“నేను వారిని స్వస్థపరిచెదను,” లియహోనా, 2025 ఫిబ్రవరి.
లియహోనా నెలవారీ సందేశము, 2025 ఫిబ్రవరి
“నేను వారిని స్వస్థపరిచెదను”
రక్షకుని యొక్క స్వస్థపరిచే పరిచర్య అనేది పునరుత్థానంలో మనలో ప్రతి ఒక్కరికి వచ్చే శాశ్వతమైన శారీరక మరియు భావోద్వేగ స్వస్థత యొక్క దైవిక ప్రారంభము మరియు వాగ్దానం.
విమానయాన సారథిగా నా వృత్తి జీవితంలో నేను చేసిన కొన్ని సుదీర్ఘ విమానప్రయాణాలు ఇప్పటికీ నాకు స్పష్టంగా గుర్తున్నాయి.
వాటిలో ఒకటి, నేను ఉదయం 11:00 గంటలకు జర్మనీలో బయలుదేరి, అదే రోజున మధ్యాహ్నం 1:00 గంటలకు కాలిఫోర్నియాలో దిగుతాను. ఒక విమానం యొక్క స్థానిక నిష్క్రమణ మరియు ఆగమన సమయాలను పోల్చి చూస్తే అట్లాంటిక్ మహాసముద్రం మరియు ఉత్తర అమెరికా ఖండం మీదుగా రెండు గంటలు మాత్రమే పట్టినట్లు కనిపించవచ్చు. బోయింగ్ 747 వేగవంతమైనది, కానీ అంత వేగవంతం కాదు! వాస్తవానికి, వీచేగాలిపై ఆధారపడి 5,600 మైళ్లు (9,000 కిమీ) ప్రయాణించడానికి మాకు దాదాపు 11 గంటలు పట్టింది.
మేము పశ్చిమం వైపు ప్రయాణిస్తున్నందున, మా విమాన ప్రయాణంలో సూర్యుడు ఎప్పటికీ అస్తమించలేదు. జర్మనీ నుండి కాలిఫోర్నియా వరకు మేము పగటి వెలుతురును ఆస్వాదించాము.
అయితే, జర్మనీకి తిరిగి రావడం పూర్తిగా భిన్నమైన కథ. మేము మిట్టమధ్యాహ్నం బయలుదేరినప్పటికీ, తూర్పు వైపుకు వెళ్లినప్పుడు, సూర్యాస్తమయం సాధారణం కంటే త్వరగా వచ్చింది, మరియు మాకు తెలియక ముందే, రాత్రి వచ్చింది.
ఈ సుదీర్ఘ విమాన ప్రయాణ సమయంలో, నేను ఈ భూమి యొక్క అందం మరియు దేవుని సృష్టి యొక్క క్రమాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు నా ఆత్మ తరచుగా విస్మయంతో నిండిపోయింది. రాత్రి పూట పూర్తి చీకటిలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా, సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడని, ప్రకాశవంతమైన కాంతి తిరిగి వస్తుందని మరియు మా ప్రయాణం ముగిసేలోపు ఉత్సాహము మరియు జీవితానికి కొత్త రోజు తీసుకువస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. నా విమానప్రయాణం యొక్క పరిస్థితులలో సూర్యుడు మరింత నెమ్మదిగా లేదా మరింత త్వరగా అస్తమిస్తున్నట్లు అనిపించి ఉండవచ్చు, కానీ సూర్యుడు ఆకాశములో స్థిరంగా, నిశ్చలంగా మరియు విశ్వసనీయంగా ఉంటాడని నాకు తెలుసు.
దేవుని విషయంలో నాకూ అలాగే అనిపిస్తుంది. దేవుని యొక్క జ్ఞానం మరియు ఆయన సృష్టి అంతటి ఉద్దేశ్యం గురించి నాకు లోతైన నిశ్చయత ఉంది కాబట్టి, మన మర్త్య ఉనికి గురించి ఆలోచించినప్పుడు నేను ఆనందకరమైన నిరీక్షణను మరియు శాశ్వత శాంతిని అనుభవించగలను. మనం దేవుని యొక్క బిడ్డలము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయనకు మన పరిస్థితులు తెలుసు. సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మన చుట్టూ ఉన్న ఇతర విషయాలు అస్థిరంగా మరియు ఊహించలేనివిగా అనిపించినప్పుడు కూడా, ఈ సత్యాలు మారవు.
