2025
నిబంధనలు, శక్తి మరియు వాగ్దానాలు
2025 అక్టోబరు లియహోనా


“నిబంధనలు, శక్తి మరియు వాగ్దానాలు,” లియహోనా, అక్టో 2025.

లియహోనా నెలవారీ సందేశము, 2025 అక్టోబరు

నిబంధనలు, శక్తి మరియు వాగ్దానాలు

ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడకు ముందు విశ్వాసులకు వాగ్దానము చేసిన శక్తి మరియు భద్రతకు దేవాలయము గొప్ప ప్రాముఖ్యతగలదని ఎల్డర్ రాస్‌బాండ్ సాక్ష్యమిస్తున్నారు.

కర్ట్‌లాండ్ దేవాలయము యెదుట నిలబడిన జోసెఫ్ స్మిత్ యొక్క దృష్టాంతము

డాన్ బర్ చేత జోసెఫ్ స్మిత్ యొక్క చిత్రపటము

మే 1833లో, మా నాల్గవ ముత్తాత అసహెల్ పెర్రీ మరియు కొందరు స్నేహితులు ఉత్తర న్యూయార్క్ నుండి కర్ట్‌లాండ్ ఒహైయోకు ప్రయాణించారు. వారు క్రొత్తగా పునఃస్థాపించబడిన సంఘ సభ్యులు కాదు, కానీ వారు ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను కలుసుకోవాలని కోరారు. కర్ట్‌లాండ్ దేవాలయ నిర్మాణం గురించి చర్చించడానికి జరిగిన మొదటి సలహాసభకు హాజరుకావడానికి వారు సరిగ్గా సమయానికి వచ్చారు.

సలహాసభ ప్రారంభించిన తరువాత, ప్రవక్త దేవాలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. తరువాత అటువంటి పెద్ద కార్యక్రమానికి సంబంధించి వారి భావాలను తెలియజేయమని అతడు హాజరైన వారిని కోరాడు. అటువంటి పనిని చేపట్టడానికి సంఘము చాలా పేదరికంలో ఉందని అనేకమంది స్పందించారు. ఒక చిన్న, తక్కువ ఖర్చుగల భవన నిర్మాణమును వారు ప్రతిపాదించారు.

తరువాత జరిగిన చర్చలో, పెర్రీ తాత మరియు అతని స్నేహితులు గుమిగూడి, వారి డబ్బును బయటకు తీసి వారి దగ్గర ఉన్న డబ్బు మొత్తం లెక్కపెట్టారు. వారి తిరుగు ప్రయాణానికి చెల్లించడానికి మరియు దేవాలయ నిర్మాణానికి విరాళమివ్వడానికి వారికి తగినంత డబ్బు ఉన్నదా? కొన్ని నిముషాల తరువాత, మా తాత జోసెఫ్ స్మిత్‌ను సమీపించి, ఐదు డాలర్ల బంగారు నాణెన్ని తీసి, దానిని ప్రవక్తకు సమర్పించాడు. (అటువంటి ఒక నాణెము ఇప్పుడు వందల డాలర్ల విలువను కలిగియుంటుంది!)

జోసెఫ్ సలహాసభ యెదుట నిలబడి నాణేన్ని ఎత్తి చూపాడు. తరువాత, ఉత్సాహంగా మాట్లాడుతూ, “కార్యము ప్రారంభమైంది మరియు [ప్రభువు యొక్క] మందిరము ప్రభువైన యేసు క్రీస్తు చేత సమర్పించబడిన నమూనా ప్రకారం నిర్మించబడుతుంది” అని చెప్పాడు.

త్వరలో పెర్రీ కుటుంబం కర్ట్‌లాండ్‌లోని సంఘములో చేరింది, కొన్ని సంవత్సరాల తరువాత నావూ దేవాలయంలో వారి దేవాలయ దీవెనలు పొందారు మరియు తరువాత మైదానాలను దాటి యూటాకు చేరుకున్నారు.

