పిల్లలకు బోధించడానికి అదనపు వనరులు
అనుబంధం ఎ: తల్లిదండ్రుల కొరకు—దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచియుండేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట


“అనుబంధం ఎ: తల్లిదండ్రుల కొరకు—దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“అనుబంధం ఎ,” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

ఒక తల్లి మరియు కొడుకు

అనుబంధం ఎ

తల్లిదండ్రుల కొరకు—దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచియుండేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట

ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, నమ్ముతున్నారు మరియు మీ సామర్థ్యమును ఎరిగియున్నారు గనుక, నిత్యజీవానికి మార్గమైన ఆయన నిబంధన బాటలో ప్రవేశించి, పురోగమించడానికి మీ పిల్లలకు సహాయపడే అవకాశాన్ని పరలోక తండ్రి మీకు ఇచ్చారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–28 చూడండి). ఇది బాప్తిస్మపు నిబంధన మరియు దేవాలయంలో చేసే నిబంధనలు వంటి పవిత్రమైన నిబంధనలు చేసి, పాటించడానికి సిద్ధపడేందుకు వారికి సహాయపడడాన్ని కలిపియున్నది. ఈ నిబంధనల ద్వారా మీ పిల్లలు తమను తాము రక్షకుడైన యేసు క్రీస్తుతో ఆనందంగా బంధించుకోగలరు.

నిబంధన బాటపై ఈ ప్రయాణం కొరకు మీ పిల్లలను సిద్ధపరచడానికి అనేక విధానాలున్నాయి మరియు వారికి సహాయం చేయడానికి శ్రేష్ఠమైన విధానాన్ని కనుగొనడానికి పరలోక తండ్రి మీకు సహాయపడతారు. మీరు ప్రేరేపణను వెదకినప్పుడు, అభ్యాసమంతా ప్రణాళిక చేయబడిన పాఠ్యసమయాల్లోనే జరగదని గుర్తుంచుకోండి. వాస్తవానికి, ఇంటివద్ద అభ్యాసాన్ని అంత శక్తివంతంగా చేసే దానిలో భాగమేమిటంటే, మాదిరి ద్వారా మరియు అనుదిన జీవితంలో భాగంగా సహజంగా సంభవించే చిన్న, సరళమైన అనుభవాల ద్వారా నేర్చుకొనే అవకాశం. నిబంధన బాటను అనుసరించడం అనేది ఒక నిలకడయైన జీవితకాలపు ప్రక్రియ, అదేవిధంగా నిబంధన బాట గురించి నేర్చుకోవడం కూడా అటువంటిదే. (“గృహము మరియు కుటుంబము,” రక్షకుని విధానములో బోధించుట [2022], 30–31 చూడండి.)

మరింత ప్రేరేపణకు నడిపించే కొన్ని ఉపాయాలు క్రింద ఉన్నాయి. ప్రాథమిక-వయస్సు గల పిల్లలకు బోధించడానికి “అనుబంధం బి: ప్రాథమిక కొరకు—దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచియుండేందుకు పిల్లలను సిద్ధపరచుట” లో మీరు అదనపు ఉపాయాలను కనుగొనగలరు.

బాప్తిస్మము మరియు నిర్ధారణ

నిబంధన బాటలో “[మనము] ప్రవేశించవలసిన ద్వారము పశ్చాత్తాపము మరియు నీటి ద్వారా బాప్తిస్మము” (2 నీఫై 31:17) అని నీఫై బోధించాడు. బాప్తిస్మము మరియు నిర్ధారణ కొరకు సిద్ధపడేందుకు మీ పిల్లలకు సహాయపడడానికి మీరు చేసే ప్రయత్నాలు వారి పాదాలను ఆ మార్గములో స్థిరంగా నిలుపగలవు. యేసు క్రీస్తునందు విశ్వాసము మరియు పశ్చాత్తాపము గురించి బోధించడంతో ఈ ప్రయత్నాలు మొదలవుతాయి. ప్రతీ వారము సంస్కారములో పాల్గొనుట ద్వారా మన బాప్తిస్మపు నిబంధనలను మనం ఏవిధంగా క్రొత్తవిగా చేస్తామనే దాని గురించి బోధించడాన్ని కూడా అవి కలిపియున్నాయి.

నీళ్ళతొట్టిలో తన కుమారునికి బాప్తిస్మమిస్తున్న తండ్రి

నిబంధన బాటలో “[మనము] ప్రవేశించవలసిన ద్వారము పశ్చాత్తాపము మరియు నీటి ద్వారా బాప్తిస్మము” (2 నీఫై 31:17) అని నీఫై బోధించాడు.

మీకు సహాయపడగల వనరులు కొన్ని ఇక్కడున్నాయి: 2 నీఫై 31.

  • పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తునందు మీ విశ్వాసాన్ని బలపరిచే అనుభవం మీకు కలిగినప్పుడల్లా దానిని మీ బిడ్డతో పంచుకోండి. విశ్వాసమనేది జీవితాంతము ఇంకా ఇంకా బలంగా ఎదగగలదని గ్రహించేలా వారికి సహాయం చేయండి. వారు బాప్తిస్మము పొందడానికి ముందు క్రీస్తునందు బలమైన విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి మీ బిడ్డ చేయగల కొన్ని పనులేవి?

  • మీ బిడ్డ ఒక తప్పు ఎంపిక చేసినప్పుడు, పశ్చాత్తాపం యొక్క బహుమానం గురించి ఆనందంగా మాట్లాడండి. మీరు ఒక తప్పు ఎంపిక చేసినప్పుడు, మీరు పశ్చాత్తాపపడినప్పుడు కలిగే ఆనందాన్ని పంచుకోండి. మన పాపాల కొరకు యేసు క్రీస్తు బాధననుభవించి, మరణించారు గనుక, మనం ప్రతీరోజు పశ్చాత్తాపపడగలము, క్షమించబడగలము మరియు మార్పు చెందగల శక్తిని పొందగలము అని సాక్ష్యమివ్వండి. మీ బిడ్డ క్షమాపణను కోరినప్పుడు, స్వచ్ఛందంగా మరియు ఆనందంగా క్షమించండి.

  • మీ బాప్తిస్మము గురించి మీ బిడ్డకు చెప్పండి. ఫోటోలు చూపించండి మరియు జ్ఞాపకాలను పంచుకోండి. మీరెలా భావించారు, మీ బాప్తిస్మపు నిబంధనలు యేసు క్రీస్తు గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి మీకెలా సహాయపడ్డాయి మరియు మీ నిబంధనలు మీ జీవితాన్ని ఇంకా దీవించడాన్ని ఎలా కొనసాగిస్తున్నాయి అనేదాని గురించి మాట్లాడండి. ప్రశ్నలు అడగడానికి మీ బిడ్డను ప్రోత్సహించండి.

  • మీ కుటుంబములో లేదా మీ వార్డులో బాప్తిస్మము జరిగినప్పుడు, దానిని చూడడానికి మీ బిడ్డను తీసుకొని వెళ్ళండి. మీరు, మీ బిడ్డ చూసిన మరియు భావించిన దాని గురించి కలిసి మాట్లాడండి. సాధ్యమైనట్లయితే, బాప్తిస్మము పొందుతున్న వ్యక్తితో మాట్లాడండి మరియు క్రింది ప్రశ్నల వంటివి అడగండి: “ఈ నిర్ణయాన్ని మీరు ఎలా తీసుకున్నారు? మీరు ఎలా సిద్ధపడ్డారు?”

  • వారు చేస్తామని వాగ్దానం చేసినదేదైనా మీ బిడ్డ చేయడాన్ని మీరు గమనించినప్పుడల్లా మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. ఒప్పందాలను పాటించడం అనేది మనం బాప్తిస్మమప్పుడు చేసే నిబంధనలను పాటించడానికి సిద్ధపడేందుకు మనకు సహాయపడుతుందని చెప్పండి. మనం బాప్తిస్మము పొందినప్పుడు మనం దేవునితో ఏమని వాగ్దానం చేస్తాము? ఆయన మనతో ఏమని వాగ్దానం చేస్తారు? (మోషైయ 18:8–10, 13 చూడండి).

  • నిర్ధారించబడడం మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యునిగా కావడం మిమ్మల్ని ఏవిధంగా దీవించిందనే దాని గురించి మాట్లాడండి. ఉదాహరణకు, మీరు ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు మరియు ఇతరులు మీకు సేవ చేస్తున్నప్పుడు మీరు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు ఎలా దగ్గరయ్యారు? సంఘ సభ్యునిగా ఇతరులకు సేవ చేసే మరియు బలపరిచే విధానాల గురించి ఆలోచించడానికి మీ బిడ్డకు సహాయపడండి. సేవచేయడం నుండి వచ్చే ఆనందాన్ని అనుభవించడానికి మరియు గుర్తించడానికి కూడా వారికి సహాయపడండి.

  • మీరు మరియు మీ బిడ్డ కలిసి ఒక పవిత్రమైన అనుభవాన్ని కలిగియున్నప్పుడు (సంఘములో, లేఖనాలు చదువుతున్నప్పుడు లేదా ఎవరికైనా సేవ చేస్తున్నప్పుడు), మీకు కలిగిన ఆత్మీయ భావనలు లేదా మనోభావాల గురించి వారికి చెప్పండి. వారు ఎలా భావిస్తున్నారో పంచుకోమని మీ బిడ్డను ఆహ్వానించండి. ఆయన మీతో వ్యక్తిగతంగా మాట్లాడే విధానాలతో కలిపి, ఆత్మ జనులతో మాట్లాడగల వివిధ రకాల విధానాలను గమనించండి. వారు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని అనుభవించే క్షణాలను గుర్తించడానికి మరియు మీతో పంచుకోవడానికి మీ బిడ్డకు సహాయపడండి.

