2025
మీ సువార్త ప్రయాణంలో ఆనందాన్ని కనుగొనుట
2025 జూలై


“మీ సువార్త ప్రయాణంలో ఆనందాన్ని కనుగొనుట,” లియహోనా, 2025 జూలై.

లియహోనా నెలవారీ సందేశము, 2025 జూలై

మీ సువార్త ప్రయాణంలో ఆనందాన్ని కనుగొనుట

ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా ప్రభువు పట్ల మన ప్రేమను చూపించుట వలన కలిగే అంతిమ ఫలితం సంతోషాన్ని, ఆనందాన్ని తెచ్చే ఆశీర్వాదాలు.

థాయ్‌లాండ్‌లో నవ్వుతున్న సంఘ సభ్యులు

క్రిస్టీనా స్మిత్ చేత థాయ్‌లాండ్‌లో ఆనందిస్తున్న సంఘ సభ్యుల ఛాయాచిత్రము

కొన్ని సంవత్సరాల క్రితం జపాన్‌లో ఒక మిషను నాయకునిగా సేవ చేస్తుండగా, మా మిషనుకు దూరంగా ఉన్న ఒక గ్రామీణ నగరంలో వారాంతపు సమావేశానికి నేను హాజరయ్యాను. ఒక సంవత్సరం క్రితం సంఘంలో చేరి, దేవాలయ సిఫారసును పొందడానికి కోరుచున్న ఒక వ్యక్తితో ఇంటర్యూ జరపడానికి జిల్లా అధ్యక్షుడు నన్ను ఏర్పాటు చేసాడు. తాను బాప్తీస్మము పొందిన ఒక సంవత్సరం పూర్తి చేసిన రోజున లేదా దానికి దగ్గరలో తన స్వంత వరమును పొందాలని అతడు ఆశించాడు.

మా సంభాషణ సమయంలో, ఈ క్రొత్త సభ్యుడు తాను బాప్తీస్మము పొందిన సంవత్సరం నుండి తాను పొందిన సమృద్ధియైన దీవెనల కోసం తాను ఎంత కృతజ్ఞత కలిగియున్నాడో వివరించాడు. అతడు వారాంతపు మరియు ఇతర సమావేశాలకు హాజరు కావడాన్ని ఆనందించాడు. అతడు తన శాఖలోని ప్రోత్సాహ కార్యక్రమాలలో లోతుగా పాలుపంచుకున్నాడు. నాకైతే, అతడు తన సువార్త ఉద్దేశ్యమును గ్రహించి, దేవునితో నిబంధనలు చేయడం మరియు పాటించడం వలన ఒక వ్యక్తికి కలిగే విశ్వాసాన్ని అతడు ప్రదర్శించాడు, ఇప్పుడు అది అతని స్వభావము మరియు గుర్తింపులో ముఖ్యమైన భాగము. అతడు హృదయము యొక్క బలమైన మార్పును అనుభూతి చెందిన క్రీస్తు యొక్క మార్పు చెందిన శిష్యుడు (మోషైయ 5:2 చూడండి).

మా మిగిలిన సంభాషణ ఆశావాద స్వరాన్ని కూడా కలిగియున్నది. అతని దేవాలయ అనుభవంలో భాగమైన విధులు మరియు నిబంధనల గురించి మేము చర్చించాము. ఒక దేవాలయ సిఫారసును పొందడానికి సంబంధించిన ప్రమాణపు ప్రశ్నలలో ప్రతి దానికి అతడు దృఢంగా జవాబిచ్చాడు.

ఇంటర్యూ తరువాత, అటువంటి శ్రేష్ఠమైన వ్యక్తిని కలుసుకున్నందుకు నేను ఎంత కృతజ్ఞత కలిగియున్నానో జిల్లా అధ్యక్షునితో చెప్పడం నాకు గుర్తుంది. సువార్తికులు మరియు సభ్యులు అటువంటి సామర్ధ్యం మరియు వాగ్దానాన్ని కలిగియున్న వ్యక్తిని కనుగొని, ఆత్మీయంగా పోషించినందుకు నేను ఎంతగా ముద్రవేయబడ్డానో అతనికి చెప్పాను.

