2025
ప్రేమ మరియు ఆనందము యొక్క సువర్తమానములు
2025 జనవరి


“ప్రేమ మరియు ఆనందము యొక్క సువర్తమానములు,” లియహోనా 2025 జనవరి.

లియహోనా నెలవారీ సందేశము, 2025 జనవరి

ప్రేమ మరియు ఆనందము యొక్క సువర్తమానములు

పునఃస్థాపన యొక్క ఆశీర్వాదాలు మన హృదయాలను ఉత్సాహపరచి మనల్ని దేవుని యొక్క గొప్ప ప్రేమ కొరకు కృతజ్ఞతతో నింపాలి.

సూర్యాస్తమయమున దేవదూత మొరోనై యొక్క విగ్రహము

యేసు క్రీస్తు సజీవుడు మరియు ఈ కడవరి దినములలో తన సువార్తను, సంఘమును పునఃస్థాపించియున్నాడు అనేది అందరికోసం నిరీక్షణను, శాంతిని ఇచ్చే మన సందేశము.

“ఈ విషయములు మానవజాతికి ఎంత వర్ణనాతీతమైన మహిమ కలవి!” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ ప్రకటించారు. “నిజముగా అవి జనులందరికి గొప్ప ఆనందము కలిగించే సువర్తమానములు; భూమినంతటిని మరియు ప్రతీ ఒక్కరి చెవులలో వినబడినప్పుడు వారి హృదయములను ఉత్సాహపరచవలసినటువంటి సువర్తమానములుగా కూడా అవి భావించబడవచ్చు.”

రక్షకుని యొక్క భూలోక పరిచర్య తరువాత శతాబ్దాలుగా, దేవుని బిడ్డలు ఆయనను వెదుకుతూ మరింత వెలుగు మరియు సత్యము కొరకు తపనపడ్డారు. ఇప్పుడు యేసు క్రీస్తు సువార్త మరియు కొనసాగుతున్న పునఃస్థాపన యొక్క సంతోషకరమైన సువర్తమానములు జనులందరిని ఆశీర్వదించడానికి మరియు యేసు క్రీస్తు “రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను పరిపాలించే” రోజు కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి ముందుకు సాగుతున్నాయి. ఇది పరలోకమందున్న మన తండ్రి మరియు మన రక్షకుని యొక్క అంతులేని ప్రేమకు మహత్తరమైన నిదర్శనం. ఈ సత్యములను ప్రపంచమంతటికి ప్రకటిస్తూ నా జీవితాన్ని గడపగలనని నేను ఆనందిస్తున్నాను.

అసంభవమైనది మరియు విశేషమైనది

తాను ఏ సంఘములో చేరాలి అని యువకుడైన జోసెఫ్ యొక్క ప్రార్థనకు జవాబుగా తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షమై జోసెఫ్ స్మిత్‌తో మాట్లాడారు, ఆ విధముగా ఒక వనములో మానవ కుటుంబానికి ఒక నూతన దినము ఉదయించింది (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:14–20 చూడండి). ఏ సంఘములోను చేరవద్దని యేసు క్రీస్తు జోసెఫ్‌తో చెప్పారు. భవిషత్తులో తన సువార్త యొక్క సంపూర్ణత జోసెఫ్‌కు బయల్పరచబడుతుందని ఆయన వాగ్దానము చేసారు.

అంత ప్రాముఖ్యమైన పనికి జోసెఫ్ పిలువబడడం అసంభవం అనే భావం అనేకులకు కలిగింది మరియు వారు అనుకున్నది నిజమే. అతడు ఒక మారుమూల పట్టణము దగ్గర ఒక చిన్న పల్లెలో ఉన్న చదువు లేని అనామకుడైన బాలుడు. “నజరేతు నుండి ఏదైనా మంచి విషయం రాగలదా?” అని ఆ కాలంలో రక్షకుని గురించి కొందరు చెప్పినట్లు (యోహాను 1:46), న్యూయార్క్‌లోని పాల్మైరాలో ఉన్న చదువులేని 14 యేండ్ల బాలుని నుండి ఏ మంచి రాగలదు అని చాలామంది ఆశ్చర్యపడ్డారు. కానీ—అతడు ఎంత అసమంజసంగా కనిపించినా— పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తు జోసెఫ్ ద్వారా నిజంగా విశేషమైన కార్యములు జరిగించారు. మన చిన్న మరియు వినయపూర్వకమైన మార్గంలో, మనము కూడా అర్థవంతమైన విధాలలో ప్రభువు కార్యములో సహకరించగలము అనే నిరీక్షణను ఇది మనకు కలిగించాలి.