  • ప్రభువు యొక్క సేవకులు ఆయన స్వరాన్ని వినే వివిధ మార్గాల గురించి కలిసి మాట్లాడండి. వారు రక్షకుని స్వరాన్ని ఏవిధంగా వింటారనే దాని గురించి ఒక బొమ్మ గీయమని లేదా ఒక వీడియో చేయమని మీ బిడ్డను ఆహ్వానించండి.

  • సంస్కారమును మీ కుటుంబములో ఒక పవిత్రమైన మరియు ఆనందకరమైన సంఘటనగా చేయండి. సంస్కార సమయంలో మీరు యేసు క్రీస్తుపై ఎలా దృష్టికేంద్రీకరిస్తారో మీ బిడ్డతో పంచుకోండి. సంస్కారము వారికి పవిత్రమైనదని చూపడానికి ఒక ప్రణాళిక చేయడంలో మీ బిడ్డకు సహాయపడండి. ఉదాహరణకు, సంస్కార ప్రార్థనల పదాలను వినడం మన బాప్తిస్మపు నిబంధనలను మనకు గుర్తుచేయగలదు.

  • ఫ్రెండ్ పత్రిక యొక్క అనేక సంచికలలో బాప్తిస్మము మరియు నిర్ధారణ కొరకు పిల్లలు సిద్ధపడడంలో సహాయపడేందుకు వ్యాసాలు, కథలు మరియు ప్రోత్సాహకార్యక్రమాలు ఉంటాయి. మీతో కలిసి చదవడానికి మరియు ఆనందించడానికి మీ బిడ్డను వాటిలో కొన్ని ఎంపిక చేయనివ్వండి.

యాజకత్వ శక్తి, అధికారము మరియు తాళపుచెవులు

యాజకత్వము అనేది దేవుని యొక్క అధికారము మరియు శక్తి, దానిచేత ఆయన తన పిల్లలను దీవిస్తారు. నేడు భూమి మీద యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో దేవుని యొక్క యాజకత్వము ఉంది. తమ నిబంధనలను పాటించే సంఘ సభ్యులందరు—స్త్రీలు, పురుషులు మరియు పిల్లలు—తమను మరియు తమ కుటుంబాలను బలపరచుకోవడానికి తమ ఇళ్ళలో దేవుని యొక్క యాజకత్వపు శక్తితో దీవించబడ్డారు (ప్రధాన చేతిపుస్తకము: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సేవచేయుట, 3.6, సువార్త గ్రంథాలయము చూడండి). తమ వ్యక్తిగత జీవితాల్లో మరియు కుటుంబాల్లో దేవుని యొక్క రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యమును చేయడంలో ఈ శక్తి సభ్యులకు సహాయపడుతుంది (ప్రధాన చేతిపుస్తకము2.2 చూడండి).

స్త్రీలు, పురుషులు సంఘ పిలుపులలో సేవ చేసినప్పుడు, వారు యాజకత్వ అధికారంతో, యాజకత్వ తాళపుచెవులు కలిగియున్న వారి నడిపింపు క్రింద ఆవిధంగా చేస్తారు. పరలోక తండ్రి పిల్లలందరు—ఆయన కుమారులు మరియు ఆయన కుమార్తెలు—యాజకత్వమును బాగా అర్థం చేసుకున్నప్పుడు దీవించబడతారు.

యాజకత్వ అధికారం ద్వారా మనం విధులను పొందుతాము. “యాజకత్వం అనుగ్రహించబడుట మరియు యాజకత్వ స్థానాలకు నియమించబడుట ద్వారా సంఘము యొక్క యోగ్యులైన పురుష సభ్యులు యాజకత్వ అధికారాన్ని పొందుతారు” (ప్రధాన చేతిపుస్తకము, 3.4). యాజకత్వ స్థానాలను కలిగియున్నవారు యాజకత్వ విధులను నిర్వహించడానికి యాజకత్వ తాళపుచెవులను కలిగియున్న వారి చేత అధికారమివ్వబడగలరు.

యాజకత్వము గురించి మరింత నేర్చుకోవడానికి, రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆత్మీయ నిధులు,” లియహోనా, నవ. 2019, 76–79; ప్రధాన చేతిపుస్తకము లో “యాజకత్వ సూత్రాలు,” 3వ అధ్యాయము చూడండి.