మనమందరం మన శాంతికి ముప్పు కలిగించే చీకటి, దుఃఖం మరియు అనిశ్చితి యొక్క క్షణాలను అనుభవిస్తాము. సత్యం మరియు కాంతి యొక్క విశ్వసనీయమైన మరియు నిజమైన మూలమును బట్టి నేను ఎంత కృతజ్ఞుడను(సిద్ధాంతము మరియు నిబంధనలు 88: 6–11 చూడండి). యేసు క్రీస్తు లోకము యొక్క వెలుగు మరియు జీవమైయున్నారు. ఆయన మరియు ఆయన యొక్క ప్రాయశ్చిత్త త్యాగం కారణంగా, మనకు భవిష్యత్తుపై నిరీక్షణ ఉంది, మన ప్రయాణంలోని చీకటి రోజులను ప్రకాశవంతం చేయడానికి దైవిక కాంతికి ప్రాప్యత మరియు పాపం మరియు మరణంపై అంతిమ విజయం యొక్క వాగ్దానం ఉంది.
“ఆయన లోకమును ప్రేమించెను”
యేసు క్రీస్తు మాత్రమే భూమిపై నడిచిన ఏకైక పరిపూర్ణమైన వ్యక్తి. ఆయన పరిపూర్ణమైన జీవితం కారణంగా, ఆయన న్యాయానికి రుణపడి లేరు. మనపై ప్రేమతో, అమరత్వానికి మరియు నిత్యజీవానికి తలుపులు తెరిచేందుకు ఆయన మనలో ప్రతి ఒక్కరి కోసం వ్యక్తిగతంగా మరియు దేవుని పిల్లలందరి కోసం సమిష్టిగా తన జీవితాన్ని ఇచ్చారు.
సాతాను మనల్ని ఏమి నమ్మాలని కోరినప్పటికీ, మనల్ని రక్షించే రక్షకుని సామర్థ్యానికి మనలో ఎవరూ అతీతం కాదు. మనలో ఎవ్వరూ క్షమా కృపకు అనర్హులు కారు. మనలో ఎవ్వరూ “ఆయన ప్రేమ యొక్క బాహువులలో శాశ్వతముగా చుట్టుబడటానికి” అతీతులు కారు (2 నీఫై 1:15).
అన్ని బహుమతులలో ఈ గొప్ప బహుమానం యేసు క్రీస్తు వారి ప్రాయశ్చిత్తం యొక్క సమర్థతనిచ్చే మరియు విమోచించే శక్తి నుండి వచ్చినది. గెత్సేమనేలో మరియు గొల్గోతాలో రక్షకుని బాధల కారణంగా, మన బలహీనతలన్నింటి నుండి మనల్ని ఎలా రక్షించాలో మరియు మనకు ఎలా సహాయం చేయాలో ఆయనకు తెలుసు (ఆల్మా 7:12 చూడండి).
“ఆయన లోకమునకు ప్రయోజనకరమైన దానిని తప్ప మరిదేనిని చేయడు; ఏలయనగా ఆయన తన ప్రాణమును పణంగాపెట్టి మనుష్యులందరినీ తన వైపు ఆకర్షించునంతగా లోకమును ప్రేమించెను” (2 నీఫై 26:24).
యేసు క్రీస్తు మన బలం!
ఆయన చేరుకుంటారు.
ఆయన పునఃస్థాపిస్తారు.
ఆయన రక్షిస్తారు.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు “రక్షకుడు సమస్త మానవాళి కొరకు [ప్రాయశ్చిత్తము చేసినప్పుడు], ఆయనను అనుసరించే వారు, ఆయన స్వస్థత, బలపరిచే శక్తి మరియు విమోచించే శక్తిని పొందగలిగేలా ఆయన ఒక మార్గాన్ని తెరిచారు”.
