“మన జీవితాల సత్యము,” లియహోనా, ఆగ. 2025.
లియహోనా నెలవారీ సందేశము, 2025 ఆగష్టు
మన జీవితాల సత్యము
పరలోక తండ్రి మన గతం, వర్తమానం, మరియు భవిష్యత్తు గురించి సత్యాలను బయల్పరిచారని, నిత్య జీవపు బహుమతిని ఎలా పొందాలో కూడా ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు.
1833, జనవరి 22న, కర్ట్‌లాండ్, ఓహైయోలోని న్యూవెల్ కె. విట్నీ స్టోర్ మెట్లపైన ఉన్న చిన్న, ఇరుకైన గదిలో, సంఘ ఎల్డర్లు ప్రవక్త జోసెఫ్ స్మిత్‌తో సమావేశమయ్యారు. గత సంవత్సరం డిసెంబరులో, ప్రధానంగా సహోదరులను మిషన్ల కోసం సిద్ధపరచడానికి ఒక పాఠశాలను సిద్ధపరచమని జోసెఫ్ ఒక బయల్పాటును పొందాడు.
“పరలోకరాజ్యపు సిద్ధాంతమును మీరు ఒకరికొకరు బోధించాలని” “నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను” అని ప్రభువు ప్రకటించెను.
“శ్రద్ధగా బోధించుడి, నా కృప మీకు దొరుకును, తద్వారా మీరు సూత్రమందు, నియమమందు, సిద్ధాంతమందు, సువార్త నియమమందు, దేవుని రాజ్యమునకు సంబంధించి మీరు గ్రహించుటకు యుక్తమైన అన్ని విషయములందు మరింత పరిపూర్ణముగా ఉపదేశమును పొందవలెను; …
“తద్వారా నేను మిమ్ములను పిలిచిన పిలుపును, నేను మీకు అప్పగించిన పరిచర్యను ఘనపరచుటకు చేయుటకు నేను మరలా మిమ్ములను పంపునప్పుడు అన్ని విషయములందు మీరు సిద్ధపడియుందురు” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 88:77–78, 80).
ఈ “ప్రవక్తల యొక్క పాఠశాల,” అది పిలవబడినట్లుగా, ఒక అద్భుతమైన ఆత్మీయమైన వరములు మరియు అనుభవాల ప్రవహాన్ని అందించెను. చాలామంది ప్రారంభ సంఘ నాయకులు అక్కడ బోధించబడ్డారు. నేడు లోకము పూర్తిగా భిన్నమైన ప్రదేశము, కానీ అప్పుడు ప్రభువు ఇచ్చిన మార్గదర్శకత్వము ఇప్పటికీ నమ్మశక్యం కాని విధంగా అన్వయిస్తుంది. మనము కూడా, “సత్యమనగా, ప్రస్తుతము ఉన్నవిధముగా, గతములో ఉన్నవిధముగా, భవిష్యత్తులో ఉండబోవు విధముగా ఉన్న సంగతుల యొక్క జ్ఞానమును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:24) తప్పక వెదకవలెను.
సత్యము కొరకు మన పరిశోధన
మనం జీవిస్తున్న ఈ యుగములో, ఇదివరకెన్నడూ లేనంతగా విజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చింది. గతములో, మీరు ఏదైన తెలుసుకోవాలని కోరిన యెడల, మీరు గ్రంథాలయానికి వెళ్ళి, వెదకాల్సి వచ్చేది. ఈరోజు ఇంటర్నెట్ మరియు స్మార్ట్‌ఫోన్లు వంటి పరికరాలు మనం దాదాపు వెంటనే కనుగొనగలిగే అంతులేని సమాచారానికి ప్రవేశాన్ని ఇస్తున్నాయి.
