2024
“జీవముతోకూడిన,” “ఖచ్చితమైన” మరియు “అధిక శ్రేష్ఠమైన నిరీక్షణకు” యేసు క్రీస్తే మూలం
2024 డిసెంబరు


“‘జీవముతోకూడిన,’ ‘ఖచ్చితమైన’ మరియు ‘అధిక శ్రేష్ఠమైన నిరీక్షణకు,’ యేసు క్రీస్తే మూలం,” లియహోనా, 2024 డిసెం.

లియహోనా నెలవారీ సందేశము, 2024 డిసెంబరు

“జీవముతోకూడిన,” “ఖచ్చితమైన” మరియు “అధిక శ్రేష్ఠమైన నిరీక్షణకు” యేసు క్రీస్తే మూలం

బేత్లెహేములో శిశువు పుట్టిన రోజును జరుపుకునే ఈ ప్రత్యేక కాలములో, యేసు క్రీస్తు మన రక్షకుడిగా మరియు విమోచకునిగా ఉండేందుకు ఈ లోకానికి వచ్చారని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం.

శిశువైన యేసుతో మరియ మరియు యోసేపు

జననము, షార్లెట్ ఆండ్రస్ చేత

అపొస్తలుడైన పేతురు మరియు మోర్మన్ గ్రంథ ప్రవక్తలైన జేకబ్ మరియు మొరోనైలు క్రీస్తునందు నిరీక్షణ యొక్క ఆత్మీయ వరమును బోధనాత్మకంగా సారూప్య మార్గములలో నొక్కిచెప్పారు.

ఉదాహరణకు, పేతురు ఇలా ప్రకటించాడు. “మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక, మృతులలోనుండి యేసు క్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను” (1 పేతురు 1:3; ఉద్ఘాటన జోడించబడింది). “నిరీక్షణ”ను వర్ణించడానికి “జీవముతోకూడిన” అనే పదాన్ని ఉపయోగించడాన్ని దయచేసి గమనించండి.

జేకబ్ ఇలా ప్రకటించాడు, “కావున ప్రియమైన సహోదరులారా, ఆయన అద్వితీయ కుమారుడైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా ఆయనతో సమాధానపడుడి, క్రీస్తు నందున్న పునరుత్థాన శక్తిని బట్టి మీరు పునరుత్థానమును పొందవచ్చును మరియు శరీరమందు ఆయన తననుతాను ప్రత్యక్షపరచుకొనుటకు ముందే విశ్వాసము కలిగియుండి, ఆయన యందు మహిమ యొక్క ఖచ్చితమైన నిరీక్షణను పొందియుండి మీరు క్రీస్తు యొక్క ప్రథమ ఫలములుగా దేవునికి సమర్పించబడవచ్చును” (జేకబ్ 4:11; ఉద్ఘాటన జోడించబడింది). “నిరీక్షణ”ను వర్ణించడానికి “ఖచ్చితమైన” అనే పదాన్ని ఉపయోగించడాన్ని దయచేసి గమనించండి.

మరియు మొరోనై ఇలా పేర్కొన్నాడు, “నీ తండ్రి నివాసముల మధ్య మనుష్యుని కొరకు స్థలము సిద్ధపరచితివని, దానిలో మనుష్యుడు అధిక శ్రేష్ఠమైన నిరీక్షణ కలిగియుండునని నీవు చెప్పితివని నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను; అందువలన మనుష్యుడు నిరీక్షణ కలిగియుండవలెను, లేని యెడల నీవు సిద్ధపరచిన స్థలమందు అతడు స్వాస్థ్యము పొందలేడు” (ఈథర్ 12:32; ఉద్ఘాటన జోడించబడింది). “నిరీక్షణ”ను వర్ణించడానికి “శ్రేష్ఠమైన” అనే పదాన్ని ఉపయోగించడాన్ని దయచేసి గమనించండి.

క్రీస్తునందు నిరీక్షణ అంటే ఏమిటి?