  • యాజకత్వ విధులను మీ కుటుంబ జీవితంలో ఒక స్థిరమైన భాగంగా చేసుకోండి. ఉదాహరణకు, ప్రతీవారము సంస్కారము కొరకు ఆత్మీయంగా సిద్ధపడడానికి మీ బిడ్డకు సహాయపడండి. వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఓదార్పు లేదా నడిపింపు అవసరమైనప్పుడు యాజకత్వ దీవెనలు కోరమని మీ బిడ్డను ప్రోత్సహించండి. యాజకత్వ శక్తి ద్వారా ప్రభువు మీ కుటుంబాన్ని దీవిస్తున్న విధానాలను ప్రత్యేకంగా తెలియజేయడాన్ని అలవాటుగా మార్చుకోండి.

  • మీరు లేఖనాలను కలిసి చదువుతున్నప్పుడు, దేవుడు తన శక్తి చేత జనులను ఎలా దీవిస్తారో చర్చించడానికి అవకాశాల కొరకు గమనించండి. ఆయన యాజకత్వము ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించిన స్వీయానుభవాలను పంచుకోండి. యాజకత్వం ద్వారా మనం దేవుని నుండి పొందే ఆశీర్వాదాల ఉదాహరణల కోసం, ప్రధాన చేతిపుస్తకము, 3.23.5 చూడండి.

  • బాప్తిస్మము తర్వాత, బాప్తిస్మపు నిబంధనను పాటించడం ద్వారా వారు దేవుని శక్తిని పొందగలరని మీ బిడ్డకు బోధించండి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశము “ఆత్మీయ నిధులు” (లియహోనా, నవ. 2019, 76–79) కలిసి పునర్వీక్షించండి. యాజకత్వ విధులు మీ జీవితంలోకి దేవుని శక్తిని ఏవిధంగా తెచ్చాయో మీ బిడ్డకు చెప్పండి. యాజకత్వ శక్తి చేత మనం దీవించబడిన కొన్ని విధానాల జాబితా కొరకు, ప్రధాన చేతిపుస్తకము,  3.5 చూడండి.

  • “ప్రభువు యొక్క సేవకుడు ఎలా ఉంటాడు?” అనే ప్రశ్నను చర్చించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:36–42 ను కలిసి చదవండి మరియు జవాబుల కొరకు చూడండి. మీ బిడ్డ (లేదా ఇంకెవరైనా) ఈ వచనాలలోని సూత్రాలు లేదా సుగుణాలలో ఒకదానిని అన్వయించడాన్ని మీరెప్పుడు చూసినా, దానిని ప్రత్యేకించి చూపండి.

  • మీరు లేదా మీ బిడ్డ ఒక తలుపు తెరవడానికి లేదా కారులో బయలుదేరడానికి తాళపుచెవులను ఉపయోగించినప్పుడు, ఆ తాళపుచెవులను యాజకత్వ నాయకులు కలిగియున్న తాళపుచెవులతో పోల్చడానికి ఒక్క క్షణం కేటాయించండి. (యాజకత్వ తాళపుచెవుల నిర్వచనము కొరకు, ప్రధాన చేతిపుస్తకము, 3.4.1 చూడండి). యాజకత్వ తాళపుచెవులు మన కొరకు దేనిని “తెరుస్తాయి” లేదా “ఆరంభిస్తాయి”?

    2:51

    Where Are the Keys?

పూర్వీకుల కొరకు బాప్తిస్మము తీసుకొనుట మరియు నిర్ధారించబడుట

దేవాలయాలు ఆయన పిల్లల కొరకు పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో భాగము. ప్రభువు యొక్క మందిరములో, మనం పవిత్ర విధులలో పాల్గొనినప్పుడు మనం పరలోక తండ్రితో పవిత్ర నిబంధనలను చేస్తాము, అవన్నీ యేసు క్రీస్తు వైపు దారిచూపుతాయి. వాటిని ఈ జీవితంలో పొందని వారితో పాటు ఆయన పిల్లలందరి కొరకు నిబంధనలను చేయడానికి మరియు విధులలో పాల్గొనడానికి పరలోక తండ్రి ఒక మార్గాన్ని ఏర్పాటుచేసారు. మీ బిడ్డకు 12 ఏళ్ళు వచ్చిన సంవత్సరం ఆరంభం నుండి వారు, మరణించిన పూర్వీకుల కొరకు దేవాలయంలో బాప్తిస్మము పొందడానికి మరియు నిర్ధారించబడడానికి తగిన వయస్సు గలవారు (1 కొరింథీయులకు 15:29 కూడా చూడండి).

  • మీ పరిస్థితులు అనుమతించినంత తరచుగా ప్రభువు యొక్క మందిరానికి వెళ్ళండి. మీరు ఎందుకు వెళ్తున్నారు మరియు పరలోక తండ్రికి, యేసు క్రీస్తుకు దగ్గరగా భావించడానికి దేవాలయం మీకెలా సహాయపడుతుందనే దాని గురించి మీ బిడ్డతో మాట్లాడండి.

