2025
యేసు క్రీస్తు: ఈస్టర్ యొక్క నిరీక్షణ మరియు వాగ్దానము
2025 ఏప్రిల్


“యేసు క్రీస్తు: ఈస్టర్ యొక్క నిరీక్షణ మరియు వాగ్దానము,” లియహోనా, 2025 ఏప్రిల్.

లియహోనా నెలవారీ సందేశము, 2025 ఏప్రిల్

యేసు క్రీస్తు: ఈస్టర్ యొక్క నిరీక్షణ మరియు వాగ్దానము

ఈస్టర్ యొక్క నిరీక్షణ మరియు వాగ్దానం ద్వారా, యేసు క్రీస్తు మన హృదయాల్లో ఉన్న ఆకాంక్షలను తీర్చుతారు మరియు మన ఆత్మకు కలిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు.

ఎండిపోయిన చెట్టు కొమ్మ

మైఖేల్ డన్‌ఫర్డ్ చేత వివరణలు

దయచేసి మీరు ఈ సందేశాన్ని చదువుతున్నప్పుడు, ప్రశాంతమైన క్షణం మరియు ఆధ్యాత్మిక శరణాలయంలాంటి ప్రదేశాన్ని సృష్టించండి.

చాలా తరచుగా, మన ప్రపంచం అలజడిగా ఉంటుంది, నటన మరియు గర్వంతో అస్తవ్యస్తంగా ఉంటుంది. కానీ, మనం దేవునితో నిష్కపటముగా, నిజాయితీగా, మరియు హృదయాన్ని తెరిచి ఉంచినప్పుడు, యేసు క్రీస్తులో ఈస్టర్ యొక్క నిరీక్షణ మరియు వాగ్దానం నిజమవుతాయి. అటువంటి క్షణాల్లో, మనం ఈ విధంగా మనవి చేస్తాం:

“నేను నా కుటుంబ సభ్యుడిని, నా మిత్రుడిని, నా ప్రియమైనవారిని మళ్లీ ఎలా చూడగలను?”

“త్వరగా-క్షీణించే, ‘నేను నన్ను ఎన్నుకుంటాను’ అనే సంబంధాలు ఉన్న ఈ ప్రపంచంలో, నేను శాంతిని, నిరీక్షణను, మరియు దేవునితో ( సిద్ధాంతము మరియు నిబంధనలు 107:19 చూడండి), నా చుట్టూ ఉన్నవారితో మరియు నాతో సత్యమైన సంబంధాన్ని ఎక్కడ కనుగొనగలను?”

“నేను ప్రేమించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా—మరియు నిజంగా నన్ను ప్రేమించేవారు ఉన్నారా? ఒక కథానికలా కాకుండా, మరణ బంధాలకంటే బలమైన బంధాలతో, నిజమైన ఆనందంతో మరియు శాశ్వతంగా కొనసాగే విధంగా, నిబంధన సంబంధాలు పెరుగుతాయా మరియు నిలిచిపోతాయా?”

“ఎక్కువ నొప్పి, బాధ, మరియు అన్యాయం ఉన్న ఈ ప్రపంచంలో, నేను యేసు క్రీస్తులో, ఆయన యొక్క పునరుద్ధరించబడిన సువార్తలో మరియు సంఘంలో శాంతి, సామరస్యము, మరియు పరస్పర అవగాహనకు నేను ఎలా తోడ్పడగలను?”

ఈ ఈస్టర్ కాలంలో, యేసు క్రీస్తు గురించి మరియు, ఆయన వాగ్దానం మరియు నిరీక్షణ గురించి నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను.

నిబంధనకు చెందిన మరియు ఉద్దేశ్యము యొక్క వాగ్దానం

దేవుడు, మన శాశ్వతమైన పరలోకమందున్న తండ్రి; ఆయన ప్రియమైన కుమారుడు యేసు క్రీస్తు; మరియు పరిశుద్ధాత్మ వ్యక్తిగతంగా మనకు ఎంతో సమీపంగా ఉంటారు. వారి అనంతమైన మరియు నిత్యమైన కాంతి, కరుణ మరియు విమోచించే ప్రేమ, సృష్టి యొక్క లక్ష్యంలో మరియు మన ఉనికి యొక్క మూలస్వరూపంలో ఒదిగియున్నాయి (ఆల్మా 30:44; మోషే 6:62–63 చూడండి).