మనకు లభ్యమయ్యే వనరులను మనం తెలివిగా ఉపయోగించినప్పుడు, ప్రభువు సంతోషిస్తున్నారు, అయితే ఆయన ఈ శాశ్వతమైన సలహాను ఇచ్చారు: “శ్రద్ధతో వెదకి, ఒకరికొకరు జ్ఞానపు మాటలను బోధించుకొనుడి; శ్రేష్ఠమైన గ్రంథముల నుండి జ్ఞానముగల మాటలను వెదకుడి; అధ్యయనము ద్వారా, విశ్వాసము ద్వారా కూడా నేర్చుకొనుటకు ప్రయత్నించుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:118). మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి నేర్చుకోమని ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:79; 93:53 చూడండి), కానీ సత్యము కొరకు మన పరిశోధనలో, మనము దేవుని వైపు చూడాలి, ఆయన అన్ని విషయములను గ్రహించును, అన్ని సంగతులు ఆయన యెదుటనున్నవి, … ఆయన అన్నిటికి పైన, అన్నిటిలోను, అన్నిటికి సమీపములో నున్నాడు, …అన్ని సంగతులు యుగయుగముల వరకు దేవుడైన ఆయన వలన, ఆయన మూలముగా కలుగుచున్నవి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:41).
దేవుడు మనకిచ్చిన సత్యాలలో భూమి మీద మన జీవితాల కొరకు అత్యంత ఆధారము ఏమిటంటే, ఆయన మన పరలోక తండ్రి. మనము ఆయన ఆత్మీయ కుమారులు మరియు కుమార్తెలము. ఆయన మనల్ని సంపూర్ణంగా ఎరిగి ప్రేమిస్తున్నారు. ఆయన ఆత్మీయ పిల్లలుగా, మనం దైవిక స్వభావాన్ని, గమ్యాన్ని కలిగియున్నాము. ఈ నిత్య సత్యాలను గ్రహించి, స్వీకరించుట, మనకు గుర్తింపును, విలువను, మరియు ఉద్దేశాన్ని ఇస్తుంది, అది మన మర్త్యత్వానికి ముందు లోకంలో మనల్ని దీవించింది, నడిపించింది మరియు ఇప్పుడు, ఎప్పటికీ ఆవిధంగా కొనసాగుతుంది.
ఆదియందు మనం తండ్రితో ఉన్నాము
“అవి ఉన్నట్లుగా” సత్యము యొక్క విషయాలను మనము వెదకినప్పుడు, మన రక్షకుడైన, యేసు క్రీస్తు నుండి ఈ మాటలను మనం కనుగొంటాము: “ఆదియందు నేను తండ్రితో నున్నాను, నేనే జ్యేష్ఠుడనని ఇప్పుడు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను,” మరియు “తండ్రితో ఆదియందు మీరు కూడా ఉన్నారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:21, 23).
భూమి మీద మన జీవితానికి ముందు, మనం పరలోకంలో ఒక సభకు హాజరయ్యాము అక్కడ మన పరలోక తండ్రి తన గొప్ప సంతోష ప్రణాళికను సమర్పించారు. ఆయన ప్రణాళికకు దేవుని ప్రేరణ ఏమనగా, మనము “ఆయనలా మారడానికి [మరియు] … ఆయన వలే ఉన్నత స్థితిని పొందడానికి” మనకు అనుగ్రహించారని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించాడు. “నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే” ఆయన కార్యమును మహిమయైయున్నది (మోషైయ 1:39).
మన కర్తృత్వమును సాధన చేసి మనం పరలోక తండ్రి ప్రణాళికను అనుసరించడానికి ఎంపిక చేసాము. ఈ జీవితంలో పుట్టడానికి మనం దీవించబడ్డాము, ఇక్కడ మనం కర్తృత్వమును కలిగియుండుటను కొనసాగిస్తాము, మర్త్యత్వమును అనుభవిస్తాము, నేర్చుకుంటాము మరియు నిత్య జీవమువైపు వృద్ధి చెందుతాము.
