“ఆయనతో ఆయన కార్యములో చేరడం ద్వారా మనం యేసు క్రీస్తును అనుసరిస్తాము,” లియహోనా, 2025 జూన్.
లియహోనా నెలవారీ సందేశము, 2025 జూన్
ఆయనతో ఆయన కార్యములో చేరడం ద్వారా మనం యేసు క్రీస్తును అనుసరిస్తాము
ఆయన ఉద్దేశాలపై దృష్టి కేంద్రీకరించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం మరియు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మనం రక్షకుని యొక్క కార్యములో పాల్గొంటాము.
Christ and the Rich Young Ruler [క్రీస్తు మరియు ధనవంతుడైన యౌవన అధికారి] నుండి వివరణ, హీన్రిచ్ హాఫ్‌మన్ చేత
మనం బాప్తిస్మము తీసుకున్నప్పుడు, యేసు క్రీస్తు నామమును మనపై తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తాము. ఈ ప్రక్రియలో కొంత భాగం రక్షకునితో ఆయన కార్యములో చేరడాన్ని సూచిస్తుంది. ప్రథమ అధ్యక్షత్వములోని మొదటి సలహాదారుడు, అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్, ఇలా వ్రాశారు, “క్రీస్తు నామమును మనపై తీసుకోవడమనేదానికి అత్యంత ముఖ్యమైన అర్థాలలో ఒకటేమిటంటే, రక్షకుడిని మరియు ఆయన రాజ్యం యొక్క కార్యమును మనపై తీసుకునే సుముఖతను మరియు నిబద్ధతను కలిగియుండటం.”
“నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే” రక్షకుని యొక్క కార్యమైయున్నది. (మోషే 1:39). అమర్త్యత్వమనేది యేసు క్రీస్తు తన పునరుత్థానం ద్వారా ఇప్పటికే హామీ ఇచ్చిన షరతులు లేని ఒక బహుమానము. అయితే, నిత్యజీవమనేది అమర్త్యత్వము లాంటిది కాదు. నిత్యజీవమనేది దేవుడు మానవాళికి ఇవ్వగల గొప్ప బహుమానము (సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7 చూడండి). అది ఆయన సన్నిధిలో కుటుంబాలుగా శాశ్వతంగా జీవించడమే. మనం నిత్యజీవాన్ని పొందాలంటే, మనం యేసు క్రీస్తు యొక్క నమ్మకమైన శిష్యులుగా మారాలి. మనం రక్షకునిపై మరియు ఆయన ప్రాయశ్చిత్తముపై విశ్వాసం కలిగియుండడం, పశ్చాత్తాపపడడం, బాప్తిస్మం తీసుకోవడం, పరిశుద్ధాత్మ వరాన్ని పొందడం, దేవాలయ నిబంధనలు చేయడం మరియు పాటించడం మరియు అంతము వరకు సహించడం ద్వారా పునరుద్ధరించబడిన సువార్తను పొందుతాము అని దీని అర్థం. అంతము వరకు సహించడమనే దానిలో, రక్షకునితో ఆయన కార్యములో చేరడాన్ని కలిగియుంది.
ఆతృతతో నిమగ్నమవ్వడం
దేవుని పిల్లలు కూడా యేసు క్రీస్తు యొక్క నమ్మకమైన శిష్యులుగా మారడానికి మనం సహాయం చేస్తున్నప్పుడు, మనం రక్షకుని యొక్క కార్యములో పాల్గొంటాము. ఆయన సువార్తను పంచుకోవడం,తద్వారా చెదిరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చడం, రక్షకుని యొక్క సంఘంలో బాధ్యతలను నెరవేర్చడం మరియు ఆయనలాగా మారడానికి కృషి చేయడం, దీనిలో ఉన్నాయి. “[ఆయన కార్యములో] మన విజయం అనేది ఇతరులు [మనకు], [మన] ఆహ్వానాలకు లేదా [మన] నిజమైన దయగల చర్యలకు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉండదు.” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా ధ్రువీకరించారు, “ఏ సమయంలోనైనా మీరు చేసేది ఏదైనా అది తెరకు ఇరువైపుల ఎవరికైనా—దేవునితో నిబంధనలు చేయుట వైపు మరియు వారికి ఆవశ్యకమైన బాప్తిస్మపు నిబంధనలు, దేవాలయ నిబంధనలు పొందుట వైపు ఒక అడుగు వేయుటకు సహాయపడిన యెడల, ఇశ్రాయేలును సమకూర్చుటకు మీరు సహాయపడుతున్నట్లే.”