పరలోకపు పూర్వ మర్త్య సలహాసభలో, “ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?”(యోబు 38:7). మనం ఎంపికను ఎంచుకున్నాము. ఇప్పుడు మనం విశ్వాసంతో నడుస్తున్నాము. మన స్వంత అనుభవం ద్వారా, మానవ జీవితంలోని అనిశ్చితులు, నిరుత్సాహాలు, మరియు సవాళ్ల మధ్య దేవుడు వాగ్దానం చేసిన అందం, స్పష్టత, ఆనందం, మరియు లక్ష్యాన్ని మనం కనుగొంటాము.

అస్తిత్వానికి సంబంధించిన అనిశ్చితిలో మనం ఒంటరిగా విహరించడానికి ఉద్దేశించబడలేదు. మనకు పరలోకంతో సంబంధం కలిగియుండే అవకాశం ఉంది; కుటుంబంలో, పరిశుద్ధుల గృహంలో మరియు సమాజంలో విశ్వాసం మరియు చెందిన భావాన్ని నిర్మించవచ్చు; మరియు దేవుని ఆజ్ఞలను సంతోషంగా, స్వచ్ఛందంగా పాటించడం ద్వారా మన నిజమైన, స్వేచ్ఛాయుతమైన, అత్యంత స్వభావసిద్ధమైన, ఆనందభరితమైన స్వరూపంగా మారవచ్చు. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా ఈ నిబంధనకు చెందిన భావాన్ని అందిస్తుంది.

చిగురించే పువ్వులతో చెట్టు కొమ్మ

యేసు క్రీస్తు జీవితం మరియు ఆయన నియమితకార్యము యొక్క నిరీక్షణ

ప్రతి రోజు, ఈస్టర్ యొక్క నిరీక్షణ మరియు వాగ్దానంలో యేసు క్రీస్తు తన పరిపూర్ణ మర్త్య పరిచర్య సమయంలో పంచుకున్న ఆశీర్వాదాలు మరియు బోధనలు ఉన్నాయి. ఆరంభంలోనే ముందుగా నియమించబడిన యేసు క్రీస్తు, దేవుని అద్వితీయ కుమారునిగా జన్మించారు (జేకబ్ 4:5; ఆల్మా 12:33–34; మోషే 5:7, 9 చూడండి). ఆయన జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను (లూకా 2:52). తన తండ్రి చిత్తం మాత్రమే చేయాలని కోరుతూ, యేసు క్రీస్తు పాపాలను క్షమించారు, బలహీనతలను స్వస్థపరిచారు, చనిపోయినవారిని లేపారు మరియు అనారోగ్యంతో మరియు ఒంటరిగా ఉన్నవారిని ఓదార్చారు.

ఒకసారి, 40 రోజుల ఉపవాసం తర్వాత, “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, విరిగి నలిగిన వారిని స్వస్థపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.” అని ఆయన సాక్ష్యమిచ్చారు (లూకా 4:18; యెషయా 61:1 కూడా చూడండి).

అది మనలో ప్రతి ఒక్కరు.

చివరి భోజన సమయంలో, యేసు క్రీస్తు తన శిష్యుల పాదాలను కడిగారు (యోహాను 13:4–8 చూడండి). పురాతన మరియు నూతన ప్రపంచాలు రెండింటిలోనూ, “జీవజలము” మరియు “జీవాహారము” అయిన యేసు క్రీస్తు స్వయంగా సంస్కారమును స్థాపించారు. పవిత్రమైన సంస్కార విధిలో, మనము తండ్రిని పిలిచి యేసు క్రీస్తు నామమును మనపై తీసుకొనుటకు, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు, ఆయన వారికిచ్చిన ఆయన ఆజ్ఞలను పాటించుటకు సమ్మతించుచున్నామని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక, తద్వారా వారు ఎల్లప్పుడు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు గాక అని నిబంధన చేస్తాము ( లూకా 22:19–20; 3 నీఫై 18:7, 10–11 చూడండి).

గెత్సేమనే తోటలో, మన కోసం విమోచించడానికి మరియు ప్రాయశ్చిత్తం చేయడానికి మనుష్యుడు సహించగలిగిన దాని కంటే అధికముగా యేసు బాధపడ్డారు. ప్రతి స్వేదరంధ్రము నుండి రక్తము వచ్చింది. మనము పశ్చాత్తాపపడితే మనం బాధపడకుండా ఉండేందుకు, ఆయన అందరి కోసం ఈ బాధలను అనుభవించారు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:11; 19:16 చూడండి).