1836లో కర్ట్‌లాండ్‌ దేవాలయం ప్రతిష్ఠింపబడే సమయానికి, దాని ప్రతిష్ఠకు హాజరు కావాలని కోరే కడవరి-దిన పరిశుద్ధులనందరినీ లోపల ఉంచడానికి అది చాలా చాలా చిన్నదిగా ఉంది. సంఘము పెరిగేకొద్దీ, సమావేశాలకు బయట నుండి హాజరు కావాల్సిన పరిశుద్ధుల సంఖ్య కూడా పెరిగింది. నేను యువకునిగా ఉన్నప్పుడు నా స్టేకు అధ్యక్షునిగా సేవ చేసి మరియు 2007 లో నేను ప్రధాన అధికారిగా పిలవబడినప్పుడు నాకు గురువుగా వ్యవహరించిన అధ్యక్షులు జేమ్స్ ఈ. ఫౌస్ట్ (1920-2007), సంఘము యొక్క రెండవ దేవాలయం గురించి ఈ పరిశీలన చేసారు:

“1846 లో నావూ దేవాలయం పూర్తి చేయబడకముందు, జోసెఫ్ మరియు మిగిలిన సంఘ నాయకులు మాట్లాడినప్పుడు వినడానికి, పరిశుద్ధులు తరచుగా బయట మరియు దేవాలయం దగ్గర సమావేశమయ్యేవారు. కొన్నిసార్లు ఆ సమావేశాలకు వేలమంది హాజరయ్యే వారు”—కొన్నిసార్లు ప్రతికూల వాతావరణంలో కూడా.

“[ఎల్డర్] జార్జ్ ఎ. స్మిత్ తన హాస్యభరితమైన రీతిలో పరిశీలించినట్లుగా, ‘ప్రవక్త జోసెఫ్ రోజులలో … [సంఘము] బయట బాగా అభివృద్ధి చెందింది.’”

మన కాలంలో కడవరి-దిన పరిశుద్ధుల సంఘము ప్రపంచంలో ప్రతిచోటా అభివృద్ధి చెందుతున్నందుకు మనం కృతజ్ఞతను కలిగియున్నాము. ఆ అభివృద్ధి “ప్రస్తావించిన నమూనా ప్రకారం” దేవాలయాల నిర్మాణం అపూర్వమైన వేగంతో జరుగుచున్నది—ఈ నమూనా ఎల్లప్పుడూ దీవెనలు, సమర్పణ, విశ్వాసము మరియు త్యాగం కలిగియున్నది.

కర్ట్‌లాండ్ దేవాలయము యొక్క చిత్రపటం

గ్లెన్ ఎస్. హాప్కిన్‌సన్ చేత ఒక మహిమకరమైన వెలుగు—కర్ట్‌లాండ్ దేవాలయము అనుకరించబడదు.

ఇన్ని దేవాలయాలు ఎందుకు?

“ఉత్తర మరియు దక్షిణ అమెరికా, పసిఫిక్ ద్వీపాలు, ఐరోపా మరియు ఇతర ప్రాంతాలలో దేవాలయాలు కనిపిస్తాయని మా పూర్వీకులు ప్రవచించారు,” అని అధ్యక్షుడు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ (1899–1994) అనేక దశాబ్దాల క్రితం చెప్పారు. “ఈ విమోచన కార్యం ఇలాంటి స్థాయిలో జరగాలంటే వందలాది దేవాలయాలు అవసరమవుతాయి.”

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు, నేడు మనం అపూర్వమైన వేగంతో దేవాలయాలు నిర్మిస్తున్నాము “ఎందుకనగా ప్రభువు ఆవిధంగా చేయమని మనకు సూచించారు. దేవాలయ దీవెనలు ఇశ్రాయేలీయుల‌ను తెరకు రెండు వైపులా సమకూర్చడానికి సహాయపడతాయి. ఈ దీవెనలు ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయడంలో సహాయపడే జనులను సిద్ధం చేయడానికి కూడా సహాయపడతాయి!”

కర్ట్‌లాండ్ దేవాలయ ప్రతిష్ఠాపన ప్రార్థనలో, జోసెఫ్ స్మిత్ ఇలా ప్రార్థించాడు, “ప్రభువు యొక్క మందిరపు గుమ్మమున ప్రవేశించే జనులందరూ మీ శక్తిని అనుభూతి చెందుదురు గాక. …

“పరిశుద్ధ తండ్రీ, నీ నామము వారిపైన ఉండి నీ మహిమ వారిచుట్టూ ఉండి, వారి యెడల నీ దూతలు ఆజ్ఞను కలిగియుండుటకు, నీ శక్తిని ఆయుధములుగా ధరించుకొని నీ సేవకులు ఈ మందిరము నుండి వెళ్ళగలుగుటకు మేము నిన్నడుగుచున్నాము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 109:13, 22; వివరణ చేర్చబడింది; 23 వచనము కూడ చూడండి).