రక్షకుని కార్యమును మన కార్యముగా చేసుకోవడానికి, మనం ఆయన ఉద్దేశాలపై దృష్టి పెడతాము, ఆయన ఆజ్ఞలను పాటిస్తాము మరియు ఒకరినొకరు ప్రేమిస్తాము. మనం ఆయన కార్యమును ఆయన మార్గంలో చేస్తున్నప్పటికీ (సిద్ధాంతము మరియు నిబంధనలు 51:2 చూడండి), కొన్ని విషయాలు మనం స్వయంగా తెలుసుకోవడానికి మనకు వదిలేస్తారు. మిస్సోరిలోని జాక్సన్ కౌంటీలో సమావేశమైన పరిశుద్ధులతో రక్షకుడు ఇలా చెప్పారు:
“ఏలయనగా, అన్ని విషయములలో నేను ఆజ్ఞాపించుట యుక్తము కాదు; అన్ని విషయములలో బలవంతము చేయబడువాడు సోమరియే గాని, వివేకము గల సేవకుడు కాడు; కాబట్టి అతడు ఏ ప్రతిఫలమును పొందడు.
“నేను నిశ్చయముగా చెప్పునదేమనగా, మనుష్యులు ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమై, వారి ఇష్టపూర్వకముగా అనేక కార్యములు చేసి, అధికమైన నీతిని నెరవేర్చవలెను;
“వారిలో శక్తి ఉన్నది గనుక, వారు తమకుతామే ప్రతినిధులైయున్నారు. మనుష్యులు మంచి చేయునంత వరకు వారు తమ ప్రతిఫలమును కోల్పోరు.” (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:26–28).
మనం రక్షకుడిని అనుసరించినప్పుడు, ఆయన కార్యములో ఆయనతో చేరినప్పుడు మరియు ఇతరులు ఆయన నమ్మకమైన శిష్యులుగా మారడానికి మనం సహాయం చేస్తున్నప్పుడు, ఆయన ఏమి బోధిస్తారో అదే మనం బోధిస్తాము. మనకు మరే ఇతర సంగతులను బోధించడానికి అధికారం లేదు కాబట్టి (సిద్ధాంతము మరియు నిబంధనలు 52:9, 36 చూడండి), మనం ఆయన సిద్ధాంతంపై ఏకరీతిగా దృష్టి పెడతాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25 చూడండి). అదనంగా, బీదలను, అవసరతలోనున్న వారిని, మరియు దుర్బలంగా ఉన్నవారిపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపుతాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 52:40 చూడండి). నజరేతులోని ఒక సమాజ మందిరంలో రక్షకుడు యెషయా నుండి ఉదాహరించినప్పుడు, ఈ ఉద్ఘాటనలు స్పష్టం చేయబడ్డాయి:
“ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును,
“ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును” (లూకా 4:18–19; యెషయా 61:1–2 కూడా చూడండి).
ప్రభువు హితవత్సరము అంటే దేవుని నిబంధన యొక్క అన్ని దీవెనలు ఆయన ప్రజలపై సమృద్ధిగా కుమ్మరించు సమయాన్ని సూచిస్తుంది. దేవునితో నిబంధనలు చేసి, పాటించడం మరియు బీదలపై లేదా అవసరతలోనున్న వారిపై శ్రద్ధ చూపడం ద్వారా వచ్చే దీవెనలను పొందడానికి ఇతరులను ఆహ్వానించడం ద్వారా, మనం యేసు క్రీస్తును అనుసరిస్తాము.
యేసు క్రీస్తుతో ఆయన కార్యములో చేరడం ఉల్లాసకరమైనది ఎందుకంటే ఆయన ఉద్దేశ్యములు, ప్రణాళికలు, కార్యములు “భంగపరచబడలేవు, అవి నిష్ఫలము కాలేవు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 3:1). నిరుత్సాహపడిన వారికి, ప్రభువు ఇలా సలహా ఇచ్చారు: “కాబట్టి, మంచి చేయుట యందు విసుగులేకయుండుడి, ఏలయనగా మీరు ఒక గొప్ప కార్యమునకు పునాది వేయుచున్నారు. చిన్నవిషయముల నుండి గొప్ప సంగతులు సంభవించును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33). మనము మన వంతు కృషి చేద్దాము, కోత గురించి ప్రభువును చింతించనివ్వండి.
