2025
పరలోక తండ్రి మీతో మాట్లాడాలనుకుంటున్నారు
2025 మార్చి


“పరలోక తండ్రి మీతో మాట్లాడాలనుకుంటున్నారు,” లియహోనా, 2025 మార్చి.

లియహోనా నెలవారీ సందేశము, 2025 మార్చి

పరలోక తండ్రి మీతో మాట్లాడాలనుకుంటున్నారు

పరలోక తండ్రి మరియు ఆయన ప్రియ కుమారునియందు మీకున్న విశ్వాసం, పరలోకపు తెరను విడదీసి, మీ తండ్రి యొక్క స్వరాన్ని గ్రహించడంలో మీకు సహాయపడనివ్వండి.

ప్రార్థిస్తున్న యువతి

మనము దేవుని కుమారులము మరియు కుమార్తెలము, పరలోకమందున్న మన గృహమునకు దూరముగా వుండి భూమిని పంచుకొనుచున్నాము. ఇది మన మర్త్యత్వము, మన శరీరాన్ని స్వీకరించి, చెడును గాక మంచిని ఎంచుకొని, “చేదును రుచి చూచి, తద్వారా [మనం] మంచి బహుమానమును తెలుసుకొని” (మోషే 6:55), మన రక్షకుడైన యేసు క్రీస్తు మరియు ఆయన పవిత్రమైన ప్రాయశ్చిత్తంపై మన విశ్వాసాన్ని పెంచుకొని మన తండ్రి యొక్క సంతోష ప్రణాళికను స్వీకరించే సమయం. మన పరలోక తండ్రిలా మరింతగా మారడానికి మనము ఇక్కడ ఉన్నాము.

మన పూర్వ మర్త్య జీవితం యొక్క జ్ఞాపకం లేకుండా, మనం విడిచిపెట్టిన ప్రపంచం కోసం కొన్ని సమయాల్లో ఒంటరితనం అనుభూతి చెందుతాము. ఆయనతో సన్నిహితంగా ఉండటానికి మరియు ఆయన నుండి మార్గదర్శకత్వం, దిశానిర్దేశం మరియు ఆదరణ పొందేందుకు, మన తండ్రి మనకు ఒక ఆధ్యాత్మిక బహుమతిని ఇచ్చారు. ఈ బహుమతి మనకు బాగా తెలుసు; దీనిని ప్రార్థన అని అంటారు.

మీ పరలోక తండ్రిని ప్రార్థించండి

ఆదాము మరియు హవ్వలకు మరియు వారిని అనుసరించే వారందరికీ, ఒక దేవదూత ఇలా ఆజ్ఞాపించాడు, “నీవు పశ్చాత్తాపపడి నిరంతరము కుమారుని నామములో దేవునికి ప్రార్థన చేయవలెను.” (మోషే 5:8).

యేసు ఇలా బోధించారు: “అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును” (మత్తయి 7:7). “నీవు ప్రార్థన చేయునప్పుడు, … రహస్యమందున్న … నీ తండ్రికి ప్రార్థనచేయుము” (మత్తయి 6:6). “కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి: పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక” (మత్తయి 6:9).

యేసు తన తండ్రికి నిరంతరం ప్రార్థించేవారు. “ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను” (లూకా 6:12). “మరియు … ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను” (మార్కు 6:46). “మరియు వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పెను” (మార్కు 14:32). శిలువపై ఉన్నప్పుడు, యేసు తనను సిలువ వేసిన సైనికుల కోసం ఇలా ప్రార్థించారు: “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము” (లూకా 23:34).

“నిరంతరము ప్రార్థించమని” లేఖనాలు మనకు సలహా ఇస్తున్నాయి (లూకా 21:36; 2 నీఫై 32:9; 3 నీఫై 18:15; సిద్ధాంతము మరియు నిబంధనలు 10:5; 19:38; 20:33; 31:12). “నీ కార్యములన్నిటిలో ప్రభువుతో ఆలోచన చేయుము మరియు ఆయన నిన్ను మేలు కొరకు నడిపించును” (ఆల్మా 37:37). అదనంగా, మన తండ్రి మన కోసం చేసేదంతా మనము గుర్తించి “[మన] పూర్ణాత్మ కలిగియుండగలిగినంత శక్తి చేత సమస్త కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలెను” (మోషైయ 2:20).

అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్ ఇలా వివరించారు: “ప్రతి కొత్త ఉదయం దేవుడి నుండి వచ్చిన బహుమతి అని గ్రహించడం ద్వారా ఆధ్యాత్మిక ఆత్మగౌరవం ప్రారంభమవుతుంది. … అనుదినము ఆయన మనల్ని కాపాడుచూ, అనుక్షణము మనకు సహయపడును (మోషైయ 2:21 చూడండి).”

నీఫై ఇలా చెప్పెను, “ప్రార్థన చేయమని మనుష్యునికి బోధించు ఆత్మను మీరు ఆలకించిన యెడల, తప్పక ప్రార్థన చేయవలెనని మీరు తెలుసుకొందురు. దురాత్మ ప్రార్థన చేయమని మనుష్యునికి బోధించదు, కానీ అతడు ప్రార్థన చేయరాదని బోధించును” (2 నీఫై 32:8).

రక్షకుని యొక్క రూప వీక్షణ

Christ Raising the Daughter of Jairus [యాయీరు కుమార్తెను బ్రతకిస్తున్న క్రీస్తు] నుండి వివరణ, గ్రెగ్ కే. ఓల్సన్ చేత

మన రక్షకుని మాదిరితో మరియు శతాబ్దాలుగా దేవదూతలు మరియు ప్రవక్తల సలహాతో, మన ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మరియు మన హృదయాల్లో నిరంతరం ఒక ప్రార్థనను నిలుపుట కొరకు ప్రతిరోజూ ప్రార్థించాలని మనకు స్పష్టంగా తెలుసు. మన తండ్రితో సంభాషించవలసిన బాధ్యత మనపై ఉంది.

అయితే మరింత మహిమాన్వితమైన, పరలోకమందున్న మన తండ్రి మన ప్రార్థనలకు ప్రతిస్పందిస్తారు. ఈ మర్త్య ప్రపంచంలో ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న ఏమిటంటే, మన తండ్రి నుండి వచ్చే సమాధానాలను, దిశను మరియు ఆదరణను మనం గొప్పగా ఎలా స్వీకరించాలి మరియు ఎలా అర్థం చేసుకోవాలి?

ఏడు దశాబ్దాలకు పైగానున్న నా జీవితంలో, మన తండ్రి మనతో మాట్లాడుతారని నాకు తెలుసు. మనము ఒంటరిగాలేము. మనము రక్షకుని వెంబడించుటకు ప్రయత్నించినప్పుడు పరలోక జీవులు మనలను గమనిస్తారు మరియు మనకు సహాయం చేస్తారు.

మన ప్రార్థనలకు సమాధానాలు పొందడం అనేది మన పరలోక తండ్రిపై మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుపై మనకున్న విశ్వాసంతో ప్రారంభమవుతుంది. “భయపడకుము, నమ్మిక మాత్రముంచుము”, అని యేసు చెప్పెను (మార్కు 5:36). మనము ఆయనను విశ్వసిస్తూ, ఆజ్ఞలను పాటించడానికి మన వంతు కృషి చేస్తాము మరియు అన్ని విషయాలలో ఆయన హస్తము కొరకు చూస్తాము. “అన్ని విషయములందు ఆయన హస్తమును అంగీకరించనప్పుడు … ఏ విషయములోను మనుష్యుడు దేవుడిని నొప్పించడు లేదా ఆయన ఉగ్రత ఎవని మీదకు రాదు.” (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:21).

మన జీవితంలో దేవుని హస్తం అంటే ఆయన మన ప్రపంచంలోని చెడు లేదా భయంకరమైన విషాదాలకు కారణమవుతారని కాదు. అయితే, మీ కష్టాలలో మరియు అధర్మాల సమయాలలో, ఆయన మీకు అండగా ఉంటారు, మీ సామర్థ్యాలను బలపరుస్తారు, మిమ్మల్ని ఆదరిస్తారు, మరియు “ఆయన నీ బాధలను నీ ప్రయోజనము కొరకు ప్రతిష్ఠించును” (2 నీఫై 2:2).