దాదాపు సంవత్సరం క్రితం ఈ వ్యక్తి సువార్తికుల నుండి పాఠాలను తీసుకొని, సంఘానికి హాజరు కావడం ప్రారంభించినప్పుడు, అతడు నిరాశ్రయుడు మరియు కష్టమైన—దాదాపు నిరాశజనకమైన—పరిస్థితులలో ఉన్నాడని జిల్లా అధ్యక్షుడు చెప్పినప్పుడు నేను చలించిపోయాను. తరువాత ఈ సహోదరుడు సువార్తను ఎలా అధ్యయనం చేసాడో మరియు నెలల కాలంలో అతడి పరివర్తన, అతడి అద్భుతమైన మార్పుకు ఎలా నడిపించిందో, ఆత్మీయ మరియు భౌతికమైన స్వావలంబన కలిగియుండుటను ప్రారంభించడానికి అతడికి ఎలా సహాయపడిందో మరియు అతని ఉద్దేశ్యము, ఆనందమైన భావనను ఎలా ఇచ్చిందో జిల్లా అధ్యక్షుడు వివరించాడు.

సువార్త అతడికి తన జీవితం యొక్క ఉద్దేశ్యపు స్పష్టమైన చిత్రాన్ని ఇచ్చింది. స్పష్టమైన, ప్రశస్థమైన సువార్త సత్యములు, “దేవుడు మన పరలోక తండ్రి, మరియు మనము ఆయన పిల్లలము. … దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ఎరుగుదురు మరియు మనల్ని ప్రేమిస్తున్నారు, అనే జ్ఞానంతో ప్రారంభించి. … మర్త్యత్వము యొక్క ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులను తెచ్చింది.” ఆయన ప్రణాళికలో, “పరలోక తండ్రి … ఆయన సన్నిధికి తిరిగి వెళ్ళడానికి ఆయన మనకు సహాయపడటానికి అనేక బహుమానాలు మరియు మార్గదర్శకాలను అందించారు.”

ఈ వ్యక్తికి కలిగినది అటువంటి దీవెనయే, అది యేసు క్రీస్తు సువార్త ద్వారా దేవుని యొక్క పిల్లలందరికి సమానంగా లభ్యమయ్యేది.

జీవితం యొక్క ఉద్దేశ్యము

యేసు క్రీస్తు తన సువార్తను ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించారు కనుక, “మనమెవరము అనే జీవితపు ఉద్దేశ్యమును గూర్చి జ్ఞానాన్ని మనం కలిగియున్నాము,” అని అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బల్లార్డ్ ప్రకటించారు (1928-2023). సంఘానికి తన చివరి సాక్ష్యములో, అప్పుడు-పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క తాత్కాలిక అధ్యక్షులుగా ఉన్న అధ్యక్షులు బల్లార్డ్, ఇలా చెప్పారు:

“దేవుడు ఎవరో మనకు తెలుసు; రక్షకుడెవరో మనకు తెలుసు, ఎందుకంటే తన పాప క్షమాపణ కోరుతూ బాలుడిగా చెట్ల పొదలలోకి వెళ్ళిన జోసెఫ్ మనతో ఉన్నాడు. …

“జీవితంలో మన ఉద్దేశ్యం గురించి మనకు ఏమి తెలుసు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము, మన దైనందిన జీవితంలో మనం ఏమి చేయడానికి ప్రయత్నించాలి మరియు ఏమి సాధించాలి అనే దాని గురించి మనం తెలుసుకోవడం ఎంత ఆశీర్వాదకరమో నేను ఆశ్చర్యపోతున్నాను, మరియు మీలో చాలా మంది కూడా ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను.”

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులకు, ఆ జ్ఞానము దేవుని రక్షణ యొక్క “పరిపూర్ణమైన ప్రణాళికను” కలిపియున్నది. “సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక”, “విమోచన యొక్క ప్రణాళిక” మరియు “కనికరము యొక్క ప్రణాళిక” (అల్మా 42:8, 11, 15) అని కూడా పిలవబడే ఇది జీవితం యొక్క రహస్యాన్ని మరియు మన భవిష్యత్తు యొక్క అనిశ్చితిని తొలగిస్తుంది. ఆ ప్రణాళికకు ముఖ్యమైనది, “క్రీస్తు యొక్క సిద్ధాంతము,” ఇది జీవితం యొక్క ఉద్దేశానికి ప్రధానమైనది.