సరైన సమయములో ప్రభువు జోసెఫ్‌ను పిలిచి, “పరలోకము నుండి మాట్లాడి, ఆజ్ఞలనిచ్చారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:17). పరలోక తండ్రి యొక్క ప్రేమగల ప్రణాళిక, యేసు క్రీస్తు యొక్క విమోచించు ప్రేమ మరియు ఆయన ప్రాయశ్చిత్త బలి యొక్క శక్తి గురించి మన అవగాహనకు క్రొత్త వెలుగునిచ్చేలా జోసెఫ్ ప్రశస్తమైన బయల్పాటును మరియు ముఖ్యమైన సిద్ధాంతమును పొందాడు. దేవుని వెలుగు ప్రకాశించునట్లు మరియు ఆయన బిడ్డలను మరింత ఎక్కువగా ఆశీర్వదించునట్లు, ఈ సంతోషకరమైన సువర్తమానములు ఖచ్చితమైన సమయములో అనగా ప్రయాణ సాధనములు, ప్రసార సాధనాలలో మరియు ఇతర రంగాలలో గణనీయమైన పురోగతి పొందిన ఈ కాలములో రావడం గమనార్హము.

బంగారు పలకలను జోసెఫ్ స్మిత్‌కు అందజేస్తున్న మొరోనై

బంగారు పలకలను జోసెఫ్ స్మిత్‌కు అందజేస్తున్న దేవదూత మొరోనై, సి. సి. ఎ. క్రిస్టెన్సెన్ చేత

దేవుని ప్రేమకు శక్తివంతమైన సాక్ష్యము

పునఃస్థాపనకు మరియు దేవుని ప్రేమకు శక్తివంతమైన నిదర్శనముగా ఉండడానికి దేవదూత మొరోనై జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమవడం అవసరమైయుంది. బంగారు పలకలపై వ్రాయబడి, సమీపంలో పాతిపెట్టబడిన ఒక వృత్తాంతమును గూర్చి మొరోనై జోసెఫ్‌తో చెప్పాడు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:33–34 చూడండి). మోర్మన్ గ్రంథముగా రూపొంది, బైబిలుతో పాటు నిలుచు యేసు క్రీస్తు యొక్క మరొక నిబంధనయైయున్న ఆ వృత్తాంతమును అనువదించడానికి జోసెఫ్‌కు “ఉన్నతము నుండి శక్తి” (సిద్ధాంతము మరియు నిబంధనలు20:8) ఇవ్వబడుతుంది.

మోర్మన్ గ్రంథమంతటా, క్రీస్తు పూర్వము వందల సంవత్సరాల ముందుగా ఆయనను తెలుసుకొని, ఆయన రాకడను గూర్చి ప్రవచించి, ఆయన కొరకు తపించిన జనులను గూర్చి మనము చదువుతాము. పునరుత్థానుడైన రక్షకుడు నీఫైయులకు ప్రత్యక్షమై వారి మధ్య చేసిన పరిచర్య సమయంలో వారందరిని తన యొద్దకు రమ్మని పిలిచి ఆయన ప్రక్కలలో గుర్తులను తాకమని, ఆయన చేతులు మరియు కాళ్ళలోని మేకుల గుర్తులను తడిమి తెలుసుకొమ్మని వారిని ఆహ్వానించిన అసాధారణమైన వృత్తాంతమును కూడా మనము కనుగొంటాము (3 నీఫై 11:14–15). ఆయన రోగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని—“ ఏ విధముగానైనా బాధింపబడిన వారిని” స్వస్థపరిచారు—మరియు వారి చిన్న పిల్లలను ఆశీర్వదించి, వారికొరకు ప్రార్థించారు (3 నీఫై 17:7–9, 21 చూడండి). ఈ పవిత్ర వృత్తాంతము నుండి రక్షకుని ప్రేమ మరియు దయను గూర్చి మనము ఎంతో నేర్చుకుంటాము.

“యేసే క్రీస్తు” అని మోర్మన్ గ్రంథము సాక్ష్యమిస్తోంది. పరలోకమందున్న మన తండ్రి మరియు మన రక్షకుడు మనము ఊహించగలిగిన దానికంటే కూడా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నారు అని మోర్మన్ గ్రంథములోని హామీలు తరచు మనకు జ్ఞాపకము చేస్తాయి.