ద్రోహానికి గురై మరియు అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొన్న యేసు క్రీస్తు, అపహాస్యం చేయబడ్డారు, కొరడాతో కొట్టబడ్డారు, మరియు ఆయన వినయపూర్వకమైన తలపై ముల్ల కిరీటం పెట్టబడింది (మత్తయి 27:26, 29; మార్కు 15:15, 17, 20, 31; లూకా 22:63; యోహాను 19:1–2 చూడండి). “మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను … అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” (యెషయా 53:5). మనలను ఆయన వైపుకు ఆకర్షించడానికి ఆయన “సిలువపైన పైకెత్తబడ్డారు” (3 నీఫై 27: 14–15 చూడండి). అయినప్పటికీ, సిలువపైనుండి కూడా, యేసు క్రీస్తు క్షమించారు (లూకా 23:34 చూడండి). అయన తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని యోహాను‌ని కోరారు (యోహాను 19:26–27 చూడండి). ఆయన విడిచిపెట్టబడినట్లు భావించారు (మత్తయి 27:46; మార్కు 15:34 చూడండి). ఆ లేఖనము నెరవేరేందుకు, ఆయన నాకు దాహంగా ఉంది అని అన్నారు (యోహాను 19:28 చూడండి). అన్నీ నెరవేరిన తర్వాత, ఆయన స్వయంగా “ప్రాణము విడిచెను” (లూకా 23:46; యోహాను 10:17–18 కూడా చూడండి).

మన అనారోగ్యాలు, బలహీనతలు, ఏకాంతం, ఒంటరితనం, మరియు కష్టాల్లో మనకు ఎలా సహాయపడాలో యేసు క్రీస్తు వారికి తెలుసు (ఆల్మా 7:12 చూడండి). ఇలాంటి బాధలు తరచుగా ఇతరుల ఎంపికల ఫలితంగా వస్తాయి. మన ఆనందం మరియు కృతజ్ఞతలో మనతో కలిసి హర్షించటం ఎలా అనే సంగతి ఆయనకు తెలుసు, అలానే మన ఆనందం పరిపూర్ణమైనప్పుడు మనతో కలిసి సంతోషముతో ఉప్పొంగి ఏడ్చుట కూడా తెలుసు. మృదువుగా, ఆయన తన నామంలో, తన స్వరంతో, మనలను తన మందలోకి ఆహ్వానిస్తారు. ఆయన ప్రతిచోటా ప్రతి వ్యక్తిని పిలుస్తారు. నిత్యమైన దృక్కోణం ద్వారా మర్త్య జీవితాన్ని చూడడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తారు. మనము యథార్థముగా నడుచుకుంటూ, మన నిబంధనలను పాటించినప్పుడు, మన మేలుకొరకు సమస్తము సమకూడి జరుగును (సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24; రోమా 8:28 చూడండి).

ఆయన సమయానికి మరియు విధానానికి అనుగుణంగా, పునరుద్ధరణ జరుగుతుంది—కేవలం గత స్థితికి మాత్రమే కాకుండా, వాటి సాధ్యమైన ఉత్తమ రూపానికి కూడా జరుగుతుంది. నిజంగా, యేసు క్రీస్తు మనలను దాస్యము మరియు పాపం నుండి, మరణం మరియు నరకం నుండి విముక్తి చేయగలరు మరియు, విశ్వాసం మరియు పశ్చాత్తాపం ద్వారా, మనం ఊహించినదానికంటే ఎక్కువగా మారినప్పుడు మన దైవిక గుర్తింపును నెరవేర్చడంలో సహాయపడుతారు.

విడుదల యొక్క వాగ్దానం

యేసు క్రీస్తు కారణంగా, మరణం అనేది ముగింపు కాదు. ఈస్టర్ సందర్భంగా మనం ఈ విధంగా ప్రకటిస్తాము:

మరణం జయించబడింది; మనిషి విముక్తుడయ్యాడు.

క్రీస్తు విజయం సాధించారు.

తన తండ్రి యొక్క ఆజ్ఞ మరియు శక్తిచే, యేసు తన జీవితాన్ని అర్పించగలిగారు మరియు దాన్ని తిరిగి స్వీకరించగలిగారు (యోహాను 10:17 చూడండి). ఆయన శరీరం సమాధిలో ఉండగా, యేసు క్రీస్తు ఆత్మల లోకంలో పరిచర్య చేసి మరియు వ్యవస్థీకరించి, “మరణపాశముల నుండి వారి విమోచనను” ప్రకటించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:16).

మూడవ రోజు ఉదయం, ఆయన సమాధి నుండి తిరిగి లేచారు. ఆయన మరియతో మాట్లారు. ఆయన ఎమ్మాయుకు వెళ్లే మార్గంలో ఇద్దరు శిష్యులకు, అతని అపొస్తలులకు మరియు ఇతరులకు కనిపించారు (మత్తయి 28; మార్కు 16; లూకా 24; యోహాను 20 చూడండి.)