ఆ వచనాలను నేను చదివినప్పుడు, కడవరి దినాలను గూర్చి నీఫై యొక్క దర్శనం గురించి నేను ఆలోచిస్తున్నాను. ఇదేవిధమైన పదాలను గమనించండి: “భూముఖమంతటిపై చెదిరియున్న గొఱ్ఱెపిల్ల సంఘము యొక్క పరిశుద్ధులపైన, ప్రభువు నిబంధన జనులపైన దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క శక్తి దిగివచ్చుట నీఫైయను నేను చూచితిని; వారు గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి” (1 నీఫై 14:14; వివరణ చేర్చబడింది).

కడవరి-దిన దేవాలయాలు నీఫై ప్రవచనం నెరవేర్పులో ముఖ్యమైన పాత్ర వహిస్తాయని, రెండవ రాకడకు ముందు విశ్వాసులకు వాగ్దానము చేయబడిన భద్రత మరియు శక్తికి చాలా ముఖ్యమైనవని నేను నమ్ముతున్నాను.

కొన్ని సంవత్సరాల క్రితం, నేను విశ్వవిద్యాలయ వార్డుకు బిషప్పుగా సేవ చేస్తున్నప్పుడు, మా వార్డులో ఒక యువతి నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆమె ఇప్పటికీ నన్ను ఆకట్టుకుంటుంది. ఆమె యువతుల ప్రధాన అధ్యక్షురాలైన, అధ్యక్షురాలు ఎమిలీ బెల్లె ఫ్రీమాన్‌గా మీకు తెలుసు. ఇటీవల సర్వసభ్య సమావేశ ప్రసంగంలో, ఆమె దేవాలయం ద్వారా యేసు క్రీస్తు మనల్ని మహోన్నతమైన ఆత్మీయ స్థాయికి పైకి ఎత్తుతారని బోధించింది.

“ఆయన మందిరపు గుమ్మములో ప్రవేశించిన ప్రతిసారి, నేను ఆయనతో లోతైన నిబంధన సంబంధాన్ని అనుభవిస్తున్నాను,” అని అధ్యక్షురాలు ఫ్రీమాన్ చెప్పింది. “ఆయన ఆత్మతో నేను శుద్ధి చేయబడ్డాను, ఆయన శక్తితో వరమివ్వబడ్డాను, మరియు ఆయన రాజ్యమును నిర్మించడానికి నియమించబడ్డాను.”

వాగ్దానము చేయబడిన శక్తి

దేవాలయ నిబంధనల ద్వారా లభ్యమయ్యే యేసు క్రీస్తు యొక్క శక్తి గురించి అధ్యక్షులు నెల్సన్ తరుచుగా చెప్పారు. “మీరు రక్షకుని యొక్క కాడిని యెత్తుకోవడమంటే అర్థము, ఆయన బలానికి, విమోచనా శక్తికి మీరు ప్రవేశం కలిగియుండడం” అని ఆయన అన్నారు. అధ్యక్షులు నెల్సన్ ఇలా కూడా బోధించారు:

“మనం మన దేవాలయ నిబంధనలను పాటించినప్పుడు, ప్రభువు యొక్క బలపరిచే శక్తిని మనం ఎక్కువగా పొందుతాము. దేవాలయంలో, లోకము యొక్క దెబ్బల నుండి మనం రక్షణ పొందుతాము.”

“పవిత్రమైన యాజకత్వ నిబంధనల ద్వారా ఆయన ఆవశ్యకమైన విధులు మనల్ని “[రక్షకునితో] బంధించి ఉంచుతాయి. తరువాత, మనం మన నిబంధనలను పాటించినప్పుడు, ఆయన స్వస్థపరిచే, బలపరిచే శక్తిని ఆయన మనకు వరముగా ఇస్తారు. మరియు ఓహ్, రాబోయే రోజుల్లో ఆయన శక్తి మనకు ఎంతో అవసరం.”

“మన జనులకు ప్రస్తుతం మరియు రాబోయే రోజులకు అవసరమైన నైతిక మరియు ఆత్మీయ శక్తి, తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి. వారితో నిబంధనలను చేసి, పాటించడం ద్వారా వారి శక్తిని మనం పొందుతాము.”

