“సర్వసభ్య సమావేశము: ప్రపంచవ్యాప్త సంఘ సమావేశము,” లియహోనా, సెప్టెంబరు 2021
సెప్టెంబరు 2021, లియహోనా నెలవారీ సందేశము
సర్వసభ్య సమావేశము: ప్రపంచవ్యాప్త సంఘ సమావేశము
సర్వసభ్య సమావేశములో మనము ప్రవక్తలు మరియు ఇతర సంఘ నాయకుల నుండి వింటాము. మనము వినాలని దేవుడు కోరుతున్న దానిని వారు మనకు బోధిస్తారు.
ప్రతి ఏప్రిల్ మరియు అక్టోబరులలో సర్వసభ్య సమావేశము అనబడే వరుస సమావేశాలను సంఘము జరుపుతుంది. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి నాయకులు బోధించి, సాక్ష్యమిస్తారు. సర్వ సభ్య సమావేశము అమెరికాలో యూటాలోని సాల్ట్ లేక్ సిటీలో జరుగుతుంది మరియు 80కు పైగా భాషలలో ప్రపంచమంతా ప్రసారం చేయబడుతుంది. ప్రసంగాలను వినడానికి సభ్యులందరు మరియు ఆసక్తి గల ఇతరులెవరైనా ఆహ్వానించబడతారు.
మొదటి సంఘ సమావేశాలు
1830, ఏప్రిల్ 6న ఒక సమావేశంలో సంఘము అధికారికంగా ఏర్పాటు చేయబడింది (సిద్ధాంతము మరియు నిబంధనలు 20 చూడండి). మొదటి సర్వసభ్య సమావేశము 1830, జూన్ 9న జరుపబడింది. అప్పటి నుండి సభ్యులు సమకూడగలిగిన చోట సంఘాధ్యక్షుని ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాలు జరుపబడ్డాయి. 1840లలో, సంవత్సరానికి రెండుసార్లు నాయకులు సమావేశం జరపడం ప్రారంభించారు.
నేడు సమావేశాలు ఏవిధంగా ఏర్పాటు చేయబడుతున్నాయి
సర్వసభ్య సమావేశములో ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది అపొస్తలుల సమూహము మరియు ఇతర సంఘ నాయకులు మాట్లాడతారు. టెంపుల్ స్క్వేర్ వద్దనున్న టాబర్నాకిల్ గాయకబృందము మరియు ఇతర సంఘ గాయకబృందాలు సంగీతాన్ని అందిస్తాయి. ప్రతి సమావేశము ఐదు సభలను కలిగియుంటుంది: శనివారం మూడు మరియు ఆదివారం రెండు. ఏప్రిల్‌లో శనివారంనాడు మూడవ సభ అహరోను మరియు మెల్కీసెదెకు యాజకత్వ సమూహాల సభ్యుల కొరకైనది. అక్టోబరులో అది ఉపశమన సమాజ సభ్యులు మరియు యువతుల కొరకైనది.
నాయకుల బోధనలు
సమావేశానికి ముందు నెలల్లో సంఘ నాయకులు ఏమి బోధించాలనే దాని గురించి ప్రార్థిస్తారు. వారు ఏమి చెప్పాలో తెలుసుకోవడానికి ప్రభువు వారిని ప్రేరేపిస్తారు. వారు సువార్త సత్యాలను బోధిస్తారు మరియు దేవుని ఆజ్ఞలను పాటించమని మనల్ని ఆహ్వానిస్తారు. వారు యేసు క్రీస్తు గురించి కూడా సాక్ష్యమిస్తారు మరియు ఆయనను అనుసరించమని మనల్ని ప్రోత్సహిస్తారు.
సమావేశము నుండి నేర్చుకొనుట
సర్వసభ్య సమావేశానికి ముందు, మనం ఏమి నేర్చుకోవాలని ప్రభువు కోరుకుంటున్నారో వినడానికి మనం ప్రార్థించగలము. మనం ప్రసంగాలను వింటున్నప్పుడు, మనం తెలుసుకోవలసిన దానిని ఆత్మ మనకు బోధిస్తుంది. సమావేశం తర్వాత, ప్రసంగాలు ChurchofJesusChrist.org వద్ద, సువార్త గ్రంథాలయ యాప్‌లో మరియు లియహోనాలో కనిపిస్తాయి. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి మనం ప్రార్థనాపూర్వకంగా ప్రసంగాలను చదువవచ్చు.
లేఖనాల నుండి
మనం తరచు కలుసుకోవాలని యేసు క్రీస్తు బోధించారు (3 నీఫై 18:22 చూడండి).
సంఘ సభ్యులు కలిసి ఆరాధించినప్పుడు, ప్రభువు వారితో ఉంటారు (మత్తయి 18:20 చూడండి).
“ఒకరికొకరు ఉపదేశించుకొని, జ్ఞానాభివృద్ధిని కలుగజేయుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 43:8) అని ప్రభువు సంఘ సభ్యులను ఆజ్ఞాపించారు.
సంఘ సభ్యులు క్రీస్తునందు విశ్వాసము చూపినప్పుడు, వారు కలుసుకున్నప్పుడు ఆయన ఆత్మ వారితో ఉంటుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 44:2)
© 2021 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, September 2021 యొక్క అనువాదము Telugu. 17473 421