ఆసియా ప్రాంతీయ నాయకత్వ సందేశం
పవిత్రమైన నిబంధనలను చేయడం మరియు పాటించడం ద్వారా దీవెనలు వస్తాయి
"దేవుడు ఆయనతో నిబంధన చేసుకున్న వారిపట్ల, ఆయనకు, అయన పిల్లలకు ప్రతిరోజూ సేవ చేయడానికి ఎంచుకునే వారిపట్ల, ఆయనవలె కావడానికి ప్రయత్నించే వారిపట్ల ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉంటాడు".
నిబంధనల యొక్క శాశ్వతమైన శక్తి
ఎనిమిది సంవత్సరాల చిన్న పిల్లవాడిగా, నా బాప్తిస్మం కొరకు ఎదురుచూస్తూ నేను పడిన అత్యుత్సాహం నాకు స్పష్టంగా గుర్తుంది. నాకు చాలా ఎక్కువ అంచనాలు ఉన్నందున, నేను ఏదో ఒక అద్భుతమైన మరియు తక్షణ అనుభూతిని పొందుతానని నిజంగా నమ్మాను. ఆ స్పష్టమైన అనుభూతి రానప్పుడు, నేను కొంచెం గందరగోళానికి గురయ్యాను. నేను తక్షణ ఆశీర్వాదాలను; ఉన్నపాటుగా పరివర్తనను ఆశించానని అనుకుంటున్నాను. 50 సంవత్సరాల క్రితం జరిగిన నా బాప్తిస్మం గురించి మరియు అప్పటి నుండి బయటపడిన ప్రతివిషయం గురించి ఆలోచిస్తే, ఇప్పుడు నేను అంతా చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాను.
బాప్తిస్మము నిబంధనలోకి ప్రవేశించే అనుభవంతో పాటు, అప్పటి నుండి నేను ప్రభువుతో చేసిన అనేక నిబంధనలు, నా జీవితంలోని గొప్ప ఆశీర్వాదాలకు మూలము. ఇది తక్షణ అతిశయమైన అనుభూతి లేదా మార్పు గురించి కాదు, కానీ నా జీవితంలో నిశ్శబ్దంగా మరియు స్థిరంగా విశదపరచబడిన లోతైన శక్తి గురించి. ఎదో ఒక్క సందర్భంలో కాకుండా, నిబంధన చేయడం మరియు పాటించడం కొరకు చేసిన అనేక కార్యాల ద్వారా ప్రభువుపై నా నమ్మకాన్ని వ్యక్తపరిచిన ప్రతిసారీ నేను చేసిన సరళమైన నమ్మకమైన ఎంపికల నుండి నాకు వచ్చిన అపారమైన శక్తి మరియు ఆశీర్వాదాలను నేను ఇప్పుడు నిజంగా గ్రహించాను.
నిబంధనలు ఒక భాగస్వామ్యంః మనం ప్రభువుతో నిబంధన చేసుకున్నప్పుడు మనం ఒక పవిత్ర సంబంధంలోకి ప్రవేశిస్తాము. విశ్వాసాన్ని సాధనచేస్తామని, ఆయన ఆజ్ఞలను పాటించడానికి కృషి చేస్తామని మరియు నీతివంతమైన ఎంపికలు చేయడానికి శ్రద్ధగల ప్రయత్నాలను చేస్తామని మనము వాగ్దానం చేస్తున్నాము. బదులుగా, జీవితంలోని అన్ని పరిస్థితులలో ఆయన ప్రేమపూర్వక మార్గదర్శకత్వం, బలం మరియు మద్దతును అనుభూతి చెందడానికి మనం ఆశీర్వదించబడ్డాము. అధ్యక్షుడు రస్సెల్ ఎమ్. నెల్సన్ దేవునితో ఒక నిబంధన సంబంధం, “... ఆయన మనలను ఆశీర్వదించడానికి మరియు మార్చడానికి అనుమతిస్తుంది.... మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఉంచినట్లయితే, ఆ నిబంధన మనలను ఆయనకు చాలా దగ్గరగా నడిపిస్తుంది" అని బోధించారు. (“నిత్య నిబంధన,” లియహోనా, 2022 అక్టోబరు)
క్రమంగా మార్పుః నిబంధనల నుండి వచ్చే ఎదుగుదల మరియు మార్పు తరచుగా ఒక శుద్ధీకరణ ప్రక్రియగా ఉంటుంది. ఒక నది లోయను చెక్కినట్లుగా, నిరంతర ప్రయత్నం మరియు ఆత్మచే నడిపించబడటానికి ఇష్టపడే హృదయం, క్రమంగా ప్రభువు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా రూపొందిస్తాయి. ఈ పరివర్తన రోజువారీగా సూక్ష్మంగా ఉండవచ్చు కానీ సంవత్సరాలు మరియు దశాబ్దాలు గడిచేకొద్దీ తిరస్కరించలేనిదిగా మారుతుంది. నేను బాప్తిస్మము తీసుకున్న వెంటనే నాకు భిన్నమైన అనుభూతి కలిగి ఉండకపోవచ్చు, కానీ ఆ నిబంధన కారణంగా నేను తీసుకున్న ఎంపికలు, రోజురోజుకూ, నా జీవితంలో గణనీయమైన ఎదుగుదలకు దారితీశాయి.