ఒక చియాస్మాటిక్ సాక్ష్యంలో, ఆయన తన శిష్యులను పడవ యొక్క మరో వైపుకు వలలను వేయమని ఆహ్వానించారు; ఈసారి, వలలు మళ్లీ చేపలతో నిండినప్పటికీ, అవి తెగిపోలేదు (యోహాను 21:6–11; లూకా 5:3–7 చూడండి). ఆయన శిష్యులకు ఆహారం పెట్టి మరియు తన గొర్రెలను మరియు గొర్రె పిల్లలను పోషించమని పేతురును మూడుసార్లు వేడుకున్నారు (యోహాను 21:12–17 చూడండి). ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు, ఆనాటి ఆయన శిష్యులు మరియు ఈనాటి మనమందరం, ఈస్టర్ మహిమాన్విత వార్తలను మరియు తన సువార్తను ప్రతి దేశం, ప్రతి బంధువులు మరియు ప్రతి ప్రజలతో పంచుకోవాలని ఆయన ప్రకటించారు (మత్తయి 28:19–20; మార్కు 16:15 చూడండి).

యేసు క్రీస్తు మన మంచి కాపరి మరియు దేవుని గొఱ్ఱెపిల్ల. ఆయన తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పించారు మరియు తన గొర్రెలకు జీవితం అనుగ్రహిస్తారు. తోటలో మరియు సిలువపై, ఆయన భరించలేని వాటిని భరించారు మరియు మన కోసం ప్రాయశ్చిత్తం చేశారు. లోకములో మరియు నిత్యత్వములో, “మృత్యువు, నిత్యత్వంలోకి మార్గాన్ని ఎలా తెరుస్తుంది” అని ఆయన మనకు ఉదాహరణ ద్వారా చూపిస్తారు.

క్రీస్తు ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానం యొక్క శక్తి ద్వారా, మన శరీరాలు మరియు ఆత్మలు భౌతిక పునరుత్థానంలో మళ్లీ కలుసుకుంటాయి. మనం మహిమాన్వితంగా ఉంటాం, మన ముఖ కాంతి మరియు శరీరాకృతిలో సంపూర్ణంగా పునరుద్ధరించబడతాము, అంగం అంగంగా సమగ్రంగా తిరిగి పొందుతాము. మన తల వెంట్రుకలు కూడా పునఃస్థాపించబడతాయి. మనం కాల క్షయం, వ్యాధి, భౌతిక ప్రమాదాలు, మరియు మానసిక అసమర్థతల నుంచి విముక్తులవుతాము. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ప్రతి విధమైన ఆత్మీయ విభేదాన్ని మరియు ఆత్మీయ మరణాన్ని జయించడానికి మనకు ఆశీర్వాదాన్ని అందించగలదు. పశ్చాత్తాపం యొక్క షరతుపై, మనం ప్రతి పాపం మరియు దుఃఖం నుండి విముక్తి పొందుతాము మరియు నిత్యమైన ప్రేమ మరియు ఆనందపు పరిపూర్ణతకు తెరవబడతాము. పరిశుద్ధంగా, స్వచ్ఛంగా, స్వేచ్ఛతో, మనం మన అత్యంత ప్రియమైన కుటుంబ సంబంధాలతో కలిసి, మన తండ్రి అయిన దేవుడు మరియు యేసు క్రీస్తు యొక్క మహిమాన్వితమైన సిలెస్టియల్ సన్నిధికి తిరిగి వెళ్ళచ్చు.

మన ప్రియమైన వారిని మళ్ళీ చూస్తాము. మనం ప్రేమించే వారితో మనం తిరిగి కలిసినప్పుడు, మనం ఒకరినొకరు శాశ్వతమైన దృక్పథంతో—ఎక్కువ ప్రేమ, అవగాహన, మరియు దయతో పరస్పరం చూడగలుగుతాము. యేసు క్రీస్తు వారి ప్రాయశ్చిత్తం మనకు ముఖ్యమైన వాటిని గుర్తుంచుకోవడానికి మరియు లేని వాటిని మరచిపోవడానికి సహాయపడుతుంది. గొప్ప విశ్వాసం మరియు కృతజ్ఞతతో మన రక్షకుని మరియు సంబంధాలను చూడటం శాంతిని అందిస్తుంది, భారాలను తొలగిస్తుంది, హృదయాలను పునరుద్దరిస్తుంది మరియు కాలములో మరియు నిత్యత్వంలో కుటుంబాలను ఏకం చేస్తుంది.

