“యేసు క్రీస్తు నందు ఐక్యత కొరకు ఒక నమూనా,“ లియహోనా, 2024 అక్టోబర్.
లియహోనా నెలవారీ సందేశము, 2024 అక్టోబరు
యేసు క్రీస్తు నందు ఐక్యత కొరకు నమూనా
4 నీఫై లోని జనులవలే మనము యేసు క్రీస్తు నందు ఐక్యమైతే, ఏకము కావాలనే మన ఆశ, విభేదాలను అధిగమించును మరియు ఆనందమునకు నడిపించును.
విబేధము మరియు వివాదముల యొక్క ప్రవాహము ఉప్పొంగుచు భూగోళమంతటా వ్యాపించుచున్న కాలంలో మనము జీవిస్తున్నాము. సాంకేతిక పరిజ్ఞానము సహాయముతోను మరియు హృదయాలు చల్లబారిన జనులచేతను ప్రోత్సహించబడి, మన హృదయాలను ధిక్కారముతోను, అవినీతితోను మన ప్రసారాలను వివాదములతో నింపుటకు విభజన శక్తులు బెదిరించుచున్నవి. సామాజిక బంధాలు తెగిపోవుచున్నాయి. యుద్ధాలు చెలరేగుచున్నాయి.
ఈ నేపథ్యంలో యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరులు శాంతి కొరకు ఆతృతపడుచు యేసు క్రీస్తు యొక్క బోధలపై స్థాపించబడిన—వైవిధ్యమైన సమాజమును నిర్మించుటకు చురుకుగా వెదకుచున్నారు. “ఒకటిగా నుండుడి; మీరు ఒకటిగా నుండని యెడల మీరు నా వారు కారు” ఇంత మేరకు ప్రభువు నిర్దేశించి యున్నాడు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:27). నిశ్చయముగా ఐక్యత అనేది యేసు క్రీస్తు యొక్క నిజమైన సంఘము యొక్క నాణ్యతకు గుర్తు.
విభజన మరియు వివాదాస్పద మైన శక్తులకు వ్యతిరేకంగా మనము ఎట్లు పనిచేస్తాము? ఏవిధంగా మనం ఐక్యత సాధిస్తాము?
అదృష్టవశాత్తు, మోర్మను గ్రంధములోని 4 నీఫై మనకొక మాదిరి నిచ్చుచున్నది. రక్షకుడు వారిని దర్శించి, వారికి బోధించి, వారి మధ్య తన సంఘమును స్థాపించిన తరువాత ఆ ప్రజలు జీవించిన విధానమును ఈ అధ్యాయము క్లుప్తంగా భద్రపరచియున్నది. ఈ జనులు ఏవిధంగా ఒక ధన్యకరమైన మరియు శాంతియుతమైన ఐక్యతను సాధించారో ఈ వృత్తాంతము చూపించుచున్నది మరియు మనము అదే ఐక్యతను పెంపొందించుకొనుటకు అనుసరించగల ఒక నమూనాను మనకు అందించుచున్నది.
పరివర్తన
4 నీఫై 1:1,లో మనము చదువు చున్నాము: “యేసు యొక్క శిష్యులు చుట్టూ ఉన్న దేశములన్నిటిలో క్రీస్తు సంఘమును స్థాపించిరి. మరియు [జనులు] వారి యొద్దకు వచ్చిరి, మరియు తమ పాపముల గురించి నిజముగా పశ్చాత్తాప పడిరి.”
మనము ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు చుట్టూర ఐక్య పడతాము. ప్రతి ఒక్క వ్యక్తి యేసు క్రీస్తును, ఆయన సువార్త, మరియు ఆయన సంఘమును గురించి నేర్చుకొనుటచేత, ప్రతి ఒక్కరి హృదయములో పరిశుద్ధాత్మ సత్యమును గురించి సాక్ష్యమిచ్చును. అప్పుడు మనలో ప్రతి ఒక్కరు రక్షకుని యందు విశ్వాసము కలిగి, పశ్చాత్తాప పడుట ద్వారా ఆయనను అనుసరించుటకు ఆయన ఆహ్వానమును అంగీకరించ గలము.