మన మర్త్య ప్రయాణంలో, మనం సవాళ్ళను, పరాజయాలను ఎదుర్కొంటాము. కానీ మనం జీవితపు ప్రతికూలతను ఒంటరిగా ఎదుర్కోవాల్సినవసరం లేదు. పరలోక తండ్రి, “విశ్వము యొక్క గొప్ప తండ్రి, మొత్తం మానవ కుటుంబాన్ని తండ్రి లాంటి శ్రద్ధతో మరియు పితృ గౌరవంతో చూస్తున్నారని,” జోసెఫ్ స్మిత్ బోధించాడు.
మన పరలోక తండ్రి, “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక,” “దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు” (2 కొరింథీయులకు 1:3–4). ఆయన ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా, పరలోక తండ్రి ఆయన వద్దకు తిరిగి వెళ్ళటానికి మన కోసం మార్గం సిద్ధపరిచారు.
మన తండ్రి వద్దకు మార్గము
సత్యము “అది విషయములు వాస్తవముగా ఉన్నట్లు” (జేకబ్ 4:13) స్పష్టమైనది: మన పరలోక తండ్రి పిల్లలుగా మనం మన పూర్తి సాధ్యతను సమీపించలేము. ఆత్మలో తండ్రి యొక్క తొలి కుమారుడైన యేసు క్రీస్తు, మన రక్షకుడు మరియు విమోచకునిగా ఉండటానికి నిబంధన చేసారు.
యేసు క్రీస్తు, “తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు, ఆయన కృపాసత్యసంపూర్ణుడు అనగా సత్యస్వరూపియైన ఆత్మ, … ఆయన శరీరమందు వచ్చి, మా మధ్య నివసించెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:11). ఆయన ఈ జీవితంలో, నిత్యత్వంలో సంతోషాన్ని, అర్థాన్ని, మరియు ఆనందాన్ని కనుగొనే మార్గాన్ని మనకు చూపించడానికి వచ్చారు.
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”
“లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు” (యోహాను 3:16–17).
రక్షకుని యొక్క భూలోక అనుభవము ముఖ్యమైనది. ఆయన “మొదటే సంపూర్ణత్వమును పొందలేదు, కానీ కృప వెంబడి కృపను పొందెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:12). ఆయన “తండ్రి మహిమను సంపూర్ణముగా పొందెంత వరకు” వృద్ధి చెందెను మరియు “పరలోకమందు, భూలోకమందు ఆయన సమస్త అధికారమును పొందెను, తండ్రి మహిమ ఆయనతోనుండెను, ఏలయనగా ఆయన, ఆయనయందు నివసించెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:16-–17). రక్షకుడు ఇలా బోధించారు:
“ఏ విధముగా ఆరాధించవలెనో గ్రహించి తెలుసుకొనుటకు, దేనిని ఆరాధించవలెనో తెలుసుకొనుటకు ఈ మాటలను నేను మీకిచ్చుచున్నాను, తద్వారా నా నామములో మీరు తండ్రి యొద్దకు వచ్చి, తగిన కాలమందు ఆయన సంపూర్ణత్వమును పొందగలరు.
“ఏలయనగా, మీరు నా ఆజ్ఞలను పాటించిన యెడల, మీరు ఆయన సంపూర్ణత్వమును పొందెదరు, నేను తండ్రి యందు ఉన్నవిధముగా నా యందు మహిమపరచబడుదురు; కాబట్టి నేను చెప్పునదేమనగా, మీరు కృప వెంబడి కృపను పొందెదరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:19–20).
గెత్సెమనే తోటలోను, మరియు సిలువపైన, యేసుక్రీస్తు ప్రపంచ పాపములన్నిటిని స్వయంగా మోయుచు మన విచారములు, మరియు “నొప్పులు మరియు బాధలు మరియు ప్రతి రకమైన శోధనలు” (ఆల్మా 7:11) భరించెను. ఇది “అందరికంటే గొప్పవాడైన [ఆయనను], … నొప్పి కారణంగా వణకించింది, మరియు ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారేలా చేసింది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18). యేసు క్రీస్తు ఆయన ప్రాయశ్చిత్తము మరియు పునఃరుత్థానము ద్వారా మాత్రమే రక్షణ మరియు ఉన్నతస్థితి సాధ్యమవుతుంది.
రక్షకుని కృప మరియు ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా, మనము సంపూర్ణతను పొందే వరకు వృద్ధి చెందవచ్చు మరియు ఒకరోజు పరిపూర్ణతకు తీసుకొనిరాబడవచ్చు. మనము రక్షకుని మాదిరిని అనుసరించి, మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఆయన మనకు దారి చూపించి, మన పరలోకమందున్న తండ్రి యొక్క మహిమాన్విత సన్నిధికి తిరిగి వెళ్ళే మార్గంలో మనల్ని నడిపిస్తారు.
మైఖేల్ కోల్‌మాన్ చేత, యెరూషలేముకు దారిలో క్రీస్తు, అనుకరించబడదు
ఆయన బహుమతిని మీరు పొందుతారా?
“విషయములను గూర్చి అవి వాస్తవముగా ఉన్న” (జేకబ్ 4:13) సత్యములలో, యేసు క్రీస్తును అనుసరించడానికి మరియు ఆయన ఇచ్చే బహుమానాలను పొందడానికి మన ఎంపిక ద్వారా నిత్యత్వములో మన అనుభవము నిర్ణయించబడుతుందని మనము నేర్చుకుంటాము. “[మనము] స్వీకరించుటకు సమ్మతించు దానిని ఆనందిస్తామని” లేఖనాలు బోధిస్తున్నాయి. విచారకరంగా, కొందరు “వారు పొందగలిగే దానిని ఆనందించుటకు సమ్మతించరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:32)).
నా మిషను అధ్యక్షులు, ప్రధాన అధికారి డెబ్బదిగా సేవ చేసిన, ఎల్డర్ మారియన్ డి. హాంక్స్ (1921–2011), మనం స్వీకరించడానికి, ఆనందించడానికి సమ్మతించే దానిని అడగడం అనేది మన ఆత్మీయ ప్రయాణంలో మనం ఎక్కడ ఉన్నామో అంచనా వేయడానికి ఒక మార్గమని బోధించారు. “ఒక మనుష్యునిపై ఒక బహుమానము ప్రోక్షించబడి, అతడు ఆ బహుమానము పొందని యెడల వానికేమి ప్రయోజనము?” మనఃపూర్వకంగా వెదకి, ఆయనను అనుసరించుట ద్వారా రక్షకుని యొక్క బహుమానాలను మనం స్వీకరించినప్పుడు, మనం నిత్య జీవపు నిరీక్షణలో మరియు “[ఆ] బహుమానము ఇచ్చిన వానియందు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:33) సంతోషిస్తాము. ఎంతో ప్రేమగా ఇవ్వబడిన ఈ బహుమానము “దేవుని బహుమానములలోకెల్లా అత్యంత ఘనమైనది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7).
దేవుడు మన పరలోక తండ్రి. ఆయన మనల్ని ఎరిగి, ప్రేమిస్తున్నారు. సత్యము కొరకు మన పరిశోధనలో మనం ఆయనవైపు తిరిగినప్పుడు, మేధస్సును అంటిపెట్టుకొనియుండగలము, జ్ఞానమును స్వీకరిస్తాము, సత్యమును హత్తుకొనియుంటాము, సద్గుణమును ప్రేమిస్తాము, ఆయననుండి వచ్చు వెలుగును అంటిపెట్టికొనియుంటాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:40 చూడండి). “ఒక దినము వచ్చును, ఆయన యందు ఆయన వలన బ్రతికింపబడిన [మనము] అప్పుడు దేవుడిని కూడా చూచు వరకు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:49) మన జీవితములంతటా కొనసాగిస్తాము.
అది అత్యంత మహిమాన్వితము, సంతోషకరమైన దినము.
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, August 2025 యొక్క అనువాదము. Telugu. 19613 421