ఆధ్యాత్మిక పరిపక్వతః తక్షణ మార్పును ఆశించే 8 ఏళ్ల బాలుడి నుండి లోతైన దీర్ఘకాలిక ఆశీర్వాదాలను గుర్తించే పెద్దవాడిగా నా ప్రయాణం పెరుగుతున్న ఆధ్యాత్మిక పరిపక్వతను ప్రతిబింబిస్తుంది. సమయం మరియు అనుభవంతో మనలో ప్రతి ఒక్కరూ మన జీవితాల్లో ప్రభువు హస్తాన్ని మరింత సూక్ష్మమైన మార్గాల్లో గ్రహించడం నేర్చుకోవచ్చు. మన నిబంధనలలో పాతుకుపోయిన చిన్న చిన్న విశ్వాస చర్యలు కూడా గణనీయమైన ఫలితాలకు దారితీస్తాయని మనం చూడటం ప్రారంభిస్తాము.
నిబంధన పాటించుట వలన కలిగే సమృద్ధియైన ఆశీర్వాదాలు
నా బాప్తిస్మము నుండి నేను చేసిన ప్రతి నిబంధన ఆశీర్వాదాలు, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక శక్తిని కూడబెట్టాయి. ఇది కేవలం ఒక నిబంధన కాదు, కానీ నిబంధనను పాటించే నమూనాయే నా జీవితంలో పరలోకపు ద్వారాలను నిజంగా తెరిచింది. నా నిబంధనల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, ప్రభువు యొక్క మృదు కనికరములు నాకు ఇస్తున్నట్లు నేను చూస్తున్నాను:
-
ధైర్యం: సువార్త సేవ చేయడానికి, ఆలయంలో వివాహం చేసుకోవడానికి మరియు పిల్లలను కనడానికి ధైర్యం;
-
విశ్వాసం: జీవనప్రగతిలో వైఫల్యం ఎదురైనప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండటానికి విశ్వాసం;
-
షరతులు లేని ప్రేమ: నా పిల్లలు దారితప్పి తిరుగుతున్నప్పుడు కూడా వారిపై షరతులు లేని ప్రేమ కలిగిఉండడానికి;
-
క్షమించే శక్తి :నన్ను మోసం చేసిన వ్యాపార భాగస్వామి పట్ల క్షమించే శక్తి
-
నిరీక్షణ: నా బలహీనతలు ఉన్నప్పటికీ పశ్చాత్తాపపడటం కొనసాగించడానికి నన్ను అనుమతించే రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా క్షమాపణ యొక్క నిరీక్షణను కలిగిఉండడానికి: మరియు
-
శాంతి ద్వారా నా తల్లిదండ్రుల మరణాన్ని ఎదుర్కోవడానికి.
"అంతేకాక దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా వారు ఐహికమైన మరియు ఆత్మ సంబంధమైన విషయములన్నిటి యందు ఆశీర్వదింపబడియున్నారు; వారు అంతము వరకు విశ్వాసముతో స్థిరముగా ఉన్న యెడల, వారు పరలోకములోనికి చేర్చుకొనబడి దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు" అని రాజైన బెంజమిన్ బోధించాడు. (మోషైయ 2:41)
నాకు ఇంకా అర్థం కానివి చాలా ఉన్నప్పటికీ, ఇది నాకు ఖచ్చితంగా తెలుసు: దేవుడు తనతో నిబంధన చేసుకునే వారి పట్ల, తనను మరియు తన పిల్లలను సేవించడానికి ప్రతిరోజూ ఎంచుకునే వారి పట్ల మరియు ఆయనలాగా మారడానికి ప్రయత్నించే వారి పట్ల ప్రత్యేక ప్రేమను కలిగి ఉంటాడు. నా జ్ఞానవంతులైన తల్లిదండ్రులకు మరియు నేను అనుసరించడానికి ఒక మార్గాన్ని ఏర్పర్చుటకు బాప్తీస్మ పు నీటిలోకి ప్రవేశించిన వారి నీతిమంతమైన ఉదాహరణకు నేను చాలా కృతజ్ఞుడను. ఈ నిబంధనలు మరియు వాటిని పాటించడానికి ప్రయత్నించడం ద్వారా నా జీవితంలో నేను చూసిన స్పష్టమైన ఆశీర్వాదాల కారణంగా, ప్రభువు జీవిస్తున్నాడని మరియు నన్ను మృదు కనికరములతో ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. నా హృదయం ఆయనది మరియు నేను ప్రతిరోజూ ఆయన దైవిక ఉదాహరణను అనుసరించి విశ్వాసంతో వ్యవహరించాలని ఎంచుకుంటాను.■