ఒక వ్యక్తి యొక్క స్వార్ధము మరియు పాపపు కోరికలకు దూరంగా పరివర్తనము మరియు రక్షకుని వైపునకు ప్రయాణము ఈ విధంగా ప్రారంభ మౌతుంది. ఆయన మన విశ్వాసమునకు పునాది. ప్రతి ఒక్కరము ప్రతి ఆలోచనలోను ఆయనవైపు చూచునప్పుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36 చూడుము), ఆయన మన జీవితాలలో ఐక్యపరచు శక్తిగా అగును.
నిబంధనలు
ఎవరైతే సంఘమునకు వచ్చి తమ పాపములకొరకు పశ్చాత్తాపపడిరో వారు యేసు నామములో బాప్తీస్మము పొందిరి; మరియు వారు పరిశుద్ధాత్మను కూడా పొందిరి” అని 4 నీఫై గ్రంధములో ప్రకటించుచున్నది (4 నీఫై 1:1). వారు దేవునితో ఒక నిబంధనలో—ఒక ప్రత్యేకమైన అనుబంధ బాంధవ్యములో ప్రవేశించిరి.
మనము నిబంధనలను చేయుచు మరియు పాటించునప్పుడు, మనము ప్రభువు నామమును వ్యక్తిగతంగా ధరించుదుము. పైగా, ఒక జనాంగముగా మనం ఆయన పేరును ధరించుదుము. నిబంధనలు చేసి మరియు వాటిని పాటించుటకు శ్రమించు వారు ప్రభువు యొక్క జనులగుదురు, వారు ఆయనకు ప్రత్యేక మైన నిధులు (నిర్గమ కాండము 19:5 చూడుము). సంఘములో, మనము వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా నిబంధన మార్గంలో ప్రయాణిస్తాము. దేవునితో మన నిబంధన బాంధవ్యము మనకు ఒకే విధమైన లక్ష్యము, ఒకే విధమైన గుర్తింపు నిస్తుంది. మనము ప్రభువునకు ముడివేయ బడినప్పుడు మనము “ఒకరి యెడల ఒకరు ఐక్యతయందును, ప్రేమయందును మన హృదయములు ముడివేయ బడునట్లు ఆయన సహాయము చేయును” మోషైయ 18:21
న్యాయము, సమానత్వము, మరియు పేదలకు సహాయపడుట
4 నీఫైలోని వృత్తాంతము ఇంకనూ ఈ విధముగా నున్నది: “వారి మధ్య విబేధములు మరియు వివాదములు లేకుండెను, మరియు ప్రతి ఒక్కరు ఒకరితోనొకరు న్యాయముగా వ్యవహరించిరి.
“వారు అన్ని వస్తువులను వారి మధ్య ఉమ్మడిగా కలిగి యుండిరి. కావున అక్కడ ధనవంతులని, పేదలని,దాసులని, స్వతంత్రులని భేదము లేకయుండిరి, కాని వారందరు స్వతంత్రులుగాను మరియు పరలోకపు బహుమానమందు పాలిభాగస్తులుగాను చేయబడిరి” 4 నీఫై 1:2–3).
మన ఐహిక వ్యవహారాలలో మనము ఒకరితోనొకరు న్యాయమును మరియు ధర్మమును ననుసరించి, మోసము చేయక, అదను చూచి దెబ్బతీయక యుండవలెనని ప్రభువు కోరుచున్నాడు. (1 థెస్సలోనీకయులకు 4:6 చూడుము). మనము ప్రభువునకు సన్నిహితమయ్యేకొలది, “మీరు ఒకరినొకరు గాయపరచుకోకుండా సమాధానముతో నివసించుటకు, ప్రతి మనుష్యునికి అతనికి తగిన దానిని బట్టి చెల్లించుటకు కోరుకొందురు.” (మోషైయా 4:13).
పేదలకు, అక్కరలోనున్న వారిని ఆదరించవలెనని కూడా ప్రభువు మనకు ఆజ్ఞాపించియున్నాడు. వారిని విమర్శించకుండా మనకు “ఉన్నదానిలోనుండి” శక్తికొలది సహాయపడవలెను (మోషైయ 4:21–27 చూడుము).
