లియహోనా
దైవిక స్వభావమునందు పాలివారు
2026 జనవరి లియహోనా


“దైవిక స్వభావమునందు పాలివారు,” లియహోనా, జన, 2026.

లియహోనా నెలవారీ సందేశము, 2026 జనవరి

దైవిక స్వభావమునందు పాలివారు

(2 పేతురు 1:4).

రక్షణ ప్రణాళికను గూర్చి జ్ఞానము ప్రశస్తమైన దృష్టికోణాన్ని అందిస్తుంది, మన ఆనందాలను సుసంపన్నం చేస్తుంది, మరియు మన సవాళ్ళను, కష్టాలను జయించడానికి మనల్ని బలపరుస్తుంది.

ఇద్దరు శిష్యులను పిలుస్తున్న క్రీస్తు యొక్క దృష్టాంతము

క్రీస్తు ఇద్దరు శిష్యులను పిలుచును, గ్యారీ ఈ. స్మిత్ చేత

అపొస్తులుడైన పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, యేసు క్రీస్తు యొక్క శిష్యులకు ఆయన “దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన, వాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును:

“ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. ఈ వాగ్దానముల మూలముగా, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను (2 పేతురు1:3–4; వివరణ చేర్చబడింది).

పరలోక తండ్రి యొక్క ప్రణాళిక మన శాశ్వత గుర్తింపు మరియు ఉద్దేశ్యాన్ని నిర్వచించే అత్యంత గొప్ప, విలువైన సత్యాలు మరియు వాగ్దానాలను వివరిస్తుంది.

“కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన చూడండి” లో వివరించబడినట్లుగా:

“పురుషుడు, స్త్రీ—మానవులందరు—దేవుని యొక్క స్వరూపములో సృజించబడిరి. ప్రతీఒక్కరు, పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన ఆత్మ కుమారుడు లేక కుమార్తె, మరియు దీనివలన ప్రతీఒక్కరు ఒక దైవిక స్వభావమును మరియు గమ్యమును కలిగియున్నారు. …

“పూర్వమర్త్య జీవితములో ఆత్మ కుమారులు మరియు కుమార్తెలు దేవునిని వారి నిత్యుడగు తండ్రిగా ఎరిగి, ఆరాధించారు మరియు ఆయన ప్రణాళికను అంగీకరించారు, తద్వారా ఆయన పిల్లలు భౌతిక శరీరమును పొందగలరు, పరిపూర్ణత వైపు సాగిపోవు భూలోక అనుభవమును గడించగలరు మరియు చివరకు నిత్య జీవపు వారసులుగా వారి దైవిక గమ్యమును చేరుకోగలరు.”

పరలోక తండ్రి తన పిల్లలకు ఇలా వాగ్దానమిస్తున్నారు, వారు ఆయన ప్రణాళిక యొక్క సూత్రాలు మరియు ఆయన ప్రియమైన కుమారుని యొక్క మాదిరిని అనుసరించి, మరియు ఆజ్ఞలను పాటించి, అంతము వరకు విశ్వాసముగా సహించిన యెడల వారు “నిత్యజీవమును పొందెదరు, ఆ బహుమానము దేవుని బహుమానములలోకెల్లా అత్యంత ఘనమైనది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7).

దేవుని కార్యము ఆయన పిల్లల అభివృద్ధి మరియు ఉన్నతస్థితిపై దృష్టిసారించును. ఆయన ప్రణాళికలోని ప్రతి అంశం ఆయన కుమారులను, కుమార్తెలను ఆశీర్వదించడానికి రూపొందించబడింది, ఎందుకనగా “దేవుని దృష్టిలో ఆత్మల విలువ గొప్పదని జ్ఞాపకముంచుకొనుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10).

తండ్రి యొక్క ప్రణాళిక

పూర్వ మర్త్య సలహాసభలో, పరలోక తండ్రి తన ఆత్మ పిల్లలకు వారి నిత్య పురోగతి మరియు సంతోషము కొరకు తన ప్రణాళికను సమర్పించారు.