యాజకత్వము మరియు సంఘము యొక్క దీవెనలు

పరలోకము నుండి ఇతర దూతలు జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమవడం ద్వారా పునఃస్థాపన కొనసాగింది. “పునరుత్థానము చెందిన బాప్తిస్మమిచ్చు యోహాను, పాప విమోచన కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మమిచ్చు అధికారాన్ని పునఃస్థాపించాడు. మొదటి పన్నెండుమంది అపొస్తలులలో ముగ్గురైన— పేతురు, యాకోబు మరియు యోహానులు— అపొస్తలత్వమును మరియు యాజకత్వ అధికారము యొక్క తాళపుచెవులను పునఃస్థాపించారు. ఏలియాతో సహా ఇతరులు కూడా వచ్చి, మరణాన్ని అధిగమించే నిత్య సంబంధములలో కుటుంబములను శాశ్వతముగా జతచేసే అధికారాన్ని పునఃస్థాపించారు.”

1830, ఏప్రిల్ 6వ తేదీన, యేసు క్రీస్తు క్రొత్త నిబంధన కాలంలో తాను స్థాపించిన సంఘము యొక్క నమూనాలో (విశ్వాస ప్రమాణాలు 1:6), “క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద” (ఎఫెసీయులకు 2:20)పరిపూర్ణమైన విధంగా ప్రవక్త జోసెఫ్ ద్వారా ఒక సంఘమును స్థాపించారు. యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము పునస్థాపించబడిన యాజకత్వ అధికారము యొక్క దీవెనలను అంగీకరించడానికి సిద్ధపడిన దేవుని బిడ్డలందరికి వాటిని అందుబాటులో ఉంచుతోంది.

అధ్యక్షుడు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు బోధించిన విధంగా, మనము అనుదిన పశ్చాత్తాపము ద్వారా పరలోక తండ్రి మరియు మన రక్షకుని వైపు మరలినప్పుడు ఆనందాన్ని పొందవచ్చు. నిరుత్సాహంగా భావించేవారు లేదా వారు తగనివారని లేదా చెందియుండలేదని భావించే వారెవరి కోసమైనా: అట్టి వారందరు క్రీస్తు నొద్దకు మరియు ఆయన సంఘానికి రావడానికి ఆహ్వానితులే. సంఘము అంటే పరిపూర్ణులుండే ఒక మఠం కాదు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ఒక ఆసుపత్రిలాంటిది. “మనము సంఘానికి వచ్చేది మన సమస్యలను దాచుకోవడానికి కాదు, కానీ వాటిని నయం చేసుకోవడానికి” అని పన్నెండుమంది అపొస్తలుల సమూహములోని ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ మనకు జ్ఞాపకము చేస్తున్నారు.

సంఘములో మన బాహ్య ప్రవర్తనను మార్చుకోవడానికి, ఇతరులకు ప్రేమతో సేవచేయడానికి మరియు క్రీస్తు యొక్క అపారమైన మంచితనముతో మనకున్న వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడానికి గల అవకాశములందు మనం ఆనందాన్ని కనుగొంటాము. మనము “క్రీస్తు యొక్క సంఘములోని జనులతో పాటు లెక్కింపబడగలము” మరియు “జ్ఞాపకము చేసుకొనబడి, దేవుని సువార్త ద్వారా పోషింపబడగలము” (మొరోనై 6:4). ఎంత గొప్ప దీవెన!

గొప్ప ఆనందానికి కారణము

ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఒకసారి ఇలా ప్రకటించారు, “ఇప్పుడు, మనము పొందిన సువార్తలో మనము ఏమి విందుము? సంతోషకరమైన స్వరము! పరలోకమునుండి కరుణగల స్వరము; భూమినుండి సత్య స్వరము; మృతుల కొరకు సువర్తమానము; సజీవులు, మృతుల కొరకు సంతోషకరమైన స్వరము; మహా సంతోషకరమైన సువర్తమానము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:19).