ఆయన స్వరమును ఆలకించండి

మనము ఆయనయందు విశ్వాసముంచి, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు, సహజంగానే ఆయన స్వరాన్ని బాగా ఆలకించడం నేర్చుకుంటాము.

సెప్టెంబరు 1993లో, ప్రధాన అధికారిగా నా మొదటి సంవత్సరంలో, అప్పటి పన్నెండు మంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యుడు, అధ్యక్షుడు జేమ్స్ ఇ. ఫౌస్ట్ (1920–2007), నా భార్య కాథీని మరియు నన్ను అతనితో పాటు బ్రిగం యంగ్ విశ్వవిద్యాలయ భక్తి పరమైన సమావేశమునకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. గుర్తుంచుకోండి, 1993, స్మార్ట్‌ఫోన్‌లు, సామాజిక మాధ్యమం మరియు ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడానికి ముందు రోజులు.

“The Voice of the Spirit [ది వాయిస్ ఆఫ్ ది స్పిరిట్},” అనే పేరున్న తన ప్రసంగంలో అధ్యక్షుడు ఫౌస్ట్ ఇలా హెచ్చరించారు: “మీ తరంలో మీరు ఎలా జీవించాలో, మీ అభిరుచులను ఎలా సంతృప్తి పరచాలో, అన్నింటినీ ఎలా కలిగి ఉండాలో చెప్పే అనేక స్వరాలు మీపై విరుచుకుపడతాయి. మీరు దాదాపు ఐదు వందల టెలివిజన్ ఛానెల్‌ల వరకు అందుబాటులో కలిగి ఉంటారు. అన్ని రకాల సాఫ్ట్‌వేర్, ఇంటరాక్టివ్ కంప్యూటర్ మోడెమ్‌లు, డేటాబేస్‌లు మరియు బులెటిన్ బోర్డులు ఉంటాయి; డెస్క్‌టాప్ పబ్లిషింగ్, శాటిలైట్ రిసీవర్‌లు మరియు కమ్యూనికేషన్‌ల నెట్‌వర్క్‌లు మీకు సమాచారంతో ఊపిరాడకుండా చేస్తాయి. … మీరు వినడానికి నేర్చుకోవలసిన స్వరం ఆత్మ యొక్క స్వరం.”

పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షుడు, అధ్యక్షుడు బోయిడ్ కె. ప్యాకర్ (1924–2015), జాన్ బరోస్ అనే ప్రకృతి శాస్త్రవేత్త, రద్దీగా ఉండే ఉద్యానవనం గుండా అతని స్నేహితులతో నడుస్తున్నప్పుడు ఆత్మ యొక్క చిన్న స్వరమును గూర్చిన అతని అనుభవాన్ని వివరించడం గురించి బోధించారు. అధ్యక్షుడు ప్యాకర్ మాటలు ఇక్కడున్నాయి:

“నగర జీవితం యొక్క శబ్దాల పైన [Mr. బరోస్] పక్షి పాట విన్నాడు.

“అతను ఆగి విన్నాడు! అతనితో ఉన్నవారు వినలేదు. చుట్టూ చూశాడు. మరెవరూ అది గమనించలేదు.

“ప్రతి ఒక్కరూ ఏదో చాలా అందమైనదానిని కోల్పోయారనేది, అతనికి బాధ కలిగించింది.

“అతను తన జేబులో నుండి ఒక నాణెం తీసి గాలిలోకి విసిరాడు. అది పక్షి పాట కంటే పెద్ద శబ్దం లేకుండా రింగ్‌ అనే శబ్దంతో కాలిబాట‌ను తాకింది. అందరూ తిరిగారు; వారు దానిని వినగలిగారు!

“నగర ట్రాఫిక్ యొక్క అన్ని శబ్దాల నుండి పక్షి పాటను వేరు చేయడం కష్టం. కానీ మీరు వినగలరు. మీరు దానిని వినడానికి శిక్షణ పొందినట్లయితే మీరు స్పష్టంగా వినవచ్చు.”