సహోదర, సహోదరిలారా, పరలోక శక్తి ముఖ్యమైనది, ఎందుకనగా మనము చాలా దుష్టలోకంలో జీవిస్తున్నాము. ఆ శక్తి లేకుండా, మనం “ఆయన రాకడను సహింపలేము” లేదా “ఆయన అగుపడగా ఓర్వలేము” (మలాకీ 3:2). ఆ రోజు ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఆయన రాకడ కొరకు “మార్గము సిద్ధపరచుటకు” (మలాకీ 3:1) ఆయన దూత ఇదివరకే పంపబడ్డాడు. ఈలోగా, ప్రపంచం ఆ రోజు వైపు ప్రశాంతంగా జారిపోవడం లేదు.

మనకు సహాయపడటానికి విశ్వాసులకు వాగ్దానము చేయబడిన శక్తి మనకవసరం:

  • మన జీవితాలలో దేవునికి ప్రాధాన్యతను ఇవ్వాలి.

  • పశ్చాత్తాపపడి, ప్రభువుకు దగ్గర కావాలి.

  • దీవించాలి, ఓదార్చాలి, నడిపించాలి, మరియు పరిచర్య చేయాలి.

  • “మన శ్రమలు, శోధనలు మరియు హృదయ వేదనలను సరిగా భరించాలి” (మోషైయ 3:19 చూడాలి).

  • మనం నిబంధన బాటను నడుస్తున్నప్పుడు క్రీస్తునందు శాంతిని మరియు ఆనందాన్ని కనుగొనాలి.

  • “దహించివేయబడు దినము” మరియు “దుష్టులకు కలుగబోవు ఉపద్రవముకు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 109:46) వ్యతిరేకంగా సిద్ధపడాలి.

  • ప్రభువు రాకడకు ముందు ఆయన కార్యమును నెరవేర్చాలి.

టక్సన్ ఆరిజోనా దేవాలయం

జేమ్స్ విట్నీ యంగ్ చేత టక్సన్ ఆరిజోనా దేవాలయపు గోపురం యొక్క ఛాయాచిత్రం

రక్షణ సైనికులు

“నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే” పరలోక తండ్రి యొక్క కార్యమును మహిమయైయున్నది (మోషైయ 1:39). ఆ కార్యము మరియు మహిమలో రక్షకుని ప్రధాన పాత్రను సూచిస్తూ, ప్రతి దేవాలయము దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు భూసంబంధమైన కాపలాదారునిగా నిలుచును.

ఆయన శక్తితో ధరించబడి, నిబంధన-పాటించే ప్రతి పురుషుడు మరియు స్త్రీ—వివాహితులైన లేదా కానప్పటికినీ—దేవాలయ నిబంధనలను విశ్వాసంగా పాటించే వారు ఈ జీవితంలో, రాబోయే మరియు జీవితంలో దీవించబడతారు.

అధ్యక్షులు నెల్సన్ వాగ్దానమిచ్చారు: “మనలో ప్రతీఒక్కరు ప్రయాసపడే లక్ష్యము ప్రభువు యొక్క మందిరములో శక్తితో దీవించబడుట, కుటుంబాలుగా బంధింపబడుట, దేవుని యొక్క మిక్కిలి గొప్ప వరమైన—నిత్యజీవము కొరకు మనల్ని అర్హులుగా చేయునట్లు దేవాలయములో చేయబడిన నిబంధనలకు విశ్వాసముగా ఉండుట. దేవాలయము యొక్క విధులు మరియు అక్కడ మీరు చేయు నిబంధనలు మీ జీవితము, మీ వివాహము, కుటుంబమును మరియు అపవాది యొక్క ముట్టడులను ఎదురించుటకు మీ సామర్ధ్యమును బలపరచుటకు ముఖ్యమైనవి. దేవాలయములో మీ ఆరాధన, మీ పూర్వీకుల కొరకు అక్కడ మీ సేవ మిమ్మల్ని హెచ్చించబడిన వ్యక్తిగత బయల్పాటుతో దీవించును, నిబంధన బాటపై నిలిచియుండుటకు మీ నిబద్ధతను పటిష్టపరచును.”

ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తులునిగా, ఈ విషయాలు సత్యమని నేను సాక్ష్యమిస్తున్నాను.