సూర్యుని వలె, ఆ శక్తి, ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఎప్పుడూ తడబడదు. రక్షకుని అడుగుజాడలను అనుసరించే ఎంపిక చీకటి నుండి వెలుగులోకి నడవడం వంటిది, ఇక్కడ మనం దేవుని కాంతి, వెచ్చదనం మరియు ప్రేమ యొక్క ఆశీర్వాదాలను పొందగలము. ఒక రోజు, మనం వెనక్కి తిరిగి చూస్తామని మరియు మనల్ని ఉద్ధరించడానికి మరియు బలోపేతం చేయడానికి యేసు క్రీస్తును మరియు ఆయన దైవిక ప్రేమను విశ్వసించడానికి శాశ్వతమైన గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతతో నిండిపోతామని నాకు తెలుసు.
“నా యొద్దకు తిరిగిరండి”
రక్షకుని సిలువ వేయబడిన తరువాత అత్యంత గాఢమైన చీకటిలో మూడు రోజులు గడిపిన ప్రజల గురించి మోర్మన్ గ్రంథము చెబుతుంది. వారి చుట్టూ ఉన్న భౌతిక చీకటి, మనమందరం పాపం కారణంగా అనుభవించే ఆధ్యాత్మిక చీకటిని సూచిస్తుంది. అప్పుడు ప్రజలు తమను చీకటిలో నుండి తన వెలుగులోకి ఆహ్వానించే క్రీస్తు స్వరాన్ని విన్నారు:
“నేను మిమ్ములను స్వస్థపరచునట్లు ఇప్పుడు నా యొద్దకు తిరిగివచ్చి, మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి పరివర్తన నొందరా?” (3 నీఫై 9:13).
“విరిగిన హృదయమును, నలిగిన ఆత్మను బలిగా నాకు అర్పించెదరు.” (3 నీఫై 9:20).
“పశ్చాత్తాపపడి హృదయము యొక్క సంపూర్ణ ఉద్దేశ్యముతో నా యొద్దకు తిరిగిరండి” (3 నీఫై 10:6).
ఈ రోజు మనం చీకటిలో తప్పిపోయినట్లు గుర్తించినప్పుడు రక్షకుడు మనకు అదే ఆహ్వానాలను అందజేస్తారు. ప్రతి సూర్యోదయం ఒక నూతన దిన ప్రారంభాన్ని సూచిస్తున్నట్లే, పశ్చాత్తాపం చెందిన ప్రతిసారీ మనము ఒక కొత్త ప్రారంభాన్ని, ప్రకాశమయమైన నూతన ఆరంభాన్ని పొందుతాము.
దానర్థం అది సులభం అని కాదు. పశ్చాత్తాపం అంటే మార్పు మరియు మార్పు త్వరగా జరగదు. ఆనందంగా ఉన్నప్పటికీ, పశ్చాత్తాపంలో “దైవచిత్తానుసారమైన దుఃఖము” ఉంటుంది (2 కొరింథీయులకు 7:10). దానికి, మన తప్పులను అంగీకరించడం మరియు ఒప్పుకోవడం, దేవుని నుండి మరియు మనం హాని చేసిన వారి నుండి క్షమాపణ కోరడం అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా, మనం “సర్వశక్తిమంతుడైన ప్రభువు యొక్క ఆత్మను” వెదకడం అవసరం, తద్వారా మనం “చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరుకొనక నిరంతరము మంచి చేయుటకు కోరిక కలిగియుండునట్లు … మా హృదయములందు గొప్ప మార్పు కలుగజేసెను” మోషైయ 5:2).
ఆ విధమైన మార్పు ఒక సుదీర్ఘ ప్రయాణం, కానీ మీరు మొదటి అడుగు వేసిన వెంటనే, “మీ రక్షణ యొక్క దినము” ప్రారంభమవుతుంది మరియు “వెంటనే విమోచన యొక్క గొప్ప ప్రణాళిక మీ కొరకు పని చేయును” (ఆల్మా 34:31).