ప్రతి ఒక్కరు “తన సహోదరుడిని తనవలే యెంచవలెను” సిద్ధాంతము మరియు నిబంధనలు 38:24). మనము ప్రభువు యొక్క జనులుగా ఐక్యపడ వలెనన్నచో ఒకరి యెడల ఒకరిని సమానముగా ఎంచడమే కాకుండా నిజముగా సమానమని గుర్తించి మన హృదయములలో మనము—దేవుని యెదుట సమానమనియు, సమాన మైన విలువ మరియు సమాన మైన శక్తియు గలవారమని భావించ వలెను.
విధేయత
తరువాతి పాఠం 4 నీఫై నుండి ఆయన సాధారణ మాటలలో వస్తుంది: “వారు తమ ప్రభువు మరియు దేవుని నుండి పొందిన ఆజ్ఞల ప్రకారము నడచుకొనిరి” (4 నీఫై 1:12).
ప్రభువు ఈ జనులకు తన సిద్ధాతమును నేర్పించి వారికి తన ఆజ్ఞలను ఇచ్చెను, మరియు వాటి పాలనకు సేవకులను పిలచెను. ఈ విధముగా చేయుటలో ఆయన యొక్క ఉద్దేశ్యములలో ఒకటి, వారి మధ్య వివాదములు ఉండ కూడదని (3 నీఫై 11:28–29; 18:34 చూడుము).
మనము ఏకమగుటకు ప్రభువు మరియు ఆయన సేవకుల యొక్క బోధలకు మన విధేయత అవసరము. వీటితో పాటు మనము దినదినాభివృద్ధి చెంది మరింత మెరుగుగా జీవించుటకు మన ఆజ్ఞావిధేయతలో నిబద్ధత కలిగి, అది ఎప్పుడైనా తగ్గితే పశ్చాత్తాప పడుచు మరియు ఒకరికొకరు సహాయ పడుట కూడా అవసరము.
సభలో కూడుకొనుట
తరువాత మనం నేర్చుకొనేది 4 నీఫైలో జనులు ”ఉపవాసము మరియు ప్రార్ధనలో [కొనసాగిరి] మరియు తరచు ప్రార్ధించుటకు, ప్రభువు వాక్యమును వినుటకు కూడుకొనిరి“ }4 నీఫై .
మనము సభగా కలుసుకొనుట అవసరం. మనము వ్యక్తిగతం గాను సమిష్టిగాను బలం పొందుటకు వారం వారం మన ఆరాధన సమావేశాలు ఒక ముఖ్యమైన అవకాశము. మనము పరిశుద్ధ సంస్కారంలో పాల్గొంటాము, నేర్చుకుంటాము, ప్రార్ధిస్తాము, కలిసి స్తుతిస్తాము మరియు ఒకరినొకరు బలపరచుకుంటాము. సంఘటిత భావము, స్నేహము, మరియు లక్ష్యసాధనకు సహచర్యము పెంపొందించుటకు ఇతర కూడికలు కూడ సహాయపడును.
ప్రేమ
4 నీఫై లోని వృత్తాంతము బహుశా అన్నిటికి గొప్ప తాళంచెవి వంటి దానిని మనకు అందిస్తున్నది—అదిలేకుండా నిజమైన ఐక్యత అసంభవం: “ఇప్పుడు జనుల హృదయములలో గల దేవుని ప్రేమను బట్టి దేశమందు ఎట్టి వివాదము లేకుండెను” (4 నీఫై 1:15).
మనము వినయపూర్వక సమర్పణతో నిజముగా దేవుని ప్రేమించినప్పుడు వ్యక్తిగత శాంతిని పొందుదుము. “ఇది మొట్ట మొదటిదియు మరియు గొప్పదైన ఆజ్ఞ. అందరి కంటే, లేక అన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించడం అనేది నిజమైన శాంతి, ఓదార్పు, విశ్వాసం మరియు ఆనందాన్ని తెచ్చే నియమం. మనము దేవుని పట్ల, మరియు యేసు క్రీస్తు పట్ల ప్రేమను పెంచుకుంటే, కుటుంబములోను మరియు పొరుగు వారిలోను సహజంగానే ప్రేమ పెరుగును.