  • దేవాలయ సిఫారసు ప్రశ్నలను పునర్వీక్షించండి మరియు చర్చించండి. వాటిని మీరు యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శి యొక్క 36–37 పేజీలలో కనుగొనగలరు. దేవాలయ సిఫారసు మౌఖిక పరీక్షలో ఏమి జరుగుతుందనే దాని గురించి మీ బిడ్డతో మాట్లాడండి. దేవాలయ సిఫారసును కలిగియుండడం మీకు ఎందుకు ముఖ్యమైనదో పంచుకోండి.

  • మలాకీ 4:6 కలిసి చదవండి. ఏవిధంగా మీ హృదయాలు మీ పూర్వీకుల వైపు తిరుగగలవనే దాని గురించి మాట్లాడండి. కలిసి మీ కుటుంబ చరిత్రను FamilySearch.org పై పరిశోధించడం ద్వారా మీ పూర్వీకుల గురించి మరింత తెలుసుకోండి. బాప్తిస్మము పొంది, నిర్ధారించబడవలసిన పూర్వీకుల కొరకు వెదకండి. వార్డు దేవాలయ మరియు కుటుంబ చరిత్ర సలహాదారు మీకు సహాయపడగలరు.

గోత్రజనకుని దీవెనను పొందుట

గోత్రజనకుని దీవెన నడిపింపు, ఓదార్పు మరియు ప్రేరేపణకు మూలాధారం కాగలదు. అది మన కొరకు పరలోక తండ్రి నుండి వ్యక్తిగత ఉపదేశాన్ని కలిగియుంటుంది మరియు మన నిత్య ఉనికిని, ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి మనకు సహాయపడుతుంది. గోత్రజనకుని దీవెనల యొక్క ప్రాముఖ్యతను, పవిత్ర స్వభావాన్ని వారికి బోధించడం ద్వారా గోత్రజనకుని దీవెనను పొందడానికి సిద్ధపడడంలో మీ బిడ్డకు సహాయపడండి.

  • గోత్రజనకుని దీవెనను పొందడంలో మీ అనుభవాన్ని మీ బిడ్డతో పంచుకోండి. దానిని పొందడానికి మీరెలా సిద్ధపడ్డారు, దేవునికి దగ్గర కావడానికి అది మీకెలా సహాయపడింది మరియు ఈ దీవెన ద్వారా ఆయన మిమ్మల్ని నడిపించడాన్ని ఎలా కొనసాగిస్తారు వంటి విషయాలను మీరు పంచుకోవచ్చు. తమ గోత్రజనకుని దీవెనలను పొందిన ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడమని మీరు మీ బిడ్డను ఆహ్వానించవచ్చు.

  • ఎల్డర్ రాండల్ కె. బెన్నెట్ గారి సందేశము “మీ గోత్రజనకుని దీవెన—పరలోక తండ్రి నుండి ప్రేరేపించబడిన నడిపింపు” మరియు ఎల్డర్ కజుహికో యమషితా గారి సందేశము “మీ గోత్రజనకుని దీవెనను ఎప్పుడు పొందాలి” (లియహోనా, మే 2023, 42–43, 88–90) ని కలిసి పునర్వీక్షించండి. మనం గోత్రజనకుని దీవెనను పొందాలని పరలోక తండ్రి ఎందుకు కోరుకుంటున్నారు అనేదాని గురించి ఈ సందేశాల నుండి మీరు నేర్చుకొనే దానిని ఒకరితో ఒకరు పంచుకోండి. గోత్రజనకుని దీవెనను పొందే ప్రక్రియ గురించి నేర్చుకోవడానికి, ప్రధాన చేతిపుస్తకము, 18.17 చూడండి.

  • గోత్రజనకుని దీవెనలు పొందిన పూర్వీకులను మీరు కలిగియున్నట్లయితే, వారిలో కొందరివి మీ బిడ్డతో కలిసి చదవడం ప్రేరేపించేదిగా ఉండవచ్చు. మరణించిన పూర్వీకుల యొక్క దీవెనల కొరకు మనవి చేయడానికి, ChurchofJesusChrist.org లో లాగిన్ అయ్యి, తెర మీద కుడివైపు పైన మూలనున్న Tools‌ను నొక్కి, Patriarchal Blessing [గోత్రజనకుని దీవెన] ఎంపిక చేయండి.

  • మీ బిడ్డ గోత్రజనకుని దీవెనను పొందిన తర్వాత, వారి భావాలను నమోదు చేయమని అక్కడ ఉన్న కుటుంబ సభ్యులలో ఎవరినైనా ఆహ్వానించండి మరియు వాటిని మీ బిడ్డతో పంచుకోండి.