క్రీస్తునందు నిరీక్షణ యొక్క ఆత్మీయ వరము అనేది “పరిశుద్ధ మెస్సీయ యొక్క మంచితనము, కనికరము మరియు కృప” ద్వారా నిత్యజీవము యొక్క సంతోషకరమైన నిరీక్షణ (2 నీఫై 2:8) మరియు వాగ్దానం చేయబడిన నీతిగల దీవెనల కోసం బలమైన కోరిక. ఈ వచనములలోని “జీవముతోకూడిన,” “ఖచ్చితమైన” మరియు “అధిక శ్రేష్ఠమైన” అనే విశేషణాలు యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా పునరుత్థానం మరియు నిత్యజీవం గురించి ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న శక్తివంతమైన హామీని సూచిస్తున్నాయి.

ప్రవక్త మోర్మన్ ఇలా వివరించాడు:

“మరలా నా ప్రియమైన సహోదరులారా, నేను మీతో నిరీక్షణను గూర్చి మాట్లాడుదును. మీరు నిరీక్షణ కలిగియుండని యెడల, మీరు విశ్వాసమును ఎట్లు పొందగలరు?

“మీ నిరీక్షణ దేని కొరకైయున్నది? ఇదిగో నేను మీతో చెప్పునదేమనగా—క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా నిత్యజీవమునకు లేపబడుటకు మీరు నిరీక్షణ కలిగియుండవలెను; మరియు ఇది వాగ్దానము ప్రకారము ఆయనయందు మీ విశ్వాసమును బట్టియైయున్నది.

“అందువలన, ఒక మనుష్యుడు విశ్వాసము కలిగియున్న యెడల, అతడు తప్పక నిరీక్షణ కలిగియుండవలెను; ఏలయనగా విశ్వాసము లేకుండా నిరీక్షణ ఉండజాలదు” (మొరోనై 7:40–42).

తండ్రి యొక్క సంతోష ప్రణాళిక

క్రీస్తునందు జీవముతోకూడిన, ఖచ్చితమైన మరియు అధిక శ్రేష్ఠమైన నిరీక్షణ అనేది నిత్యుడగు తండ్రి అయిన దేవుడు జీవించియున్నాడనే జ్ఞానంతో ప్రారంభమవుతుంది. ఆయన మన తండ్రి మరియు మనము ఆయన ఆత్మీయ బిడ్డలము. మనము అక్షరాలా దేవుని ఆత్మీయ కుమారులము, కుమార్తెలము మరియు ఆయన నుండి దైవిక లక్షణాలను వారసత్వంగా పొందాము.

సంతోష ప్రణాళిక యొక్క రచయిత తండ్రియే (అబ్రాహాము 3:22–28 చూడండి). దేవుని ఆత్మీయ కుమారులు మరియు కుమార్తెలుగా, మనము “ఆయన ప్రణాళిక అయిన భౌతిక శరీరమును పొందగలుగుటకు మరియు సంపూర్ణతవైపు సాగిపోయి భూలోక అనుభవమును గణించుటకు మరియు ఆమె లేక అతని దైవిక గమ్యమైన నిత్యజీవ వారసత్వమును సంపూర్ణముగా గ్రహించుటకు అంగీకరించితిమి.” లేఖనములలో, మనము ఇలా నేర్చుకుంటాం: “స్పర్శించగలుగు మనుష్య శరీరమువలె మాంసము, ఎముకలు గల శరీరమును తండ్రి, కుమారుడు కలిగియుండెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22). అందువలన, మన దైవిక గమ్యము వైపు పురోగమించే ప్రక్రియలో భౌతిక శరీరాలను పొందడం చాలా అవసరం.

మనం ద్వంద్వ జీవులం. మన ఆత్మలు, మనలో శాశ్వతమైన భాగం, అవి మర్త్యత్వము యొక్క కోరికలు మరియు ఆశలకు లోబడి ఉండే భౌతిక శరీరాలను ధరించి ఉంటాయి. తండ్రి యొక్క సంతోష ప్రణాళిక తన పిల్లలకు దిశానిర్దేశం చేసేందుకు, పునరుత్థానమైన, ఉన్నతమైన శరీరాలతో ఆయన గృహానికి సురక్షితంగా తిరిగి రావడానికి, శాశ్వతమైన సంతోషం మరియు ఆనందాన్ని పొందేందుకు వారికి సహాయం చేయడానికి రూపొందించబడింది.