1979లో అధ్యక్షుడు ప్యాకర్ యొక్క పరిశుద్ధాత్మను గూర్చిన బోధనలు జరిగాయి, ఆ సమయంలో జీవితం చాలా నిశ్శబ్దంగా ఉంది మరియు ప్రపంచంలోని శబ్దం, ఇప్పుడు ఉన్నదానికంటే చాలా తక్కువగా ఉంది.

అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు, “మీరు ఆత్మ యొక్క నిమ్మళమైన స్వరం కంటే సోషల్ మీడియా నుండి వచ్చే సమాచారంపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంటే, మీరు మిమ్మల్ని ఆధ్యాత్మిక ప్రమాదానికి గురిచేసుకుంటున్నారు.”

అధ్యక్షులు ఫౌస్ట్ ఇలా అన్నారు, “మనం ఆత్మ యొక్క స్వరాన్ని వినాలంటే, మనం కూడా మన చెవులు తెరవాలి, విశ్వాసం యొక్క కన్ను స్వరం యొక్క మూలం వైపుకు మళ్లించాలి మరియు పరలోకము వైపు దృఢంగా చూడాలి.”

ఆత్మ యొక్క ఈ స్వరం మన తెలివికి మరియు మన భావాలకు రెండింటికీ చేరుతుంది. “నేను నీ మనస్సులోను నీ హృదయములోను పరిశుద్ధాత్మ ద్వారా చెప్పెదను, అది నీ మీదికి వచ్చి, నీ హృదయమందు నివశించును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2). మీ మనస్సాక్షిని వినండి—బయల్పాటు తరచుగా అక్కడ ప్రారంభమవుతుంది.

ఎల్డర్ ఆండర్సన్ ఒక సమూహంతో మాట్లాడుతున్నాడు

ఫిబ్రవరి 2024లో ఫిలిప్పీన్స్‌లోని మారికినా సిటీలోని బాలికల హోమ్ బాయ్స్ టౌన్ కాంప్లెక్స్‌ను సందర్శించినప్పుడు, ఎల్డర్ ఆండర్సన్ యువతకు వారు దేవుని పిల్లలు అని బోధించారు: “ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మరియు మీరు ఆయనకు విజ్ఞప్తి చేయవచ్చు. ఆయన మీ ప్రార్థనలు వింటారు.”

విశ్వసించే హృదయంతో ప్రార్థించండి

సమాధానాలు మరియు మనోభావాలు బలవంతంగా ఇవ్వబడవు. మనము ప్రార్థన చేస్తాము మరియు విశ్వసించే హృదయంతో వేచియుంటాము. కొన్ని సమాధానాలు ఈ జీవితంలో రావు, కానీ నీతిమంతులకు, ప్రభువు ఎల్లప్పుడూ తన శాంతిని అనుగ్రహించుచున్నారు (యోహాను 14:27 చూడండి). సమాధానాలు తరచుగా మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నప్పుడు వస్తాయి. కొన్ని సమయాల్లో, అవి “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రముగా” వస్తాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 98:12).

ఊహించని సమయాలలో మరియు ఊహించని ప్రదేశాలలో పరలోకము యొక్క స్వరం మన వద్దకు రావచ్చు, అయితే నిశ్శబ్ద ప్రదేశాలలో మరియు పవిత్ర స్థలాలలో మనము అత్యంత ముఖ్యమైన అవకాశాలను కనుగొంటాము. నా తెల్లవారుజాము ప్రార్థనలు మరియు ఆలోచనల నిశ్శబ్దంలో, నేను అసాధారణమైన ఆశీర్వాదాలను కనుగొన్నాను. లేఖనాల యొక్క రోజువారీ, వ్యక్తిగత, నిరంతర పఠనం, కొన్ని సమయాల్లో దినచర్య అయితే, ఇతర సమయాల్లో అగ్నిలాగా ఆత్మ యొక్క స్వరాన్ని మన హృదయాలలోకి తీసుకువస్తుంది.