వరమును పొందుట

“మహోన్నత స్థలము నుండి శక్తితో” (సిద్ధాంతము మరియు నిబంధనలు 95:8) తన పిల్లలందరికి వరమివ్వాలని లేదా దీవించాలని దేవుడు కోరుతున్నారు. కేవలం ఒక్కసారి మన స్వంత వరమును పొందడానికి మనం దేవాలయానికి వెళ్తాము, కానీ దేవునితో మనం చేసే నిబంధనలు మరియు వరములో భాగంగా ఆయన మనకిచ్చే ఆత్మీయ శక్తి మన జీవితాల్లో అనుదినము మనల్ని దీవించగలదు.

  • మీ ఇంటిలో దేవాలయము యొక్క చిత్రాన్ని ప్రదర్శించండి. ప్రభువు యొక్క మందిరములో మీరు అనుభూతి చెందే భావాల గురించి మీ బిడ్డకు చెప్పండి. ప్రభువు పట్ల మరియు ఆయన మందిరం పట్ల మీ ప్రేమ గురించి, అక్కడ మీరు చేసిన నిబంధనల గురించి తరచుగా మాట్లాడండి. వారి పూర్వీకుల కోసం బాప్తిస్మములు మరియు నిర్ధారణలను నిర్వహించడానికి మీ బిడ్డతో దేవాలయానికి వెళ్ళే అవకాశాల కోసం చూడండి.

  • దేవాలయ వరము గురించి” మరియు “ప్రభువు యొక్క మందిరం కొరకు సిద్ధపడండి” వంటి వ్యాసాలను కలిసి చదవండి. దేవాలయం గురించి వారు కలిగియున్న ప్రశ్నలేవైనా మీ బిడ్డను అడగనివ్వండి. దేవాలయం వెలుపల మీరు దేని గురించి మాట్లాడవచ్చు అనేదాని గురించి నడిపింపు కొరకు, ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ గారి సందేశము “అవసరమైన ప్రతిదానిని పొందుటకు సిద్ధపడుము” చూడండి (లియహోనా, మే 2019, 101–4; ప్రత్యేకించి “గృహ-కేంద్రిత సంఘ-సహకార అభ్యాసము మరియు దేవాలయ సిద్ధపాటు” అనే శీర్షిక గల విభాగాన్ని చూడండి).

  • మీరు, మీ బిడ్డ ఇతర విధులలో పాల్గొనినప్పుడు లేదా సాక్షిగా ఉన్నప్పుడు (సంస్కారము లేదా స్వస్థపరిచే దీవెన వంటివి), ఆ విధిలో ఉన్న చిహ్నము గురించి ఒక్క క్షణం చర్చించండి. చిహ్నములు దేనిని సూచిస్తాయి? అవి యేసు క్రీస్తు గురించి ఏవిధంగా సాక్ష్యమిస్తాయి? యేసు క్రీస్తు గురించి కూడా సాక్ష్యమిచ్చే దేవాలయ విధుల యొక్క చిహ్నరూపకమైన అర్థాన్ని ధ్యానించడానికి సిద్ధపడేలా ఇది మీ బిడ్డకు సహాయపడగలదు.

  • మోషైయ 18:10, 13లో వివరించిన బాప్తిస్మపు నిబంధనను వారు ఎలా పాటిస్తున్నారో గమనించడంలో మీ పిల్లలకు సహాయపడండి (ఆ నిబంధన యొక్క ఫలాలను వివరించే 8–9 వచనాలను కూడా చూడండి). వారిని ప్రభువు ఎలా దీవిస్తున్నారో గమనించడానికి కూడా మీ బిడ్డకు సహాయపడండి. నిబంధనలను పాటించడానికి వారి సామర్థ్యంలో మీ బిడ్డ నమ్మకాన్ని పెంపొందించండి.

  • మీ దేవాలయ నిబంధనలు మీ ఎంపికలను ఎలా నడిపిస్తాయో మరియు యేసు క్రీస్తుకు దగ్గర కావడానికి మీకెలా సహాయపడతాయో అనేదాని గురించి బహిరంగంగా, తరచుగా మాట్లాడండి. మనం దేవాలయంలో చేసే నిబంధనలను పునర్వీక్షించడానికి, ప్రధాన చేతిపుస్తకము, 27.2 ను మీరు ఉపయోగించవచ్చు. మీరు వరమును పొందినట్లయితే, యేసు క్రీస్తుతో మీ నిబంధనలను గుర్తుంచుకోవడానికి దేవాలయ వస్త్రం మీకు ఎలా సహాయపడుతుందో మీ పిల్లలకు చెప్పండి (అన్నెట్ జె. డెన్నిస్, “ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనుడి,” లియహోనా, మే 2024, 10–13 చూడండి).

