ని వెలికి తెస్తుంది.
సాంకేతిక పరిజ్ఞానం ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందినప్పటికీ, చాలా మంది ప్రజలు ఈ యెదుగుదలల ద్వారా గందరగోళానికి లోనవుతున్నారు. కొంతమంది వ్యక్తులు సాంకేతికతను అతిగా ఉపయోగిస్తున్నారు మరియు కుటుంబం మరియు ఆధ్యాత్మికత వంటి మరింత ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. సంతోషం అనే పదం తరచుగా ఉపయోగించబడుతుంది, కానీ అది తన అర్థాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. ధనమే సంతోషాన్ని నిర్ణయిస్తుందని చాలా మంది నమ్ముతున్నప్పటికీ, నిజమైన ఆనందం ప్రేమ మరియు నీతిమంతమైన జీవనం నుండి వస్తుందని మనకు తెలుసు.
కొన్ని ఆర్థిక గణాంకాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, సమూహ కార్యకలాపాలలో పాల్గొనే వారు సాధారణంగా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు అని నేను చదివాను. వారు కలిసి సంభాషిస్తారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు మరియు సహచర్యాన్ని ఆనందిస్తారు. సంతృప్తి మరియు మానసిక ప్రశాంతత ఒక వ్యక్తి యొక్క నీతిమంతమైన దృష్టి మరియు ఇతరులను కలుపుకొని పోవాలనే కోరికపై ఆధారపడి ఉంటాయని నేను గ్రహించాను. నాకు, ఇది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమయ్యే “కుటుంబ ప్రయత్నం”.
ఒక నిత్య దృష్టికోణాన్ని పెంపొందించుకోవడం మన జీవితాలను మారుస్తుంది మరియు మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. కొన్నిసార్లు వ్యక్తులు ప్రధానంగా భూసంబంధమైన సంపదను నిర్మించడంపైనే దృష్టి పెడతారు. మన జీవితాల్లో, ఈ జీవితానికి మరియు మన తదుపరి జీవితానికి ఆధ్యాత్మిక సంపదను నిర్మించుకోవడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. నిత్య దృష్టికోణాన్ని స్వీకరించడం మన జీవితాలను మారుస్తుంది మరియు మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి అని రక్షకుడు బోధించారు. (మత్తయి 6:19-21)
నా జీవితంలో, సంతోషం అనేది కేవలం భూసంబంధమైన జీవితం గురించే కాదు, అంతకంటే ముఖ్యంగా నిత్య దృష్టికోణాన్ని కలిగి ఉండటం మరియు మరింత దైవికమైనదానితో అనుసంధానం అవ్వడం. సంతోషం మనల్ని ప్రభువు సలహాను అనుసరించే ఒక ఉన్నత లక్ష్యం వైపు నడిపించడానికి ఉద్దేశించబడింది అని నేను నమ్ముతున్నాను. మన ప్రవక్తల మాటల నుండి మరియు ప్రభువు నుండి, మనం సంతోష ప్రణాళికను అర్థం చేసుకోవడం నేర్చుకుంటాము మరియు ఫలితంగా, గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాము. మన జీవితాలు యేసు క్రీస్తు మరియు ఆయన బోధనలపై కేంద్రీకృతమైనప్పుడు, మన ఆనందం పెరుగుతుంది. మీ చర్యలు మరియు జీవన విధానం కారణంగా మీరు ప్రభావితం చేసిన జీవితాల గురించి ఆలోచించండి. దేవుని ఉద్దేశాన్ని మరియు అందరి పట్ల ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకోవడానికి ఇతరులను యేసు క్రీస్తు వద్దకు రావాలని మనం ప్రేరేపించాలి మరియు ప్రోత్సహించాలి. దేవుని సంతోష ప్రణాళిక మన కుటుంబం, స్నేహితులు మరియు పొరుగువారికి వ్యాప్తి చెందడానికి మనమే సాధనం.
ఈ సంవత్సరం మా కుటుంబమంతా కలిసి బ్యాంకాక్ థాయిలాండ్ దేవాలయానికి వెళ్లినప్పుడు, మన జీవితాలలో ఉద్దేశం మరియు శాంతిని కనుగొనడంలో మన రక్షకుడితో మనకున్న అనుబంధమే ముఖ్యమని నేను మరింత బలమైన అవగాహన పొందాను. దేవాలయంలో, నిజమైన ప్రేమ మరియు ఆనందం మా కుటుంబాన్ని మా నిత్య ఉద్దేశాన్ని కనుగొనడంలో నడిపిస్తాయనే భావన నాకు కలిగింది. నా కుటుంబంతో కలిసి దేవాలయంలో ఉండటం, నా జీవితంలో అత్యంత మరపురాని మరియు ఆధ్యాత్మిక సమయాలలో ఒకటి. మేము దేవాలయ విధులను నిర్వర్తించినప్పుడు, ప్రభువు ప్రేమను అనుభవించగలిగాము. “ఇనుపదండాన్ని గట్టిగా పట్టుకోవడానికి మీ పరిస్థితులు అనుమతించినంత క్రమంగా దేవాలయంలో ఆరాధించడం కంటే ఎక్కువగా మీకు ఏదీ సహాయం చేయదు”, అని అధ్యక్షులు నెల్సన్ పేర్కొన్నారు. (“యాజకత్వ తాళపుచెవుల బహుమానమందు ఆనందించండి,” లియహోనా, మే 2024, 122) దేవుని సంతోష ప్రణాళికను సాధించడానికి మరియు మన దేవాలయ నిబంధనలను పాటించడానికి, మన సమయాన్ని మరియు సామర్థ్యాలను దేవుని రాజ్యాన్ని నిర్మానించే పనికి ఉపయోగించాలి, తద్వారా మనం దేవుని నిత్య రాజ్యంలోకి ప్రవేశించే వీలు కలుగుతుంది.
యేసు క్రీస్తు ఈ లోకానికి విమోచకుడు మరియు రక్షకుడు, అలాగే దేవుని అద్వితీయ కుమారుడు. మన రక్షణ ఆయన ద్వారానే సాధ్యమవుతుందని నేను సాక్ష్యం కలిగి ఉన్నాను. ■