2025
క్రీస్తు వైపు చూడుము
2025 జనవరి


యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2025 జనవరి

క్రీస్తు వైపు చూడుము

సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36

సంశయము కంటే నమ్మకమును మరియు భయము కంటే విశ్వాసమును ఎంచుకోవడానికి 2025 యౌవనుల ఇతివృత్తము మీకు సహాయపడుతుంది.

2025 యౌవనుల ఇతివృత్త చిహ్నము.

పదిహేడు సంవత్సరముల కైలీ ఒక దుర్ఘటన వలన ఆమె మెదడు గాయపడక మునుపు ఒక ప్రోత్సాహక బృందంలో ఉండేది. ఆమె కోలుకునే సమయంలో పాఠశాలకు హాజరు కాలేకపోయింది మరియు ఆమె ఒంటరిగా భావించడం ప్రారంభించింది. ఆమె మానసికంగా పోరాడింది మరియు సహాయం కోసం ఎటు చూడాలో తెలియలేదు. సువార్తికుల బోధనలు వినమని ఒక స్నేహితురాలు సలహా ఇచ్చింది. వారు ఆమెకు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము గురించి బోధించారు. క్రీస్తును గూర్చి మరింత నేర్చుకోవడం ఆమెకు నిరీక్షణను ఇచ్చింది. దేవుడే తన దగ్గరకు సమీపిస్తున్న భావన ఆమెకు కలిగింది.

కైలీ తన తల్లితో ఇలా చెప్పింది, “దేవుడు నన్ను ప్రేమిస్తున్నారని నేనెన్నడు అనుకోలేదు. కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారని ఇప్పుడు నాకు తెలుసు.”

ఆమె తల్లి మిషెల్ కొంచెం ఆశ్చర్యపడింది. కైలీకి యేడేళ్ళప్పుడు ఆమె మరియు ఆమె భర్త బ్రాక్ ఎదుర్కొన్న వివిధరకాల ప్రశ్నలు, సందేహాలు మరియు ఆందోళనల కారణంగా వారు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘమును విడిచిపెట్టారు. తమ కుమార్తెకు ఆ సమావేశాలు మరియు ఆజ్ఞలు అన్నీ లేకపోతేనే సంతోషంగా ఉంటుందని వారు అనుకున్నారు. కానీ వారి నిర్ణయం వలన కైలీకి దేవునితో సన్నిహిత బాంధవ్యం దూరం అవుతుందని వారెన్నడూ ఆలోచించలేదు. కైలీలో మార్పు గమనించినప్పుడు మిషల్ మరియు బ్రాక్, తాము దేవుని సన్నిధికి దూరమై చాలకాలం గడిచిందని గ్రహించారు మరియు వారు ఆ అనుభూతిని తిరిగి పొందాలని ఆశించారు.

వారు తమ బిషప్పును కలిసారు మరియు త్వరలోనే ఆ కుటుంబం, కైలీ సోదరుడు బ్రేడెన్‌తో సహా సంఘానికి తిరిగి వచ్చింది. దేవునికి సన్నిహితంగా భావించడం—ముఖ్యముగా ప్రార్థన ద్వారా ఆయనతో తిరిగి సంబంధం కలుపుకోవడం— వారి విశ్వాసాన్ని పునరుద్ధరించింది. సంఘానికి తిరిగి రావడం వలన వారి ప్రశ్నలకు గాని భయాలకు గాని పరిష్కారము లభించలేదు, కానీ వారి అపనమ్మకము కంటే దేవునితో బలమైన వ్యక్తిగత సంబంధం ముఖ్యమని వారు గ్రహించారు.

ఇదంతా ఒక స్నేహితురాలైన—మీ వంటి యువతి— కైలీని క్రీస్తు వైపు చూడడానికి ఆహ్వానించినప్పుడు ఆరంభమయ్యింది. మరియు ఆమె చూసింది!

“ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36) అని యేసు క్రీస్తు చెప్పారు. 2025 యౌవనుల ఇతివృత్తము వెనుకనున్న స్ఫూర్తి ఇదే. మీరు క్రీస్తు వైపు చూస్తూ సంశయము కంటే నమ్మకమును మరియు భయము కంటే విశ్వాసమును ఏ విధముగా ఎంచుకోగలరో మీతో పంచుకోవడానికి మాకు అనుమతివ్వండి:

యువతుల ప్రధాన అధ్యక్షత్వము

ఎడమ నుండి కుడికి: సహోదరి రూనియా, అధ్యక్షుడు ఫ్రీమన్, సహోదరి స్పానౌస్

తమారా డబ్ల్యు. రూనియా

నేను కష్టంలో ఉన్నప్పుడు, యేసు క్రీస్తు చేతులు చాపియున్నట్లుగా ఊహించుకోవడం ఎల్లప్పుడు నాకు సహాయపడుతుంది. ఆయన వైపు చూచినప్పుడు, “నేను యేసుతో నడిచెదను”: “ఆయన యెన్నడును నన్ను విడువడు, నేను పడిపోయినప్పుడు కూడా,” అనే పాటలోని పదాలను నేను గుర్తుచేసుకుంటాను.

ఎమిలీ బెల్ ఫ్రీమన్

నేను ఈ ఇతివృత్తపు లేఖనాన్ని చదివినప్పుడు, నాకు గలిలయ సముద్రము మీద పేతురు జ్ఞాపకం వచ్చాడు. తుఫాను మీద దృష్టి పెట్టినప్పుడు అతనిలో భయము మరియు సంశయము ఎక్కువై, అతను తుఫాను అలల్లో మునిగి పోయేలా చేసాయి. కానీ రక్షకునిపై దృష్టి పెట్టినప్పుడు అతడు ఇంతకు ముందెన్నడు చేయనిది చేయగలిగాడు: అతడు నీటిపై నడిచాడు! అది నిజంగా విశేషమైనది. ఆయన వైపు చూడడం ద్వారా మీరు ఏమి సాధించగలరు?

ఆండ్రియా మున్యోస్ స్పానౌస్

నేను ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నాకు భయంగా అనిపించినప్పుడు, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో నా అనుబంధము గురించి నేను ఉద్దేశపూర్వకంగా ఆలోచిస్తాను. నేను దేవుని కుమార్తెను, అని నా మనసులో అనేకసార్లు చెప్పుకుంటాను. నా పరిస్థితి మెరుగయ్యే వరకు ఈ విధంగా కొనసాగిస్తాను. అది ఎల్లప్పుడు పనిచేస్తుంది!

యువకుల ప్రధాన అధ్యక్షత్వము

ఎడమ నుండి కుడికి: సహోదరుడు విల్‌కాక్స్, అధ్యక్షుడు లండ్, సహోదరుడు నెల్సన్

బ్రాడ్లీ ఆర్. విల్‌కాక్స్

ఎవరు మీపై శ్రద్ధ చూపుతున్నారు మరియు ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ తల్లిదండ్రులు మరియు సంఘ నాయకులా? మిమ్మల్ని కేవలం ఒక సంఖ్యగా మాత్రమే గుర్తించే సామాజిక మాధ్యమాలలోని జనులా? పరలోక తండ్రి మరియు క్రీస్తు వైపు చూడండి. వారు నిజంగా శ్రద్ధ చూపుతారు.

స్టీవెన్ జె. లండ్

మీరు అహరోను యాజకత్వ సమూహము మరియు యువతుల ఇతివృత్తములను వల్లించినప్పుడు మీకు ఏమి గుర్తుచేయబడుతుందో జ్ఞాపకముంచుకోండి: మీరు దేవుని యొక్క ప్రియమైన కుమారుడు లేదా కుమార్తె. మన తండ్రి మీ కొరకు ఒక ప్రణాళిక కలిగియున్నారని విశ్వసించండి. క్రీస్తు వైపు చూడడం అంటే ఆయన ప్రాయశ్చిత్తము ఆ ప్రణాళికకు కేంద్రముగా ఉన్నదని చూడడం.

మైఖేల్ టి. నెల్సన్

లేఖనములను పఠించడం క్రీస్తు వైపు చూడడమే! యేసు చేసిన అద్భుతములు మరియు బోధనలను జ్ఞాపకము చేసుకున్నప్పుడు సందేహములు మరియు భయములు సహజంగానే తొలగిపోతాయి. ఆయన మాటలు పొందగలిగినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. మన జీవితాలలో మనం అనుభవించే ప్రతి పరిస్థితిలోను అవి అన్వయించబడతాయి.

వివరణ

  1. స్టీఫెన్ పి. షాంక్ ద్వారా పదాలు మరియు సంగీతం (see Friend, Feb. 2020, 27; see also Hymns—For Home and Church, no. 1004).