“వీరందరు నివాసముండుటకు మనము ఒక భూలోకమును చేయుదుము;

“వారి దేవుడైన ప్రభువు వారికి ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని వారు గైకొందురో లేదోనని మనము వారిని పరీక్షించెదము;

“మరియు ఎవరైతే వారి మొదటి స్థితిని కాపాడుకుంటారో వారు వృద్ధి చేయబడతారు; మరియు తమ మొదటి స్థితిని కాపాడుకోలేని వారు, వారి మొదటి స్థితిని కాపాడుకొనిన వారితో అదే రాజ్యములో మహిమ కలిగియుండరు; మరియు ఎవరైతే వారి రెండవ స్థితిని కాపాడుకుంటారో వారికి మహిమ వారి తలలపై ఎప్పటికీ, శాశ్వతంగా చేర్చబడుతుందని దేవుడు చెప్పాడు.

“నేను ఎవరిని పంపుదును?“ అని ప్రభువు అన్నారు: అప్పుడు మనుష్య కుమారుని పోలిన ఒకడు—నేనున్నాను, నన్ను పంపుము అని పలికెను. మరియొకడు—నేనున్నాను, నన్ను పంపుము అని పలికెను. అందుకు ప్రభువు: నేను మొదటి వానిని పంపెదననెను.

“రెండవ వానికి ఆగ్రహము కలిగి తన మొదటి స్థితిని నిరూపించుకొనలేదు; ఆ దినమందు అనేకులు అతడిని వెంబడించిరి” (అబ్రహాము 3:24–28).

పూర్వ మర్త్య సలహాసభలో—తండ్రి యొక్క ప్రణాళిక ఒక్క ప్రణాళిక మాత్రమే సమర్పించబడిందని గమనించండి. మన పరలోక తండ్రి, “మనం ఏం చేయాలి?” అనే ప్రశ్నను వేయనే లేదు. ఆయన సలహాలు, సిఫారసులు కోరలేదు, లేదా ప్రతిపాదనలు కోరలేదు. బదులుగా, ఆయన తన ప్రణాళిక యొక్క ప్రాధమిక అంశాలను సమర్పించారు మరియు, “నేను ఎవరిని పంపుదును?“ అని అడిగారు. ఆయన ప్రణాళిక యొక్క నిబంధనలు మరియు షరతులను అమలు చేయడానికి ఎవరిని పంపాలనే దానిపై ఆయన ప్రశ్న యొక్క అతి ముఖ్యమైన విషయము కేంద్రీకరించబడి ఉన్నది.

అపవాది తిరుగుబాటు యొక్క పరిణామాలు కూడా లేఖనాలలో వివరించబడినవి.

“కాబట్టి, సాతాను నా యెడల తిరుగుబాటు చేసి … నేను నరునికిచ్చిన స్వతంత్రతను నాశనము చేయుటకు చూచెను, … అంతేకాక నా శక్తిని వానికి ఇవ్వవలెనని కోరెను; … , అతడు పడద్రోయబడునట్లు నేను చేసితిని;

“మరియు అతడు అబద్ధములకు తండ్రిగా, నరులను మోసపుచ్చుటకు మరియు గ్రుడ్డివారిగా చేయుటకు, నా స్వరము వినని వారందరిని అతని చిత్తప్రకారము చెరపట్టుటకు అతడు సాతానుగా, అపవాదిగా మారెను” (మోషే 4:3–4; వివరణ చేర్చబడింది).

పూర్వ మర్త్య సలహాసభలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఓటు వేసిన ఒక ప్రణాళికను లూసిఫర్ సమర్పించలేదు. అతడు ఒక ఎన్నికలో ఓడిపోయిన సానుభూతిపరుడైన వ్యక్తికాదు. అతడు తిరుగుబాటు చేసాడు! గర్వము, అహంకారము, మరియు స్వార్ధము తండ్రి యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి అతడిని ప్రేరేపించాయి.

తండ్రి యొక్క ప్రణాళిక మరియు రక్షకుని యొక్క సువార్త

సమస్త మానవాళికి నిత్యజీవపు ఆశీర్వాదాలను అందుబాటులోకి తెచ్చే తండ్రి మరియు కుమారుని యొక్క కార్యాలను ప్రణాళిక వర్ణిస్తుంది.

యేసు క్రీస్తు యొక్క సువార్త దేవుని ప్రణాళికలో వాగ్దానం చేయబడిన దీవెనలను, పురుషులు మరియు స్త్రీలు నమ్మి అనుసరించాల్సిన సిద్ధాంతం, సూత్రాలు, విధులు మరియు నిబంధనలను కూడా మనం పొందగల మార్గాన్ని ఏర్పరుస్తుంది. “ఈ యేసు క్రీస్తు నామము తప్ప, మనుష్యుడు రక్షింపబడుటకు ఆకాశము క్రింద ఇయ్యబడిన ఇతర నామమేదియు లేదు” (2 నీఫై 25:20). నిజంగా, ప్రభువైన యేసు క్రీస్తే “మార్గమును, సత్యమును, మరియు జీవమును: [ఆయన] ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” (యోహాను 14:6; వివరణ చేర్చబడింది).

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా వివరించారు:

“రక్షణకు సృష్టి అవసరము, దానికి పతనము మరియు ప్రాయశ్చిత్తము రెండూ అవసరము. ఇవి ప్రణాళిక యొక్క మూడు ప్రాథమిక భాగాలు. దివ్యమైన ఉపగ్రహము యొక్క సృష్టి దేవుని నుండి వచ్చింది. ఆదాము పతనము ద్వారా మర్త్యత్వము మరియు మరణము లోకములోనికి వచ్చాయి [2 నీఫై 2:25; మోషే 6:48 చూడండి]. అమర్త్యత్వము మరియు నిత్య జీవితం యొక్క సాధ్యత యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా సిద్ధపరచబడింది [2 నీఫై 2:21–28 చూడండి]. …

“… మనం భూమిపైకి కొంతకాలం పాటు వస్తాము, మన పరీక్షలు, మరియు శ్రమలను సహిస్తాము, మహిమాన్వితమైన ఇంటికి తిరిగి రావడానికి ముందుకు, పైకి సంచరించడానికి సిద్ధపడతాము [కీర్తనలు 116:15; ఆల్మా 42:8 చూడండి]. మనం దేవుని యొక్క ప్రణాళికను గ్రహించి మరియు ఆయన ఆజ్ఞలకు విధేయులుగా ఉన్న యెడల [మర్త్యత్వములో] మన ఆలోచనలు మరియు క్రియలు ఖచ్చితంగా మరింత ఉద్దేశ్యపూర్వకంగా ఉంటాయి [సిద్ధాంతము మరియు నిబంధనలు 59:20–21 చూడండి].”

మోర్మన్ గ్రంథములో ప్రణాళిక యొక్క శీర్షికలు

మోర్మన్ గ్రంథములో తండ్రి యొక్క ప్రణాళిక కోసం అనేక విభిన్నమైన శీర్షికలను గుర్తించి అధ్యయనం చేయడం ద్వారా ముఖ్యమైన సత్యాలను మనం నేర్చుకుంటాము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన. ఉదాహరణకు, క్రింది ఎంపిక చేసిన శీర్షికల నమూనాను పరిగణించండి:

“గొప్ప సృష్టికర్త యొక్క కనికరము గల ప్రణాళిక” (2 నీఫై 9:6).

“మన దేవుని ప్రణాళిక” (2 నీఫై 9:13).

“రక్షణ ప్రణాళిక” (జేరమ్ 1:2; ఆల్మా 24:14).

“విమోచన ప్రణాళిక” (ఆల్మా 12:25, 26, 30, 32, 33; 42:11, 13).

“పునఃస్థాపన ప్రణాళిక” (ఆల్మా 41:2).

“సంతోషము యొక్క ప్రణాళిక” (ఆల్మా 42:16).

“కనికరము యొక్క గొప్ప ప్రణాళిక” (ఆల్మా 42:31).

ఈ శీర్షికలలో ప్రతిఒక్కటి తండ్రి ప్రణాళిక యొక్క ప్రశస్తమైన వాగ్దానాలను మరింత స్పష్టంగా గ్రహించడానికి మనకు సహాయపడతాయి మరియు మన మర్త్య జీవితాల ఉద్దేశ్యాలు మరియు అర్ధము గురించి మన దృక్పథాన్ని సుసంపన్నం చేస్తుంది.

ప్రాముఖ్యంగా, మోర్మన్ గ్రంథములో దేవుని ప్రణాళిక కోసం మిక్కిలి తరచుగా ఉపయోగించబడిన శీర్షిక యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా సాధ్యము చేయబడిన విమోచనపై దృష్టిసారిస్తుంది.

ఆల్మా ప్రకటించాడు, “లోకము పునాది వేయబడినప్పటి నుండి సిద్ధము చేయబడిన విమోచన ప్రణాళిక లేని యెడల మృతుల పునరుత్థానము ఉండేది కాదు; కానీ చెప్పబడిన ఆ మృతుల పునరుత్థానమును తెచ్చు ఒక విమోచన ప్రణాళిక చేయబడినది” (ఆల్మా12:25).

“దేవుని కుమారుడు తన జనులను విమోచించుటకు వచ్చునని, ఆయన వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు శ్రమపడి మరణించునని, ఆయన మృతులలో నుండి లేచునని, వారి క్రియలను బట్టి అంత్య మరియు తీర్పు దినమున తీర్పు తీర్చబడుటకు మనుష్యులందరు ఆయన యెదుట నిలబడునట్లు అది పునరుత్థానమును తెచ్చునని ఆయన యందు నమ్ముట మొదలుపెట్టుడి,” (ఆల్మా 33:22) అని కూడా అతడు హెచ్చరించాడు.

మార్గము సిద్ధపరచబడింది.

దేవుని యొక్క గొప్ప రక్షణ, విమోచన, పునఃస్థాపన, కనికరము, మరియు సంతోషము యొక్క ప్రణాళికను మనం పరిగణించినప్పుడు మన ఆత్మలు కృతజ్ఞతతో ఉప్పొంగాలి. ఆయన రక్షణ ప్రణాళికను గూర్చి జ్ఞానము ప్రశస్తమైన దృష్టికోణాన్ని అందిస్తుంది, మన ఆనందాలను సుసంపన్నం చేస్తుంది, మరియు మన సవాళ్ళను, కష్టాలను జయించడానికి మనల్ని బలపరుస్తుంది.

మనం ఆయన వద్దకు తిరిగి రావాలని పరలోక తండ్రి ఆపేక్షిస్తున్నారు. ఆయన ఆహ్వానిస్తున్నారు మరియు దీవెనలు వాగ్దానమిస్తున్నారు, కానీ ఆయన మనకిచ్చిన నైతిక స్వతంత్రతను ఉపయోగించేలా ఆయన ఎన్నడూ బలవంతం చేయరు, ఒత్తిడి చేయరు లేదా నిర్బంధించరు. మనం చర్య తీసుకోవాలి మరియు ఆయన ప్రియమైన కుమారుని మాదిరిని అనుసరించుట ద్వారా ఆయన వద్దకు తిరిగి రావడాన్ని ఎంపిక చేయాలి.

యేసు క్రీస్తు యొక్క చేతిని పట్టుకోవడానికి ఒక బిడ్డ చేయి చాపుతున్న దృష్టాంతము

ఆయన హస్తము చాపబడింది ఎలిజబెత్ థాయర్ చేత

మార్గము సిద్ధపరచబడినది, మరియు మనము చూచిన యెడల మనము నిరంతరము జీవించెదము” (ఆల్మా 37:46; వివరణ చేర్చబడింది).

పరలోక తండ్రి తన పిల్లల కొరకైన దైవిక ప్రణాళిక యొక్క గ్రంధకర్త అని నేను సంతోషంగా సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు మన రక్షకుడు మరియు విమోచకుడు. ప్రభువు యొక్క కడవరి-దిన అపొస్తులులలో ఒకరిగా, నేను వాస్తవంగా ఆయనే “మార్గమును, సత్యమును, జీవమును” అని సాక్ష్యమిస్తున్నాను (యోహాను 14:6 వివరణ చేర్చబడింది).

వివరణలు

  1. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” సువార్త గ్రంథాలయం.

  2. Russell M. Nelson, “The Creation,” Ensign, May 2000, 84, 86.

  3. మోర్మన్ గ్రంథములో కనిపించే దేవుని ప్రణాళిక యొక్క అనేక శీర్షికల సమగ్ర విశ్లేషణ కొరకు, Noel B. Reynolds, “The Plan of Salvation and the Book of Mormon,” Religious Educator, vol. 21, no. 1 (2020), 31–53 చూడండి.