శిశువైన యేసుతో మరియ

శిశువైన క్రీస్తు, షార్లెట్ ఆండ్రస్ చేత

తండ్రి యొక్క ప్రణాళికలో యేసు క్రీస్తు యొక్క విమోచన పాత్ర

యేసు క్రీస్తు నిత్యుడగు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు. ఆయన తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకే ఈ లోకములోనికి వచ్చియున్నారు (3 నీఫై 27:13 చూడండి). మానవజాతి రక్షణకు సంబంధించిన అన్ని విషయాలలో తన వ్యక్తిగత ప్రతినిధిగా ఉండేందుకు యేసు క్రీస్తు తండ్రిచే అభిషేకించబడ్డారు. ఆయన మన రక్షకుడు మరియు విమోచకుడు ఎందుకంటే ఆయన మరణం మరియు పాపం రెండింటినీ జయించారు.

మెస్సీయ యొక్క రక్షణ కార్యము గురించి గిడియన్ జనులకు ఆల్మా ఇలా ప్రవచించాడు:

“ఆయన ప్రతి విధమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు అనుభవించుచూ ముందుకు సాగును; తన జనుల బాధలను, రోగములను ఆయన తనపై తీసుకొనునని చెప్పిన వాక్యము నెరవేరుటకు ఇది జరుగును.

“తన జనులను బంధించు మరణ బంధకములను తొలగించునట్లు ఆయన మరణమును తనపై తీసుకొనును; మరియు శరీరమును బట్టి ఆయన హృదయాంతరములు కనికరముతో నిండునట్లు, వారి బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి ఆయన ఎరుగునట్లు, ఆయన వారి బలహీనతలను తనపై తీసుకొనును.“

“ఇప్పుడు ఆత్మ అన్ని విషయములను ఎరుగును; అయినప్పటికీ, తన జనుల పాపములను ఆయన తనపై తీసుకొనునట్లు, ఆయన విడుదల యొక్క శక్తిని బట్టి వారి అతిక్రమములను ఆయన తొలగించునట్లు దేవుని కుమారుడు శరీరమును బట్టి శ్రమపడును” (ఆల్మా 7:11–13).

ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము సువార్త యొక్క మొదటి నియమము. నిజమైన విశ్వాసం రక్షకునిపై దృష్టి కేంద్రీకరిస్తుంది, ఆయనపై మనం నమ్మకం ఉంచేలా చేస్తుంది మరియు మరణం నుండి మనలను రక్షించి, పాపం నుండి మనలను శుద్ధి చేసి, మన స్వంత శక్తిని మించిన బలముతో దీవించే ఆయన శక్తిపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటుంది.

మొరోనై ఇలా సాక్ష్యమిచ్చాడు, “యేసు క్రీస్తు ద్వారా వచ్చిన మమష్యుని విమోచనను బట్టి, వారు ప్రభువు సన్నిధిలోనికి తిరిగి తేబడిరి; ఈ విధముగా మనుష్యులందరు విమోచింపబడియున్నారు, ఏలయనగా క్రీస్తు యొక్క మరణము పునరుత్థానమును తెచ్చును, అది ఒక అంతము లేని నిద్ర నుండి విమోచనను తెచ్చును, ఒక బూరధ్వని చేయబడినప్పుడు ఆ నిద్ర నుండి మనుష్యులందరు దేవుని శక్తి ద్వారా లేపబడుదురు; ధనికులు పేదవారు ఇరువురు, ఐహిక మరణమైన ఈ మరణము యొక్క నిత్య బంధకము నుండి విడిపించబడి, విమోచింపబడి, ముందుకు వచ్చి, అందరు ఆయన న్యాయపీఠము యెదుట నిలిచెదరు” (మోర్మన్ 9:13).