మనం సువార్తను కలిగియున్నాము కనుక, మనము దేవుని పిల్లలమని, పరీక్షించబడటానికి, మెరుగుపరచబడటానికి, మరియు “వధించబడిన గొఱ్ఱెపిల్ల యొక్క విజయము, మహిమ ద్వారా, మృతుల పునరుత్థానమువలన ముందుకు తేబడటానికి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:39) సిద్ధపరచబడటానికి భూమి మీదకు పంపబడ్డామని మనం ఎరుగుదుము. మనకు ఆజ్ఞలు తెలుసు మరియు “మంచి చెడులను [మనం] తెలుసుకొనుటకు తగినంత సమృద్ధిగా” (2 నీఫై 2:5) బోధింపబడియున్నాము. ప్రేమించడానికి మరియు సేవ చేయడానికి మనం భూమి మీద ఉన్నామని ఎరుగుదుము. ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపాటులో లోకాన్ని జయించడానికి మరియు ఇతరులు అదేవిధంగా చేయడానికి సహాయపడుటకు రక్షకుడు మనల్ని పిలిచారని మనమెరుగుదుము (యోహాను 16:33; సిద్ధాంతము మరియు నిబంధనలు 64:2 చూడండి)

మనము ఆయనపై దృష్టిసారించినప్పుడు, “మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సువార్త యొక్క ఉల్లాస ధ్వని” అని జోసెఫ్ స్మిత్ పిలిచినది కష్టతరమైన రోజులలో మనల్ని బలపరుస్తుంది మరియు మన జీవితాలలో, ఇతరుల జీవితాలకు అర్థాన్ని మరియు ఉద్దేశాన్ని తెస్తుంది.

యేసు క్రీస్తు

డేన్ విల్సన్ చేత, ప్రతి మోకాలు వంగును, అనుకరించబడదు

విధేయత, దీవెనలు, ఆనందము

మన ఎంపికల కొరకు జవాబుదారులుగా ఉండునట్లు దేవుడు మనకు నైతిక కర్తృత్వమును ఇచ్చారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 101:78; 2 నీఫై 2:16 చూడండి). “అన్ని విషయములలో వ్యతిరేకత ఉండుట” (2 నీఫై 2:11) లో భాగంగా, మన కర్తృత్వమును దుర్వినియోగం చేయడానికి మనల్ని శోధించడానికి సాతాను అనుమతించబడ్డాడు.

కానీ ప్రభువైన యేసు క్రీస్తు, మన కాలములో, “భూలోక నివాసులందరిపైకి రాబోవు విపత్తునెరిగి,” ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను పిలిచి, “పరలోకము నుండి మాట్లాడి, మరియు అతనికి ఆజ్ఞలనిచ్చెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:17). ప్రభువు తన ఆజ్ఞలను మరియు చిత్తమును తన ప్రవక్తలకు బయల్పరచే మాదిరి మన కాలంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌తో కూడా కొనసాగుతున్నది—మరియు అదే కారణము కొరకు. ఈ జీవితంలో సంతోషానికి మరియు తరువాత జీవితంలో సిలెస్టియల్ మహిమకు మనల్ని నడిపించడానికి దేవుడు కోరుతున్నారు.

దేవుని ఆజ్ఞలకు విధేయత అనేది ఆయన పట్ల మనకున్న భక్తి మరియు మన ప్రేమ నుండి రావాలి. దేవునిని ప్రేమించుట “ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ” (మత్తయి 22:37–38 చూడండి) అని ప్రభువైన యేసు క్రీస్తు తానే ప్రకటించారు. తరువాత “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు” (యోహాను 14:15) అని ఆయన ప్రకటించినప్పుడు, ఆయన మరింత అంతర్దృష్టిని ఇచ్చారు.