మనము దేవుని పట్ల మరియు ఆయన పిల్లలందరి పట్ల ప్రేమలో మునిగిపోయినప్పుడు మనము ఎన్నడూ అనుభవించని గొప్ప ఆనందం మనకు కలుగుతుంది.
దాతృత్వం, క్రీస్తు యొక్క నిర్మలమైన ప్రేమ, వివాదానికి పరిష్కారం. దాతృత్వమనేది యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరుని యొక్క ప్రధాన లక్షణం. మనల్ని మనం దేవుని యెదుట తగ్గించుకొని, మన హృదయముల యొక్క పూర్ణ శక్తితో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మనకు దాతృత్వాన్ని ప్రసాదిస్తాడు (మొరోనై 7:48 చూడుము).
మనమందరము దేవుని ప్రేమ మన హృదయములో వసించవలెనని కోరిన యెడల, అద్భుతమైన ఐక్యత మనకు సర్వ సాధారణమైనదిగా కనిపించును.
దైవిక గుర్తింపు
చివరిగా 4 నీఫై లోని జనులు మనము గుర్తించ దగిన ఐక్యతను ప్రదర్శించారు: “అక్కడ దొంగలు లేదా హంతకులు లేరు, లేనీయులు లేరు, లేదా ఏ విధమైన -ఈయులు లేరు; కానీ వారు ఒక్కటిగా, క్రీస్తు యొక్క సంతానముగా మరియు దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండిరి.” (4 నీఫై1:17).
మన్నిక గల గౌరవ ప్రదమైన గుర్తింపు వలన వందలాది సంవత్సరాలు జనులను వేరు చేసిన ముద్రలు వెనుక బడినవి. వారు తమను తాము—మరియు ఇతరులను—పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యొక్క సంబంధులుగా గుర్తించిరి.
వైవిధ్యము మరియు భిన్నత్వము మనకు మంచివి మరియు ప్రాముఖ్య మైనవి కావచ్చును. కానీ, మనకు అతి ముఖ్యమైన గుర్తింపు మాత్రం మన యొక్క దైవాంశము నకు మరియు ప్రణాలికకు సంబంధించినవి.
అన్నిటికన్నా మొట్టమొదట, మనలో ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలం. రెండవదిగా, మన సంఘ సభ్యునిగా మనలో ప్రతి ఒక్కరూ నిబంధన బిడ్డలం. మరియు మూడవదిగా, మనలో ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు శిష్యులం. నేను మనలో అందరిని అర్ధించుచున్నాను, ఈ మూడు శాశ్వతమైన హోదాలను తొలగించుటకు గాని, మార్చుటకు గాని, అణచుటకుగాని ఏ ఇతర గుర్తింపులకు అనుమతించ వద్దు.
ఏకమై ఉండుడి
దేవుడు తన యొద్దకు రమ్మని అందరినీ ఆహ్వానించి యున్నాడు. అక్కడ ప్రతీ ఒక్కరికి స్థలమున్నది. మన యొక్క సంస్కృతులు, రాజకీయాలు, జాతులు, అభిరుచులు, మరియు అనేక ఇతర విషయాలలో మనం విభిన్నం కావచ్చును. కానీ మనము యేసు క్రీస్తు నందు ఐక్యమైనప్పుడు—మనము ఆయన వారల మగునట్లు విభేదముల ప్రాముఖ్యత సన్నగిల్లును మరియు ఐక్యము కావలెనను మన హెచ్చింపు కోరిక చేత అవి అధిగమించబడును.
4 నీఫైలో బోధింపబడిన పాఠములను హృదయములో ఉంచుకొనుడి. మనలో ప్రతి ఒక్కరూ ఐక్యత యొక్క ఈ అత్యవసరమైన మూలకములను మన జీవితాలలో పొందుపరచు కొనుటకు పాటుపడుచున్నందుకు మన గురించి వారివలెనే, “దేవుని యొక్క హస్తము చేత సృష్టించ బడిన జనులందరి మధ్య వారికంటే సంతోషము కలిగిన జనులుండజాలరు.” (4 నీఫై 1:16).
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. నెలవారీ లియహోనా సందేశం, 2024 అక్టోబర్. యొక్క అనువాదము. Telugu. 19359 421