హృదయము మరియు సిద్ధమైన మనస్సు
ప్రభువు కార్యము చేయడానికి అసాధారణమైన ప్రతిభను లేదా సామర్థ్యాలను తీసుకురానవసరం లేదు కాబట్టి మన వంతు కృషి చేయడం మనం ఊహించిన దానికంటే చాలా సులభం. ఆయన కోరునది కేవలం నిబద్ధత మరియు సుముఖత. కర్ట్‌లాండ్, ఓహైయోలోని పరిశుద్ధులతో ప్రభువు ఇలా అన్నారు, “ఇదిగో హృదయమును, సిద్ధమైన మనస్సును ప్రభువు కోరును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 64:34). సమ్మతించిన వారిని దేవుడు సమర్థులను చేయగలరు, కానీ సమర్థులను ఆయన సమ్మతించేలా చేయలేరు లేదా చేయరు. మరో మాటలో చెప్పాలంటే, మనం నిబద్ధతతో మరియు సిద్ధంగా ఉంటే, ఆయన మనల్ని ఉపయోగించుకోగలరు. కానీ మనం ఎంత సమర్దులమైనప్పటికీ, మనం ఆయన కార్యమునకు కట్టుబడి ఉండి, ఆయనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటే తప్ప ఆయన మనల్ని ఉపయోగించుకోరు.
సామ్యూల్ మరియు అన్నా-మారియా కోయివిస్టో నిబద్ధతను మరియు సంసిద్ధతను రెండింటినీ కనపరిచారు. వారి వివాహం అయిన వెంటనే, కోయివిస్టోలు ఉద్యోగ అవకాశాల కోసం ఫిన్లాండ్‌లోని జివాస్కైలా నుండి స్వీడన్‌లోని గోటెబోర్గ్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత, సహోదరుడు కోయివిస్టోను గోటెబోర్గ్ స్వీడన్ స్టేకు అధ్యక్షత్వములో ఒక సలహాదారుడు అయిన అధ్యక్షుడు లీఫ్ జి. మాట్సన్‌ను సందర్శించడానికి ఆహ్వానించబడ్డాడు. సామ్యూల్‌కు స్వీడిష్ మాట్లాడటం రాకపోవడంతో, ఇంటర్వ్యూ ఇంగ్లీషులో జరిగింది.
ఒక క్లుప్త సందర్శన తర్వాత, అధ్యక్షుడు మాట్సన్ సామ్యూల్‌ను ఉట్బీ వార్డులో వార్డు మిషను నాయకుడిగా సేవచేయమని కోరారు. “కానీ నేను స్వీడిష్ మాట్లాడలేను”: అని సామ్యూల్ సూటిగా చెప్పారు.
అధ్యక్షుడు మాట్సన్ తన బల్ల మీద వాలి, “నీవు స్వీడిష్ మాట్లాడగలవా అని నేను అడిగానా లేక ప్రభువును సేవించడానికి ఇష్టపడుతున్నావా అని అడిగానా?” అని సూటిగా ప్రశ్నించారు.
సమూయేలు ఇలా జవాబిచ్చాడు, “నేను ప్రభువును సేవించడానికి ఇష్టపడుతున్నానా అని మీరు అడిగారు. మరియు నేను ఇష్టపడుతున్నాను.”
సామ్యూల్ పిలుపును అంగీకరించాడు. అన్నా-మరియా కూడా పిలుపులను అంగీకరించారు. ఇద్దరూ నమ్మకంగా సేవ చేసి, అ మార్గంలోనే అందమైన స్వీడిష్ మాట్లాడటం నేర్చుకున్నారు.
ప్రభువును సేవించాలనే నిబద్ధత మరియు సంసిద్ధత సామ్యూల్ మరియు అన్నా-మరియా జీవితాలను వర్ణించాయి. వారు సంఘంలో సాధారణ హీరోలు. అడిగిన ప్రతిసారీ వారు నమ్మకంగా సేవ చేశారు. మనం సేవ చేస్తున్నప్పుడు, మనకున్న ప్రతిభలను ఉపయోగిస్తామని వారు నాకు నేర్పించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 60:13 చూడండి), మరియు ప్రభువు అప్పుడు తన ఉద్దేశాలను సాధించడంలో మనకు సహాయం చేస్తారు.