ప్రభువును ప్రేమించి మరియు ఆయన ఆజ్ఞలను పాటించినందుకు బహుమానమున్నది. ఈ యుగములో ఆయన ఇలా ప్రకటించారు, “అన్ని దీవెనలు ఆధారపడియున్న ఒక ధర్మశాస్త్రము మార్పు చేయజాలని విధముగా పరలోకములో ప్రకటించబడెను—

“మనము దేవుని నుండి ఏదైనా దీవెనను పొందిన యెడల, అది ఏ ధర్మశాస్త్రముపై ఆధారపడియున్నదో దానికి విధేయత చూపుట ద్వారా అది జరుగును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:20–21).

కాబట్టి, ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా ప్రభువు పట్ల మన ప్రేమను చూపించుట వలన కలిగే అంతిమ ఫలితం సంతోషాన్ని, ఆనందాన్ని తెచ్చే ఆశీర్వాదాలు.

పునఃస్థాపించబడిన సువార్త మరియు ఆధునిక బయల్పాటు యొక్క దృష్టికోణము ద్వారా జీవితాన్ని చూడటం మనకు స్పష్టతను ఇస్తుంది. మన దైవిక పుట్టుక మరియు గమ్యము గురించి స్పష్టమైన దృష్టికోణముతో, మనము “[మన] మర్త్య జీవితాన్ని ఉత్తమంగా మార్చే విషయాలు, ఖచ్చితంగా అవే విషయాలు నిత్యత్వము అంతటా మీ జీవితాన్ని ఉత్తమంగా మార్చగలవని ఎరుగుదుము!”

ముగింపు

జపానులో ఇటీవల మార్పు చెందిన వ్యక్తితో ఒక సంవత్సరం క్రితం నా అనుభవాన్ని గుర్తు చేస్తూ, నేను ప్రారంభించిన చోటే ముగిస్తాను. అతడి శ్రద్ధ మరియు సువార్తికులు, సభ్యుల యొక్క శ్రద్ధ ద్వారా, అతడు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను కనుగొన్నాడు. సువార్తను కనుగొనుటలో, అతడు తన ఉద్దేశాన్ని కూడా కనుగొన్నాడు, అది అతడి దృష్టిని విశదపరచింది. అతడు సంతోషము యొక్క గొప్ప ప్రణాళికను కూడా కనుగొన్నాడు. ప్రణాళిక యొక్క సువార్త నిబంధనలకు విధేయత అతడిని భౌతికంగా, ఆత్మీయంగా పైకెత్తుతూ, అతడికి దీవెనలు మరియు ఆనందాన్ని తెచ్చింది.

యేసు క్రీస్తు యొక్క సంఘానికి నడిపించిన అతడి ప్రయాణము అతడు యేసు క్రీస్తు యొక్క సాక్షిగా మారడానికి అనుమతించింది. తరువాత కలిగే ఆనందాన్ని పన్నెండు మంది అపొస్తలుల సమూహము యొక్క ఎల్డర్ ప్యాట్రిక్ కీరన్ క్రింది విధంగా వర్ణించారు:

“ఆయన పిల్లలలో ప్రతీ ఒక్కరి కోసం మన పరలోక తండ్రి యొక్క ప్రేమ పూర్వకమైన ప్రణాళిక కారణంగా, మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క విమోచించు జీవితము, నియమితకార్యము కారణంగా, మనం భూమిపై—అత్యంత ఆనందకరమైన వ్యక్తులుగా ఉండగలము—మరియు ఉండాలి! తరచుగా సమస్యాత్మకమైన ప్రపంచంలో జీవితపు తుఫానులు మనపైకి వచ్చినప్పటికీ, క్రీస్తునందు మనకున్న నిరీక్షణ మరియు అందమైన సంతోష ప్రణాళికలో మన స్వంత స్థానం గురించి మనకున్న అవగాహన కారణంగా మనం పెరుగుతున్న మరియు స్థిరమైన ఆనందాన్ని, అంతర్గత శాంతిని పెంపొందించుకోవచ్చు.”

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తలో అంతర్భాగంగా ఉన్న సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక గురించి సాక్ష్యమును, నా కృతజ్ఞతను తెలుపుతున్నాను. నిత్యజీవము వైపు మీ ప్రయాణములో సువార్త ఫలాలను పాలుపంచుకోమని మరియు ఈ జీవితంలో ఆనందాన్ని అనుభవించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.