మన నిష్కపటమైన పశ్చాత్తాపం ద్వారా, దేవుడు మన పాపాలను క్షమించి ఇకపై జ్ఞాపకముంచుకోనని వాగ్దానం చేస్తున్నారు. మన పాపాలను మరచిపోవడం కష్టంగా ఉన్నప్పుడు, క్షమిస్తాను అని ప్రభువు చేసిన వాగ్దానాన్ని విశ్వసించడానికి కృషి చేద్దాం మరియు ఇతరులను మరియు మనలను క్షమించడం నేర్చుకుందాం.
“మనం తప్పులు చేసినప్పుడు మరియు పాపాలు చేసినప్పుడు మన ఆత్మలు దెబ్బతింటాయి,” అని అధ్యక్షులు బోయిడ్ కె. పాకర్ బోధించారు (1924–2015). “కానీ మన మర్త్య శరీరాల మాదిరిగా కాకుండా, పశ్చాత్తాప ప్రక్రియ పూర్తయినప్పుడు, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం కారణంగా ఎటువంటి మచ్చలు మిగిలియుండవు.”
గ్రుడ్డివానిని స్వస్థపరచుట, కార్ల్ హైన్రిక్ బ్లోక్ చేత
“వారిని ఇక్కడకు తీసుకురండి”.
రక్షకుడు గొప్ప వైద్యుడు. ఆయన స్వస్థత శక్తి యొక్క అత్యంత అందమైన ప్రదర్శనలలో ఒకటి మోర్మన్ గ్రంథములో, పురాతన అమెరికాలో ఆయన వ్యక్తిగత పరిచర్య ఖాతాలో కనుగొనబడింది:
“మీ మధ్య రోగులెవరైనా ఉన్నారా?” అని ఆయన అడిగెను. “వారిని ఇక్కడకు తీసుకురండి. కుంటివారు, గ్రుడ్డివారు లేదా కదలలేని వారు, వికలాంగులు, కుష్ఠువారు, ఊచకాలు చేతులు గలవారు, చెవిటి వారు లేదా ఏ విధముగానైనా బాధింపబడిన వారు మీలోనున్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి, నేను వారిని స్వస్థపరిచెదను, ఏలయనగా నేను మీ యెడల కనికరము కలిగియున్నాను; నా ఆంత్రములు కనికరముతో నిండియున్నవి. …
“ఆయన ఆ విధముగా పలికినప్పుడు, సమూహమంతా కలిసి వారి రోగులను, బాధింపబడిన వారిని, కుంటివారిని, గ్రుడ్డివారిని, మూగవారిని మరియు ఏ విధముగానైనను బాధింపబడిన వారందరిని తీసుకొని ముందుకు వెళ్ళిరి; ఆయన యొద్దకు వారిని తీసుకురాగా, ఆయన వారిలో ప్రతివానిని స్వస్థపరిచెను” (3 నీఫై 17:7, 9).
రక్షకుడు తన పునరుత్థానానికి ముందు మరియు తరువాత, “ఏవిధముగానైనా బాధింపబడిన వారిని” స్వస్థపరిచిన ప్రతిసారీ, అది మన ఆత్మలను స్వస్థపరిచే అతని అంతిమ శక్తికి నిదర్శనం. ప్రతి అద్భుత స్వస్థత అనేది పునరుత్థానంలో మనలో ప్రతి ఒక్కరికి వచ్చే శాశ్వతమైన శారీరక మరియు భావోద్వేగ స్వస్థత యొక్క ప్రారంభము మరియు వాగ్దానం, ఇది “ప్రభువు యొక్క సంపూర్ణ స్వస్థత చర్య.”
ఈ జీవితంలో స్వస్థత కోసం మన ప్రార్థనలు ఎల్లప్పుడూ మనం ఆశించే విధంగా సమాధానం ఇవ్వబడవు అనేది వాస్తవమే, కానీ అవి ఎప్పుడూ విస్మరించబడవు. రాత్రి చీకటి ఎల్లప్పుడూ —అద్భుతమైన సూర్యోదయానికి—సరైన సమయంలో దారితీసినట్లు, స్వస్థత కోసం సమయం వస్తుంది.