    4:12

    Sacred Temple Clothing

సువార్తసేవ చేయుట

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు: “సేవ చేయాలనే పిలుపు కొరకు సిద్ధపడేందుకు మీరు చేయగల ఏకైక అత్యంత ముఖ్యమైన విషయమేమనగా, మీరు సువార్త సేవకు వెళ్ళడానికి చాలాకాలం ముందే మీరు ఒక సువార్తికునిగా మారడం. … విషయం సువార్తసేవకు వెళ్ళడం కాదు; బదులుగా, విషయమేమిటంటే ఒక సువార్తికునిగా మారడం మరియు మన హృదయము, శక్తి, మనస్సు మరియు బలమంతటితో మన జీవితమంతా సేవ చేయడం. … జీవితకాల సువార్త సేవ కొరకు మీరు సిద్ధపడుతున్నారు” (“Becoming a Missionary,” Liahona, Nov. 2005, 45–46). ఒక సువార్తికునిగా మారడంలో మీ బిడ్డ కలిగియున్న అనుభవాలు వారిని నిత్యము దీవిస్తాయి, కేవలం వారు సువార్తికులుగా సేవ చేసిన కాల వ్యవధికే పరిమితం కావు.

మరింత తెలుసుకోవడానికి, రస్సెల్ ఎమ్. నెల్సన్, “శాంతికరమైన సువార్తను బోధించుట,” లియహోనా, మే 2022, 6–7; గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “ప్రేమించు, పంచు, ఆహ్వానించు,” లియహోనా, మే 2022, 84–87 చూడండి.

  • సహజమైన విధానాల్లో సువార్తను ఎలా పంచుకోవాలో చేసి చూపించండి. పరలోక తండ్రి మరియు రక్షకుని గురించి, రక్షకుని యొక్క పునఃస్థాపించబడిన సువార్త నుండి మరియు ఆయన సంఘ సభ్యునిగా మీరు పొందే దీవెనల గురించి మీ భావాలను ఇతరులతో పంచుకొనే అవకాశాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. సంఘములో మరియు కుటుంబ సంబంధిత ప్రోత్సాహ కార్యక్రమాల్లో మీ కుటుంబంతో చేరడానికి ఇతరులను ఆహ్వానించండి.

  • మీ కుటుంబం సువార్తికులతో సంభాషించడానికి గల అవకాశాల కొరకు చూడండి. మీ స్నేహితులకు బోధించడానికి వారిని ఆహ్వానించండి లేదా మీ ఇంటిలోని జనులకు బోధించడానికి వారికి అవకాశమివ్వండి. వారు కలిగియున్న అనుభవాల గురించి మరియు యేసు క్రీస్తుకు దగ్గర కావడానికి సువార్తసేవ వారికి ఎలా సహాయపడుతున్నది అనేదాని గురించి సువార్తికులను అడగండి. సువార్తికులుగా కావడానికి సిద్ధపడేందుకు వారు ఏమి చేసారు (లేదా చేయాలనుకున్నారు) అని కూడా అడగండి.

  • మీరు సువార్తసేవ చేసినట్లయితే, మీ అనుభవాల గురించి బహిరంగంగా మరియు తరచుగా మాట్లాడండి. లేదా సువార్తసేవ చేసిన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను దాని గురించి మాట్లాడమని ఆహ్వానించండి. మీ జీవితమంతా మీరు ఇతరులతో సువార్తను పంచుకున్న విధానాల గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. వారు సువార్తను పంచుకోగల విధానాల గురించి ఆలోచించడానికి మీ బిడ్డకు సహాయపడండి.

  • మీ కుటుంబానికి సువార్త సూత్రాలను బోధించే అవకాశాలను మీ బిడ్డకు ఇవ్వండి. వారి నమ్మకాలను ఇతరులతో పంచుకోవడాన్ని కూడా మీ బిడ్డ సాధన చేయవచ్చు. ఉదాహరణకు, “మోర్మన్ గ్రంథము గురించి ఎన్నడూ వినని వారికి దానిని మనం ఎలా పరిచయం చేస్తాము?” లేదా “క్రైస్తవులు కాని ఒకరికి రక్షకుని అవసరం గురించి మనం ఎలా వివరిస్తాము?” వంటి ప్రశ్నలను మీరు చర్చించవచ్చు. (అహ్మద్ ఎస్. కార్బిట్, “ఒక క్రైస్తవుడిగా నేను క్రీస్తుని ఎందుకు నమ్ముతానో మీకు తెలుసా?,” లియహోనా, మే 2023, 119–21 చూడండి.)

  • జనులతో మాట్లాడడాన్ని సౌకర్యంగా భావించడానికి మీ బిడ్డకు సహాయపడండి. ఒక సంభాషణను మొదలుపెట్టడానికి గల కొన్ని మంచి విధానాలేవి? ఇతరులు చెప్పేదానిని ఎలా వినాలి, వారి హృదయాలలో ఉన్నదానిని ఎలా గ్రహించాలి మరియు వారి జీవితాలను దీవించగల సువార్త సత్యాలను ఎలా పంచుకోవాలి అని నేర్చుకోవడానికి మీ బిడ్డను ప్రోత్సహించండి.