కొన్ని సమయాల్లో, మనోభావాలు ప్రత్యేకంగా మనం చదువుతున్న వాటి నుండి ఉంటాయి మరియు ఇతర సమయాల్లో, మనం ఆలోచిస్తున్నది చాలా భిన్నమైన ఆందోళనకు సమాధానాన్ని తెస్తుంది. ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ యొక్క మాటలను గుర్తుంచుకోండి: “మనం దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు, మనం ప్రార్థిస్తాము. మరియు ఆయన మనతో మాట్లాడాలని మనం కోరుకున్నప్పుడు, మనం లేఖనాలను వెదుకుతాము.”

ప్రపంచం యొక్క శబ్దం మరియు పరధ్యానాలు మన చుట్టూ తిరుగుతుండగా, మరిన్ని దేవాలయాలను నిర్మించమని ప్రభువు తన ప్రవక్తను ఆదేశించారు. ప్రభువు యొక్క ఈ పవిత్ర మందిరాలలో, మన సవాళ్లను బయట వదిలి, మన ప్రార్థనలు మరియు ఆందోళనలతో ప్రవేశించినప్పుడు, మనకు నిత్యత్వపు సత్యాలు బోధించబడతాయి.

ఒక సంవత్సరం క్రితం, అధ్యక్షులు నెల్సన్ మనకు ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చారు: “నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇదిగో నా వాగ్దానం. ఇనుపదండాన్ని గట్టిగా పట్టుకోవడానికి మీ పరిస్థితులు అనుమతించినంత క్రమంగా దేవాలయంలో ఆరాధించడం కంటే ఎక్కువగా మీకు ఏదీ సహాయం చేయదు. ప్రపంచంలోని అంధకారపు పొగమంచులను మీరు ఎదుర్కొన్నప్పుడు ఏదీ మిమ్మల్ని ఎక్కువగా రక్షించదు. ప్రభువైన యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం గురించిన మీ సాక్ష్యాన్ని ఏదీ బలపరచదు లేదా దేవుని అద్భుతమైన ప్రణాళికను ఎక్కువగా అర్థం చేసుకోవడంలో ఏదీ మీకు సహాయం చేయదు. బాధాకరమైన సమయంలో ఏదీ మీ ఆత్మను ఎక్కువగా శాంతింపజేయదు. ఏదీ పరలోకాలను ఎక్కువగా తెరవదు. ఏదీ లేదు!”

ప్రతి సర్వసభ్య సమావేశము అదనపు సమృద్ధి ఆశీర్వాదాలను తెస్తుంది. రాబోయే ఏప్రిల్ నెలలో, మరోసారి, ప్రభువు స్వరాన్ని వినడానికి సర్వసభ్య సమావేశములో కలుద్దాం. మనము ప్రార్థన చేసుకొని సిద్ధపాటుగా సర్వసభ్య సమావేశానికి వస్తాము. మనలో ప్రతి ఒక్కరికి, ఒత్తిడితో కూడిన ఆందోళనలు మరియు తీవ్రమైన ప్రశ్నలు ఉన్నాయి. మన రక్షకుడైన యేసు క్రీస్తునందు మన విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి మరియు శోధనను ఎదిరించే మన సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి మనము వస్తాము. మనము ఉన్నత స్థలమునుండి బోధించబడడానికి వస్తాము. మీరు సర్వసభ్య సమావేశ సభలకు సిద్ధమై ప్రార్థనాపూర్వకంగా వస్తున్నప్పుడు, మీ ఆందోళనలకు సమాధానాలు మీకు లభిస్తాయని మరియు “పరలోకము యొక్క హస్తము” మీపై ఉందని మీరు తెలుసుకుంటారని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.

మీ పరలోక తండ్రి మీతో మాట్లాడుతున్నారని విశ్వసించండి. ఆయన మాట్లాడుతున్నారు! ఆయనయందు మరియు ఆయన ప్రియమైన కుమారునియందు మీకున్న విశ్వాసం, పరలోకపు తెరను విడదీసి, మీ తండ్రి యొక్క స్వరాన్ని గ్రహించడంలో మీకు సహాయపడనివ్వండి. ఆయన ఉన్నారని మరియు మాటలలో చెప్పగలిగే దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను.