యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2026 జనవరి
నాతో నడువుము
మీరు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, ఆయన మీతో—ఎల్లప్పుడు నడుస్తారని 2026 యువత ఇతివృత్తము మీకు గుర్తు చేయడానికి సహాయపడుతుంది.
ఎడమ నుండి కుడి: తమరా డబ్ల్యు. రునియా, మొదటి సలహాదారిణి; ఎమిలీ బెల్లె ఫ్రీమాన్, అధ్యక్షురాలు; మరియు రెండవ సలహాదారిణి ఆండ్రియా మునోజ్ స్పన్నాస్.
మనము ఒంటరిగాలేము
మీరు చేయలేరని అనుకున్నది ఏదైనా చేయమని మీరు ఎప్పుడైనా అడగబడ్డారా? బహుశా మీరు తగినంత బలమైన వారని లేదా తెలివైన వారని భావించియుండకపోవచ్చు, లేదా ఇతరులు మిమ్మల్ని చూసి నవ్వుతారని మరియు విమర్శిస్తారని మీరు భయపడి ఉండవచ్చు. మీరు ఎప్పుడైనా ఈవిధంగా భావిస్తే, మీరు ఒంటరివారు కారు.
వేల సంవత్సరాల క్రితం, హానోకు అనే పేరుగల వ్యక్తి ఉండేవాడు. భూమి ఇప్పటివరకు చూడని—అత్యంత దుష్టులలో కొంతమంది ప్రజలకు పశ్చాత్తాపం ప్రకటించమని దేవుడు హనోకును అడిగారు.
దానిని తాను చేయగలనని హానోకు అనుకోలేదు. తాను చాలా చిన్న వాడినని, తనను ఎవరూ ఇష్టపడలేదని, మరియు అతడు “నోటిమాంద్యము కలవాడను” (మోషే 6:31 చూడండి) అని దేవునితో చెప్పాడు.
కానీ, దేవుడు హానోకుకు ఒక వాగ్దానమిచ్చాడు. “ఇదిగో నా ఆత్మ నీమీదనున్నది, కాబట్టి నీ మాటలన్నిటిని నేను నిర్దోషమైనవిగా యెంచెదను; పర్వతములు నీ యెదుట పారిపోవును, నదులు వాటి మార్గమునుండి మరలును; నీవు నాయందును నేను నీయందును నిలిచియుందుము; కాబట్టి నాతో నడువుము” (మోషే 6:32, 34).
“నాతో నడువుము.” ఎంత నిర్మలమైన, అందమైన ఆహ్వానము.
హానోకు ధైర్యంగా ముందుకు సాగితే, ప్రతి అడుగులో అతడితో ఉంటానని దేవుడు అతడికి వాగ్దానమిచ్చాడు. దేవుడు హనోకును శక్తివంతునిగా చేసి, ఇంకా ఎక్కువ చేయడానికి అతన్ని బలపరుస్తాడు మరియు అతడు ఎప్పటికీ ఊహించిన దానికంటే ఎక్కువగా మారడానికి సహాయం చేస్తాడు.
రక్షకుని అనేక పేర్లలో ఒకటి ఇమ్మానియేలు, లేదా “దేవుడు మనతో ఉన్నాడు” (మత్తయి 1:23). మనతో నడుచుట ప్రభువు నామము మరియు స్వభావములో ఉన్నది. ఎంపిక మనది—మనము కూడా ఆయనతో నడుద్దామా?
ఈరోజుల్లో,హానోకును మనం క్రియాశీలునిగా, ఒక గొప్ప ప్రవక్త మరియు నాయకునిగా చూస్తాము. కానీ హానోకు ప్రవక్త కంటే ముందు, తనను తాను సందేహించుకున్నప్పటికినీ దేవునితో నడవడానికి ఎంపిక చేసిన ఒక బాలుడైన హానోకు ఉన్నాడు.
జీవితం కష్టముగా ఉన్నప్పుడు, మీరు తగిన వారు కారని భావించినప్పుడు, హానోకుకు, మరియు మీకు ప్రభువు చేసిన వాగ్దానమును గుర్తుంచుకొనండి. ఆయన మీతో నడుస్తారు. ఆయన మిమ్మును ఒంటరిగా వదిలిపెట్టరు, ఒక్క క్షణము కూడా విడవరు.
ఇమ్మానియేలు. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మీతో ఉన్నాడు!”
యువతుల ప్రధాన అధ్యక్షత్వము
ఎడమ నుండి కుడి: డేవిడ్ జె. వుండర్లీ, మొదటి సలహాదారులు; తిమోతి ఎల్. ఫర్నెస్, అధ్యక్షుడు; మరియు సీన్ ఆర్. డిక్సన్ రెండవ సలహాదారులు.
ఆయన సహాయంతో, మీరు అన్ని విషయాలు చేయగలరు
యువకులైన మీ వలే, ప్రభువు ముఖ్యమైన యాజకత్వ బాధ్యతలను నెరవేర్చమని హానోకును అడిగారు. దుష్టులైన జనులకు పశ్చాత్తాపాన్ని ప్రకటించుట అతడి పని. హానోకు తన సందేహాలను వ్యక్తపరిచాడు. “[నేను] బాలుడను,” అని అతను చెప్పాడు. “జనులందరు నన్ను ద్వేషించుచున్నారు; … నేను నోటిమాంద్యము కలవాడను; … కాబట్టి నేను నీ దాసుడనా?” (మోషే 6:31).
ప్రభువు శక్తి మరియు హామీతో స్పందించారు. “నీవు వెళ్ళి నేను నీకాజ్ఞాపించినట్లుగా చేయుము. … నీ నోటిని తెరువుము, అది నింపబడును … . ఇదిగో నా ఆత్మ నీమీదనున్నది … ; పర్వతములు నీ యెదుట పారిపోవును … ; కాబట్టి నాతో నడువుము” (మోషే 6:32, 34).
ప్రభువు మనకు చేయడానికి ఒక పనిని ఇచ్చినప్పుడు, మనం దానిని ఒంటరిగా ఎదుర్కొనమని హానోకు నేర్చుకున్నాడు. మనం క్రీస్తుతో నిబంధనలు చేసి వాటిని పాటించినప్పుడు, మనం ఆయనతో నడుస్తాము మరియు ఆయన శక్తిలో పాలుపంచుకుంటాము—మనం ఆయన చేతులలో సాధనాలుగా మారతాము.
హానోకు వలే, మీరు ఒక ముఖ్యమైన పాత్రను కలిగియున్నారు: పరిచర్య చేయుట, దేవాలయంలో సేవ చేయుట, సంస్కారమును నిర్వహించుట, లేఖనాలను అధ్యయనం చేయుట, సువార్త ప్రమాణాలను జీవించుట, పశ్చాత్తాపపడుట, సువార్త సేవ కోసం సిద్ధపడుట, మొదలైనవి. అది చాలా అధికమైనదిగా అనిపించవచ్చు. మీరు తగినవారు కాదని భావించవచ్చు. ఫరవాలేదు. అది ఒంటరిగా చేయడం గురించి కాదు. అది దేవునితో నడవడానికి నేడు—ఈరోజు మరియు ప్రతిరోజు—ఎంపిక చేయడం గురించినది.
ఆయన సహాయముతో, మీరు అన్ని విషయాలు చేయగలరు. ఆయన మీ సహజమైన సామర్ధ్యాన్ని మించి మిమ్మల్ని బలపరుస్తారు, క్షమిస్తారు, మరియు శక్తివంతులుగా చేస్తారు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు! యువతుల ప్రధాన అధ్యక్షత్వము వలే, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మరియు 2026 స్పూర్తిదాయకమైన ఇతివృత్తము: “నాతో నడువుము,” దీనిని అన్వేషించడంలో మీతో చేరడానికి ఎదురుచూస్తున్నాము.
యువకుల ప్రధాన అధ్యక్షత్వము
© 2026 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, January 2026 యొక్క అనువాదము. Telugu. 19934 421