రక్షకుడు మరణ బంధకాలను తెంచాడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన పునరుత్థానుడయ్యారు, ఆయన జీవించియున్నారు మరియు జీవముతోకూడిన, ఖచ్చితమైన మరియు అధిక శ్రేష్ఠమైన నిరీక్షణకు ఏకైక మూలం ఆయనే.

ఆత్మకు ఒక లంగరు

ప్రవక్త ఈథర్ ఇలా సాక్ష్యమిచ్చాడు, “అందువలన దేవుని యందు విశ్వాసముంచు వాడెవడైనను నిశ్చయముగా మేలైన లోకము కొరకు, అనగా దేవుని యొక్క కుడిచేతి వైపున ఒక స్థలము కొరకు నిరీక్షించును; ఆ నిరీక్షణ విశ్వాసమును బట్టి వచ్చును, అది మనుష్యుల ఆత్మలకు ఒక లంగరు వంటిది, అది నిశ్చయముగా నిలకడగా ఎల్లప్పుడు సత్‌క్రియలలో వృద్ధి పొందుచూ దేవుడిని మహిమపరచుటకు వారు నడిపింపబడునట్లు చేయును”(ఈథర్ 12:4; ఉద్ఘాటన జోడించబడింది).

బేత్లెహేములో శిశువు పుట్టిన రోజును జరుపుకునే ఈ ప్రత్యేక కాలములో, యేసు క్రీస్తు మన రక్షకుడిగా మరియు విమోచకునిగా ఉండేందుకు ఈ లోకానికి వచ్చారని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. జీవము, వెలుగు, పునరుద్ధరణ, ప్రేమ, శాంతి, దృష్టికోణము, ఆనందము మరియు నిరీక్షణ అనే అమూల్యమైన ఆత్మీయ వరములను ఆయన మనకు అందిస్తున్నారు.

ఆయన ప్రాయశ్చిత్త త్యాగం మరియు నిజమైన పునరుత్థానం గురించి ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తల బోధనలను, సాక్ష్యాలను అధ్యయనం చేయడం ద్వారా రక్షకునియందు నిరీక్షణ యొక్క ఆత్మీయ వరముల కోసం తగిన విధంగా వెదకమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు అలా చేస్తున్నప్పుడు, విమోచకుని దైవత్వం గురించి మీ సాక్ష్యం బలపడుతుందని, ఆయన పట్ల మీ పరివర్తన మరింత లోతుగా ఉంటుందని, ఆయన యొక్క పరాక్రమ సాక్షిగా నిలబడాలనే మీ కోరిక మరియు దృఢ సంకల్పం పెరుగుతుందని మరియు మీ ఆత్మకు లంగరు—అనగా జీవముతోకూడిన, ఖచ్చితమైన మరియు అధిక శ్రేష్ఠమైన నిరీక్షణతో మీరు దీవించబడతారని నేను వాగ్దానం చేస్తున్నాను.

యేసు క్రీస్తు సజీవుడగు దేవుని యొక్క సజీవుడైన కుమారుడని, యుగయుగాలుగా ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చిన అపొస్తలులతోపాటు నా సాక్ష్యమును నేను సంతోషముగా ప్రకటించుచున్నాను. ఆయన మహిమాన్వితమైన, స్పర్శించగల మాంసము మరియు ఎముకలు గల శరీరమును కలిగియుండి పునరుత్థానుడైన మన విమోచకుడు. ప్రభువు మానవాళి అందరికీ సాధ్యమయ్యే విమోచనను మరియు దేవునితో సమాధానమును సాధ్యపరచుట వలన, మనం ఆత్మీయ హామీని మరియు “క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు” (1 కొరింథీయులకు 15:22) అనే జీవముతోకూడిన, ఖచ్చితమైన మరియు అధిక శ్రేష్ఠమైన నిరీక్షణను పొందగలుగుచున్నాము.

గమనిక

  1. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” సువార్త గ్రంథాలయం.