మనం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మన సేవకు ఏ విధంగానూ కళంకం కలిగించకూడదని కోరుకుంటున్నందున, ఫిర్యాదు చేయకుండా లేదా సణగకుండా ఉండటానికి ప్రయత్నిస్తాము. ఫిర్యాదు చేయడం అనేది నిబద్ధతలో తడబాటుకు సంకేతం కావచ్చు లేదా రక్షకుని పట్ల మనకున్న ప్రేమ తగినంతగా లేకపోవడం వలన కావచ్చు. నియంత్రించకుండా వదిలేస్తే, సణగడం అనేది ప్రభువుకు వ్యతిరేకంగా పూర్తి తిరుగుబాటుకు దారితీయవచ్చు. మిస్సోరికి సువార్తికుడిగా పిలవబడిన, ఓహైయోలోని సంఘమందు తొలిదశలో పరివర్తన చెందిన ఎజ్రా బూత్ జీవితంలో ఈ పరిణామం కనిపిస్తుంది.
జూన్ 1831లో ఓహైయో నుండి బయలుదేరినప్పుడు, వేసవి వేడిలో తాను నడిచి వెళ్తూ, దారిలో ప్రకటిస్తూ ఉండగా, కొంతమంది సువార్తికులు బండిలో ప్రయాణించగలిగినందుకు ఎజ్రా కలత చెందాడు. అతను సణిగాడు. అతను మిస్సోరికి వచ్చినప్పుడు, అతను నిరుత్సాహంగా భావించాడు. మిస్సోరి అతను ఆశించిన విధంగా లేదు. బదులుగా, అతను చుట్టూ చూసాడు మరియు “ఆ అవకాశం కొంత నిరాశాజనకంగా కనిపించిందని” గమనించాడు.
ఎజ్రా మరింత దురుసుగా, వ్యంగ్యంగా మరియు విమర్శనాత్మకంగా మారాడు. మిస్సోరిని విడిచిపెట్టిన తర్వాత, తనకు సూచించబడినట్లుగా ప్రకటించడానికి బదులుగా, వీలైనంత త్వరగా ఓహైయోకు తిరిగి వచ్చాడు. అతని ప్రారంభ సణుగుడు తడబాటుకు దారితీసింది మరియు చివరికి అతను తన మునుపటి ఆధ్యాత్మిక అనుభవాలపై విశ్వాసం కోల్పోయాడు. త్వరలోనే ఎజ్రా సంఘాన్ని విడిచి “తుదకు ‘క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి నాస్తికుడుగా మారాడు.’”
మనం జాగ్రత్తగా లేకపోతే మనకు కూడా అదే జరగవచ్చు. మనం శాశ్వతమైన దృక్పథాన్ని కాపాడుకోకపోతే, ఇది నిజంగా ఎవరి కార్యమని మనకు మనం గుర్తు చేసుకోకపోతే, మనం ఫిర్యాదు చేయవచ్చు, సందేహించవచ్చు మరియు చివరికి మనకున్న విశ్వాసాన్ని కోల్పోవచ్చు.
యేసు క్రీస్తు కార్యములో ఆయనతో చేరడం ద్వారా మనం ఆయనను అనుసరించాలని నేను ప్రార్థిస్తున్నాను. మనం అలా చేసినప్పుడు, మనకు “అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములు” ఇవ్వబడతాయి. (2 పేతురు 1:4). ఈ దీవెనలలో పాప క్షమాపణ (సిద్ధాంతము మరియు నిబంధనలు 60:7 ; 61:2, 34; 62:3; 64:3 చూడండి), రక్షణ (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:13; 56:2 చూడండి), మరియు ఉన్నతస్థితిని (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:3–11; 59:23 చూడండి) కలిగియున్నాయి. నిజానికి, దేవుడు ఇవ్వగల అతి గొప్ప బహుమానం మనకు వాగ్దానం చేయబడింది—నిత్యజీవము.
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, June 2025 యొక్క అనువాదము. Telugu. 19610 421