పరలోక తండ్రి మరియు ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నారు మరియు—అన్నింటికన్నా ఎక్కువగా—వారు జీవించేలాంటి జీవితాన్ని మనం శాశ్వతంగా కలిగియుండేలావారి సన్నిధిలోకి మనల్ని తిరిగి ఆహ్వానించాలని కోరుతున్నారు, కాబట్టి ఈ సంతోషకరమైన సువర్తమానములు వచ్చాయి. దీనిని మనందరికీ దివ్యమైన అవకాశంగా మార్చడానికి అవసరమైన వాటన్నింటిని వారు చేసారని పునఃస్థాపన బయల్పరుస్తుంది. మన నిత్య ప్రయాణములో మనము సవాళ్ళు మరియు కష్టాలు అనుభవిస్తాము, కానీ ఈ జీవితములోను మరియు తరవాతి జీవితములోను “[మనము] ఉనికిలోనికి వచ్చునట్లు, [మనము] సంతోషమును కలిగియుండునట్లు” (2 నీఫై 2:25) ఉన్నాము. ప్రవక్త జోసెఫ్‌కు ఈ విషయము అందరికంటే బాగా తెలుసు.

జోసెఫ్ తరచు వ్యతిరేకతను హింసను ఎదుర్కొన్నాడు, ఐనప్పటికి తన “సహజమైన ఉల్లాస స్వభావమును నిలబెట్టుకున్నాడు” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:28) అతడు సంతోషముగాను, బలముగాను, స్థిరముగాను నిలిచాడు మరియు తనకు అప్పగించబడిన అసాధారణమైన కార్యమును సాధించాడు. ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను నమ్మి, బలపరచి, అనుసరించిన వారికి మరియు సంఘ నిర్మాణానికి తమనుతాము సమర్పించుకున్న ప్రారంభ పరిశుద్ధులందరికి నేను నివాళులర్పిస్తున్నాను. మనము వారికి గొప్ప కృతజ్ఞత మరియు గౌరవముతో ఋణపడియున్నాము.

సంఘము యొక్క ఆరంభ దినములలో ఒడిదుడుకులున్నాయి మరియు ఈ రోజూ ఒడిదుడుకులుండవచ్చు. కానీ పునఃస్థాపన కొనసాగుతోంది. యేసు క్రీస్తు ఈ సంఘానికి అధిపతియైయుండగా, జీవించుచున్న ప్రవక్తలు మనల్ని నడిపించడం కొనసాగిస్తారు. దేవునితో నిత్య నిబంధనల యొక్క దీవెనలు మనల్ని ఆయనతో మరియు తెరకు ఇరువైపుల నున్న మన ప్రియమైనవారితో బంధించునట్లు, ప్రభువు యొక్క మందిరముల నిర్మాణము కొనసాగుతుంది (మత్తయి 16:19 చూడండి). ఆయన గొర్రెలను మేపమని మరియు ఆయన సువార్తను పంచుకోమని రక్షకుడు ఇచ్చిన ఆజ్ఞను మనం అనుసరించినప్పుడు, దేవుడు మరియు యేసు క్రీస్తు యొక్క ప్రేమ ప్రపంచమంతటికి వ్యాపిస్తుంది. పునఃస్థాపన యొక్క సత్యములు జోసెఫ్ యొక్క దినములో ఊహించలేని విధాలుగా వివిధ ప్రదేశాలకు వ్యాపించడాన్ని మనము కన్నులారా చూస్తాము.

మనము ఈ ప్రశస్తమైన సత్యములను హత్తుకొని జీవించినప్పుడు—ప్రవక్త జోసెఫ్ వలే—బలమును మరియు గొప్ప ఆనందమును పొందగలము. జోసెఫ్ తన కాలపు పరిశుద్ధులకు ఇచ్చిన పిలుపు ఈ రోజుకి మనతో నిలిచియుంది:“మనము ఒక గొప్ప కార్యములో ముందుకు సాగుటలేదా? వెనుకకు మరలక ముందుకు సాగుడి. ధైర్యము, … జయము పొందుటకు ముందుకు సాగుడి! మీ హృదయములు సంతోషించి గొప్ప ఆనందమును పొందనీయుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:22).

పునఃస్థాపన తెచ్చు ప్రేమ మరియు ఆనందము యొక్క సువర్తమానములు మన జీవితములను దీవించి నడిపించును గాక—ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ.

వివరణలు

  1. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 152.

  2. జీవముతోనున్న క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము,” సువార్త గ్రంథాలయము.

  3. See Saints: The Story of the Church of Jesus Christ in the Latter Days, vol. 1, The Standard of Truth, 1815–1846 (2018), 16.

  4. మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ.

  5. యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: ప్రపంచమునకు ద్విశతాబ్ది ప్రకటన,” సువార్త గ్రంథాలయము.

  6. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆత్మీయ వేగము యొక్క శక్తి,” లియహోనా, మే 2022, 98 చూడండి.

  7. Dieter F. Uchtdorf, “On Being Genuine,” Liahona, May 2015, 83.