అధ్యక్షులు నెల్సన్ సాక్ష్యమిచ్చినట్లుగా: “మన విశ్వాసం ఎన్నటికీ ప్రశంసించబడకుండా ఉండదు. సర్వ జ్ఞాని అయిన పరలోక తండ్రి దృక్పథం మన దృక్పథం కంటే చాలా విస్తృతమైనదని నాకు తెలుసు. మన మర్త్య సమస్యలు మరియు బాధల గురించి మనకు తెలిసినప్పటికీ, మన అమరత్వపు పురోగతి మరియు సంభావ్యత గురించి ఆయనకు తెలుసు. ఆయన చిత్తాన్ని తెలుసుకుని, ఓర్పుతో, మరియు ధైర్యంతో ఆయన చిత్తానికి మనల్ని మనం సమర్పించుకుని ప్రార్థిస్తే, పరలోక స్వస్థత ఆయన స్వంత మార్గంలో మరియు సమయంలో జరుగుతుంది.
ఇటీవలే నా భార్య, హ్యారియెట్ మరియు నేను మా ప్రార్థనలలో ఒక ప్రత్యేక నిరీక్షణను చేర్చుకున్నాము మరియు మేము ప్రేమించే కొందరి తరపున విన్నవించుకున్నాము. వారి అనారోగ్యాలను నయం చేయడానికి వారి ఆరోగ్య సంరక్షణ బృందానికి ప్రత్యేక సామర్థ్యాన్ని అందించాలని మేము ప్రార్థించాము. తక్షణ నివారణ లేదా స్వస్థత జరగకపోయినా, రక్షకుని స్వస్థపరిచే శక్తి వారికి ఓదార్పును మరియు శాంతిని కలిగిస్తుందని అని మా ప్రార్ధనలో జోడించమని ప్రేరేపణ కలిగింది. రక్షకుని విమోచించే శక్తి యొక్క స్వస్థత ప్రభావం మన భావోద్వేగ, ఆధ్యాత్మిక మరియు శారీరక ఆరోగ్యంపై మనం పొందగల ఏ భూసంబంధమైన స్వస్థత కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపవచ్చు. ఈ జీవితంలో మరియు నిత్యత్వములో స్వస్థపరచువారు యేసు క్రీస్తే.
నా సోదరులు మరియు సోదరీమణులారా, ప్రియమైన మిత్రులారా, మీ గాయాలను స్వస్థపరచడానికి, పాపం నుండి మిమ్మల్ని పరిశుభ్రపరచడానికి, రాబోయే పరీక్షల కోసం మిమ్మల్ని బలపరచడానికి మరియు మీకు నిరీక్షణ, జ్ఞానం మరియు ఆయన శాంతిని అనుగ్రహించడానికి మన రక్షకుని దయ సరిపోతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. మనం కొంతకాలం, ఆయన ప్రేమ, కాంతి మరియు వెచ్చదనం నుండి దూరంగా ఉన్నట్లు భావించినప్పుడు కూడా—స్థిరంగా మరియు నమ్మదగినదిగా—ఆయన శక్తి ఎల్లప్పుడూ ఉంటుంది.
యేసు క్రీస్తు మనకోసం చేసిన వాటన్నిటికీ మన విస్మయాన్ని మరియు ప్రగాఢమైన కృతజ్ఞతా భావాన్ని మనం ఎప్పటికీ కోల్పోవద్దని నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి మీరు పరిపూర్ణంగా ప్రేమించబడ్డారని తెలుసుకోండి మరియు మీకు శాశ్వతంగా వాగ్దానం చేయబడిన వాటిని గుర్తుంచుకోండి.
“అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు యందలి సంతోషము ద్వారా మీ భారములు తేలికగునట్లు దేవుడు మీకు అనుగ్రహించునుగాక” (ఆల్మా 33:23).
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, February 2025Monthly Liahona Message, February 2025 యొక్క అనువాదము. Telugu. 19609 421