  • మీ బిడ్డ ఇతర సంప్రదాయాలు మరియు విశ్వాసాల గురించి తెలుసుకోవడానికి అవకాశాల కొరకు చూడండి. ఇతరుల నమ్మకాలలో ఉన్న మంచిని, నిజమైన సూత్రాలను గుర్తించి, గౌరవించడానికి వారికి సహాయపడండి.

ముద్రవేయు విధిని పొందుట

దేవాలయంలో, ఒక భర్త మరియు భార్య నిత్యత్వము కొరకు వివాహమాడగలరు. ఇది “దేవాలయ ముద్ర” అని పిలువబడే విధిలో జరుగుతుంది. మీ కుమారుడు లేదా కుమార్తె కొరకు ఈ విధి చాలా సంవత్సరాల దూరంలో ఉన్నప్పటికీ, ఆ సంవత్సరాలలో కలిసి మీరు చేసే చిన్న, సరళమైన, స్థిరమైన విషయాలు ఈ అద్భుతమైన దీవెన కొరకు సిద్ధపడేందుకు వారికి సహాయపడగలవు.

  • కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” (సువార్త గ్రంథాలయము)ను కలిసి చదవండి. ఈ ప్రకటన కుటుంబ జీవితంలో సంతోషము గురించి మరియు విజయవంతమైన వివాహాల గురించి ఏమి బోధిస్తుంది? మీ బిడ్డతో కలిసి అధ్యయనం చేయడానికి ఈ ప్రకటనలో జాబితా చేయబడిన సూత్రాలలో ఒకదానిని ఎంపిక చేయండి. ఆ సూత్రానికి సంబంధించిన లేఖనాల కొరకు మీరు లేఖన దీపికలో చూడవచ్చు. మీ కుటుంబంలో ఆ సూత్రాన్ని ఇంకా పూర్తిగా అన్వయించడానికి కూడా మీరు లక్ష్యాలను ఏర్పరచుకోవచ్చు. మీరు మీ లక్ష్యాలపై పని చేస్తున్నప్పుడు, ఆ సూత్రమును జీవించడం కుటుంబ జీవితంపై కలిగియున్న ప్రభావాన్ని కలిసి చర్చించండి.

  • క్రీస్తు-కేంద్రిత నిత్య వివాహం కలిగియుండడం గురించి మీరు, మీ భాగస్వామి నేర్చుకుంటున్న విషయాలు మరియు మెరుగుపరచుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్న విధానాల గురించి బాహాటంగా మీ బిడ్డతో చెప్పండి. మీరు మరియు మీ భాగస్వామి దేవాలయంలో ముద్రవేయబడినట్లయితే, మీరు ప్రభువుతో చేసిన మీ నిబంధనలను పాటించడానికి ఎలా ప్రయాసపడుతున్నారో మాదిరి ద్వారా మీ బిడ్డకు చూపండి. పరలోక తండ్రిని మరియు రక్షకుడిని మీ అనుబంధానికి కేంద్రంగా చేయడానికి మీరు ఎలా ప్రయాసపడుతున్నారో మరియు వారు మీకు ఎలా సహాయపడుతున్నారో మీ బిడ్డకు చెప్పండి (యులిసెస్ సోవారెస్, “ప్రభువుతో భాగస్వామ్యంలో,” లియహోనా, నవ. 2022, 42–45 కూడా చూడండి).

  • కుటుంబ నిర్ణయాలు చేయవలసి వచ్చినప్పుడు, కుటుంబ సలహాసభలు మరియు చర్చలు జరపండి. కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలు వినిపించుకొనేలా మరియు విలువివ్వబడేలా చూడండి. విషయాలను అందరూ ఒకే విధంగా చూడనప్పుడు కూడా, కుటుంబ అనుబంధాలలో ఆరోగ్యకరమైన సంభాషణను, దయను ప్రదర్శించే అవకాశంగా ఈ చర్చలను ఉపయోగించండి.

  • కుటుంబంలో అభిప్రాయభేదం లేదా వివాదం ఉన్నప్పుడు, సహనము మరియు దయను ప్రదర్శించండి. వివాదాన్ని క్రీస్తు వంటి విధానాలలో పరిష్కరించడం సంతోషకరమైన వివాహం కొరకు సిద్ధపడేందుకు వారికి ఎలా సహాయపడగలదో చూడడానికి మీ బిడ్డకు సహాయపడండి. కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 121:41–42 చదవండి మరియు ఈ వచనాలలోని సూత్రాలు వివాహానికి ఎలా అన్వయించబడగలవు అనేదాని గురించి మాట్లాడండి.