చిగురించే పువ్వులతో చెట్టు కొమ్మ

సమృద్ధి మరియు ఆనందం యొక్క నిరీక్షణ

యేసు క్రీస్తునందు ఈస్టరులో పరలోకపు కిటికీలు తెరుచుకోవడం, ద్రాక్షాఫలం విస్తరించడం, మరియు భూములు మనోహరంగా మారడం వంటివి ఉన్నాయి. యేసు క్రీస్తునందు ఈస్టరులో వితంతువులు మరియు అనాథలు, ఆకలితో ఉన్నవారు మరియు నిస్సహాయులు, భయపడే, దుర్వినియోగం చేయబడిన లేదా అమాయకంగా హానికరమైన మార్గంలో చిక్కుకున్న వారికి ఓదార్పు మరియు సంరక్షణ ఉంటుంది. ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని, యేసు క్రీస్తు ఆయనలా ప్రేమతో మరియు కరుణతో చూడమని మరియు పరిచర్య చేయమని మనలను ఆహ్వానిస్తున్నారు.

ప్రతి మంచిపనిలో, యేసు క్రీస్తు సమృద్ధిగా పునరుద్ధరిస్తారు ( యోహాను 10:10; ఆల్మా 40:20–24 చూడండి). “భూమి వనరులతో నిండియుండి, కావలసినదానికంటే అధికముగా కలిగి ఉన్నది” అని ఆయన వాగ్దానము చేస్తున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 104: 17). ఆయన అన్ని విషయముల పునఃస్థాపనలో ఆయన సువార్త యొక్క పరిపూర్ణత, ఆయన యాజకత్వ అధికారము మరియు శక్తి, అలాగే ఆయన నామమునందు పిలువబడిన, ఆయన సంఘములోని పవిత్రమైన విదులు మరియు నిబంధనలు ఉంటాయి, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము కూడా.

యేసు క్రీస్తులో ఈస్టర్ అనగా, భూలోకమునందలి అనేక స్థలములలో దేవుని పవిత్ర దేవాలయలు ఆయన పిల్లలకు మరింత సమీపమగుచుండుట, మన హృదయములలో “సీయోను కొండమీద రక్షకులు” అనే సిద్ధాంతాన్ని ప్రేరేపించుట (ఓబద్యా 1:21 చూడండి). మరణించిన ప్రియమైన వారికి, వారు నిత్యత్వంలో కోరుకునే వాటిని తమకై పొందలేని వాటిని భూమిపై అందించడానికి ప్రభువు పవిత్రమైన, నిస్వార్థమైన మార్గాన్ని మనకు అందించుచున్నారు.

ఇదే నా నిరీక్షణ, వాగ్దానం, మరియు సాక్ష్యం. నేను మన పరలోకపు తండ్రి అయిన దేవునికి; మన రక్షకుడు మరియు విమోచకుడు అయిన యేసు క్రీస్తునకు; మరియు పవిత్రాత్మకు, సాక్షిగా ఉన్నాను. ఈస్టర్ రోజున మరియు ప్రతిరోజూ, మర్త్యత్వము నుండి అమర్త్యత్వము మరియు నిత్య జీవితంలోకి దైవిక పరివర్తన యొక్క నిబంధన మార్గంతో, దేవుని సంతోషము యొక్క దైవిక ప్రణాళికలో నిత్యమైన నిరీక్షణ మరియు వాగ్దానాన్ని మనం కనుగొనగలముగాక. ప్రతిరోజూ, యేసు క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం యొక్క నిశ్చయత మన భారాలను ఎత్తివేసి, ఇతరులను వారి దుఃఖాలలో ఓదార్చేందుకు మనకు సహాయపడి, మరియు ఆయన సంపూర్ణ ఆనందాన్ని స్వీకరించేందుకు మన ఆత్మలను విముక్తి చేయునుగాక.

ఈస్టర్ యొక్క నిరీక్షణ మరియు వాగ్దానం ద్వారా, యేసు క్రీస్తు మన హృదయాలలో ఉన్న ఆకాంక్షలను తీరుస్తారు మరియు మన ఆత్మకు కలిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు.

వివరణలు

  1. యోహాను 4:10, 14; 6:35; 7:37; యెషయా 49:10 కూడా చూడండి.

  2. మత్తయి 26:26–29; మార్కు 14:22–25; లూకా 22:17–20; 3 నీఫై 18:1–11 చూడండి.

  3. He Is Risen! [ఆయన లేచియున్నారు!],” Hymns, no. 199.

  4. Upon the Cross of Calvary [కల్వరి శిలువ మీద],” Hymns, no. 184.

  5. Teachings of Presidents of the Church: Joseph Smith (2011), 473, సువార్త గ్రంధాలయము, చూడండి.