2021
యాజకత్వము దేవుని శక్తి
ఆగష్టు 2021


“యాజకత్వము దేవుని శక్తి,” లియహోనా, ఆగష్టు 2021

లియహోనా నెలవారీ సందేశము, ఆగష్టు 2021

యాజకత్వము దేవుని శక్తి

దేవుడు మనలను యాజకత్వపు శక్తి ద్వారా దీవిస్తాడు. యాజకత్వపు దీవెనలు ప్రతిఒక్కరికి అందుబాటులో ఉన్నాయి.

యాజకత్వము దేవుని శక్తియైయున్నది. ఆయన ఈ శక్తిని తన పిల్లలందరినీ దీవించుటకు, ఆయనతో కలిసి జీవించుటకై తిరిగి వెళ్ళునట్లు సహాయపడుటకు ఉపయోగిస్తారు. దేవుడు యాజకత్వపు శక్తిని భూమిపైనున్న ఆయన పిల్లలకు అనుగ్రహించారు. ఈ శక్తితో యాజకత్వపు నాయకులు సంఘాన్ని నడిపించగలరు మరియు యాజకత్వము గలవారు దేవునికి చేరువగుటకు మనకు సహాయం చేయు బాప్తీస్మము వంటి పరిశుద్ధ విధులను జరిపించగలరు. యోగ్యతతో యాజకత్వపు విధులను పొంది, నిబంధనలను (పరిశుద్ధ ప్రమాణాలను) పాటించే ప్రతి పురుషుడు మరియు స్త్రీకి దేవుని శక్తి లభ్యమవుతుంది.

సంస్కారము

జోసెఫ్ స్మిత్‌కు యాజకత్వపు శక్తి ఇవ్వబడింది

యేసు క్రీస్తు భూమిపైనున్నప్పుడు, ఆయన తన సంఘాన్ని యాజకత్వపు శక్తితో నడిపించారు. ఆయన ఈ శక్తిని తన శిష్యులకు కూడా ఇచ్చారు. వారు మరణించిన తరువాతి శతాబ్దాలలో అనేకమంది సభ్యులు సంఘం నుండి వెడలిపోయారు. వారు సువార్తను, సంఘం పనిచేసే తీరును తప్పుగా సవరించారు. దేవుని యాజకత్వము భూమిపై ఇక లేకుండా పోయింది. 1829లో, జోసెఫ్ స్మిత్‌కు యాజకత్వమునిచ్చుటకై యేసు బాప్తీస్మమిచ్చు యోహానును, అపొస్తలులైన పేతురు, యాకోబు, యోహానులను పంపించెను. భూమిపై దేవునినుండి ఈ అధికారాన్ని కలిగియున్న ఏకైక సంఘము యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము.

మెల్కీసెదెకు యాజకత్వము యొక్క పునఃస్థాపన

పేతురు, యాకోబు, యోహానుల స్వరము, లిండా కర్లీ క్రిస్టెన్సన్ మరియు మైకెల్ టి. మాల్మ్ చేత

యాజకత్వపు తాళపుచెవులు

విధులను జరిపించుటకు అనుమతించుట వంటి యాజకత్వపు ఉపయోగమును నిర్దేశించు అధికారమే యాజకత్వపు తాళపుచెవులు. యేసు క్రీస్తు యాజకత్వపు తాళపుచెవులన్నింటినీ కలిగియున్నారు. సంఘం యొక్క అధ్యక్షుడు మాత్రమే భూమిపై మొత్తం సంఘమంతటినీ నిర్దేశించడానికి యాజకత్వపు తాళపుచెవులను ఉపయోగించగలరు. ఆయన నిర్దేశకత్వంలో, ఇతరులు దేవుని కార్యమును చేయుటకు కొన్ని తాళపుచెవులను ఉపయోగించగలరు. బిషప్పులు, స్టేకు అధ్యక్షులు వంటి నాయకులు వారి వార్డులు, స్టేకులను నడిపించుటకు యాజకత్వపు తాళపుచెవులను ఉపయోగిస్తారు. సేవచేయుటకు పిలుపులు యాజకత్వపు తాళపుచెవులు కలిగియున్ననాయకుల నుండి వస్తాయి గనుక, పిలుపులలో సేవచేయు స్త్రీ పురుషులు వారి విధులను నిర్వర్తించినప్పుడు యాజకత్వపు అధికారాన్ని వినియోగించెదరు.

మెల్కీసెదెకు యాజకత్వము మరియు అహరోను యాజకత్వము

యాజకత్వము రెండు భాగములను కలిగియుంది: మెల్కీసెదెకు యాజకత్వము మరియు అహరోను యాజకత్వము. మెల్కీసెదెకు యాజకత్వము ద్వారా సంఘనాయకులు సంఘం యొక్క దైవసేవ, దేవాలయ కార్యము వంటి ఆత్మీయ కార్యమునంతటినీ నిర్దేశిస్తారు. అహరోను యాజకత్వము మెల్కీసెదెకు యాజకత్వ అధికారం క్రింద పనిచేస్తుంది. ఇది బాప్తీస్మము, సంస్కారము వంటి విధులను నిర్వహించుటకు ఉపయోగించబడుతుంది.

బాప్తీస్మము

యాజకత్వము యొక్క దీవెనలు

నిబంధనలు, విధుల ద్వారా యాజకత్వపు దీవెనలను దేవుడు ఆయన పిల్లలందరికీ లభ్యమయ్యేలా చేస్తారు. ఈ దీవెనలలో బాప్తీస్మము, పరిశుద్ధాత్మ వరము, సంస్కారము, దేవాలయ విధులు ఉన్నాయి. దేవాలయంలో వరమును పొందిన స్త్రీ పురుషులు వారు చేసిన నిబంధనల ద్వారా దేవుని యాజకత్వశక్తి యొక్క బహుమానాన్ని పొందుతారు. స్వస్థత, ఆదరణ, మార్గదర్శకత్వములను కూడా యాజకత్వపు దీవెనల ద్వారా మనం పొందగలము.

దేవాలయము వద్ద నూతనదంపతులు

యాజకత్వమును గురించి లేఖనములు ఏమి చెప్తున్నాయి?

ప్రాచీనదినములలో ఉన్న యాజకత్వమే ఇప్పుడు కూడా ఉంది (మోషే 6:7 చూడుము).

ప్రభువు కార్యాన్ని మనం సక్రమంగా సాధించామని నిశ్చయపరచడానికి యాజకత్వపు తాళపుచెవులు సహాయపడతాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:11 చూడుము).

యాజకత్వమును కలిగియున్న పురుషులు దానిని “నీతి సూత్రములతో తప్ప” వినియోగించలేరు ( సిద్ధాంతము మరియు నిబంధనలు 121:36).

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:38-67 లో యాజకత్వము గలవారి బాధ్యతలలో కొన్ని వివరించబడ్డాయి.